18, నవంబర్ 2018, ఆదివారం

శ్రీరామచంద్ర కందములు -2


కం. శ్రీరామచంద్ర శ్రీమ
న్నారాయణ పద్మనాభ నానాలోకా
ధార దశాననగర్వవి
దార భవవిషాపహార తారకనామా

కం. శ్రీరామచంద్ర రాఘవ
వీరేంద్రా సకలలోక వినుతచరిత్రా
భూరమణీకన్యావర
కారుణ్యముచూపి నన్ను కావవె తండ్రీ

కం, శ్రీరామచంద్ర నుతగుణ
భూరికృపాభరణ భక్తపోషణచణ సం
సారాపద్వారణ సీ
తారమణ సమస్తదైత్యదండన నిపుణా

కం. శ్రీరామచంద్ర నీకృప
ధారుణి ప్రజలందరకును దక్కిన నిధియై
చేరిన పాపుల పుణ్యుల
నారూఢిగ బ్రోచుచుండు నన్నివిధములన్

కం. శ్రీరామచంద్ర యెవ్వని
బారినిపడి లోకప్రజలు పరవశులగుచున్
దారులు మరచెదరో యా
మారుడు నను చెణక కుండ మనుపవె తండ్రీ

కం. శ్రీరామచంద్ర నాలో
నీ రూపం బనవరతము నిలచెడు నటులన్
నా రసనను నీ నామము
ధారాళం బగుచు నాడ దయచేయు మయా

కం. శ్రీరామచంద్ర యోగీం
ద్రారాధ్య మహానుభావ దైత్యవిదళనా
యీరేడు లోకములలో
శూరులలో నీకు సాటి శూరుడు కలడే

కం. శ్రీరామచంద్ర నీదగు
తారకనామంబు చాలు ధారుణి ప్రజ సం
సారము దాటగ నని లో
నారసి నిను చేరియుందు రఖిలసుజనులున్

కం. శ్రీరామచంద్ర ధర్మము
నీ రూపము దాల్చి వచ్చి నిలచినటులుగా
మారీచు డన్న మాటకు
భూరియశము కల్గి వాడు పొందెను ముక్తిన్