శ్రీరామచంద్రుడు పేరోలగమున సింహాసనస్థుడై చెన్నొంది యుండి పెద్ద తడవు దాక తద్దయు శ్రధ్ధ ఆయవ్యయంబుల నడిగి కన్గొనియె నగరముఖ్యుల వచనము లాలకించె మంత్రిసామంతుల మాటలు వినెను కార్తాంతికులు పలుకాడగా వినెను సంగీతసాహిత్యసద్గోష్టి జరిపె విప్రవినోదుల వీక్షించె పంపె మేటి నట్టువరాండ్ర యాటలు జూచె చాలించి సభ నిజ సదనంబు చేరె అనాడు రామయ్య కమితమైనట్టి అలసట కలిగెను తలనొప్పి వచ్చె ఎన్నడు నలసట నెఱుగడే రాజు ఎన్నడు తలనొప్పి నెఱుగడే రాజు వాడిన మొగముతో వచ్చిన రాజు వ్రాలెను పడకపై బాధ తాడించ అంతిపురంబు వా రది గాంచి వేగ ఉపచారములు చేయ నుద్యుక్తులైరి స్నానంబు చేసిన శాంతించు నన్న స్నానమాడెను బాధ శాంతించ లేదు పరిమళద్రవ్యముల్ పరచిరి గదిని తలనొప్పి వానితో తగ్గనే లేదు శొంఠిపట్టున నొప్పి స్రుక్కున టన్న నుదురంత బిగబట్టె నొప్పి హెచ్చినది వైద్యులు వచ్చిరి వారి మందునకు సామ్రాట్టు తలనొప్పి సమసి పోలేదు కౌసల్య ఇంతలో గబగబ వచ్చి దృష్టి దోషంబని దిష్టి దీసినది పుత్రుని తలనొప్పి పోకున్న దాయె ఇంత లోపల పురోహితు లరుదెంచి ఇంత విభూతి మంత్రించి యలదిరి ఎవరేమి చేసినా యినకులేశ్వరుని తలనొప్పి ఇసుమంత తగ్గనే లేదు శివపూజలోనున్న సీతమ్మ వారు పూజలు సాలించి సౌజన్యమూర్తి దైవగృహంబును తాను వెల్వడిన అంతలో చెలికత్తె లంద రేతెంచి అమ్మగారికి స్వామి యుమ్మలికము తెలియంగ బల్కిన తెఱవ వేవేగ పరువెత్తి కొనిపోయి పతి బాధ నెఱిగి ఇంతటి తలనొప్పి యెట్లు వచ్చినది రావని యెరిగియు రామభక్తులకు కష్టంబు లన్నవి కలలోన నైన వ్యగ్రులై యరయుచు వారి సేమంబు సకల లోకంబుల సంగతు లెల్ల చిన్నవి పెద్దవి చీకాకు లెల్ల అరమర లేకుండ నవధరించుచును కొఱతల నూహించి కొందలపడుచు సాకేతరాజ్యంపు సమృధ్ధి జూచి ఓర్వని వారల యుక్తు లెన్నుచును కవులు గాయకులును గతమెన్ను వారు మిమ్ము కీర్తించెడు మిషమీద మీకు అహితంబు లగు నాటి యాపద లెల్ల దడవుచుండిన విన దప్పక వినుచు అలయు చున్నా రయ్య జలజాక్ష మీరు కావున తలనొప్పి కలిగెగా స్వామి అని సీత యీ రీతి యంగలార్చుచును పతి శయ్యపై చేరి పావనమూర్తి ఫాలంబుపై చేయి పరచి ప్రేముడిని నిమురుచు తన్వి కన్నీళ్ళు నించినది సీతాకరస్పర్శ శీతాంశు కిరణ స్పర్శంబు కంటెను చల్లనై సోకి జలధరశ్యాముండు గలగల నవ్వె శ్రీరామచంద్రుడు సేద దీరగను తృటిలోన తలనొప్పి మటుమాయ మాయె |
17, సెప్టెంబర్ 2013, మంగళవారం
శ్రీరామచంద్రుడి తలనొప్పి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)