31, జనవరి 2018, బుధవారం

పాహిరామప్రభో: రాముని నేను నమ్మితిని రాముడు నమ్మును నన్ను


ఉ. రాముని నేను నమ్మితిని రాముడు నమ్మును నన్ను చాలు నిం
కేమియు కోరగా దగిన దీభువనంబున గాన రాదు శ్రీ
రాముని యాజ్ఞమేరకు చరాచరసృష్టిని నాడవచ్చి నా
స్వామిని గాక యెవ్వరిని ప్రస్తుతి చేసెడి వాడ చెప్పుడీ

ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా నమ్మకాలలోని నిజానిజాలను గురించి నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది.

నేను ఆ శ్రీరామచంద్రుడిని నమ్ముకొన్నాను.

నా నమ్మకంలోని నిజాయితీని గురించి ఎవరన్నా ప్రశంసించాలన్న ఆశ అనండి దురాశ అనండీ అదేమీ లేదు నాకు.

నా నమ్మకంలోని నిజాయితీని గురించి ఎవరన్నా శంకిస్తారేమో అన్న చింతా వంతా కూడా నాకేమీ లేదు.

నా నమ్మకంలోని నిజాయితీని గురించి అందరికన్నా బాగా తెలిసినవాడు ఆ శ్రీరామచంద్రుడే.

ఈ లోకంలోని వాళ్ళు కొందరు నన్ను అర్థశతాబ్దం నుండీ చూస్తూ ఉన్నారు.  నిన్న మొన్ననే నన్ను చూడటం మొదలు పెట్టిన వారూ ఉన్నారు. వారికి నా గురించి కొద్దో గొప్పో తెలిసి ఉండవచ్చును.  అందులో కొందరి దృష్టిలో నేను ఉత్తముణ్ణీ కావచ్చును కొందరి దృష్టిలో నేను అధముణ్ణీ కావచ్చును. దానికేమి. అది లోకసహజం.

కాని నా రాముడు నన్ను మొదటినుండీ యెఱిగిన వాడు. నామంచి చెడులు ఆయన కన్నా మరెవరికి బాగా తెలిసి ఉంటాయి చెప్పండి?

నాకు తెలిసి రాముడికి నా మీద నమ్మకం ఉంది.

నేను సరైన దారిలోనే ఉన్నానన్న నమ్మకం ఉంది రాముడికి.

సరైన దారి అంటే అది రాముడి వైపుకు నడిచే దారి అన్నమాట,

వేరే ఏదారీ సరైనది కాదు.

ఇది నా విశ్వాసం.  ఈ నాడు కొత్తగా నాకు ఈ జన్మలో ఏర్పడినది కాదు. అనాది ఐనది.

ఈ పరస్పరమైన నమ్మకం ఉందే మా ఇద్దరి మధ్యనా, అది నాకు చాలు.

వేరేది ఏదీ కోరదగినది నాకు కనిపించదు. అలా ఇంకేదో కోరదగినది ముల్లోకాల్లోనూ ఉంటుందంటే నాకు నమ్మకం లేదు.

బాగుందయ్యా అలాంటప్పుడు నువ్వా రాముణ్ణి వదలిపెట్టి ఇక్కడ ఈ భూలోకంలో ఏం చేస్తున్నావూ అనవచ్చును మీరు.

భేషుగ్గా అనవచ్చును.

దానిని నా సమాధానం ఒక్కటే.  ఇక్కడ నేను ఉన్నది కూడా నా రాముడి ఆజ్ఞప్రకారమే కాని నా స్వబుధ్ధితో మాత్రం కాదు అని.

అక్కడ కొన్నాళ్ళుండి రావోయ్ పనుందీ అన్నాడాయన.

అయన ఆజ్ఞాపించాక అందులో ఆలోచించవలసింది ఏమీ ఉందదు.

అందుకే ఇక్కడకు వచ్చి ఉంటున్నాను.

ఈ సృష్టి అంతా రాముడి క్రీడ.

ఈ రంగస్థలం మీద నాకు ఒక వేషం ఇచ్చి ఆడిస్తున్నాడు.

ఈ సృష్టికన్నా గొప్ప నాటకం ఎన్నడూ మరొకటి లేదు - ఉండదు కాక ఉండదు.

ఈ రామవినోదనాటకంలో నా పాత్రనేను ఆడుతున్నది నా రాముడి వినోదం కోసమే కాని ఏదో నా వినోదం కోసం కానేకాదు.

నా రాముడి ప్రత్యక్షంలో ఆయన్నే ప్రస్తుతిస్తూ సంతోషంగా ఉండే వాడిని.

ఇప్పుడు రాముడి పరోక్షంలో కూడా రాముణ్ణి ప్రస్తుతిస్తూనే సంతోషంగా ఉంటున్నాను.

ఐనా నా పిచ్చి కాని రాముడి పరోక్షం అన్నది తప్పుసుమా. రాముడి లీలగా జరుగుతున్న ఈ సృష్టినాటకానికి ప్రేక్షకుడు ఆ రాముడే కాదా? ఇంకా అందుచేత రాముడి పరోక్షం అన్న మాటకు అర్థం ఉందా? లేదు కదా!

అందుకే రాముణ్ణి ప్రస్తుతిస్తూ ఉన్నాను.

ఈ సృష్టిలో ఉన్నది సర్వం రాముడి ఇఛ్చమేరకే జరుగుతూ ఉన్నది కదా.

అటువంటప్పు స్తవనీయుడు రాముడు కాక మరెవరు?

మీరే చెప్పండి. నా రాముణ్ణి కాక మరెవరిని ప్రస్తుతిస్తాను?

రాముడి ఆజ్ఞమేరకు సృష్టిలోనికి వచ్చి రాముణ్ణి కాక మరెవవరిని ప్రస్తుతిస్తాను? ఎందుకు ప్రస్తుతిస్తాను?

అందుకే నిత్యం అంటూ ఉంటాను పాహిరామప్రభో అని.