24, అక్టోబర్ 2022, సోమవారం

దీపావళీ తాటాకు టపాకాయలు!


ఈరోజు దీపావళీ పర్వదినం. 
 
ఈ సందర్భంగా కష్టేఫలీ బ్లాగు శర్మ గారు తాటాకు టపాకాయలు అని ఒక చక్కని టపా వేసారు. 

ఆ టపాలో తాటాకు టపాకాయల్లో ఉపయోగించేది సూరేకారం, పటాసు , గంధకం,బొగ్గుపొడి, ఒక్క జొన్నగింజ అని చెప్పారు. కాని నాకు తెలిసి అలా చేసే కాయల్ని నల్లమందు కాయలు అనేవారు. నేను అరవైల్లో తాటాకు టపాకాయలు చేయటం మొదలుపెట్టే నాటికే నల్లమందు కాయల తయారీ బాగా తగ్గిపోయింది.

ఆధునికమైన టపాకాయల తయారీ అప్పటికే మొదలయ్యింది. వాటిలో ఉపయోగించేవి పటాసు, గంధకం, మెగ్నీషియం పౌడర్ మాత్రమే. సీమటపాకాయల్ని మీరు విడదీసి చూస్తే మీకు కనిపించేది ఈమందే.

పటాసు గంధకం అనేవి రెండూ విడివిడిగా అంత వెంటనే పేలేవి ఏమీ కావు కాని రెండింటినీ కనుక కలిపినట్లైతే ఏమాత్రం వత్తిడి సోకినా తక్షణం పేలుడు సంభవిస్తుంది.

అందుకనే ఆరెండిటినీ నేరుగా కలపకుండా మందుగుండు తయారు చేయాలి. మొగ్నీషియం పౌడర్ తీసుకొని దానిలో పటాసు కలిపి ఆమిశ్రమంలో అప్పుడు గంధకం పొడిని కలపాలి.
 
ఆరోజుల్లో రోలు-రోకలి అనే ఒక చిన్న సాధనం అమ్మేవారు. అందులో రోలు అనే గుంటలో కొంచెం‌ పటాసు కొంచెం గంధకం వేసి ఆ సాధనాన్ని మూసివేయాలి. దాని హేండిల్ పట్టుకొని ముందుభాగాన్ని ఏ రాతి అరుగుమీదో ఒక దెబ్బవేసి కొడితే ధన్ మని పెద్ద సౌండ్ వచ్చేది.
 
నాస్నేహితుడు ఒకతను చావలి నరసింహం (పూర్తిపేరు చాలా పొడుగు!) ఒక చిన్న కథ చెప్పాడు ఒకసారి. వాళ్ళ ఊరిలో ఒకబ్బాయి బోలెండంత పటాసునూ తగినంత గంధకాన్నీ కలిపి ఎత్తునుండి పడేస్తే ఊరంతా అదిరిపోయిందట ఆపేలుడు శభ్దానికి.

మణిశిల అని ఒకటి దొరుకుతుంది. దానిని టపాకాయల్లో వాడటం అత్యంత ప్రమాదకారి అని చెప్పారు మానాన్నగారు . అది వాడిన కాయలు బిగింపు చేసే సమయంలో ఆ ఒత్తిడికే చేతుల్లో పేలిపోయి మనుషుల కాళ్ళూ చేతులూ తెగిపడిపోతాయట.
 
ఈమెగ్నీషియం పౌడర్‌ని అప్పట్లో జనం ఎలక్ట్రిక్ పౌడర్ అనే తమాషా పేరుతో పిలిచే వారు. అందుకని ఈ టపాకాయలకు ఎలక్ట్రిక్ కాయలనే పేరు కూడా ప్రచారంలో ఉండేది.
 
మా ఊరు కొత్తపేటలో పొన్నాడ రత్తమ్మ గారి ఇంట్లో ఈ రెండురకాల‌ తాటాకు టపాకాయనూ భారీఎత్తున తయారు చేసి అమ్ముతూ ఉండేవారు దీపావళికి. ఈ పొన్నాడ రత్తమ్మ గారి అబ్బాయి భీమశంకరం హైస్కూల్లో సైన్స్ లాబ్ అసిస్టెంట్ ఉద్యోగంలో ఉండేవాడు. అప్పట్లో ఎలక్ట్రిక్ కాయల ఖరీదు పాతికకు రెండు రూపాయలుగా ఉండేది. నల్లమందు కాయలైతే పాతిక రూపాయే. వీళ్ళ దగ్గర ఒకసారి యభై ఎలక్ట్రిక్ కాయలను కొని తెచ్చాను.

మా స్కూలు పిల్లవాడు ఒకతని ద్వారా నాకు ఈతాటాకు టపాకాయలను చేసే విధానం తెలిసింది. అతడితో వాళ్ళింటికి వెళ్ళి ఆయింట్లో వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తున్నారో చూసి నేర్చుకున్నాను.

శర్మ గారు మామూలు తాటాకులు పనికి రావు అని అన్నారు కాని మేము మాత్రం మామూలు తాటాకులనే వాడి చేసే వాళ్ళం. తాటిమట్టలను తెచ్చి ఆకులు విడదీసుకొని ఆరబెట్టి సిధ్ధం చేసుకొనేవాడిని. మరీ ఎక్కువగా ఎండితే పొడిపొడి ఐపోతుంది ఆకు. ఆవిషయంలో కొంచెం పదును తెలియాలి.

టపాకాయను చుట్టే టప్పుడు మూలల్లో కొద్దిగా సూక్ష్మరంధ్రం ఉండిపోయి పేల్పు సరిగా రాకపోయే ప్రమాదం ఉంది. అందుకని వత్తి పెట్టిన మూల కాక ప్రక్కన ఉండే మూల ఒక చిన్న గింజను ఉంచితే దట్టింపు బాగా వస్తుంది. అలా బాగా బిగించి కట్టిన కాయ భలే చప్పుడుతో పేలుతుంది. కాని ఒక చిన్న చీకాకు ఉంది. ఆగింజ ఎంతవేగంగా ఎగిరిపోతుందీ అంటే ఒక తుపాకీగుండులా అనుకోండి! మరి అది అలా ఎటైనా పోవచ్చును కదా. అంటె మనమీదకూ రావచ్చును కదా. ఒక్కోసారి అలా ఎగిరి వచ్చిన గింజలు టపాకాయల పేల్పు చూసి వినోదిస్తున్నవాళ్ళకు తాకి ఇబ్బంది పెట్టటం గమనించాను. కొద్ది సార్లు నాకే తగిలాయి. ఇది మంచిది కాదని గింజలు గట్రా వాడటం మాని వేసాను. వాటిబదులు చిన్న కాగితం ముక్కను ఉంచేవాడిని. కట్టటంలో టైం వేష్ట్ అవుతోందని అదీ మానివేసాను.

తాటాకులు సరిగా దొరకని పక్షంలో న్యూస్ పేపర్ ముక్కని పొడుగ్గా మడతలు వేసి దానితో కూడా టపాకాయలు కట్టి ప్రయత్నించాను. బాగానే వచ్చాయి తాటాకులంతగా సౌండ్ చేయకపోయినా.

నేను కాలేజీ చదువుకు వచ్చి అమలాపురం వెళ్ళిన సంవత్సరం దీపావళికి ముందుగా చాలా పెద్ద తుఫాను వచ్చింది. అమలాపురంలో ఐతే కాలేజీ కుర్రవాళ్ళకు కొద్దిరోజులు తిండికే ఇబ్బంది ఐనది. హోటళ్ళు అన్నీ మూతబడ్దాయి కాబట్టి. పోనీ ఇళ్ళకు పోదాం అంటే చెట్లు పడిపోయి దారులన్నీ మూసుకొని పోవటం వలన బస్సు సౌకర్యం నిలిచిపోయింది మళ్లా కార్తీకపౌర్ణిమ దాకా.

అప్పట్లో నేను వండుకొని తినే వాడిని రూములో. అందుకని నాకూ నారూమ్మేటు స్వర్గీయ గుడిమెళ్ళ పాండురంగా రావుకూ తిండికి ఏ ఇబ్బందీ రాలేదు. 

ఐతే ఇంటి వెళ్ళాలి పండక్కు అనుకుంటే దారి లేని పరిస్థితి.

దీపావళికి ముందురోజున మరెవరోతోనో కలిసి సైకిల్ మీద ఊరికి వెళ్ళాడు పాండురంగా రావు.

నాకంత సీన్ లేదు. నాకు సైకిల్ త్రొక్కటం కూడా రాదు.

అందుచేత నేను అమలాపురంలోనే చిక్కుపడి పోయాను.

దీపావళికి నేను ఎలాగైనా రాగలుగుతానని ఇంట్లో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

అంతకు చాలా ముందుగానే దీపావళికి తాటాకు టపాకాయలను కట్టటానికి అంతా సిధ్ధం చేసుకొన్నాను కూడా. అవి కాక మాయింట్లో ఆనవాయితీగా ఎప్పుడూ మతాబాలూ చిచ్చుబుడ్లూ మేమే తయారు చేసుకుంటాం. వాటి తయారీ హడావుడి ముఖ్యంగా మానాన్నగారిది.

అవి కాక నేనూ మా తమ్ముడు స్వర్గీయ సత్యశ్రీరామచంద్రమూర్తీ కలిపి వందల లెక్కన సిసింద్రీలు తయారు చేసుకుంటాం ఏటా. నిజం చెప్పాలంటే వాడి చేతిమీదుగా మందు తయారుచేస్తేనే సిసింద్రీలు మహబాగా తూనీగల్లా ఎగిరేవి.

ఇంత హడావుడి ఉంది.

నేనేమో అమలాపురంలో చిక్కుపడిపోయాను.

మరెలా?

రాత్రంతా నిద్రపట్టలేదని గుర్తు. పైగా నిత్యం నేనూ పాండూ కబుర్లు చెప్పుకుంటూ‌ నిద్రపోయే వాళ్ళం. ఆరాత్రి వాడు రూములో లేడు కదా. దీపావళికి ఎలాగో ఇంటికి వెళ్ళగలిగాడు కదా. మరి నాసంగతి ఏమిటీ?

ఇంక గట్టిగా నిర్ణయం చేసుకున్నాను.

కొంచెం తెల్లవారగానే, అమలాపురం నుండి కాలినడకన మాఊరు కొత్తపేటకు బయలుదేరాను.

దారిపొడుగునా రహదారిని ఆక్రమించుకొంటూ అనేకచోట్ల వృక్షాలు కూలిపోయి ఉన్నాయి.

అప్పటికే చాలాచోట్ల కొందరు వాటి కొమ్మలని కొద్దిగా ప్రక్కకు నెట్టి నడకకు కొంచెం దారి చేసుకున్నారు. ఇంకా అనేక చోట్ల అలా వీలు పడలేదని తెలుస్తూనే ఉంది. కష్టపడి సైకిళ్ళను పెకి ఎత్తి దాటించి మరీ ప్రయాణం చేసారేమో జనం.

నేనూ అంతే వీలైన చోట్ల ఆ కొమ్మల మధ్యన సందులోనుండి ఆవలకు వెళ్తూ దాటాను లేదా కొమ్మల మీదనుండి వీలైన చోటు చూసుకొని ఎక్కి ఆవలికి దిగి వెళ్ళాను. కొద్ది చోట్ల కష్టం అయింది అలా దాటటం కూడా.

మధ్యాహ్న కావస్తున్నది.

ఇంకా నేను నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది.

ఒకప్రక్కనుండి నీరసం వస్తున్నది. అప్పటికే పదమూడు కిలోమీటర్ల దూరం నడిచి అలసి ఉన్నాను కదా.

ఉదయం అమలాపురంలో నారూములో కొంచెం ఉప్మా చేసుకొని తిని బయలుదేరాను. అదెంత సేపని ఆపగలుగుతుంది మరి?

ఐనా ఇంక నాలుగు కిలోమీటర్లే కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న ఆలోచనతో ఓపిక తెచ్చుకొని నడుస్తూనే ఉన్నాను.

ఒక చెట్టు కొమ్మను ఎక్కి దిగబోతుంటే ఒకతను సైకిలుతో వచ్చి ఆగాడు నావెనుకనే.

నా సంగతి విచారించి నన్నూ తనతో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తానన్నాడు.

నిజానికి అప్పటికి నాప్రయాణంలో ఎందరో అలా సైకిళ్ళపై వెళ్ళటం చూసాను కాని ఎవ్వరూ ఆమాట అనలేదు సాయం చేస్తానని.

అక్కడినుండి ఇద్దరమూ సైకిల్ ప్రయాణం అన్నమాట.

మధ్యమధ్యలో పడిపోయిన చెట్లు వచ్చినప్పుడు దాటుకొంటూ సైకిల్ పుణ్యమా అని ముఖ్యంగా ఆ సహాయం చేసిన అబ్బాయి పుణ్యమా అని పదకొండున్నర దాటిన తరువాత కొత్తపేట చేరాను. అతను ఇంకా ముందుకు సాగిపోయాడు నన్ను మెయిన్ రోడ్డు మీద హైస్కూల్ దగ్గర్ దించి.

నేను ఇంటికి రావటంతో అందరూ చాలా సంతోషపడ్డారు. అప్పటి ఒక్కొక్కరి సంతోషస్పందన మీదా ఒక్కొక్క పేరాగ్రాఫ్ వ్రాయవచ్చును.

స్నానమూ భోజనమూ పూర్తి అయ్యాక టపాకాయలను కట్టటంలో పడ్డాను.

అప్పటికే కొన్ని సిధ్ధం చేసానో లేదో ఇప్పుడు గుర్తు లేదు. చేసే ఉండాలి. ఎందుకంటే మొత్తం టపాకాయలన్నీ సాయంత్రానికి రెడీ చేసేసాను. అన్ని కలిపి ఒక నాలుగువందలు వరకూ చేసి ఉంటాను.

నాకాలేజీ చదువు పూర్తి అయిన వెంటనే‌ మానాన్నగారికి రంపచోడవరం ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడా నేను తాటాకు టపాకాయలు చేసాను. అదీ ఒకటి రెండేళ్ళే!

నేను హైదరాబాదుకు ఉద్యోగం నిమిత్తం వచ్చాక తాటాకు టపాకాయలను ఇంక చేయటం వీలు పడలేదు.

కాని మతాబులూ చిచ్చుబుడ్లూ మాత్రం చేయటం మానలేదు చాలాకాలం పాటు. మానాన్నగారు నా ఉద్యోగజీవితం ప్రారంభంలోనే స్వర్గస్థులయ్యారు. అమ్మా తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ అంతా హైదరాబాదుకు నావద్దకు వచ్చేసారు. మోండామార్కెట్లో మందుగుండు సామాగ్రినీ చిచ్చుబుడ్ల గుల్లలనూ కొనే వాళ్ళం. మా నాన్నగారికి లాగానే మా అమ్మగారికి కూడా దీపావళీ అంటే ఎంతో సరదా ఉండేది. అందుకని పండుగకు నెల్లాళ్ళ ముందునుండీ దీపావళీ బాణాసంచా తయారీ మొదలయ్యేది మాయింట్లో. ఆ సందడి దీపావళి నాడు సాయంత్రం దాకా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉండటంగా కొనసాగేది.

ఆరోజులే వేరు!