చాలు చాలు నీసేవయె చాలును మాకు
కాలము నీసేవలో గడచుట చాలు
తెలియని వారమని తెలియుటయే గాక
తెలిసిన దేమి మాకు దేవదేవుడా
తెలిసి యేమి లాభము తెలియ కేమి నష్టము
వలచి నీ సేవ జేయ గలిగిన చాలు
గురువు దొరక లేదనుచు కొండంత చింతేల
గురు వందరకు శివుడు కువలయంబున
తరుణమెఱిగి తారకమంత్రము నిచ్చుచుండగ
మరువక నీసేవలో మసలిన చాలు
వేల శాస్త్రంబులను వివరింపగ నేల
చాలదా నీయందు సద్భక్తి మాకు
మేలేమి యేమంత్రజాలంబుచే మాకు
చాలు నీరామనామజపమే మాకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.