తే. ఆంధ్రజాతికి దుర్దిన మాయెననగ విభజనము కోరు వారికి వేడుకనగ నిర్ణయము వచ్చె తెలుగింట నిప్పుపుట్టె ముందుముందేమి పుట్టునో యిందువలన |
వ. కొందఱ కిది స్వాతంత్యసిధ్ధి యట! సీ. పూర్ణస్వాతంత్యంబు పొల్పెట్టు లుండునో ప్రత్యేకదేశమై వరలు వారొ సర్వస్వాతంత్యంబు చాడ్పెట్టులుండునో భరతదేశంబులో వారు గారొ అరువదేండ్ల స్వప్న మందురే పెక్కేండ్లు విభజనోద్యమమెందు విడిసి యుండె అమరవీరులు కల రధికులీ యుద్యమ రాజకీయమునకే రాలినారు |
తే. అనుదినంబును నింద లన్యాయ భాష ణంబు లివి యెల్ల ధర్మాగ్రహంబు పేర నిన్ని నాళులు దాయాదు లన్న మిషను వేలు చూపించి కురిసిరీ వీరు లకట |
తే. వేరు కాపురములు వీలుగా కుదిరెను చాలు దాయాదులను మాట సఖ్య మొప్ప అన్నదమ్ముల మగుటయే యెన్న దగిన బాంధవంబను తీయని పలుకు పుట్టె |
తే. రాష్ట్రములు వేరు తెలుగువా రంద రొకటె యన్న సొంపైన మాట యే మంత పొసగు తిట్లు కురిపించుటయు చేరదీయుటయును వారి చిత్తంబు వీరి సౌభ్యాగ్య మగునె |
ఉ. కాలము చేత సర్వమును గల్గుచు నుండును క్రిందుమీదులన్ కాలము చేయ కొందరధికంబగు మోదము నొంద కొంద రార్తులై బేలతనంబు బొందుటయు వింత యనంగ రాదు గర్వశోకముల్ కాలము వేఱు భంగి చనగా విపరీతము లౌటయు పుట్టు చుండెడిన్ |
క. కాలము నీదు స్వరూపము నీ లీలకు తిరుగు లేదు నీ వేదో పె న్మేలెంచి చేయుచున్న ద దే లాగున తెలియ నేర్తు మీశ్వర చెపుమా |
శా. తౌరక్యాంధ్రము కోరి కొందరు మహాదోషాచరుల్ దీక్షమై పోరంబోరగ వారి యాశ లవి సంపూర్ణంబుగా దీరు చో నేరం బేమియు లేని శిక్ష పడి యీ నిర్భాగసీమాంధ్రు లీ ఘోరం బింక సహించి యుండవలెనా కోదండరామప్రభూ |
సీ. కాంగిరేసును వల్లకాటికి పంపక ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు భాజపామూర్ఖుల పట్టి పల్లార్చక ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు సీమాంధ్రమంత్రుల చెత్తగా నూడ్వక ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు సోనియమ్మకు చెప్పుచూపించు నందాక ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు |
ఆ. తెలుగుజాతిపరువు దిల్లీబజారులో అమ్ముకొన్న దుష్టు లల్పమతుల రేపు శోకవహ్ని రూపర జేయక ఆంధ్రజాతి కోప మణగు టెట్లు |
తే. అన్నిటికి నీవు గలవని విన్నవించి యూర కుందును శ్రీరామ యుచిత మైన భంగి విభజనవాదుల భంగపరచి బుధ్ధి చెప్పుము దుడు కారిపోవు నట్లు |
6, డిసెంబర్ 2013, శుక్రవారం
తెగతెంపుల నిర్ణయం వెలువడింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)