17, నవంబర్ 2018, శనివారం

శ్రీరామచంద్ర కందములు - 1


కం. శ్రీరామచంద్ర నీవే
చేరువగా బిలువవలయు జీవుని వాడే
తీరున తానై వెదకుచు
చేరగలాడయ్య నిన్ను శ్రితమందారా

కం. శ్రీరామచంద్ర లోకా
ధారా నీయందు భక్తి తాత్పర్యంబుల్
ధారాళంబగుచో సం
సారంబునతిక్రమించ జాలుదురు నరుల్

కం. శ్రీరామచంద్ర విద్యలు
నేరిచి ఫలమేమి లోన నిన్నెఱుగనిచో
నేరిచెనా నీ నామము
కూరిమితో విద్యలెల్ల కొలిచిన యటులే

కం. శ్రీరామచంద్ర జగమున
ధీరులు నిక్కముగ బల్కు తెరగెట్లన్నన్
శ్రీరామచంద్రపాదాం
భోరుహముల కన్య మేల పూజించ నగున్

కం. శ్రీరామచంద్ర యీ భవ
వారాన్నిధి దాటదలచు వారల కెపుడున్
తీరము చేర్చెడు నౌకగ
నారూఢిగ నీదు నామ మలరుచు నుండున్

కం. శ్రీరామచంద్ర నృపతుల
పేరెన్నికగన్నవాడ విజ్ఞానులు నీ
పేరెన్నిపలుకుచుండెద
రారాటంబులు నశించు ననుచున్ భక్తిన్

కం. శ్రీరామచంద్ర ఆర్తుల
యారాటము దీర్చువాడ వయ్యును దయతో
ధారుణి నిదె నీపాదాం
భోరుహగతుడైన నన్ను బ్రోవ వదేలా

కం. శ్రీరామచంద్ర యీ సం
సారము నిస్సారమన్న సంగతి మున్నే
కారుణ్యముతో తెలిపిన
శ్రీరమణా యేల నన్ను చేదుకొన వయా

కం. శ్రీరామచంద్ర నీకొఱ
కారాటము హెచ్చుచుండె నతిదుస్సహమై
భారంబైనది యీ తను
ధారణ మిటు లెన్నినాళ్ళు దయచూడవయా