12, ఫిబ్రవరి 2018, సోమవారం

రాజకీయ నాయకుల్లో రకాలు.


ఒకసారి బుధ్ధభగవానుడి దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది.

ఆమె వచ్చింది అనటం కన్నా ఆమె బంధువులు ఆమెను నయానో భయానో ఒప్పించి తీసుకొని వచ్చారని చెప్పటం సబబుగా ఉంటుంది.

బుధ్ధుడి సముఖం లభించింది.

ఏమిటి విషయం అన్నాడు బుధ్ధుడు వారు తననుండి ఏదో ఆశిస్తున్నారని గ్రహించి.

స్వామీ, ఈ అమ్మాయికి కొంచెం మంచి ఉపదేశం చేయండి. ఈమె పెడసరపు ప్రవర్తనతో అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు నిత్యమూ. ఇరుగుపొరుగుతో సఖ్యతకు ఆసక్తి చూపదు. బంధువులకు గౌరవమర్యాదలు ఇవ్వదు. ఇంక భర్త ఐతే ఆతడి యాతన చెప్పనలవి కాదు - అన్నింటికీ ఎడ్డెమంటే తెడ్డెమనే. అసలు అతడు నోరు ఎత్తితే చాలు దులపరింపులూ చీదరింపులూ ను. మీరు ఈమెకు కాస్త మంచిబుధ్ధి ఉపదేశిస్తారని మీ దగ్గరకు ఎంతో ఆశతో వచ్చాం అన్నారు ఆమెను తీసుకొని వచ్చిన పెద్దమనుషులు.

బుద్దుడు కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు.

చివరకు ఇలా అన్నాడు.

అమ్మాయీ, పురుషుడికి భార్యలు ఏడు రకాలుగా ఉంటారు.

ఒకామె తల్లి వంటిది,  అనునిత్యమూ కంటి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలని తాపత్రయపడుతూ ఉంటుంది. తాను లేకుంటే ఏమైపోతాడో అని ఆదుర్దాపడుతూ ఉంటుంది.

ఒకామె సోదరి వంటిది, ఎంతో ఆత్మీయతతో అతడికి అవసరమైన ప్రేమాభిమానాలు అందిస్తూ అతడి అభ్యున్నతిని కోరుతూ ఉంటుంది.

మరొకామె స్నేహితురాలి వంటిది,  అతడిని అభిమానిస్తూ అవసరమైన సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది.

ఒకామె పరిచయస్థురాలి వంటిది,  అవసరార్థం మాత్రమే అతడి ప్రక్కన ఉంటుంది కాని తన జీవితం తనది అతడి జీవితం అతడిదిగా అంటీ ముట్టనట్లు ఉంటుందంతే.

ఒకామె దొంగ వంటిది,   అతడికి ఉన్న సమస్తమూ తనకి ఎలా చెందేలా చేసుకోవాలా అన్న తపన తప్ప మరేమీ ఉందదు. అవసరమైన పక్షంలో అతడిని మోసగించి ఐనా తన కోర్కెలు తీర్చుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటుంది.

ఇంకొకామె హంతకురాలి వంటిది,   తన విలాసాలు తనవే కాని భర్త అడ్డు రావటాని వీల్లేదు. వచ్చాడా చచ్చాడే అన్నమాట,

ఇంకా ఒకతె దాసి వంటిది.  ఈమె భర్తను ఉన్నతస్థానంలో నిలపటానికి నిత్యం తపిస్తూ ఉంటుంది. తనగౌరవమర్యాదలు అతడి గౌరవమర్యాదలతో ముడిపడి ఉన్నాయని భావించి సర్వాత్మనా అతడికి అవరమైన సేవలను అందిస్తూ ఆతని జీవితానికి చుక్కానిలా ఉంటుంది.

ఇప్పుడు ఆలోచించుకొని చెప్పు. నీవు నీ భర్తకు ఎటువంటి భార్యగా ఉండాలనుకుంటున్నావు అన్నాడు బుధ్ధుడు.

బుధ్ధభగవానుడి ఉపదేశానికి ఆమె వినయంగా బదులు చెప్పింది.

స్వామీ, ఇకనుండి నేను నా భర్తకు దాసిగా ఉండాలనుకుంటున్నాను అని.

ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే ప్రస్తుత కాలంలో మనరాజకీయనాయకుల వ్యవహారశైలి చూస్తూ పోతుంటే వారిలో ఉన్న రకాలను గురించి చెప్పుకోవటం అవసరం అనిపించి.

రాజకీయనాయకుల్లో కూడా ఏడు రకాల వాళ్ళున్నారు. ఒకరకం ప్రభువులు, ఒకరకం మంత్రులు, ఒకరకం సేనానులు,  కొందరు సెలెబ్రిటీలు, ఒకరకం వారు వారసులు, ఒకరకం  ఒకరకం రాజసేవకులు, ఒకరకం ప్రజాసేవకులు.

ప్రభువుల రకం రాజకీయులు తాము ప్రజల నెత్తిన రాజులమన్న అహంతో ఉంటారు. ఓట్లేసి గెలిపించిన జనం అంతా తాము వేలు ఎలా ఆడిస్తే తదనుగుణంగా ఆడవలససి అర్భకులే కాని వాళ్ళకు తమను ప్రశ్నించే హక్కు ఎక్కడిదీ అని భావిస్తూ ఉంటారు.

మంత్రుల రకం రాజకీయులు ఏవేవో వ్యూహాలు పన్నుతూ, అవన్నీ తమ స్వార్థం కోసమే ఐనా అంతా ప్రజలమంచికే అని నిత్యం నమ్మబలుకుతూ తమలో తాము గుడుసుళ్ళుపడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒరిగించేది ఏమీ లేదని ఎవరన్నా జనంలో వాళ్ళంట్టే వాళ్ళంతా ప్రగతిద్రోహులూ  ప్రజాద్రోహులూ అంటూ అందరినీ నమ్మించాలని మేతావుల్లాగా ఏవోవే చెబుతుంటారు.

సేనాపతులరకం వాళ్ళు అన్నింటికీ రణోత్సాహంతో రంకెలు వేస్తుంటారు. ప్రభువులూ మంత్రులూ వాళ్ళను చక్కగా వాడుకుంటూ ఉంటారు. వీళ్ళు సాధించి చచ్చేది ఆట్టే లేకపోయినా జనబహుళ్యంలో గందరగోళం మటుక్కు చక్కగా సృష్టించగలరు.

సెలెబ్రిటీలు అని ఒక తమషాజాతి మనుష్యులు కూడా రాజకీయులుగా వేషాలు వేస్తూ ఉంటారు. ఏదో ఒకరంగంలో పేరు వచ్చినంత మాత్రాన రాజకీయులు కావటం కుదరదు కాని జనం తమ వెంట పడేలా హంగామా చేయగల చాకచక్యం ఉన్నవాళ్ళుంటారు. ఒక పెద్ద తెరతారకున్న అసంఖ్యాక అబిమానజనం వాళ్ళకు రాజకీయబల ఇవ్వవచ్చును. ఒకపెద్ద క్రీడాకారుడిని ఉన్న ప్రజాభిమానాన్ని ప్రభువులో మంత్రులో రాజకీయవేషం వేయటానికి ఉపయోగించ వచ్చును. తమాషా ఏమిటంటే రాజకీయాల గురించి కాని నిజంగా ప్రజాపాలన ప్రజాశ్రేయస్సు వంటి వాటి గురించి కాని ఓనమాలు కూడా రాకపోయినా ఈ సెలెబ్రిటీలు రాజకీయరంగప్రవేశం చేసి చిందులు వేస్తూంటారు. ఖర్మ ఖర్మ.

వారసులు అని ఒక జాతి రాజకీయులు ఉంటారు. వీళ్ళు సెలెబ్రిటీల్లో ఒక ప్రతేకమైన రకం. వీళ్ళకు కుటుంబ వారసత్వంగా రాజకీయ నాయకత్వం ఆటోమేటిగ్గా బదిలీ ఐపోతుంది. వీళ్ళలో పరమశుంఠలైనా సరే తప్పనిసరిగా  అన్నలూ,  మహానాయకులూ వంటి బిరుదలతోనే జనం నెత్తిన కూర్చుంటారు.

రాజసేవకులు సేనానులకన్న కొంచెంగా తక్కువ. వీళ్ళు సేనానుల వెనుక తిరగటం ద్వారా సేనానులో మంత్రులో ఐపోదాం అని కలలు కంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ సంతలో చింతకాయల్ని పైతరగతి రాజకీయులు పట్టించుకోరు కాని పట్టించుకుంటున్నట్లు నటిస్తారు కాని ఆమాత్రానికే వీళ్ళంతా ఆనందంతో వాళ్ళకు అరవచాకిరీ చేస్తూ పోతుంటారు. వీళ్ళవల్ల ఎవ్వరికీ ఏమీ ప్రయోజనం లేదు. ఇంక ప్రజలకేం ఒరిగిస్తారు. తరచూ జనం వీళ్ళని జోకర్లుగా లెక్కించుతూ ఉంటారరు.

ప్రజాసేవకులూ ఉంటారు రాజకీయనాయకుల్లో. ఐతే వీళ్ళని కాగడా వేసి వెదుక్కోవలసిందే. ఇలాంటి వాళ్ళకు మిగతా రాజకీయులు పుట్టగతులు లేకుండా చేస్తూ ఉంటారు.  ఐనా వీళ్ళల్లో కొందరు మొండిగా జనంలో ఉండి జనం కోసం పోరాడుతూనే ఉంటారు వ్యవస్థతో అవస్థలు పడుతూనే. పాపం వీళ్ళలో మితవాదుల్ని మేధావులనీ అతివాదుల్ని తీవ్రవాదులనీ మిగతా రాజకీయులు ప్రక్కకు తోసేస్తుంటే కాలం మాత్రం వీలైన చోట్ల వీళ్ళకి న్యాయం చేస్తుంది లెండి.

ఏ రాజకీయ నాయకుణ్ణీ మీరు వీటిలో ఏరకం అని అడక్కండి. అందరూ ప్రజాసేవకులమనే అంటారు.

బుధ్ధుడు ఒకమ్మాయికి విడమరచి చెప్పి నువ్వెలా ఉంటావూ అంటే ఆమె సరైన విధానం ఎంచుకున్నది. బాగుంది.  మన రాజకీయనాయకులకు బుధ్ధి చెప్పగల వాడు ఎవరూ ఉన్నట్లు లేదు.