కొందరు లేడనగానే కీర్తికి కొంచెము కాని రాముడు
సత్యసంధుడీ రాముడు బహు సరసహృదయుడీ రాముడు
నిత్యము భక్తుల కోర్కెలు తీర్చే నిరుపమానుడీ రాముడు
నాకు నీవే రక్షకుడవని నమ్మితిని శ్రీరామచంద్రా
నీకు మ్రొక్కుదు గాని యేమియు నేను కోరను రామచంద్రా
తల్లి వీవే తండ్రి వీవే దశరథాత్మజ రామచంద్రా
యెల్లవేళల నాకు వలసిన దిచ్ఛుచుండే రామచంద్రా
వెల్లువై కష్టములు నన్నిట విరుచునప్పుడు రామచంద్రా
చల్లగా నాకెపుడు చేతిని జాచువాడవు రామచంద్రా
భువనమందున నీకు బిడ్డలు పోల జీవులు రామచంద్రా
ఎవరి కేనా డేది యీవలె నెరుగుదువుగా రామచంద్రా
శివుడు తారకమంత్ర మిచ్చుచు చెప్పెనిది శ్రీరామచంద్రా
అవిరళమ్ముగ నిన్ను కొలిచెద నంతియే హరి రామచంద్రా
శ్రీరామనామము ప్రాణమైన జీవితమ్మే చాలదా
ఆరాముడే నీప్రాణసఖుడై నట్టి బ్రతుకే చాలదా
హరి దివ్యగాథాలహరి వినెడు నట్టి చెవులే చాలవా
హరి నామమొకటే పలికి మురిసెడు నట్టి నాలుక చాలదా
హరి పూజలందే నిత్యముండెడు నట్టి కరములు చాలవా
హరి క్షేత్రములనే తిరుగుచుండెడు నట్టి కాళ్ళే చాలవా
హరి రూపములనే చూడగోరెడు నట్టి కన్నులు చాలవా
హరితత్త్వచింతన మందు నిలిచెడు నట్టి బుధ్ధియె చాలదా
హరిభావనారతి ననిశముండెడు నట్టిమనసే చాలదా
హరి కరుణకన్యము నాకు వలదను నిశ్చయంబే చాలదా
హరిభక్తులే నీకాప్తబంధువు లైన నదియే చాలదా
హరి కన్యదైవము లేడులేడను నట్టి ధృఢతయె చాలదా
హరి విశ్వకర్తయు విశ్వమయుడను నట్టి యెరుకే చాలదా
హరి మోక్షమిచ్చును వేరు వరముల నడుగ ననుటే చాలదా
కల్యాణి
ఇచ్చట రాముని పాటల ముచ్చటలే దొరకు నండి
వచ్చి స్వయముగా నరసి మెచ్చి మీరు పాడుకోండి
నిండు మనసుతో రాముని నిత్యము సేవింతురా
పండుగయే రామునిపై పాటలనే పాడుకొనుట
రండి సుజనులార మీరు రామునిపై కీర్తనలు
దండిగా లభించు నిచట తప్పక విచ్చేయండి
పదేపదే రామాయని పలుకుచును మురియుచును
సదా హృదయముల రామసన్నిధియే కలవారికి
ముదావహముగా నిచట నే ప్రొద్దనకను భక్తి మీర
సదారామభజన జరుగు సంతోషముగ రండి
హరినామ స్మరణమందె నిరంతరము గడుపువారు
తరింతురు మరల వారు ధరకు వచ్చు పనే లేదు
హరినామము మారు మ్రోగు నట్టి మంచిచోటి దండి
పరుగున శ్రీరామభక్తవరు లారా రండి రండి
దిక్కంటే అందరకూ దిక్కు రాముడే
దిక్కంటే అన్నిటీకీ దిక్కు రాముడే
సర్వలోకములకు రామచంద్రు డొకడె దిక్కు
సర్వకాలములను రామచంద్రు డొకడె దిక్కు
సర్వజీవులకును రామచంద్రు డొకడె దిక్కు
సర్వవిధములుగను రామచంద్రు డొకడె దిక్కు
సర్వదిక్కులందు రామచంద్రు డొకడె దిక్కు
సర్వకష్టములను రామచంద్రు డొకడె దిక్కు
సర్వవ్యాధులందు రామచంద్రు డొకడె దిక్కు
సర్వులును తరింప రామచంద్రు డొకడె దిక్కు
నందగోపసుతావంద్య బృందారకజనవంద్య
నందివాహనా త్రిపురసుందరీశ మునివంద్య
వందనమో శివశంకర ఫాలవిలోచన హర
వందారు భక్తసుజనమందార దురితహర
సుందరాకార ఉమాసుందరీ సహిత లోక
వందిత సంసారభయాపహర భవతాప హర
వందనమో సదారామవందితచరణారవింద
వందనమో రామనామపారాయణసదానంద
వందనమో మహాదేవ వరదాయక శుభదాయక
అందె నాకు భవతారక మద్భుతముగ నీదయచే
కాంభోజి
నీయందు మాబుధ్ధి నిలచి యుండు నటుల
జేయుమా సర్వేశ శ్రీరామచంద్ర
మాయచే కాయముల మతిమాలి ప్రేమించి
నీయందు బుధ్ధినే నిలుపగ లేము
మాయదారి మాయ నీయునికినే గప్పి
వేయగా నిన్నెరుగు విధమేది దేవుడా
మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి
మాయలోనే చచ్చు మాబోంట్లకు
మాయ యొక టున్న దను మాట తెలియుట యెట్లు
తోయంబులకు వెలి తోచునా చేపలకు
ధ్యేయుండ వగు నిన్ను తెలియనీయదు మాయ
మాయింద్రియము లందు మసలుట చేత
నీయాన గొని యాడు నీమాయ తొలగితే
ఓయయ్య నిను విడచి యుండునా మాబుధ్ధి
వేవేల నామాల వెన్నుడ నీమహిమ
భావించి మెప్పించు ప్రతిభ లేకున్నను
నీవాడనే కాని పైవాడనా యేమి
సేవించు నామొరలు చిత్తగించవు స్వామి
జగముల పుట్టించి చక్కగా పోషించి
తగ లోగొను దేవా దాసుడ నేగానా
నిగమాగమవిదిత నిత్య శుధ్ధబ్రహ్మ
మగు నీవే శరణమో యభవ భవమోచన