30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

వేడుకైన రాసక్రీడ వేళాయెనే

 ఏడే మన మురళీధరు డెందున్నాడే

వేడుకైన రాసక్రీడ వేళాయెనే


అదిగోనే మురళీరవ మటు వినిపించె అటు

పొదపొదలో వెదకండే మదనగోపాలుని


ఇదిగోనే మురళిపాట యిటు వినిపించె యిటు

వెదకండే పూలపొదల వెన్నదొంగ కృష్ణుని


వినబడెనే పొన్నచెట్టు వెనుకనుండి మురళి మరి

కనుగొనరే మనకృష్ణుడు కలడేమో అచటనే


మనమధ్యనె మురళీస్వనమును విఃటినే సఖి హరి

మనలో నొక గోపికయై మసలుచున్నా డేమో


పొదపొదలో వినిపించునె ము‌ళీరవము ఇక

వెదకుట మన వశముకాదె వీడు మాయలోడే


అన్ని తరుశాఖలపై హరి యడిగోనే మన

పున్నెములివె పండినవే పుణ్యశీలలారా


మనమధ్యనె కలడే హరి మానినులారా ఇదె

కనుగొనరే మురళీధరు కన్యామణులారా


అడిగోనే చందమామ ఆకసమున కెక్కె హరి

ఇడుగోనే పొన్నచెట్టు నెక్కె పాటపాడగా


ఇదిగో నా.చేయిపట్టి యెగురుచున్నాడే యిదె

మొదలాయెనె రాసక్రీడ మోహనాంగులారా