ఇంగ్లీషులో troubles come in triple అని ఒక సామెత ఉంది. ఎమర్జెన్సీ దురాగతం చేసిన ఇందిరాగాంధీ దరిమిలా జరిగిన ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆవిడ సారధ్యం వహించిన కాంగ్రెసు పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెసు పార్టీ 197 సీట్లు కోల్పడి కేవలం 153 సీట్లను మాత్రం సంపాదించుకొని తలదించుకొంది. అధికారం కైవసం చేసుకున్న జనతాపార్టీకి 295 సీట్లు వచ్చాయి మొత్తం 545 సీట్లలో. అంత ఘోరపరాజయంలోనూ కేవలం నీలం సంజీవరెడ్డి మినహా 42 సీట్లుకు గాను 41 సీట్లను తెలుగువారు బంగారు పళ్ళెంలో పెట్టి ఇందిరాగాంధీగారి కాంగ్రెసుకు అందించారు ఆంధ్రప్రదేశ్ నుండి. అదీ మన తెలుగువాళ్ళు కాంగ్రెసువారికి ఇచ్చిన విలువా మర్యాదా అన్నవి. ఇప్పుడా కాంగ్రెసు పార్టీ తనను నమ్ముకుని అంటకాగుతున్న తెలుగునేలను అధోగతి పాల్జేసింది. అఫ్ కోర్స్ తెలంగాణా వాదులు మాత్రం తమ నెత్తిన పాలు పోసిందంటారను కోండి. నిజానికి అటు తెలంగాణాకూ ఇటు సీమాంధ్రకూ కాంగ్రెసువారి నాన్పుడు ధోరణివల్ల తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు తెలంగాణాలో సంగతేమో కాని, సీమాంధ్రలో కాంగ్రెసు చతికిలబడింది. ఆ పార్టీని భూస్థాపితం చేయాలని రంకెలేస్తున్నారు సీమాంధ్రగడ్డమీది జనం. ఇటు చిన్న రాష్ట్రాలో చిన్నచిన్న రాష్ట్రాలో అంటూ ఖూనీ సారీ కూని రాగాలు తీస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలుగునేల మీద ఎప్పుడూ ఆట్టే సీట్లు రాలవు. గడచిన కొద్ది రోజులుగా సీమాంధ్రకూ న్యాయం చేయాలీ అంటూ ఒక నాలుకతోనూ, తెలంగాణా బిల్లును కళ్ళకద్దుకుంటామూ అంటూ ఒక నాలుకతోనూ ఒకే సారి జుగల్ బందీ చేస్తూ చిరాకు తెప్పించింది భారతీయజనతాపార్టీ అన్ని వర్గాలకూ. తెలంగాణావాదులు, సీమాంధ్రులు, కేంద్రంలో కర్రపెత్తనం చేస్తున్న కాంగ్రేసు, ఇతరరాజకీయపార్టీలు అందరికీ వీరి ఆంతర్యం అంతుబట్టి చావలేదు. ఎలా తెల్సిఏడుస్తుందీ - వారికే వారి ఆంతర్యం గురించి స్పష్టత లేనప్పుడూ? అద్వానీ ఒక మాట, సుష్మా రెండు మూడు రకాలమాటలు, వెంకయ్య ఒక మాట, రాజనాధ్ ఒక మాట, నమో గారి మాట మరొకటి ఇల్లా ఎడ్చారు. చివరికి సీమాంధ్రను చల్లగా ముంచారు. లోక్సభలో చీకటిభాగోతంలో అధికారపక్షంతో చేతులు పిసుక్కున్నారు. తమపేరు కాస్త డామేజీ అయిందనుకున్నారో ఏమో, ఇప్పుడు రాజ్యసభలో కొత్తరాగాలు మొదలుపెట్టారు. విశ్వసనీయత అన్నది ఎంత దరిద్రంగా ఉండాలో అంతకన్నా దరిద్రంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ తీరు. ఈ రెండు పార్టీలు మన ఖర్మకాలి జాతీయపార్టీలు. అగ్రస్థానంకోసం కుర్చీలాటలో తీరికలేకుండా ఉండి ప్రజలంటే పట్టని పార్టీలు. సీమాంధ్రాలో ఐతే ఒక చిక్కొచ్చింది. అటు కాంగ్రేసును భూస్థాపన చేయాలని నిర్ణయించుకున్నారాయె. ఇటు బీజేపీని చీదరించుకుంటున్నారాయె. ఇద్దరిలో ఎవరికి వేస్తారూ ఓటూ? తోడేలుకా గుంటనక్కకా అన్నట్లుంది. పోనీ ఇద్దరూ వద్దు బాబే ముద్దు అని అనుకుంటారు జనం అని తెలుగుదేశం పార్టీ వారు తెగ కలలు గంటున్నారు. ఐతే మొన్న అత్యంత అవినీతిపరుడంటూ కాంగ్రెసు తప్ప అన్నిపార్టీలూ, సాక్షి తప్ప అన్ని పత్రికలూ, వైకాపా కార్యకర్తలు తప్ప తెలుగుజనం ప్రజానీకం అందరూ గగ్గోలుపెడుతున్న జగన్మోహనుడు ఢిల్లీ పోయి రచ్చరచ్చ చేసాడు. ఏం సాధించాడూ అనకండి. వేరే వాళ్ళు మాత్రం ఊడబొడిచి సాధించి చచ్చింది మాత్రం ఏమేడ్చింది కనక? జనంలో ఇమేజ్ మాత్రం బాగా పెంచుకున్నాడు. అది చాలదా? జనానికి కాకపోయినా బాబుగారి తెగులు దెశానికి సారీ తెలుగుదెశం పార్టీకి అది చాలు. అందుకు ప్రతిక్రియగా వారు ఏమి ఎత్తు ఎత్తాలా అని గుంపుతంపీలు పడుతున్నారు. ఐతే వారిగోల జనానికి ఇంకా వినోదం పంచకమునుపే,నల్లారివారి రాజీనామా పుణ్యమా అని కాంగ్రేసులో ముఖ్యమంత్రి పదవి అనే కుంటికుర్చీ కోసం తన్నుకోవటం హంగామా మొదలై భలే వినోదం పంచుతోంది మన తెలుగువారికి ఇంత విషాదంలోనూ. ఎవరికి పుట్టిందోతెలియదు ఈ అలోచన. సాయంత్రం టీవీలోకి వచ్చేసింది తెలంగాణా టీడీపీ వారు ఒక తీర్మానం చేసిపారేసారు. దానిప్రకారం ఇకమీదట తెలుగుదెశంపార్టీ అనేది ప్రాంతీయపార్టీ అనే చిన్నటాగ్ వదుల్చుకుని జాతీయపార్టీ అనే పేద్ద ముచ్చటైన అందమైన టాగ్ తగిలించుకుంటుందట. చచ్చాం బాబోయ్.. ఈ కొత్త అవతారంలో బాబుగారు ముస్తాబై ఎంచేస్తారండీ? ఉభయతెలుగురాష్ట్రాల్లోనూ చక్రం తిప్పేస్తారు. అధికారం కొట్టేస్తారు. సుహృద్భావం పంచేస్తారు మనం మింగలేనంతగా. అభివృధ్దిని మళ్ళి పరవళ్ళు తొక్కించేస్తారు.. అబ్బో ఎన్ని కలలో! అలా కొట్టేయకండి మరి! తెలంగాణా వచ్చేదా చచ్చేదా అని ఈ బాబుగారితో సహా అనేకపార్టీలు అమోదపత్రాలు సమర్పించేసి తరువాత చచ్చినట్లు ప్రజాభీష్టం అంటూ అన్నీ నాలుకలు అనేక మడతలు వేసుకున్నాయా లేదా చివరికి? ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ? ఖర్మకాలి (అదే కేవలం తెలుగువారి ఖర్మ మాత్రమే లేండి. అదెప్పుడూ కాలి మాడువాసన వస్తూనే ఉంది, కానీ, ఇప్పుడు మాటవరసకే అన్నాను) ఈ తెలుగుదేశం జాతీయపార్టీవారు ఉభయతెలుగురాష్ట్రాల్లోనూ గద్దెకెక్కేసారే అనుకోండి. జస్ట్ అనుకోండి. మాటవరసకేగా, కొంపేం ములిగిపోదు అనుకున్నంతలో. ఎడాపెడా అభ్వృధ్ధి చేసిపారెయ్యటానికి అలవాటుపడిపోయిన బాబుగారు మళ్ళీ లంకించుకుని ఎలా అభివృధ్ది చేస్తారయ్యా ఈ తెలుగురాష్ట్రాలనీ అన్నది ఆలోచించుకోండి. యథాప్రకారం సీమాంధ్రసొమ్మంతా మళ్ళా హైదరాబాదుని తిరిగి అంతర్జాతీయవైభవంలో అద్వితీయస్థానానికి చేర్చటానికి ఖర్చుపెట్టేస్తారు. ఈ విషయంలో సీమాంధ్రజనానికి ఆవగింజంతైనా అనుమానం అక్కర్లేదు. అదే మరి troubles come in triple అంటే. ఇప్పుడు కాంగీ భాజపాలతో పాటు బాబుగారు మరొక trouble అన్నమాట సీమాంధ్రజనానికి. తెలంగాణావారు కూడా ఉలిక్కిపడాల్సిన విషయమే. ఇంతవరకూ తెలంగాణాను దోచిన సీమాంధ్రపార్టీల్లో ఒకటి జాతీయపార్టీ అవతారమెత్తి దోపిడీని నిరాఘాటంగా కొనసాగిస్తుందన్నది వారికి ఠపీమని తట్టే సబబైన అనుమానం. కాదనలేం కదా. వారింకా తెరాసాకా కాంగీకా దేనికి జై అనాలో పూర్తిగా తేల్చుకున్నారో లేదో పాపం. ఇప్పుడు బాబుగారి జాతీయదొరవేషం నాటకం ఒకటి వాటికి తోడుగా పోటీలోకి గోదాలోకి దిగుతుందీ అన్నమాట. బాబుగారు తోలుబొమ్మలాటలో కేతిగాడో జాతీయరాజకీయనాటకంలో కేటుగాడో అన్నది ఎవరికివారే అలోచించుకోవలసిన మాట. ఎదేమైనా ఆయనగారి ఈ సరికొత్త అవతారప్రకటన మాత్రం గమనార్హమైన విషయం అని గ్రహించాలి. కాబట్టి ఉభయప్రాంతాల్లోని ప్రజలారా Beware of Babu. ముఖ్యంగా సీమాంధ్రజనులారా be very carefull. Babu returns! |
19, ఫిబ్రవరి 2014, బుధవారం
బాబోయ్! బాబోయ్! బాబు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)