13, ఆగస్టు 2013, మంగళవారం

పాహి రామప్రభో - 196

పూజావిధానంలో  తాంబూలం అనంతరం, నీరాజనం, తదనంతరం మంత్రపుష్పం అనే ఉపచారాలు ప్రచారంలో ఉన్నాయి. నీరాజనం చెప్పుకున్నాక,  

మంత్రపుష్పం

సర్వేశ కల్పించి సకలలోకముల
నిర్వహింతువు నీవు నిరుపమ లీల
కర్మసాక్షులు నీకు కన్నులై యుండ
చల్లగా చూచెద వెల్ల లోకముల
పరమాత్ముడవు నిన్ను భావించువారి
సంరక్షణము నీవు సలెపెద వెపుడు
సర్వాత్మనా నిన్ను చక్కగా నమ్మి
ఉర్విపై నీవార మున్నాము తండ్రి
ధర్మం బధర్మంబు తప్పొప్పు లనుచు
మాకేమి తెలియును మము గన్న తండ్రి
నీ పాదముల చెంత నిలుచుట తప్ప
అన్య మెఱుగని వార మయ్య రక్షించు
నీ‌ రక్షణము కోరి నిలచి యున్నాము
నీ నామమును నమ్మి నిలచి యున్నాము
నీ దివ్యచరితంబు నిగమమై యుండు
నీదు ప్రభావంబు నిత్యమై యుండు
నీ యందు మా బుధ్ధి నిలబడు నట్లు
నీ‌వు మన్నింపవే నిగమైక వేద్య
నీ దయామృతవృష్టి నిష్పాపు లగుచు
నీ ధామమును చేర నీవయ్య మమ్ము
వేరొండు వరముల వేడబోమయ్య
చిత్తగించుము దేవ శ్రీరామచంద్ర

క. ఈ మనవియె మంత్రముగా
నా మానసపుష్ప మిదియె నా స్వామీ శ్రీ
రామా నీ కర్పించెద
భూమిసుతారమణ నన్ను బ్రోవుము తండ్రీ.

తాత్పర్యం.   స్వామీ, శ్రీరామచంద్రా,  నీవు విష్ణువువు. సకలలోకాలనూ కలిగించి నీ‌ అద్భుతమైన లీలతో రక్షిస్తున్నావు.  కర్మసాక్షులైన సూర్యచంద్రులు సాక్షాత్తూ నీ‌ కళ్ళే.  నువ్వు లోకాలన్నిటినీ చల్లగా చూస్తున్నావు. నీ భక్తులను రక్షిస్తుంటావు.  మాకు ధర్మాలూ‌ అధర్మాలూ తప్పులూ‌ ఒప్పులూ ఏమి తెలుసు, నిన్నే‌ నమ్ము కున్నాము.  నీ‌ పాదాల దగ్గర నిలబడి ఉన్నాం.  నిన్నే‌ నమ్మి ఈ‌ భూమి మీద జీవిస్తున్నాం.  నీ‌ నామాన్ని నమ్ముకున్నాం - నీ‌ రక్షణ కోరుతున్నాం.  నీ చరిత్ర వేదం.   నీ‌ ప్రభావం నిత్యం. మా బుధ్ధి నీ మీద నిలచి ఉండేటట్లు అనుగ్రహించు.  నీ‌ దయ చేత పాపాలన్నీ‌ పోయి చివర నీ‌ పరమపదానికి మేము చేరుగునే‌వరం ఇవ్వు. ఇంకేమీ అక్కర లేదు. దేవా శ్రీరామచంద్రా ఈ మనవిని చిత్తగించు.

నాకు మంత్రాలు రావు.  నా మనవినే మంత్రం అనుకో‌ తండ్రీ,  నా మనస్సే మంచి పుస్పం అనుకో.  ఈ‌ మంత్ర పుష్పం స్వీకరించి నన్ను అనుగ్రహించు.

(ఆగష్టు 2013)