ధనకనకంబులె సర్వము తమకని తలచుచునుందురు కొందరు
వనజాక్షా నీసేవాభాగ్యము వదలలేరు మరికొందరు
రమణీమణుల సాంగత్యమునకు భ్రమపడుచుందురు కొందరు
రమారమణ నీసాంగత్యమునకు ప్రార్ధింతురు మరి కొందరు
కుమారకులు తమ నుధ్ధరించుటను కోరుచునుందురు కొందరు
కమలాక్షా నీవుధ్ధరించుటను కాంక్షింతురు మరి కొందరు
పరుల మెప్పునకు శాయశక్తులను పాటుపడుదు రిల కొందరు
పరాత్పరా హరి నీమెప్పునకై ప్రార్థింతురు మరి కొందరు
పొరిపొరి నానాదేవగణంబుల పూజించెద రిల కొందరు
పురుషోత్తమ హరి నిన్నొక్కడినే పూజింతురు మరి కొందరు
నోరుచేసుకొని దేవుడు లేడని నుడువుచు నుందురు కొందరు
శ్రీరఘురామా నిన్ను నమ్ముకొని జీవింతురు మరి కొందరు
ఊరక బహుమంత్రంబుల జదువుచు నుందురు మూర్ఖులు కొందరు
ఊరక బహుమంత్రంబుల జదువుచు నుందురు మూర్ఖులు కొందరు
తారకనామ స్మరణము చేయుచు తరియింతురు మరి కొందరు