సురుచిర నామనమున నిన్నే నీమ మెసగ గొల్తున్ ప్రేమ మయుడ సీతా రామ సుగుణ ధామా |
సురుచిర .
ఈ సురుచిర వృత్తానికి గణాలు భ - స - గ. అంటే పాదానికి కేవలం 7అక్షరాలు. అందుచేత యతిమైత్రి అక్కరలేదు. ప్రాసనియమం తప్పదు.
పాదానికి 14అక్షరాల నిడివికల కమలవిలసితం అనే వృత్తానికీ సురుచిర అనే మరొక పేరుంది! ఇలా ఒకఏ వృత్తానికి రెండో అంతకన్నా ఎక్కువో పేర్లుండటమూ ఒక పేరుతో ఒకటి కంటె ఎక్కువ వృత్తాలుండటమూ కూడా ఒక తమాషా.
ఈ వృత్తానికి త్రికగణాలు భసగ అన్నాం కదా.. అంటే గురులఘుక్రమం UII IIU U. దీనినే మనం UI III UU అని వ్రాస్తే మొదటి రెండూ సూర్యగణాలు ఆ పైన ఒక గగ గణమూ అన్నమాట. ఐతే ఎక్కడ ఏసూర్యగణం అన్నది స్థిరం అనుకోండి.
ప్రస్తుత పద్యం నడక చూదాం:
నా మ | నమున | నిన్నే |
నీమ | మెసగ | గొల్తున్ |
ప్రేమ | మయుడ | సీతా |
రామ | సుగుణ | ధామా |
ఈ చిట్టి పద్యం బాగుంది కదా? ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.