నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం
భావం:
ఓ ముకుందా!
నిజమే. నీ చరణారవిందాలకు నేను నమస్కారం చేస్తూనేఉంటాను.
ఏదో యీ మానవజన్మ యెత్తాక నరకం రాక తప్పుతుందా శరీరం వదిలాక? అది తెలుసు. ఆ రాబోయేది యే కుంభీపాక నరకమో యేమో అని భయపడుతున్నానా?
దాని నుండి తప్పిస్తావు కదా దయ చూపించి అని నీ కాళ్ళకు మ్రొక్కుతున్నానా?
లేదు సుమా!
సరేలే, ఎత్తాం నరజన్మ సద్వినినియోగం చేసుకుందాం. శృంగారరసాధినాధుడివి నీ కాళ్ళకు మ్రొక్కితే అందమైన అమ్మాయిల్ని అనుగ్రహిస్తావేమో ననే ఆశతో దణ్ణాలు పెడుతున్నానా?
లేదు సుమా!
తండ్రీ! నీచరణారవిందా లున్నాయే, అవి అద్వంద హేతువులు. వాటిని ఆశ్రయించిన వాడికి సకల ద్వంద్వాలనూ నాశనం చేస్తాయవి. అసలు నీవు-తాను అనే ద్వంద్వం కూడా నాశనం అయిపోతుంది కదా. ఇక అటువంటి భక్తుడికి మిగిలేది కైవల్యమే. తానే నీలో ఐక్యం అయిపోతాడు కదా. అంత గొప్పవి నీపాదాలు. అంత గొప్పది నీపాదసేవన మాహాత్మ్యం.
అయినా నా బోటి వాడికి అంత గొప్ప భక్తీ, ఆ కైవల్యం చటుక్కున వచ్చేనా! యేమో.
కాని, జన్మజన్మలకీ ఆ నీ దివ్యపాదాల యెడ నా హృదయంలో వెలుగులీనుతూ ప్రకాశించనీ. నీ యందు నా భక్తిని అవి శాశ్వతంగా నెలకొనేటట్లు చేయనీ.
అందుకే నేను నీ దివ్యశ్రీ చరణాలను ఆశ్రయించుకున్నాను స్వామీ.
నీ యందు నా భక్తిని అవి పెంపొందింప జేసి నన్ను మోక్షార్హుడిని చేస్తాయి అన్న ఆశ మాత్రమే ప్రభూ.
స్వేఛ్ఛానువాదం:
ఉ.శ్రీపతి నీదు పాదముల సేవన చేసిన నెల్ల ద్వంద్వముల్
రూపరు వానినే గొనుట రోయగ నారక భీతి చేతనో
రూపసు లైన కన్యల మరుల్గొని గోరియొ కాదు యే
లోపము లేని భక్తి యెదలోపల నిండగ జన్మజన్మలన్.