ధ్యానం
శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం
నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం
పాశాంకుశేక్షుకోదండ ప్రసూనవిశిఖాం స్మరేత్
ఉద్యత్కోటి రవిప్రఖ్యాం మహాత్రిపురసుందరీం
ముందుమాట
శ్రీలలితాపరాభట్టారికాదేవీ అమ్మవారి ఆవిర్భావాన్ని గురించీ, అమ్మవారి సహస్రనామస్తోత్రం యొక్క ఆవిర్బావం గురించీ, ఆ సహస్రనామస్తోత్రం గొప్పదనం గురించీ ముందుగా మనం చెప్పుకుందాం. ఇలా చేయటం వలన అమ్మవారి సహస్రనామ స్తోత్రాన్ని చదువరులు మరింత భక్తిశ్రధ్ధలతో ఈ శరన్నవరాత్రాలలో ఆనందంగా పారాయణం చేసుకుంటారు.
అమ్మవారి ఆవిర్భావం
ఒకప్పుడు మన్మథుడు తన పుష్పబాణాలని ఏకంగా పరమశివుడిపైనే వేసాడు. పాపం అతడి తప్పు లేదు. అది దేవతల కోర్కె. అలా చేస్తే పార్వతీపరమేశ్వరులకు త్వరగా కళ్యాణం జరుగుతుందని వారి ఆశ. అందుకే ఒక ప్రక్కన మన్మథుడు ఈ పనికి ససేమిరా అంటున్నా, దేవేంద్రుడు ఆజ్ఞాపించి పంపాడు. ఈ సాహసానికి ఫలితంగా, శివుడు మూడవకన్ను తెరవటం, తక్షణమే మన్మథుడు బూడిదకుప్పగా మారటం జరిగింది. ఆ తరువాత రతీదేవి ప్రార్థనతో అమ్మవారు శివుణ్ణి వేడుకుని మన్మథుణ్ణి పునర్జీవితుణ్ణి చేసింది. ఈ కథను లలితా సహస్రనామాల్లోని 84వ నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః అనే నామం గుర్తుచేస్తున్నది కూడా. ఈ మన్మథదహన వృత్తాంతం పాఠకులందరికీ సుపరిచితమే కాబట్టి విస్తరించ నవుసరం లేదు.
సరే, ఈ మన్మధదహనం తరువాత జరిగిన మరొక సంఘటన చూదాం. చిత్రకర్మ అనే అమాయాక ప్రమథుడు ఒకతను సరదాగా ఒక చిలిపి పని చేసాడు. మన్మథుడు కాలి బూడిదకుప్ప అయ్యాక ఆ బూడిదతో ఒక బొమ్మను చేసాడు. అది గమనించి బ్రహ్మగారు కంగారుగా భండ భండ (సిగ్గు సిగ్గు) అని వారించారు. కాని అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది. ఆ తయారైన పురుషుడు ఒక రాక్షసుడయ్యాడు! వాడికి భండాసురుడు అని పేరు వచ్చింది. అతడిని సృష్టించేందుకు ద్రవ్యంగా వాడిన భస్మంలో రుద్రుడి కోపాగ్ని ఉండటం వలన, వాడు మహాబలవంతుడైన అతి రౌద్రస్వభావం కల రాక్షసరాజు అయ్యాడు. ఈ భండాసురుడి పుట్టుక గురించిన కథ బ్రహ్మాండపురాణం ఉత్తరభాగంలో ఉంది.
ఈ భండాసురుడిని చంపటం దేవతలకి శక్తికి మించిన పని ఐపోయింది. వాడిలో రుద్రాంశ ఉందిగా మరి!
అందు చేత దేవతలు అమ్మవారి అనుగ్రహం కోరి గొప్ప యాగం చేసారు.
ఆ యాగం కోసం వారు నిర్మించిన హోమకుండం ఒక యోజనం విస్తీర్ణం కలిగి ఉందట. వాళ్ళు అమ్మవారి కరుణకోసం చేసిన ఆ యజ్ఞంలో అనేక రకాల విశిష్టమైనపదార్థాలతో హోమం చేసారు. ఫలితం లేదు. తమ తమ శరీరభాగాలనే హోమం చేసి ప్రార్థించారు. ఐనా ఫలితం లేదు. అప్పుడు వాళ్ళు చివరికి తమ తమ శరీరాలనే హోమం చేయటానికి సిథ్థం అయ్యారు.
అప్పుడు అమ్మవారు కరుణించింది. కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో, ఒక మహా తేజోమయం ఐన చక్రస్వరూపం ఆ హోమగుండంలోంచి ప్రభవించింది. ఆ దివ్య చక్రం మధ్య ఉదయిస్తున్న సూర్యుడిలా అరుణవర్ణంతో ఉన్న శ్రీదేవి ప్రత్యక్షమైనది.
ఇంద్రాది దేవతలంతా అమ్మను చూసి పరమసంతోషంతో మరల మరలా నమస్కారాలు చేసారు. శ్రీలలితా సహస్రనామావళిలోని చిదగ్నికుండ సంభూతా, దేవకార్యసముద్యతా అనే 4వ, 5వ నామాలు స్పష్టం చేస్తున్నాయి. అ తరువాత శ్రీదేవి భండాసురుడిని సంహరించింది.
ఈ విధంగా దేవతలు అమ్మవారి కోసం యజ్ఞం చేసిన స్థలం గోదావరీ నదీ తీరాన ఉన్న కోటిలింగాల క్షేత్రం లోని రాజమండ్రి పట్టణం. అసలు ఈ పట్టణం వద్ద శ్రీచక్రంతో శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆవిర్భవించటం కారణంగా అది రాజరాజేశ్వరీ మందిరమై రాజరాజేశ్వరీ మహేంద్ర వరం అని పేరు వచ్చి క్రమంగా ఆ పేరు రాజమహేంద్రవరంగా మారిందని స్థల పురాణం. మన కాలంలో అది కాస్తా మరింత వికృతంగా రాజమండ్రి ఐపోయింది.
ఈ విధమైన బ్రహ్మాండపురాణం లోని కథ కాక మరొక పౌరాణిక గాథ ఉంది శ్రీదేవి ఆవిర్భావం గురించి.
ఇక్ష్వాకు వంశంలో ఒకానొక రాజు పేరు రేణువు. ఆయన అమ్మవారికి అచంచల భక్తుడు. ఆయన శ్రీదేవిని గురించి ఉగ్రమైన తపస్సు చేసి తల్లిని మెప్పించాడు. అమ్మ సంతోషించి హోమాగ్ని మధ్యలో దివ్యస్వరూపంతో సాక్షాత్కరించింది. అవిడ శ్రీచక్ర మధ్య.
అమ్మవారి సహస్రనామస్తోత్రం ఆవిర్భావం
శ్రీలలితాదేవి తన భక్తులకుశ్రేయస్సు కలిగించాలని తలచింది. వశిని మొదలైన వాగ్దేవతలని పిలిచింది. మీకు నా అనుగ్రహంతో మంచి వాక్కు అనే విభూతి కలిగింది. మీరు శ్రీచక్ర రహస్యం చక్కగా తెలిసి నా నామాలను నిత్యం పారాయణం చేస్తున్నారు. నా భక్తులందరికీ అనుగ్రహం చేయాలని సంకల్పించాను. మీరు నా నామావళితో చక్కగా ఒక స్తోత్రం రచించండి. దాన్ని నా భక్తులు పఠించినంత మాత్రాన నాకు సంతోషం కలుగుతుంది అని చెప్పింది. ఆ తల్లి ఆజ్ఞ ప్రకారంగా వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలా, అరుణా, జయినీ, సర్వేశ్వరీ, కౌళినీ అనే పేర్లుగల ఆ వాగ్దేవతలు ఒక అద్భుతమైన స్తోత్రం రచించారు.
ఒక నాడు అమ్మ అనేక బ్రహ్మాండాలనుండి తన దర్శనం కోసం వచ్చిన కోట్లాది త్రిమూర్తులూ, కోట్లాది దేవగణాలు అన్ని బ్రహ్మాండాలలోని దివ్యమునులూ, తన మంత్రిసామంత శక్తిగణాలు కూర్చుని ఉన్న సభకు విచ్చేసింది. ఆ మహాసభలో వాగ్దేవతలు తాము రచించిన లలితా రహస్య సహస్రనామస్తోత్రం వినిపించారు.
అమ్మ సంతోషించి సభాసదులతో, వినండి. ఈ రహస్యస్తోత్రాన్ని ఈ వాగ్దేవతలు మా ఆజ్ఞ మేరకే రచించారు. మాకు సంతోషం కలిగించే ఈ స్తోత్రాన్ని మీరు పఠించండి. మా భక్తులకు ఉపదేశించండి అని ఆజ్ఞాపించింది.
కీర్తయేన్నామ సహస్ర మిదం మత్ప్రీతయే సదా
మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశః
శ్రీచక్రార్చన చేసినా చేయలేకపోయినా, మంత్రజపాదులు చేయగలిగినా చేయలేకపోయినా, సహస్రనామస్తోత్రం మాత్రం సదా పఠించాలి. అది నాకు చాలా ఇష్టం. నాకు ప్రీతిగా ఇలా చేసిన వారికి నిస్సంశయంగా కోరిన కోరికలన్నీ తీరుతాయి అని అమ్మ సెలవిచ్చింది.
శ్రీలలితాసహస్రనామం గ్రహించేందుకు అర్హతలు
శ్రీహయగ్రీవులు మహావిష్ణువు అవతారం. ఆయన శిష్యకోటిలో వాడు అగస్త్యమునీంద్రుడు. ఒకప్పుడు ఆ అగస్త్యముని తన గురువుగారైన హయగ్రీవులవారిని అమ్మవారి సహస్రనామస్తోత్రం కొరకు ప్రార్థించారు.
మమ వా యోగ్యతా నాస్తి శ్రోతుం నామసహస్రకం
కిమర్థం భవతా నోక్తం తత్ర మే కారణం వద
గురుదేవా, శ్రీదేవి సహస్రనామాలు మీరు నాకు ఉపదేశం చేయలేదు. ఎందుకని స్వామీ? అవి వినే యోగ్యత నాకు లేదా అని అడిగారు.
ఆమాట విని హయగ్రీవులవారు సంతోషించి, నాయనా అడగందే చెప్పరాదని వేదం ఆజ్ఞ. ఇది చాలా రహస్యమైన విద్యా వివేకం. ఇప్పుడు అడిగావు కాబట్టి సంతోషంగా చెబుతాను.
బ్రూయా ఛ్ఛిష్యాయ భక్తాయ రహస్యమపి దేశిక
భవతా న ప్రదేయం స్యా నభక్తాయ కదాచన
రహస్యం ఐనా భక్తుడైన శిష్యుడికి గురువు చెప్పాలి. నువ్వు కూడా భక్తుడైన శిష్యుడికే రహస్యంగా చెప్పవచ్చు.
శ్రీమాతృభక్తి యుక్తాయ శ్రీవిద్యారాజవేదినే
ఉపాసకాయ శుధ్ధాయ దేయం నామసహస్రకమ్
అమ్మ మీద విశ్వాసం లేని వాడికీ దుష్టుడికీ చెప్పరాదు. శ్రీదేవి పట్ల భక్తి కల వాడికి, శ్రీవిద్యను తెలిసి అమ్మను ఉపాసించేవాడికి, పరిశుధ్ధమైన మనస్సుకల వాడికి తప్పకుండా శ్రీలలితా సహస్రనామం ఉపదేశం ఇవ్వవచ్చును.
శ్రీలలితా నామ సహస్రం యొక్కపారాయణ ఫలం
అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి
సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ప్రవర్థనమ్
పుత్రప్రద మపుత్రాణాం పురుషార్థ ప్రదాయకమ్
ఇదం విశేషా ఛ్ఛ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతివిధాయకమ్
దీనికి సాటి స్తోత్రం ఇంతవరకూ లేదు. ఇక ముందూ ఉండదు. ఇది అన్ని రోగాలనూ శమింపచేస్తుంది. అన్ని సంపదలూ వృధ్ధి చేస్తుంది. పుత్ర సంతానం ఇస్తుంది. చతుర్విధపురుషార్థాలూ దీనితో సిథ్థిస్తాయి. అమ్మ శ్రీదేవికి సంతోషం కలుగుతుంది.
తస్యపుణ్యఫలం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ
గంగాది సర్వతీర్థేషు యః స్నాయా త్కోటి జన్మసు
అగస్త్యా, కోటి జన్మల్లో గంగాది సకల పుణ్యతీర్థాల్లోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది.
ఇంకా మరికొన్ని విశేషాలు చెబుతున్నారు. కాశీలో కోటి శివలింగాలు ప్రతిష్ట చేసినంత పుణ్యం. కురుక్షేత్రంలో సూర్యగ్రహణసమయంలో అన్ని దానాలూ కోటిసార్లు చేసినంత పుణ్యం. ఉత్తమబ్రహ్మవేత్తలకు కోటి మణుగుల బంగారం దానం చేసినంత పుణ్యం. గంగాతీరంలో కోటి అశ్వమేథయాగాలు చేసినంత పుణ్యం. వందల కొద్దీ బావులు, చెరువులూ తవ్వించినంత పుణ్యం.కోటి మంది బ్రాహ్మణోత్తములకి వేయేళ్ళు నిత్యం భోజనం పెట్టినంత పుణ్యం.
రహస్య నామ్నే సాహస్రే నామ్నాఽప్యేకస్య కీర్తనాత్
ఈ పుణ్యం అంతా కూడా ఈ రహస్యనామాల్లో ఒక్క నామాన్నైనా సరే భక్తితో పఠించినంత మాత్రాన కలుగుతుంది. ఇలా ఒక్కనామాన్ని భక్తితో పఠించినా వాడి పాపాలన్నీ నశిస్తాయి. కులాశ్రమధర్మాలను పాటించక పోవటం వల్ల వచ్చిన పాపాలైనా సరే, చేయకూడని పనులు చేయటం వల్ల వచ్చిన పాపాలైనా సరే వెంటనే నశిస్తాయి. ఇందుకు సందేహం అక్కరలేదు.
నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయే త్పుణ్యవాసరే
అమ్మ నామాలు పారాయణం చేయకపోతే ఆవిడకు భక్తులే కారు. నిత్యం పారాయణం చేయలేకపోతే కనీసం పుణ్యదినాల్లో పారాయణం చేసినా చాలు. సంక్రాంతి దినాలు, కుటుంబసభ్యుల పుట్టిన రోజులూ, శుక్లపక్షంలో వచ్చే శుక్రవారాలు, పౌర్ణమీ తిథి ఇవీ ముఖ్యమైన పుణ్యదినాలు.
మరికొన్ని విశేషాలు చెబుతున్నారు. జ్వరపడ్డ వాడి తలను ముట్టుకుంటూ, నామపారాయణం చేస్తే జ్వరం తగ్గుతుంది. భస్మాన్ని మంత్రిస్తూ నామావళి చెప్పి ఆ భస్మాన్ని ధరిస్తే వ్యాధులన్నీ వెంటనే తగ్గుతాయి. అలాగే నీటిని అభిమంత్రిస్తూ నామావళి చెప్పి ఆనీటితో స్నానం చేయిస్తే గ్రహబాధలు తగ్గుతాయి. అమ్మవారు సుధాసాగరంలో ఉన్నట్లు భావిస్తూ నామపారాయణం చేస్తే విషబాధ పోతుంది.
శుక్రవారాలు అమ్మవారి సహస్రనామం పారాయణం చేస్తే వచ్చే పుణ్యం ఇంతని చెప్పనలవి కాదు. అమ్మవారి సాయుజ్యముక్తి లభిస్తుంది.
ఇలా అనేక విధాలుగా ఫలం చెప్పబడింది.