పేజీలు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

తెలిసియుండి

అన్నీ నీకు తెలిసియుండి యడుగ నేల నిటుల
కొన్ని కొన్ని మరల వినగ కుతూహలము కాక

అందరిలో నింతవాడ వంతవాడ వని పొగడిన
విందును మరి యొక్కసారి వినిపించు మనక
అందరి గడబిడల మధ్య నంత సరిగ వినలేదు
ఇందిరయును వినగోరెడు నిపుడు తెలుపు మందువే

ఎందుకయా మోక్ష మనుచు నింత యంగలార్తు వని
యందువు నను కికురించగ నదియే రామా
వందారు సద్భక్తజనమందార నాకోరిక
యుందును నీమ్రోల నని యొక వేయిమార్లంటి



1 కామెంట్‌:

  1. మరి మరి వేడనేల?
    బల్కె హరి వేడ్కతోన
    సమయమాసన్నమైన
    నదియె సిద్దించుగద.
    🙏🙏🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.