పేజీలు

22, ఆగస్టు 2024, గురువారం

మందన్న నిదియే మందుకదా


మందన్న నిదియే మందుకదా బుధు

లందరు మెచ్చిన మందుకదా


వేయిజన్మలుగ వదలని బాధల వెడలించే దీమందుకదా

మాయదారి భవరోగము నిట్టేమాయము చేసే మందుకదా


ఆరువిధంబుల రోగలక్షణము లన్నిటి నణచే మందుకదా

తీరని మమతయు నహమను చిత్తవికారము లణచే మందుకదా


కల్లదైవముల గొలిచే వెఱ్ఱిని కట్టడిచేసే మందుకదా

ఉల్లము చక్కగ హరిపై నిత్యము నల్లన నిలిపే మందుకదా


రామనామమను పేరుగలిగిన రసవంతమగు మందుకదా

భూమిని దీనినిమించిన దేదీ పుట్టని ఘనమగు మందుకదా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.