14, జనవరి 2018, ఆదివారం

కలికి సీత కే మిప్పుడు కావలె నడుగరే



కలికి సీత కే మిప్పుడు కావలె నడుగరే
చెలులార యడుగ నేల సీత నెఱుగరే

చిన్నబోయి కూర్చున్నది సీతమ్మ నేడేల
అన్నులమిన్న కష్ట మడుగ రాదటే
తన్నేలు విభునిరాక తడవైన నోపక
యున్నది కాదే యంత కన్న నేమున్నదే

వేడినిట్టూర్పులు విడచుచు సీతమ్మ
క్రీడాశుకములవంక చూడనొల్లదే
చేడియా రఘురాముని చేరియున్న గాక
క్రీడించ తా నిచ్చగించునటే సీతమ్మ

విహరించ సాధ్వి మనసు విచారమును వీడి
మహిళామణిని తేర్చు మంచిమార్గ మేమిటే
మహీకన్య యెదుట రామాయణము పాడరే
అహహా  సీతమ్మ ముందందరము పాడుదమే