2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

పాహిరామప్రభో: కూడని దారుల బోవు చుండి నీ పంచకు నెట్లు చేరితిని


ఉ. మంచిది నీవు దేవుడవు మానవమాత్రుడ నల్పసత్వుడన్
కొంచెపు వాడ నేను మరి కూడని దారుల బోవు చుండి నీ
పంచకు నెట్లు చేరితి నవశ్యము నీ కడగంటి చూపు న
న్నించుక సోకి కాక రమణీయగుణార్ణవ రామ రాఘవా



ఏ ఏ గుణాల యందు మనస్సు నిత్యం రమిస్తూ వాటి తత్త్వాన్ని ఒంట బట్టించుకొంటే జన్మ ధన్యమౌతుందో అట్టి గుణాలు రమణీయాలు అనబడతాయి.

అలాంటి గుణాలకు ఓ రామచంద్రప్రభూ నువ్వు నిలయానివి.

పరమస్వాదుజలసంపూర్ణాలైన నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తాయి.

పరమమైన సద్గుణాలన్నీ వచ్చి పురుషోత్తముడవైన నీలో సంగమించాయి.

నువ్వే గుణార్ణవుడవు.

అన్ని గుణాల్లోనూ దయాగుణం అన్నది ఉందే అది మహా దొడ్డది.

మంచి వాళ్ళు  సాటి  మంచివాళ్లను  గుర్తించి ఆదరించటంలో విశేషం ఏమి లేదు. అది లోకసహజమే.

ధనవంతులు సాటిధనవంతులతో స్నేహం చేయటంలో విడ్డూరం ఏమీ ఉండదు. వాళ్ళంతా ఎలాగూ ఒక జట్టే అని లోకానికి తెలుసును.

విద్యావంతులు సాటి విద్యావంతులను ఆదరించటం లోకసహజమే.

గొప్పవాళ్ళు సాటి గొప్పవాళ్లతో సఖ్యంగా ఉండటం నిత్యం చూసే వ్యవహారమే,

యోగ్యులను గురించి ఆదరించటం సాధుపుంగవులు తప్పక చేయవలసినదే. చేసేదే.

సత్కార్యాచరణ కలవాళ్ళను లోకంలో సత్పురుషులూ సత్కార్యనిరతులూ నెత్తిన పెట్టుకోవటంలో వింత లేదు కదా.

కానీ, నేను అన్ని విధాలా అల్పుడను.

విద్యావంతుడనా, సత్కార్యనిరతుడనా మరే కారణంగా నైనా లోకంలో మంచివాడు అనిపించుకుందుకు కొంచెమైనా అర్హత కలవాడనా? కాదే!

మరి నన్ను ఎవరాదరిస్తారు. ఐనా ఎందుకు ఆదరిస్తారు? ఏమి చూసి ఆదరించాలీ మరి?

గౌరవం పొందటానికి అర్హతకలవాళ్ళు ఏదో విధంగా మంచిదారుల్లో నడుస్తూ సాటి మంచివాళ్ళ ఆదరం పొందగలరు కాని నాబోటి వాడు ఏమి గౌరవం పొందగలడూ అని!

నేను పోయే దంతా తప్పుడు దారుల్లోనే అని నాకే తెలిసి సిగ్గు కలుగుతూ ఉంటుందే.

ఇతరులకు ఎంత చీదరగా ఉంటుందీ!

ఐనా సరే ఆశ్చర్యాల్లో ఆశ్చర్యం ఒకటి గమనించాను.

నీ పాదాలవద్ద చోటు అడిగేందుకు అస్సలు అర్హత అన్నదే లేని వాణ్ణి నేను. ఏముఖం పెట్టుకొని అడగగలను!

అదీకాక ఎప్పుడైనా లోగడ అలా నీ వద్ద కొంచెం ప్రాధేయపడాలన్న ఊహే కలగనే లేదే మూర్ఖుడనైన నాకు.

నా బుధ్ధి యొక్క సత్త్వం ఎంత అల్పమో తెలుస్తూనే ఉంది కదా.

నా కన్నా కొంచెపు వాడు మరొక డుండడేమో.

ఐనా సరే నేను నీ పంచను చేరానే - నాకే తెలియకుండా!

మహామహులు దేవదానవోత్తములూ, పరమర్షులూ నిత్యం ధ్యానించి ఏ పదం కోరి తపిస్తున్నారో అది నీవు నాబోటి వాడికి ఎలా అనుగ్రహిస్తున్నావో బోధపడకుండా ఉంది.

కొంచెం కొంచెంగా అర్థమైనది ఇది.  అన్ని గుణాల్లోనూ దయాగుణం అన్నది ఉందే అది మహా దొడ్డది.

రమ్యగుణార్ణవుడవు నీవు.

నీ దయాగుణం ఇంతింతని చెప్పతరమా.

నా యోగ్యతను అదేలే నా అయోగ్యతను లెక్కించకుండా నీ దయాదృష్టి కొంచెం నావైపు రానిచ్చావు.

ఇంకేం నన్ను నీవాడిని చేసుకున్నావు.

నీవు దేవుడవు కదా.

నీకు అసాధ్యం అంటూ ఉంటుందా.

పరమ మూర్ఖుణ్ణీ మహా అయోగ్యుణ్ణీ ఇప్పుడు పూర్తిగా నీ మార్గంలోనికి వచ్చేసాను. అనందమే అనందం.

ఎలా నీపంచన చేరానా అన్నది అటుంచి నీ పంచన ఉన్నానన్నదే ముఖ్యం కదా.

ఇంక ఎక్కడికీ పోను.

పాహి రామప్రభో.
దయుంచు.