4, ఏప్రిల్ 2013, గురువారం

పూతన - ఖండకావ్యం: ముందుమాట.


శ్రీమద్భాగవతంలో పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు యొక్క లీలా విశేషాలు అత్యంత రసవత్తరంగా అభివర్ణించబడ్డాయి.  అవును, రసో వై సః అని కదా ఆయన గురించి చెప్పుకుంటాం.  ఆయన అవతారాల్లో శ్రీకృష్ణావతారం యొక్క ప్రసిథ్థి గురించి ప్రత్యేకంగా చెప్పాలా.  కృష్ణస్తు భగవాన్ స్వయం అని ప్రతీతి.  ఆయన బాల్యలీలలు పోతన గారి భాగవతంలో చదివి పులకించని తెలుగువాళ్ళు అరుదు.

శ్రీకృష్ణపరమాత్ముని బాల్యలీలలు పూతనాసంహారంతో‌ మొదలవుతాయి.  ఈ‌పూతన ఒక రాక్షస స్త్రీ.  కంసుడు పంపగా బాలకృష్ణుని చంపాలని నందగోకులానికి వెళ్ళింది.  బాలకృష్ణు డామె స్తన్యం అంగీకరించాడు.  స్తన్యంతో‌ పాటు ఆమె ప్రాణాలనూ గ్రహించాడు.

పూతన తన చన్నులకు విషం పూసి ఆ విషంతో కృష్ణుని చంపాలని ప్రయత్నీంచిందని అందరం నమ్ముతూ ఉంటాం.  కాని అలాగని తెలుగు భాగవతంలో‌ స్పష్టంగా లేదు.  అయితే తన పాలు త్రాగితే బాలుడు మరణిస్తాని పూతన అన్నట్లు తెలుగుభాగవతం లో‌ స్పష్టంగానే ఉంది. ఒకవేళ చన్నులకు విషం‌ పూసుకుంటే అది ఆమెకు ప్రాణహాని కాదా? అది అస్పష్టం. సంస్కృతభాగవతంలో యెలాగుందో నాకు సరిగా తెలియదు.  ఈ‌ ప్రశ్నకు నేనొక సమాధానం అన్వేషించాను.

చనిపోయిన పూతన భారీ‌ శరీరాన్ని నందాదులు ముక్కలు చేసి మరీ‌ బయటకు తీయవలసి వచ్చింది.  ఆ శరీరానికి వారు దహన సంస్కారం చేసారు.  ఆ కట్టె అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు దుర్గంధానికి బదులుగా పరమాద్భుతంగా పరమమనోహరమైన సుగంధం వెలువడింది.

ఒక రాకాసి కళేబరం‌ నుండి సుగంధమా?
ఇలా జరగటం‌ వెనుక విశేషం‌ యేమిటి?

పూతన పేరుతో ఒక ఖండకావ్యం రచించి దానిలో ఈ ప్రశ్నలకు సమాధానం‌ ఇవ్వాలని నా ప్రయత్నం.

నిజానికి ఈ ప్రయత్నాన్ని చాలా కాలం‌క్రిందటే, ఆంటే ఆరేళ్ళ క్రిందటే,  మొదలు పెట్టాను.  ఓ పది పద్యాలలూ గిలికాను.  కానీ ఉద్యోగబాధ్యతల కారణంగా ప్రశాంతంగా వ్రాసే అవకాశం లభించక ప్రయత్నం ప్రయత్నం క్రిందే‌ మిగిలి పోయింది.
ఈ‌మధ్యనే మళ్ళీ పూనుకుని వ్రాస్తున్నాను.   దాదాపు పూర్తి కావచ్చింది.

రేపటి నుండి యీ బ్లాగులో వరుస టపాలలో ప్రచురిస్తాను.

పూతన ఖండకావ్యం విషయానుక్రమణిక

1.  రత్నావళీ వృత్తాంతము
2.  కంసుడు పూతనను నియమించుట
3.  పూతన నందవ్రజమునకు ప్రయాణమగుట
4.  పూతన నందనందనుని గాంచుట
5. పూతనా సంహారము.


పాఠకులు ఈ ఖండకావ్యం పఠించి తమతమ అమూల్యాభిప్రాయాలు తెలియయవలసిందిగా ప్రార్థన.