9, ఫిబ్రవరి 2019, శనివారం

వ్యాఖ్యావ్యాసంగానికి స్వస్తి పలుకుతున్నాను


నేను అనేక కారణాలవలన నా బ్లాగు వ్యాసంగానికి పరిమితులు విధించుకొన వలసి వస్తున్నది.

ఇకపై వీలుచూసుకొని శ్యామలీయం బ్లాగులోనో లేదా మరొక నాబ్లాగులోనే వ్రాయటమే కాని ఎక్కడా ఎవరిని ఉద్దేశించీ ఏవిషయం గురించీ వ్యాఖ్యానించటం చేయను.

ఇటువంటి భీషణప్రతిజ్ఞలు లోగడ కొన్ని సార్లు నేను చేసి ఉండవచ్చును.

కాని ఇప్పుడు పరిస్థితులు వేరు.

దాదాపుగా రామసంకీర్తనం తప్ప తదితరాలపైన మనస్సు నిలుపలేకున్నాను.

అంత ప్రాణసమానమైన రామసంకీర్తనం చేయటానికి కూడా నాకు సమయం దొరకటం ప్రస్తుతపరిస్థితుల్లో కొంత కష్టంగానే ఉంది.

ఈ రోజున అనివార్యంగా కొన్ని వ్యాఖ్యలు వ్రాయవలసి వచ్చింది. వ్రాస్తున్నంతసేపూ చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను.

అటువంటప్పుడు నేనాట్టే దృష్టిపెట్టటానికి వీలు కుదరని వ్యాపకాలకు స్వస్తి చెప్పక తప్పదు కదా.

అలా స్వస్తి చెప్పక తప్పని వ్యాసంగాల్లో, బ్లాగులకు సంబంధించి వ్యాఖ్యలను అడపాదదపా వ్రాయటమూ ఒకటి.

ఇక చాలు అనుకుంటున్నాను.

కొందరు నా పల్కుదారుణాఖండలశస్త్రతుల్యము అని భావిస్తూ అక్షేపించటం నాదృష్టికి వచ్చింది. అనేకులు నావ్యాఖ్యలను మొగమాటానికి అంగీకరించినా వ్యాఖ్యలలో చేసిన సూచనలను పెడచెవిని పెట్టటం ద్వారా నోటితోనవ్వి నొసటితో వెక్కిరించటమూ నాధృష్టికి వచ్చింది. అక్కడక్కడ నా వ్యాఖ్యలు చెత్తబుట్టల్లోనికి వెళ్ళటమూ నాదృష్టికి వచ్చింది.  నా వ్యాఖ్యలవలన బ్లాగులోకానికి పెద్దగా ప్రయోజనం లేదన్నదే నిజం అన్నదీ నాదృష్టికి వచ్చింది. అంతేకాక కొన్నికొన్ని సార్లు వ్యాఖ్యలవలన నేను అనవసరమైన వివాదాల్లో చిక్కుపడుతూ ఉండటమూ నాదృష్టికి వచ్చింది.

అందుచేత ఇకపైన వ్యాఖ్యలను ఎక్కడా వ్రాయను. (గమనిక: నేటి నావ్యాఖ్యలపైన ప్రతివ్యాఖ్యలు వచ్చినా వాటికీ సమాధానం చెప్పే పరిస్థితిలేదని మిత్రులు గ్రహించి మన్నించాలి.)


నాటపాలకు చదువరులే అరుదు కాబట్టి కామెంట్లు దాదాపుగా నాస్తి. ఒకవేళ నాటపాలకు ఎవరైనా వ్యాఖ్యలు ఉంచితే వాటికి తగినంతమాత్రంగా స్పందించటం మర్యాద కాబట్టి ఆ విషయంలో మినహాయింపు. ఐనా అక్కడా చర్చలకు దిగటం వీలుపడదు ఎట్టిపరిస్థితుల్లోనూ.

వీలైనంతవరకూ నా వ్రాతలు నేను వ్రాస్తున్నా అజ్ఞాతంలో ఉండటమే హాయి అన్న నిర్ణయానికి వచ్చాను.

నిజానికి ఈనిర్ణయం వెనుక కొంత కథా పరిశ్రమా ఉన్నాయి.  కొన్ని ప్రయోగాలు చేసాను. అవి వెల్లడించలేను.  ఒకవేళ వాటిలో ఏవైనా వెల్లడించిన పక్షంలో అవి ఎవరిమనస్సునైనా ఇబ్బంది పెట్టటం జరుగవచ్చును కాబట్టి వెల్లడించను. మన్నించాలి.

ఐతే వాటి ఫలితాల వలన కనువిప్పు కలిగిందనీ, నేనెంత అనామకుణ్ణో నాకు చక్కగా తెలిసివచ్చిందనీ కించిత్తు సంతోషంగానే బ్లాగుముఖంగా వెల్లడిస్తున్నాను.

పెద్దగా ఎవరూ చదవని బ్లాగు.
వేరుగా ఎక్కడా వ్రాయని బ్లాగరు.
నేడో రేపో ఎలాగూ కనుమరుగు కావలసిన బ్లాగరు.
మెల్లగానో వేగిరమో విస్మరించబడితే ఇబ్బంది లేదు.
అందరికీ ప్రశాంతత లభిస్తుంది.
ఇలా బాగుంటుందని తోస్తోంది.
అలా కానిద్దాం.

ఈ నిర్ణయం వలన ఎవరికీ ఇబ్బంది ఉంటుందని అనుకోను. ఎవరికైనా నొవ్వుకలిగితే పెద్దమనసుతో మన్నించమని విజ్ఞప్తి.12 వ్యాఖ్యలు:

 1. శ్యామలీయం గారు! మీకు వీలైతే మీరెప్పుడో రాద్దామనుకుంటున్నట్టు ప్రస్తావించిన లలితా సహస్రనామాలకి అర్థాలు రాయగలరా, దయచేసి?

  మీకిప్పటివరకూ ఎప్పుడూ చెప్పే సందర్భం రాలేదు కానీ, మీ లలితా సహస్రనామ స్తోత్రం - నామ విభజన పట్టిక నాకు నిత్య పారాయణం. దానిని పోస్ట్ రూపంలో అందించిన మీకు వేవేల కృతజ్ఞతలు.

  https://syamaliyam.blogspot.com/2013/10/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అమ్మ ఆజ్ఞ. తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇప్పటివరకూ కంచిపరమాచార్యుల వారి గురించి నీలంరాజు వేంకట శేషయ్యగారి విరచించిన నడిచే దేవుడు పుస్తకాన్ని చదువుతున్నాను. ఇంతలో మీనుండి వర్తమానం. ఆనందంగా ఉంది. తప్పక ఈప్రయత్నం చేదాం.

   తొలగించు
 2. రాజారావుగారు మిమ్మల్ని ఉద్దేశ్యించి అనలేదు.వీ ఎన్ ఆర్ గారి ని ఉద్దేశ్యించి వ్రాసారు. మీరు అలగడం బాగాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లిలితాసహస్రనామస్తోత్రం కొరకు వేరే బ్లాగు తెరచాను. https://sreelalita.blogspot.com/

   తొలగించు
  2. నీహారిక గారూ,

   ఏమోనండీ. బహుశః నేనే అనవసరంగా బుజాలు తడుముకొన్నానేమో. ఐనా నేనున్న ప్రస్తుతపరిస్థితిలో ఒకవేళ అలా గందరగోళపడి గగ్గోలుపెట్టినా అశ్చర్యం లేదు.

   ఇకపోతే, మనశ్శాంతి కోసం కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండటం వలన నాకూ బ్లాగుమిత్రులకూ కూడా మంచిది. చూసారూ, అనవసరంగా మాష్టారి మాటలకు అపోహపడ్డానేమో కదా. అందుచేత మౌన ముత్తమ భాషణమ్ అని వ్యాఖ్యావ్యాసంగం మానుకోవటం వలన, గందరగోళాలకి స్వస్తి అవుతుంది.

   నిన్న లలితగారు అడిగినది మనస్సుకు ఎంతో నచ్చింది. రామకీర్తనలతో పాటు అది కూడా భగవత్కార్యం కాబట్టి మనస్సుకు బాగుంటుందనిపించింది.

   తొలగించు
 3. నేను మీకు చెప్పేటంతటి వాడిని కాను. మీ బ్లాగు, మీ ఇష్టం అలాగే మీ వ్యాఖ్యలు మీ ఇష్టం.

  "నా వ్యాఖ్యలవలన బ్లాగులోకానికి *పెద్దగా* ప్రయోజనం లేదన్నదే నిజం"

  "పెద్దగా" అన్నది setting the bar too high. వందలాది వ్యాఖ్యలలో ఏవో కొన్ని ఎవరో కొందరికి కొద్దిగా ప్రయోజనం చేకూర్చినా మంచిదే.

  "If a clod be washed away by the sea, Europe is the less, as well as if a promontory were, as well as any manner of thy friends or of thine own were": John Donne

  "నేను అనవసరమైన వివాదాల్లో చిక్కుపడుతూ"

  వివాదం లేని వాళ్ళు (మీ వ్యాఖ్యల వలన లాభం పొందిన వారు) ఇంకా ఎందరో ఉంటారు వారు సైలెంటుగా ఉన్నారని ఎందుకు అనుకోకూడదు?

  "కొంత కథా పరిశ్రమా ఉన్నాయి. కొన్ని ప్రయోగాలు చేసాను"

  No experiment is free of design errors (e.g. observer effect) especially in human relations with cognitive bias throwing up too many false positive "results".

  It may be better to take people at face value without imputing/testing motives. This may or may not be correct but "fails safely" for all involved.

  "నేనెంత అనామకుణ్ణో నాకు చక్కగా తెలిసివచ్చిందనీ"

  మీరు దీన్ని బూలియన్ (IF PERFECTION ELSE NOBODY) సమస్యలా చూస్తున్నారేమో? ఇంత అనుభవం, విషయం సంపద & ఓర్పు ఉన్న మీకు ఇలా ఎందుకు తోచిందో అర్ధం కావడం లేదు.

  గాయబడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అని దాశరధి అడిగారు. ఆ ఆవేదనతో ఆయన మానేసి ఉంటే తదుపరి కళాఖండాలు మనకు దొరికేనా?

  కాళోజీ నారాయణ రావు "అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక" అన్నారు. అంతటి శక్తి కలిగిన అక్షరాలకు (మీ సొంతమే అయినప్పటికీ) అడ్డుకట్ట వేసి మీనుండి ఎంతో నేర్చుకోవడం బాకీ ఉన్న వారికి నష్టం వేయవద్దని సవినయంగా విజ్ఞప్తి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సహృదయంతో మీరు వ్రాసిన వ్యాఖ్య ఆలోచనీయంగా ఉంది. నా వ్యాఖ్యల వలన ప్రయోజనం పొందే వారుండవచ్చునన్న మీ ఆలోచనను ఆమోదిస్తాను. కాని వ్యాఖ్య వ్రాయటం అన్నది ఇబ్బందులు కొనుక్కోవటంగా అనేకసందర్భాల్లో నాకు ప్రత్యక్షానుభవం. దీనివలన వివాదాలకు దూరంగా ఉండటానికి నాకు వ్యాఖ్యావ్యాసంగానికి దూరంగా ఉండటమే క్షేమం అన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం నేను ఉన్నపరిస్థితులు కూడా అంత ఉత్సాహజనకంగా లేవు. ఆందోళనలతో కూడిన మనస్సుతో సాధ్యమైనంత వరకూ ఆథ్యాత్మికరచనలకు తప్ప పరిమితంగానైనా మరే వ్యాపకానికీ ఆట్టే సమయం ఇవ్వలేను కూడా. లేదండీ ఇక్కడ బూలియన్ సమస్య లేదు; నన్ను అనామకుడిగా జమకట్టిన వారున్నారంటూ కొన్నికొన్ని సంగతులను విస్తరించలేను కాని అది నిజం. వీలైనంతవరకూ శ్యామలీయం బ్లాగుల్లో మాత్రం వ్యాఖ్యలు వ్రాయటం జవాబులివ్వటం చేస్తానంతే.

   అన్నట్లు రాజకీయవిషయకంగా మీతో కొంచెం తీవ్రంగానే విబేధిస్తూ ఈరోజున శ్యామలీయంలో వ్రాయవలసి వచ్చింది, దానికి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన పనిలేదు మనం.

   తొలగించు
  2. విబేధాలు & తీవ్ర విబేధాలు అన్నీ మామూలే. నాకు తోచింది నేనన్నాను మీకు తోచింది మీరు చెప్పారు ఇందులో ఆక్షేపణలు లేవు. We agree sometimes and agree to disagree on other occasions. My only request (if possible) is: please do not attribute motives.

   మీతో కవితలు రాయించిన రాముడే మళ్ళీ మీతో వ్యాఖ్యలు రాయిస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తాము.

   తొలగించు
 4. అయ్యా మీరు మొదలుపెట్టిన ప్రోజెక్ట్ లు దాదాపు ఓ పదో పదిహేనో అసంపూర్తిగా పడి ఉన్నై. భాగవతం ఒకటి, పూతన ఖంఢ కావ్యం ఒకటి. అమ్మవారి పద్యాలొకటి. విచిత్ర కవితా ప్రపంచం అని మరొకటి నాకు గుర్తున్నంతవరకూ.

  రాక కీర్తనలు ఎప్పటినుండో వస్తున్నవి కూడా. ఎప్పుడూ మానమని ఏమీ చెప్పలేదు కానీ ఇవన్నీ పూర్తి చేయగలరు మీరు. రాముడు నాకు సమయం ఇవ్వట్లేదు అంటారు అడిగితే. ఎవరూ నా బ్లాగు చదవరూ అని మరో సారి. పోతన కానీ అలా - నా భాగవతం ఎవరు చదువుతార్లే అని అనుకుని ఉంటే మనకి ఏమై ఉండేది? అందుకే ఆయన 'పలికించెడు వాడు రామభద్రుడట..." అనుకుంటూ "ఆయన కోసం" రాసాడు. ఎవరో చదువుతారనీ, చదివి ఏదో ఊడబొడుస్తారనీ కాదు. అదీగాక రమభద్రుడు పోతనని భాగవతం రాయమన్నది - పోతనకి మరో జన్మ లేకుండా చేయడానికి. అది పోతన ముందు పద్యాల్లో తానే చెప్పుకున్నాడు. ఓ సారి రాసి అవతల పారేసాక అది ఎలా పోతుందో అని పోతన చుసుకోలేదు. "ఆయన" రాయమన్నాడు, "నా చేత" రాయించాడు, అనుకున్నాడంతే. "నేను రాసానొహో" అని చెప్పుకోలేదు ఎక్కడాను.

  రచయిత ఎప్పుడూ ఎవరో చదువుతారని రాయడు. రాయడం అనేది తన ఆత్మ తృప్తి కోసం. మీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు గానీ, ఓ సారి ఆలోచించగలరు.

  వంకలు పెట్టకండి; మీకు రాయాలని ఉంటే అదే వస్తుంది నోట్లోంచి, రాముడే రాయిస్తాడు అని కూర్చుంటే ఆయన విలాసంగా మీకేసి సాక్షిగా చూస్తూ ఉంటాడు. కానీ ఏమీ అనడు.

  మనలో మాట, మీరు వ్యాఖ్యలు రాస్తారా, అసలు ఏమి రాస్తారా అనేది మీరు నిర్ణయించుకున్నాక అది పబ్లిగ్గా చెప్పడం దేనికీ? ఏది రాయాలనుకుంటే అది రాసుకుంటు పొండి. ఎవరి కోసం రాస్తున్నారనేది మీరు నిర్ణయించుకోవాలి. దాన్ని ఎవరూ మీకు చెప్పక్కర్లేదు.

  మీరు నన్ను ఎలా తిట్టుకున్నా ఇంత నిర్మొహమాటంగా చెప్పేసాను.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తిట్టుకోవటం ఎందుకు? కొంచెం చర్నాకోల అవసరం పడిందని నాకే తెలుస్తూనే ఉంది కదా! బోలెడు ధన్యవాదాలు. ఎవడో కాని నీళ్ళన్నీ వెళ్ళిపోయాక యేరు దాటవచ్చులే అనుకున్నాట్ట. అలాగ ఇదిగో ఈ ఉద్యోగపు వత్తిళ్ళు తగ్గాక మరింత శ్రధ్ధగా వ్రాయచ్చు గట్రా అనుకోవటాలు కూడా అలాగే నని తెలిసివచ్చింది. ఇప్పుడు ఇంకా నాకు అంతకు మించిన వత్తిళ్ళు దినదనమూగా ఉంది. వత్తిడి తగ్గే వ్యవహారం కాదని తేలిపోయక తెగించి పళ్ళబిగువున నా బ్లాగు వ్యాసంగంలో దూకుడు కొంచెం పెంచాను. అలాగే అవసరం లేని వ్యవహారాలూ కొన్ని తగ్గించాను.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.