12, ఆగస్టు 2018, ఆదివారం

పంపకం


అప్పట్లో,  పెద్దబ్బాయీ చిన్నబ్బాయీ కూడా అమెరికా చెక్కేసే సరికి, రాఘవయ్య గారికి పిచ్చెక్కినట్లయింది.

అక్కడికీ చిన్నబ్బాయి విమానాశ్రయానికి పరిగెత్తే హడావుడిలో ఉండగా ఉండబట్ట లేక ఒక ముక్క అననే అన్నారు. "ఒరే చిన్నాడా, ఈ తోటలూ పొలాలూ, ఈ రెండిళ్ళూ అన్నీ ఇంకెవరికోసంరా? నువ్వూ అన్నా కూడా మమ్మల్ని విడిచి ఎగిరిపోతుంటే" అని.

చిన్నోడు పెద్దాడిలా గుంభన మనిషి కాదు. నోటికేదొస్తే అదే అనేస్తాడు. "మరేం జెయ్యమన్నావూ? ఇంత చదువూ చదివి ఇక్కడ ఎడ్లను తోలుకుంటూ వ్యవసాయం చేయమన్నావా?" అని దులిపినట్లుగా ఒక్క ముక్క అనేసి చక్కా పోయాడు.

ఆరాత్రి మాత్రం పెద్దాడు ఫోన్ చేసాడు గొప్పగా ఓదారుస్తూ, "నువ్వేం  బెంగెట్టుకోకు నాన్నా, వస్తూపోతూనే ఉంటాంగా? అమ్మను చూడు ఎంత ధైర్యంగా ఉందో" అని గొప్ప మాటన్నాడు.

అసలు ఆ రాజ్యలక్ష్మమ్మగారు ఎంత బెంగపడుతున్నదీ ఎంత నిరాశపడుతున్నదీ ఈ కుర్రకుంకలిద్దరికీ ఏం తెలుస్తున్నదీ అని రాఘవయ్యగారు నిర్వేదం చెందాడు. తనకైతే ఏదో వ్యవసాయం పనులూ గట్రా ఉంటాయి. ఇంటికే పరిమితం ఐన తన ఇల్లాలు ఒక్కర్తీ కూర్చుని ఈ పిల్లాళ్ళ కోసం ఎలా అంగలారుస్తున్నదీ వీళ్ళకి తెలియటం లేదే అని బాధపడ్డారు.

ఇంక ఇంట్లో మిగిలినది ముసలాళ్ళం ఇద్దరమే అనుకొని ఆయనకు క్రమంగా ఏపని మీదకూ ఆసక్తి కలగటం మానేసింది.

అదీ కాక చిన్నబ్బాయి విమానం ఎక్కివెళ్ళిపోయన ఆర్నెల్లకు పిల్లలమీద బెంగతో రాజ్యలక్ష్మమ్మ మంచం ఎక్కింది.

ఓ ఆర్నెల్లపాటు వైద్యం నడిచింది.

కోలుకుంటున్నట్లే ఉండటం మళ్ళా జబ్బు తిరగబెట్టటమూ జరిగింది.

బాగా ఆలోచించి పొలాలూ తోటలూ కౌళ్ళ కిచ్చి రాఘవయ్యగారూ ఇంటిపట్టునే ఉండసాగారు.

అయన ఉపచారాల పుణ్యమా అనో వైద్యం గొప్పదనమనో చెప్పలేం కాని రాజ్యలక్ష్మమ్మ మరొక ఆర్నెల్ల తరువాత లేచి తిరగటం మొదలు పెట్టింది.

కాని మునుపటి ఉత్సాహం లేదు.

బాగా ఆలోచించి పెద్దాడికి ఫోన్ చేసారు రాఘవయ్య గారు.

కోడలు ఎత్తింది ఫోన్. పుత్రరత్నంగారు ఎక్కడికో కేంపుకు వెళ్ళారట. వచ్చాక చెబుతాను లెండి. ఐనా ఈ సీజనులో టిక్కెట్లు బాగా ఖరీదు. అదీ కాక పిల్లలకీ వీలు కుదరాలిగా. మెల్లగా వీలుచూసుకొని వస్తాం అని పెట్టేసింది.

ఇక చిన్నాడికీ ఫోన్ చేసి చెప్పారు, ఒకసారి వచ్చె వెళ్ళరా అని. వాడు గయ్యిమన్నాడు. నీకే మన్నా పిచ్చానాన్నా. నేను వచ్చి ఏడాది ఐందో లేదో ఇప్పుడే ఎలా వస్తానూ. మళ్ళీ ఏడాది చూదాంలే అని విసుక్కుని పోను ఠపీ మని పెట్టేసాడు.

కోడలి గొంతులోని నిరాసక్తతా చిన్నకొడుకు నిర్లక్ష్యమూ రాఘవయ్యగారికి విరక్తి కలిగించాయి.

ఇంక ఆయన ఎన్నడూ పిల్లలకు ఫోన్ చేయలేదు.

వాళ్ళు ఊరికే కుశలం కనుక్కుందామని అన్నట్లు అరుదుగా చేసే ఫోనులకు ముక్తసరి సమాధానాలు చెప్పి ఊరకుంటున్నారు.

కాలం ఇలాగే గడిచిపోతుందా? మనం ఇలాగే వెళ్ళిపోతామా అని రాఘవయ్యగారు మథనపడుతూ ఉన్న రోజుల్లో - అంటే చిన్నబ్బాయి కూడా తనకు అమెరికా సిటిజెన్ షిప్ వచ్చేసిందని సంబరపడుతూ ఫోన్ చేసిన మర్నాడు వాళ్ళింటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు.

ఆ పిల్లవాడి పేరు వీరేశం. వీరేశం తండ్రి రాఘవయ్యగారి దగ్గరే పాలేరుగా ఉండే వాడు. వీరేశం అన్నగారు పట్నంలో ఒక స్టీలు దుకాణంలో వాటాదారుగా చేరాడు. తండ్రిని పని మానిపించి తీసుకొని పోయాడు. కొన్నాళ్ళు సమాచారం ఏమీ లేదు రాఘవయ్యగారికి. ఇదిగో ఈమధ్యన ఆ కొట్టు ఎత్తేసి వాటాదారు డబ్బుతో సహా మాయం అయ్యాడట. అప్పులవాళ్ళు మీదకు వస్తే వీరేశం అన్న తట్టుకోలేక ఇంట్లో అందరికీ విషం కలిపి పెట్టేసాడు. అన్నా వదినా పోయారు. హాస్పిటల్లో తండ్రికీ వీరేశానికి బాగయ్యింది. కాని దిగులుతో ఆ తండ్రికాస్తా ఎంతో కాలం బ్రతకలేదు. వీరేశం చేతికి ఒక ఉత్తరమ్ముక్క ఇచ్చి, నేను పోయాక, నువ్వు పోయి రాఘవయ్యగారి పంచన బ్రతుకు అని చెప్పాడు.

ఇదంతా విని రాఘవయ్యగారూ రాజ్యలక్ష్మమ్మగారూ ఎంతో బాధపడ్డారు.

పదేళ్ళ పిల్లాడికి వచ్చిన కష్టానికి చలించిన రాజ్యలక్ష్మమ్మగారు, "ఇంక వీడు నా కొడుకే" అని ప్రకటన చేసేసింది.

రాఘవయ్యగారికి మళ్ళా ఉత్సాహం వచ్చింది.  ఇదిగో ఈ పిల్లాడి చదువుసంద్యలని ఏమి, వాడికి వ్యవసాయం పనులు నేర్పటం అని ఏమి మళ్ళా మునపటి మనిషిలా అవటానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు.

ఉన్నట్లుండి ఒకరోజున పెద్దాడూ చిన్నాడూ కలిసి అదేదో కాల్ చేసారు. సారాంశం ఏమిటంటే చిన్నోడికి అక్కడే మంచి అమ్మాయి దొరికిందట ఆరోజునే పెళ్ళి చేసుకున్నాడట.

రాఘవయ్యగారికి కోపం వచ్చి కేకలు వేసారు ఫోనులోనే.

రాజ్యలక్ష్మిగారు కూడా కొంచెం దుఃఖపడి చివరకు "అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడా" పోనివ్వండి. అసలే ఈ మధ్య మీ ఆరోగ్యం బాగోలేదు అని ఊరడించింది రాఘవయ్యగారిని.

ఆ చిన్నాడి పెళ్ళి అంత ముచ్చటగా దేశాంతరంలో కన్నవారిపరోక్షంలో జరిగిన ఐదేళ్ళకు కాబోలు పెద్దాడి ఇంట్లో ఏదో శుభకార్యం సందర్భంగా అందరూ కలిసి జరుపుకున్న సందడి తాలూకు వీడియో ఒకటి రాఘవయ్యగారికి పంపింది చిన్నకోడలు.

దానితో పాటే ఒక ఉత్తరం. తామంతా ఎన్నో తప్పులు చేసామనీ పెద్దమనసుతో మీరు క్షమించి దీవించాలనీ మీదగ్గరకు అందరం ఒకసారి తొందరలో వద్దామనుకుంటున్నామనీ దాని సారాంశం.

ఆ ఉత్తరం చేరిన నాడో మరునాడో చిన్నాడి నుండి ఫోన్. నాన్నా ఈ నెలాఖరుకు అన్నయ్యా నేనూ కుటుంబాలతో వస్తున్నాం అని.

రాఘవయ్యగారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
రాజ్యలక్ష్మమ్మ గారికి ఎంతో ఆనందం కలిగింది.

నెలాఖరు కల్లా ఇల్లంతా పిల్లా మేకాతో కళకళలాడి పోయింది.

చెరొక నెలరోజులూ సెలవులు పెట్టుకొని వచ్చారట. పెద్దకోడలు ఎన్నడూ ఎరుగనంత వినయవంతురా లయింది. కొడుకు లిద్దరూ తండ్రిని అరచేతితో ఆకాశానికి ఎత్తుకొంటూ గౌరవించుతున్నారు.

మనవలకైతే ఈ వాతావరణం అంతా చాలా అబ్బురంగా ఉంది. పెద్దాడి ఇద్దరుపిల్లలకీ తెలుగు అర్థమౌతుంది కాని మాట్లాడలేరు. చిన్నాడి కూతురికి తెలుగు అర్థం కూడా కాదు.

కొడుకులిద్దరూ వీరేశాన్ని గమనించుతూనే ఉన్నారు.

ఇంటిపనులన్నీ వాడే చూసుకొంటూన్నాడు. వ్యవసాయం పనులన్నీ వాడే చక్కబెడుతున్నాడు.  అమ్మేమో నాన్నా వీరేశా అంటుంది.  నాన్నైతే అబ్బిగా అంటాడు.

వీడూ మరీ అన్యాయమే, నాన్నగారూ అంటున్నాడు. ఇదిగో ఈముక్క కంపరంగా తోచింది అన్నదమ్ములిద్దరికీ.

ఓరోజున అమ్మకు హితోపదేశం చేసాడు చిన్నబ్బాయి. అమ్మా పాలేరును పాలేరుగానే చూడాలి కాని వీడికి ఈ చనువేమిటమ్మా అని.

రాజ్యలక్ష్మమ్మగ్సారు చర్రుమంది. ఒరే, మీరిద్దరూ దేశాలట్టుకుపోతే మాకు రెక్కాసరా ఇస్తున్నది వీడేరా - వీరేశాన్ని ఎప్పుడూ పరాయి చేసి ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది.

అరోజు రాత్రే ఆస్తిపంపకాల గురించి తండ్రితో మాట్లాడాడు పెద్దబ్బాయి. ఆలోచించి ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు కాని రాఘవయ్య గారు అలాగే అన్నాడు కాదు.

అక్కడే వింటూనే ఉన్న చిన్నబ్బాయి అందుకున్నాడు. అదికాదు నాన్నా, నువ్వా పెద్దాడివి ఐపోయావు - నీ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. పంపకాలు చేస్తేనే బాగుంటుంది కదా అని.

రాఘవయ్యగారు కంటగించుకొన్నాడు. ఒరే ఎప్పుడేమిచేయాలో నాకు నువ్వు చెప్పాలా గ్రుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు? ఈ ఆస్తి అంతా నాస్వార్జితం. ఇప్పుడు నువ్వూ నీ అన్నా వచ్చి ఆస్తి పంచివ్వూ అంటే కాదు - నాకు తోచినప్పుడే ఆస్తి పంపకాలు చేస్తాను సరా అని ఉరిమాడు.

కొడుకులకు ఇంక మాట్లాడటానికి ఏమీ దారి ఇవ్వలేదు ఆయన.

నెల పూర్తవుతూనే వెళ్ళారిద్దరూ కుటుంబాలతో తమతమ స్వస్థలాలకి.

పోతూపోతే చిన్నబ్బాయి వీరేశాన్ని పిలిచి ఒక్క ముక్కన్నాడు. ఎక్కడుండ వలసిన వాళ్ళు అక్కడుండాలి, నువ్వు మా పాలేరువు కదా మాయింట్లోనే ఉండట మేమిటీ?  లోకంలో ఇలా ఎక్కడన్నా ఉంటుందా? ఇదేమీ బాగోలేదు అని.

వీరేశం ఏమీ సమాధానం చెప్పలేదు.

వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు చిన్నబ్బాయిగారు ఇలా అన్నారండీ అని రాజ్యలక్ష్మమ్మగారితో చెప్పి పనమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

రాఘవయ్యగారు అగ్గిరాముడై పోయాడు.

ఇదంతా జరిగి మూడేళ్ళు కావస్తున్నది.

ఇప్పుడు మళ్ళా ఇల్లంతా పెద్దబ్బాయీ చిన్నబ్బాయిల కుటుంబాలతో బిలబిలలాడుతూ ఉంది.

కార్యక్రమాలన్నీ ముగిసిన మరునాడు, పెద్దబ్బాయి తల్లిదగ్గర ఆస్తి పంపకాల సంగతి ఎత్తాడు.

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు.

నాన్న పంపకాలు చేసి వెళ్ళిపోతే బాగుండేదా. ఇప్పుడు మేమే చేసుకోవాలి అన్నాడు చిన్నబ్బాయి.

ఆవిడ ఏమీ మాట్లాడలేదు.

కొంచెం ఆగి నాన్నా వీరేశా అంది.

వీరేశం వచ్చి పిలిచావా అమ్మా అన్నాడు.

స్టుపిడ్ అమ్మగారూ అనలేవా అమ్మా ఏమిటీ అన్నాడు చిన్నబ్బాయి.

అమ్మని అందరూ అమ్మా అనే పిలుస్తారు అన్నాడు వీరేశం శాంతంగా,

వీరేశా నువ్వెళ్ళి పోష్టుమేష్టార్నీ గవర్రాజుగారిని పిలుచుకురా నాయనా అంది రాజ్యలక్ష్మమ్మ.

గవర్రాజుగారికి చెప్పి పొలం వెళ్తానమ్మా చాలా పనులుండిపోయాయీ అన్నాడు.

సరే నాన్నా అంది రాజ్యలక్ష్మమ్మగారు.

ఓ. నాన్నగారు పంపకాలు చేసారన్న మాట ఐతే అన్నాడు పెద్దాడు,  వీరేశం అటు వెళ్ళగానే

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు,

గవర్రాజు గారూ రాఘవయ్యగారూ బావా అంటే బావా అని పిలుచుకొనే వారు - ప్రాణస్నేహితులు. పోష్టుమేష్టారు కూడా రాఘవయ్యగారికి ఒకప్పుడు చదువుచెప్పిన మాష్టారి కొడుకున్నూ రాఘవయ్యగారికి సన్నిహితుడున్నూ. వాళ్ళిద్దరితో పాటు గవర్రాజు గారి కొడుకూ, కూతురూ వచ్చారు. వాళ్ళ వెనకాలే పోష్టుమేష్టరు గారబ్బాయి శేఖరం వచ్చాడు. అతను లాయరు.

పనమ్మాయి అందరికీ ఫలహారాలూ కాఫీలు అందించింది.

అన్నట్లు శేఖరానికి చిన్నబ్బాయి క్లాసుమేటే.

మీ నాన్నగారు విల్లు వ్రాసి రిజిష్టరు చేయించారు అన్నాడు శేఖరం.

రాజ్యలక్ష్మమ్మగారు కొడుకుల ముఖాల్లోకి తొంగిచూసింది.

ఆస్తిపాస్తులన్నీ ఆయన రెండు భాగాలుగా విభజించారు అన్నాడు శేఖరం.

చెప్పండి నా వాటలోకి ఏం వచ్చాయో అన్నయ్య వాటా యేమిటో అన్నాడు చిన్నబ్బాయి.

శేఖరం చిరునవ్వు నవ్వి. "మీ అన్నదమ్ము లిద్దరికీ రాఘవయ్యగారు ఏమీ ఇవ్వలేదు" అన్నాడు.

మీద పిడుగుపడిన ట్లైంది అన్నదమ్ములకీ వాళ్ళ భార్యామణులకీ,

"మరి?" అన్నాడు పెద్దాడు ముందుగా తేరుకొని.

సగం ఆస్తి రాజ్యలక్ష్మమ్మగారికి చెందేలాగున్నూ మిగతా సగమూ తన పెంపుడుకొడుకు వీరేశానికి చెందేటట్లున్నూ వీలునామా వ్రాసారు మీనాన్నగారు, రాజ్యలక్ష్మమ్మగారు తనతదనంతరం తనవాటా ఆస్తిని తన ఇష్టానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చును అని కూడా వ్రాసారు. అన్నాడు శేఖరం వీలునామా చూపుతూ.

"ఇదంతా అన్యాయం అమ్మా. నీక్కూడా తెలియకుండా నాన్నెంత పని చేసాడో చూసావా?" అని చిందులేశాడు చిన్నబ్బాయి.

"ఇలా పంచమని మీనాన్నగారికి నేనే చెప్పాను. మరొక సంగతి వినండి, నా తదనంతరం నా వాటాకూడా వీరేశానికే ఇస్తాను." అంది స్థిరంగా రాజ్యలక్ష్మమ్మ.

"అన్యాయం అమ్మా" అన్నాడు పెద్దాడు నోరు తెరచి.

 "మీకు అమ్మ అక్కర్లేదు. నాన్న అక్కలేదు. స్వదేశం అక్కర్లేదు. ఎక్కడికో పోయి కూర్చున్నారు. అక్కడ మీరు బాగానే ఉన్నారు. ఇక్కడి ఆస్తులెందుకు అమ్ముకుందుకు కాకపోతే? ఆమధ్య చిన్నాడేమన్నాడూ 'ఇక్కడేముందమ్మా మట్టి అని కదూ'. ఇప్పుడు ఆ మట్టికే రేట్లు బాగా పెరిగి కోట్లు పలుకుతున్నాయని కదా మళ్ళా మీకు మా మీద ప్రేమ పుట్టుకొచ్చిందీ? అందుకే కదా మీరంతా ఆమధ్య వచ్చి వెళ్ళిందీనూ? మీ యిద్దరూ ఇక్కడి పొలాలు ఏమాత్రం పలుకుతున్నాయో వాకబు చేసుకొని వెళ్ళిన సంగతి మీ నాన్నగారికి తెలియలేదని అనుకుంటున్నారా ఇద్దరూ? మీ యిద్దరూ ఇల్లు వదలి మీదారిన మీరు పోయాక దైవికంగా దొరికిన బిడ్ద ఈ వీరేశం. వాడు మమ్మల్ని అమ్మా నాన్నా అంటుంటే మీ కెందుకు అంత కంటగింపుగా ఉన్నదీ? మీ అమ్మానాన్నల్ని వాడూ అమ్మా నాన్నా అంటున్నాడనా? ఎక్కడ మీ నాన్న వాడికేదన్నా దోపుతాడో అన్న కచ్చ తోనా అన్నది నాకు తెలియదా మీ నాన్నకి తెలియదా?  వాడికీ ఏదో ఏర్పాటు  చేయండీ అన్నాను. అన్నీ ఆలోచించే ఇలా విల్లు వ్రాస్తానన్నారు మీనాన్న. సరే అన్నాను. అప్పుడే మీనాన్న సలహా ఇచ్చారు. వీరేశానికే ఇవ్వు నీ వాటాకూడా అని."

పెద్దాడి ముఖంలోనూ చిన్నాడి ముఖంలోనూ కత్తి వాటుకు నెత్తురుచుక్క లేదు.

"మనం ముందే మేలుకొని ఈ వీరేశం గాడిని ఇంటినుండి తరిమి వేసుంటే ఈ తిప్పలొచ్చేవి కావు" అంది చిన్నకోడలు అక్కసుగా.

"మా నాన్నగారితో మాట్లాడదాం. మనకు వాటాలు ఎందుకురావో తేల్చుకుందాం" అంది పెద్దకోడలు. ఆవిడ తండ్రి కూడా ప్లీడరేను.

"లాభం లేదమ్మా. ఈ ఆస్తిపాస్తులన్నీ రాఘవయ్యగారి స్వార్జితం." అన్నాడు శేఖరం.

"మావయ్య గారు పూర్తి స్వస్థతతో ఉండే వ్రాసారా ఈ విల్లు? ఈ వీరేశం ఏదో మతలబు చేసి వ్రాయించాడేమో" అంది ప్లీడరుగారమ్మాయి. "పైగా అయన ఆరోగ్యం గత యేడాదిగా బాగుండటం లేదుట కదా? ఈ విల్లు చెల్లదేమో "అని కూడా అంది.

"అలాగా? ఈ సంగతి  కూడా వినండి. పోష్టుమాష్టార్నీ గవర్రాజుగార్నీ సంప్రదించి మరీ ఇలా విల్లు వ్రాసారు. మీరు ఆమధ్య వచ్చి వెళ్ళిన మూడోరోజునే ఈ విల్లు వ్రాయటం రిజిష్ట్రీ చేయటం  కూడా జరిగింది. అప్పుడు మీ మావయ్యగారు నిక్షేపంగా ఉన్నారు. ఆయనా పెద్దమనుషులూ పట్నం వెళ్ళి విల్లు రిజిష్టరు చేయించుకొని మరీ వచ్చారు." అని నిష్కర్ష చేసింది రాజ్యల్క్ష్మమ్మ.

"అమ్మాయీ, నేను గవర్నమెంటు డాక్టర్ని అన్న సంగతి నీకు తెలియదేమో" అన్నాడు గవర్రాజు గారు.

"ఇంకేం పని మనకిక్కడ" అంది పెద్దకోడలు విసురుగా.

కొడుకులూ కోడళ్ళు రుసరుసలాడుతూ లేచ్చక్కాపోయారు అక్కణ్ణుంచి.

ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ ఐంది.

నువ్వూ నీ వీరేశం గాడూ ఉట్టికట్టుకొని ఊరేగండి. మాకింత అన్యాయంచేసిన వాడు ఎలాబాగుపడతాడో చూస్తాంగా అని తల్లిముందు రంకెలు వేస్తూ మరీ వెళ్ళాడు చిన్నబ్బాయి.

పెద్దబ్బాయి కాస్త గుంభన మనిషి అని చెప్పాను కదా.  తమ్ముణ్ణి సముదాయించాడు, బోడి ఈ మట్టి లేకపోతే మనం బ్రతకలేమా? జస్ట్ డోంట్ కేర్. వీళ్ళిలాంటి ప్రేమలూ అభిమానాలూ లేని మనుషులనే నాకు ఇక్కడికి రావటానికే అసహ్యం. లెట్స్ గో" అన్నాడు.