20, ఆగస్టు 2013, మంగళవారం

పాహి రామప్రభో - 203..207. ఉత్సాహ రామాయణం.

ఈనాటి నుండి  అందమైన ఉత్సాహ పద్యములలో సంక్షిప్తంగా రామకథాగానం చేయాలని సంకల్పం కలిగింది.  పాఠక మహాశయులు ఈ‌ ప్రయత్నాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను.

యథా ప్రకారం రోజుకు ఒక పద్యం చొప్పున చెప్పుతూ పోతే చాలా రోజులు పడుతుంది.   అందుకే రోజుకు నాలుగైదు పద్యాలచొప్పున ప్రచురించా లనుకుంటున్నాను.

ముందుగా ఈ‌ ఉత్సాహంగురించి లఘుపరిచయం.

ఈ ఉత్సాహం అనేది ఒక అందమైన దేశి ఛందస్సు.  దీని లక్షణం ఏమిటంటే పద్యం నాలుగుపాదాల్లోనూ ప్రతిపాదానికీ 7 త్రిమాత్రా గణాలూ ఆపైన ఒక గురువూ.  ఇక్కడ నేను త్రిమాత్రా గణాలు అనడం లో‌ ఒక ముఖ్యమైన విషయం గమనించవలసి ఉంది. 

మన తెలుగు పద్యఛందస్సులలో సూర్యగణాలు అని మనం రెండు త్రిమాత్రాగణాలు వాడుతూ ఉంటాం.  అవి  హ(UI),  న(III) గణాలు.  ఇవి కాక మరొక త్రిమాత్రాగణం వ(IU) ఉంది - కాని దీనికి తెలుగు దేశి ఛందస్సులో వాడకం లేదు!.  ఇలా వ(IU) కూడా ఉత్సాహంలో వాడవచ్చునని ఒక లాక్షణికుడు పెనుమర్తి వేంకటాచార్యుని మతం.  ఇందులో తప్పేం లేదు. మంచి లయ కుదురుతున్న సందర్భంలో తప్పకుండా వ(IU) కూడా వాడ వచ్చునని నా అభిప్రాయం కూడా.   ఐతే పెనుమర్తి మతంలో పాదానికి 23మాత్రలని, 12మాత్రల తరువాత యతి అని.  అలాంటప్పుడు యధేఛ్ఛగా గగ(UU) కూడా వాడే అవకాశం దొరుకుతుంది.  ఇదీ బాగానే ఉంటుంది కాని వచనకవితా లక్షణం వచ్చేస్తుంది - ఆధునిక కవులకు బాగా నచ్చవచ్చును.  ఇక్కడ నేను ప్రయత్నించక పోవచ్చును కాని విడిగా అలా కూడా వ్రాసి చూస్తాను వీలువెంబడి.

ఉత్సాహంలో యతిస్థానం 4వ త్రిమాత్రాగణం తరువాతి అక్షరం.  ఉత్సాహంలో ప్రాసనియమం ఉంది.  ఇలా ప్రాస నియమం ఉన్నంత మాత్రాన ఉత్సాహం అనేది ఒక వృత్తంగా చెప్పకూడదు.  వృత్తాలు మార్గి ఛందస్సులు - వాటిలో ప్రతి పాదంలోనూ‌ ప్రతీ అక్షరస్థానమూ గురువా లఘువా అన్నది ఖచ్చితంగా నియమించబడి ఉంటుంది.  దేశీ మార్గి ఛందోరీతుల మధ్య ఇది నిర్ణయాత్మకమైన తేడా.

అన్నీ హ(UI) గణాలే త్రిమాత్రాగణాలుగా ఉన్న ఉత్సాహం సుగంధి అనే వృత్తం అవుతుంది.  అన్నీ న(III) గణాలే త్రిమాత్రాగణాలుగా ఉన్న ఉత్సాహం విచికితిల అనే వృత్తం అవుతుంది.  అలా వ్రాసినప్పుడు వాటిని ఉత్సాహం అనే పేరుతో పిలిచినా వృత్తాలని సుగంధి లేదా విచికితిల అన్నా ఫరవాలేదు.  అయితే శ్రమపడి ఉత్సాహం యొక్క దేశీయతను చెడగొడుతున్నా మేమోనని కవులు ఆ సందర్భంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి!

ఉత్సాహంతో సహా అన్ని దేశిఛందస్సుల లోనూ ప్రవాహ శైలి వీలైన చోట్ల పరిహరించటం మందచిది.  కాని అన్ని చోట్లా అది సాధ్యం కాకపోవచ్చును. అలాగా గణానికో‌ పదం విరుగుతుంటే భలే సొగసుగా ఉంటాయి దేశిపద్యాలు.  ఇదీ ఆచరణలో ప్రతిసారీ వీలుపడక పోవచ్చును.  కాని వీలయినంత వరకూ ప్రయత్నిస్తాను.


శ్రీమదఖిలభువనభర్త చిద్విలాసు డొప్పుగన్
రాముడై జనించి జగమ రావణంబు చేసి సు
త్రామముఖ్యసకలదేవతలకు ప్రీతిగూర్చి యీ
భూమి బరువు దించినట్టి పుణ్యకథను చెప్పెదన్   203


సకల దేవ సమితి వచ్చి సన్నుతించి వెన్నుడా
అకట పంక్తిశిరుని బాధ కాగ లేము వేగ నీ
వొకడవే సమస్త బాధ లుపశమింప జేయగా
నిక మహాత్మ తగిన వాడ వెటుల బ్రోతువో యనన్  204
 


ఆగడములు చేయు రావణాసురునకు మూడె నే
వేగ భువిని జొచ్చి వాని పిలుకుమార్చ నెంచితిన్

యాగఫలము మిషను దశరథాత్మజుండ నయ్యెదన్
సాగి మీరలెల్ల రండు సాయపడగ కోతులై   205


అని పరంతపుండు వెన్ను డభయ మిచ్చి ప్రీతిమై
ఇనకులేశు పంక్తిరథుని యింట బుట్టె రాముడై
చనిరి శేషఫణియు శంఖ చక్రములును తమ్ములై
ఘనులు రామవిభుని దివ్య కథను ముఖ్యపాత్రలై  206


అవనిజాత యగుచు లచ్చి హరిని వెంబడించి తా
నవతరించె పుడమి మీద నఖిలదనుజకోటి కా
యువులు తీరె ననుచు నమరు లుత్సహించి పాడగా
భువనకోటిమాత వేడ్క పుణ్యశ్లోక సీతయై  207


.................... ఉత్సాహరామాయణం ఇంకా ఉంది