15, అక్టోబర్ 2018, సోమవారం

రామరామ యనుచుంటి


రామరామ యనుచుంటి రక్షించు మనుచుంటి
నీ మీద గురియుంచి నీవాడనై యుంటి

భావాంబరవీధి నీదు భవ్యరూపము నించి
జీవుడ నిన్నే వేళ చింతించుచు నుంటి
దేవుడా నీవు తక్క దిక్కిం కెవరంటి
రావయ్య వేవేగ రక్షించవయ్య

వేలకొలది నామముల వేడుకైన నామమని
మేలైన నామము జగమేలు రామనామమని
నాలోన నమ్మియుంటి నావాడ వనుకొంటి
చాలదా వేవేగ సంరక్షచేయవే

ఎన్నటికిని దాటరాని యీభవాబ్ధి నుంటి
ఎన్నెన్నో యోటిపడవ లెక్కి విడచియుంటి
యిన్నాళ్ళకు రామనామ మన్న నౌక గంటి
విన్నాణము గొంటి నింక వేగ రక్షించవే


14, అక్టోబర్ 2018, ఆదివారం

గోవిందుడు హరి గురువై


గోవిందుడు హరి గురువై యుండగ
జీవులు దుర్గతి చెందెదరా

వినిన చాలురా వెన్నుని చరితలు
అనిన చాలురా హరినామములు
కనిన చాలురా గరుడవాహనుని
మనసారగ నొక క్షణమైన

చాలును శ్రీహరి సంకీర్తనము
కాలుని వలన కలుగదు భయము
మేలగు సద్గతి మీకగు గాదే
శ్రీలోలుడు మిము చేరదీయగ

పామరులై భవవార్థి గ్రుంకులిడు
మీమీ యాత్మల మేలు కొఱకు హరి
మీ ముందుంచెను ప్రేమమీఱగ
రామనామమను రక్షణకవచము

13, అక్టోబర్ 2018, శనివారం

ధర్మవీరుడా రామ దండాలు


ధర్మవీరుడా రామ దండాలు
కర్మవీరుడా నీకు దండాలు

ధనకనకములు కాక దాశరథీ నీ కరుణ
అనిశము కోరువారి నాదరించు దేవుడవు
మనసున నిన్ను నిలిపి మరువక కొలుచుచుండు
జనుల నేవేళ బ్రోచు చల్లని తండ్రివి

శరణన్న వారి నెల్ల సంతోషముగ కాచి
పరిరక్షణ చేయునట్టి భగవత్స్వరూపుడవు
నిరంతరము నీపేరు నిష్ఠతో ధ్యానించు
పరమభక్తుల నేలు పరమాత్ముండవు

అన్నిధర్మముల నీ వాచరించి చూపితివి
అన్నిలోకంబులకు నాదర్శపురుషుడవు
విన్నాణము గొలుపు చరిత వెలయించితి వీవు
నన్నేలి ముక్తినిచ్చు నారాయణుడవు

ఏమి చెప్పుదు నయ్య


ఏమి చెప్పుదు నయ్య యెందరో రక్కసుల
నామావశిష్టుల జేసినావు రామయ్య

పడతుల జెరబట్టు పాపబుధ్ధి యైనందున
పడగొట్టినావు రావణు రణమున
పడతుల నేడ్పించు పాపబుధ్ధులు నేడు
పుడమిని నిండి రిది పొడగాంచవు

యదుకులమున బుట్టి యవనిభారము దీర్ప
వెదకి రాకాసుల విరచితివి
వెదుకబని లేదు నేడు పెరిగి రీ ధరనిండ
సుదతులపాలి రాకాసులు గమనించవు

ఏమయ్య రక్కసుల కేమి తీసిపోవుదురు
భూమిని దుర్జనులై బోరవిరచుక
తామసులై తిరుగెడు ధర్మేతరులు నేడు
స్వామి వారల నేల చక్క జేయవు

11, అక్టోబర్ 2018, గురువారం

ఒకబాణము వేసి


ఒకబాణము వేసి యొంచరాదా
వికటపు కలినింక వీరుడ రామా

తరుణి సీతను బొంది దరహాసముఖుడవై
తరలుచుండు వేళ నిన్ను దాకి తీండ్రించిన
పరశురాముని పైన పరగ విల్లెక్కుపెట్టి
బిరాన నతని పుణ్య విభవమును గొట్టినట్లు

తరుణి సీత యొడిని తలనిడి నిదురించి
తరుణాన కాకి యొకటి ధరణిజను గీరిన
యరసి దానిపైన బ్రహ్మాస్త్ర మెక్కిడి
బిరాన దాని పరిభవించి విడిచి పెట్టినట్లు

తరుణి సీతని బాసి తెరువు జూపవే యని
పరిపరివిధముల నీవు ప్రార్థించ సాగరుడు
గరువాన మిన్నకున్న పరగవిల్లెక్కుపెట్టి
బిరాన నతని కాళ్ళ బేరమునకు తెచ్చినట్లు

పదిమంది దృష్టిలోన


పదిమంది దృష్టిలోన పడవలె నని నీకంత
యిదిగా నున్నదే అది మంచిది కాదు

హరి మెచ్చిన నదే చాలు ననుచు వినిపించక
నరుల మెప్పుకై వెంపరలేమిటికి
నరుడు మెచ్చు కీర్తనకు నాణ్యత హెచ్చునా
హరి మెచ్చుటే యానందము గాక

ఒరులిచ్చు ప్రశంస ల నొరుగున దేముండును
హరి ప్రశంసించె నేని యబ్బు ముక్తి
తరచుగా కీర్తి కొఱకు తహతహలాడు వాడు
పరము నార్జించుట వట్టిది సుమ్ము

పరగ రామకీర్తనలను ప్రజలు మెచ్చి పాడిరేని
హరి వారల  మెచ్చుకొను నంతియె కాక
విరచించితి రామునికై వినుడు మీరనుచు నీవు
నరుల మధ్య తిరుగుట పరమును చెఱచు

10, అక్టోబర్ 2018, బుధవారం

పరమయోగిని కాను


పరమయోగిని కాను పామరుడను కాను
హరి నీకు దాసుడనే యది చాలదా

వెనుకటి జన్మలలో వెఱ్ఱినో వివేకినో
యనునది నే నెఱుగ నది యటులుండ
మునుకొని యీ జన్మ ముడుపుగట్టితి నీకు
అనిశము సేవింతునే యది చాలదా

చనిన భవంబు లందు జల్పము లెన్నైనవో
యనునది నే నెఱుగ నది యటులుండ
విను మీ జన్మ మెల్ల విశదంబుగ నీ కీర్తి
అనిశము పాడుదునే యది చాలదా

అణగిన జన్మముల హరిభక్తి యున్నదా
యనునది నే నెఱుగ నది యటులుండ
ఇనకులేశ్వర రామ ఇప్పుడు నినుగూర్చి
అనిశము తపియింతునే యది చాలదా

ఎవరెవరి తప్పు లెంచి


ఎవరెవరి తప్పు లెంచి యేమిలాభము పూర్వ
భవముల చేసినపనుల ఫలము లిటులుండె గాన

పెట్టకుండ పుట్టదను పెద్దల మాటలు నిజము
చెట్టబుధ్ధి చేత దానశీలమును
గట్టున పెట్టినట్టి ఘనుడ నే నైతి నేమొ
కట్టికుడుపు చున్న దిప్పు డట్టి పాపమె

భాగవతుల పరిహసించ పరమమూఢు డగు నందురు
సాగి నేనట్టి తప్పు చాల జేయగ
యోగనిష్ఠ యందు బుధ్ధి యొక్కనిముష ముండదాయె
భోగభూము లందె నిలచిపోవు చుండు నయ్యయ్యో

రామచంద్ర నీవు కాక రక్షసేయ వార లెవరు
కామితార్థమైన ముక్తి కలుగు టెట్లో
యేమిచేయ జాల నట్టి హీనుడను శరణు శరణు
నా మెఱాలకించ వయ్య నన్ను కావ రావయ్య


9, అక్టోబర్ 2018, మంగళవారం

వారగణనం - 2


మనం ఇప్పటి వరకూ 1900 నుండి 1999 వరకూ ఏ సంవత్సరంలో ఐనా సరే ఏ తేదీ కయినా సరే అది ఏవారం అవుతుందో ఎలా సులభంగా లెక్కవేయవచ్చునో  తెలుసుకున్నాం.

ఇంతవరకూ బాగుంది.

కొన్నేళ్ళ క్రిందటి వరకూ ఈ గణితం సాధారణంగా అందరికీ సరిపోయేది. ఎందుకంటే మన యెఱుకలో ఉన్న జనాభా అందరూ 1900 నుండి 1999 మధ్యలో పుట్టిన వాళ్ళూనూ మనం గుర్తుపెట్టుకొనే అవసరం ఉన్న తేదీ లన్నీ ఈ సంవత్సరాలకే చెందినవి కావటమూ కారణం.

ప్రస్తుతం మనం ఆ కాలం దాటి ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనలో అనేకులకు ఆ పాత సంవత్సరాలలోని తేదీలూ ముఖ్యమైనవి ఉంటున్నాయి. కొత్తగా మనం వాడుకచేస్తున్న సంవత్సరాలన్నీ 20తో మొదలౌతున్నాయి.

ఉదాహరణకు అనేకుల పుట్టినరోజు ఏదో ఒక 19XX సంవత్సరం ఐతే పెళ్ళిరోజో ఉద్యోగంలో చేరిన రోజో ఒక 20XX సంవత్సరంలో ఉంటోంది.

పూర్వం అవధానులను అడిగే తేదీలన్నీ ఏవో కొన్ని19XX సంవత్సరాలే కాని నేటి అష్టావధానికి ఆసౌకర్యం లేదు. ఏదో ఒక 19XX లేదా 20XX సంవత్సరంలో తేదీ అడుగవచ్చును కదా!

కాబట్టి మన ఇంతవరకూ నేర్చుకున్న గణితంలో శతాబ్ది సంఖ్యనూ పరిగణనలోనికి తీసుకోవాలంటే మార్పు చేయక తప్పదు.

అదెలాగో చూదాం.

అసలు ఒక శతాబ్దంలో ఎన్నిరోజులుంటాయీ అన్న ప్రశ్నకు సమధానం చూదాం మొదట.  మనకు తెలిసి ప్రతిసంవత్సరంలోనూ 365రోజులూ పైగా నాలుగేళ్ళ కొకసారి అదనంగా ఫిబ్రవరి 29 అనే మరొక రోజూ. కాబట్టి శతాబ్దం అంటే 100 సంతర్సరాలలో 100 x 365 + 100/4 = 36500 + 25 = 36525 రోజులన్న మాట.

కొద్దిగా తప్పాం. నిజానికి 36524 రోజులేను.

ఎందుకలా?

ప్రతినాలుగేళ్ళకూ ఒక లీప్ సంవత్సరం వస్తుంది కాని సంవత్సరసంఖ్య 00 ఐతే అది లీప్ ఇయర్ కానక్కర లేదు!

1500  లీప్ ఇయర్ కాదు
1600  లీప్ ఇయర్!
1700  లీప్ ఇయర్ కాదు
1800  లీప్ ఇయర్ కాదు
1900  లీప్ ఇయర్ కాదు
2000  లీప్ ఇయర్!
2100  లీప్ ఇయర్ కాదు

అంటే ఏమిటన్న మాట? శతాబ్దాన్ని తెలిపే సంఖ్య4 యొక్క గుణిజం (12, 16, 20, 24 అలా) ఐతేనే 00 సంవత్సరం లీప్ సంవత్సరం. కాకపోతే ఆ సంవత్సరానికి 365రోజులే.

కాబట్టి సాదారణంగా 100 సంవత్సరాలలో 24 లీప్ సంవత్సరాలే ఉంతాయి. కాబట్టి మొత్తం రోజులు 365000+24 మాత్రమే.

ఇఅతే ప్రతి నాలుగువందలయేళ్ళకు ఒకసారి అదనంగా లీప్ ఇయర్ వస్తోంది కదా. 1600, 2000, 2400 సంవత్సరాలు లీప్ సంవత్సరాలే కాబట్టి ఆ సంవత్సరాల్లో ఫిబ్రవరి 29వ తారీఖు ఉంటుంది.

ఇప్పుడు 400 సంవత్సరాలకు ఎన్ని రోజులూ అని? లెక్క తేలికే 4 x 36524 + 1 అంటే 146097 రోజులు.

ఇదంతా ఎందుకు తవ్వి పోసామూ అంటే అక్కడకే వస్తున్నాను. వందేళ్ళల్లో 36524 రోజులు అంటే 5217 వారాల పైనా 5రోజులు. అనగా మరొక్క వారానికి 2 రోజులు తక్కువ.

అలాగే 400 సంవత్సరాలకు ఎన్నిరోజులూ అంటే 146097 రోజులు అన్నాం కదా, అది సరిగ్గా 20871 పూర్తి వారాలు. ఒక్కరోజు కూడా అదనంగా లేదు - తరుగ్గానూ లేదు.

ఒక్కొక్క వంద సంవత్సరాలకూ 2 రోజుల చొప్పున కొట్టివేయాలి కాబట్టి శతాబ్ది సంఖ్యను 4చేత భాగించి శేషాన్ని రెట్టించితే సరి. ఈ అదనం విలువను మన పాత గణితంలో తగ్గించాలి.

మన 19 అనేది శతాబ్ది సంఖ్య అనుకుంటే దాన్ని 4తో భాగిస్తే 3 శేషం వస్తుంది. దీన్ని రెట్టిస్తే 6. న్యాయంగా 19XX సంవత్సరానికి చేసిన గణితంలోనుండి ఈ సవరణ ప్రకారం 6 తగ్గించాలి. కాని అదెలా?  ఈ సవరణకు పూర్వమే మనగణితం అన్ని 19XX సంవత్సరాలకూ సరిపోతోందిగా!

కాబట్టి మన సవరణనే కొంచెం సంస్కరించాలి. అదనంగా 1 తగ్గించటం ద్వారా. అంటే శతాబ్ధి సంఖ్య 19 ఐతే మనం 6 బదులుగా 6+1 = 7 తగ్గించుతున్నాం.. అంటే ఏమీ తగ్గించటం లేదనే.

ఇప్పుడు అంతిమంగా శతాబ్ది సంస్కారం ఏమిటీ అంటే

 - 2 x ( శతాబ్ది సంఖ్యను 4తో భాగించితే వచ్చే శేషం)  -1

ఈ శతాబ్ది సంస్కారంతో సహా వారగణన సూత్రం
   సంవత్సరం + సంవత్సరం/4 + నెలకు ఇండెక్స్ + తేదీ -  - 2 x ( శతాబ్దిని 4తో భాగించితే వచ్చే శేషం)  -1

ఉదాహరణలు కొన్ని చూదాం.

1618-10-9: 18+4+0+9-0-1 = 30 = 2 మంగళ
1718-10-9: 18+4+0+9-2-1 = 28 = 0 ఆది
1818-10-9: 18+4+0+9-4-1 = 26 = 5 శుక్ర
1918-10-9: 18+4+0+9-6-1 = 24 = 3 బుధ
2018-10-9: 18+4+0+9-0-1 = 30 = 2 మంగళ
2118-10-9: 18+4+0+9-2-1 = 28 = 0 ఆది
2218-10-9: 18+4+0+9-4-1 = 26 = 5 శుక్ర
2318-10-9: 18+4+0+9-6-1 = 24 = 3 బుధ
2418-10-9: 18+4+0+9-0-1 = 30 = 2 మంగళ

ఈ విధంగా ఏశతాబ్దంలో ఐనా సరే ఏ సంవత్సరంలో ఐనా సరే ఇచ్చిన తేదీకి సులభంగా వారం గణితం చేయవచ్చును.

ఎవరైనా సరే చక్కగా అభ్యాసం చేస్తే ఈ గణితాన్ని కేవలం నోటిలెక్కగా సెకనుల్లో చేయవచ్చును.

అసక్తి ఉంటే మీరూ ప్రయత్నించండి.

వారగణనం - 1


నిత్యం మనం వాడుతూ ఉన్న గ్రిగొరియన్ కాలెండర్లో ఇచ్చిన తారీఖునకు సరియైన వారం గణితం వేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. అప్పుడప్పుడు అష్టావధానాల్లో సభలోని వారో పృచ్ఛకులో ఏదో ఒక తారీఖు చెప్పి ఆరోజు ఏవారం  ఐనదీ చెప్పమనటమూ అవధాని వెంటనే చెప్పటమూ మంచి వినోదంగా ఉంటుంది.

తారీఖుకు వారం కనుక్కోవటం కేవలం గణితం.

అతిసులభం అనలేము కాని సులభం అనే చెప్పాలి.

మొదట ఈ టేబుల్ భట్టీయం వేయాలి

జనవరి  0
ఫిబ్రవరి  3
మార్చి  3
ఏప్రిల్   6
మే     1
జూన్    4
జూలై    6
ఆగష్టు   2
సెప్టెంబరు 5
అక్టోబరు  0
నవంబరు 3
డిసెంబరు 5

ఈ టేబుల్ వెనుకాల బ్రహ్మ రహస్యం ఏమీ లేదు.

జనవరి 1వ తారీఖు ఆది వారం అనుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు బుధవారం అవుతుంది. ఎందుకలా అంటే జనవరిలో 31రోజులుంటాయి కదా, అందులో 28రోజులు (పూర్తివారాలు) కొట్టివేస్తే మిగిలేది 3 కాబట్టి. ఫిబ్రవరి 1 బుధవారం ఐతే (లీపు సంవత్సరం కాని సం. లో) మార్చి 1వ తేదీ బుధవారమే అవుతుంది. మరలా మార్చిలో 31 రోజులు కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖున 3+31 =34లో 28రోజులు కొట్టివేస్తే 6వది అవుతుంది.  ఇలా సంవత్సరంలో ప్రతినెల మొదటి తారీఖు ఏవారం అయ్యేదీ తెలిపే టెబుల్ ఇదన్నమాట, ఈ టేబుల్ ప్రకారం సంవత్సరంలో మొదటిది ఆదివారం అనుకుంటూన్నాం అంతే.

ప్రతిసంవత్సరానికీ 365 రోజులు. ఒక సంవత్సరం లో పూర్తివారాలు కొట్టివేస్తే 1రోజు అదనం అన్నమాట, కాబట్టి ఒకసంవత్సరం మొదటి తారీఖు ఆదివారం ఐతే (అది లీపు సంవత్సరం కాకపోతే) అ తరువాతి సంవత్సరం మొదటి తారీఖు సోమవారం అవుతుంది.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీపు సంవత్సరం వస్తుంది.

ఇప్పుడు 20వ శతాబ్దంలోని తారీఖులకు వారాలు సులభంగా ఎలా చెప్పవచ్చో చూద్దాం. (తరువాత ఇతర శతాబ్దాల సంగతీ చూద్దాం).

నిజానికి 20వ శతాబ్దం 1901 సంవత్సరంతో మొదలు అవుతుంది. 1900తో కాదు. కాని మన గణితానికి 1900 ఐనా ఇబ్బంది లేదు.

1900- జనవరి -1 ఏ వారం?

సూత్రం. సంవత్సరం + సంవత్సరం/4  + నెలకు టేబుల్ ఇండెక్స్ + నెలలో తారీఖు

గణితం.  0 + 0 + 0 + 1

ఇక్కడ సంవత్సరం అంటే శతాబ్దంభాగాన్ని వదిలేయాలి. కేవలం సంవత్సరభాగం 00 మాత్రం తీసుకోవాలి. ఈ సున్నను 4చేత భాగిస్తే వచ్చేది 0 కదా. టేబుల్ ప్రకారం జనవరి ఇండెక్స్ 0. నెలలో తారీఖు 1. అన్నీ కలిపితే వచ్చేది 1. ఆది వారం 0 నుండి లెక్కవేస్తే 1సోమవారం . ఇది సరైనదే.

1947- ఆగష్టు - 15 ఏ వారం?

గణితం.
     సంవత్సరం      47
    47/4 విలువ    11
    ఆగష్టు ఇండెక్స్    2
   తారీఖు          15
   మొత్తం  47+11+2+15 = 75
   ఈ 75 ను 7 చేత భాగిస్తే శేషం 5 అంటే శుక్రవారం.

ఇలా ఏసంవత్సరంలో ఏనెల కైనా చేయవచ్చును. కాని లీపు సంవత్సరాలతో కొంచెం పేచీ వస్తుంది చూడండి.

1996-1-1 ఏ వారం?

గణితం.  96 + 96/4 + 0 + 1 = 121
      121ని 7 చేత భాగిస్తే శేషం 2 అంటే మంగళవారం.
      ఇది తప్పు. ఆ రోజు సోమవారం.

సవరణ.  తప్పు ఎందుకు వచ్చిందంటే 4 సంవత్సరాలకూ ఒకరోజు చొప్పున 96సంవత్సరాలకు 24రోజులు. కాని ఈ అదనపు దినం కలిసేది మార్చి నుండి కాని జనవరి నుండి కాదు కదా? అందుచేత లీపు సంవత్సరాలలో మాత్రం జనవరి, ఫిబ్రవరి నెలలకు సమాధానాన్ని ఒకరోజు వెనక్కు జరపాలి.

ఇప్పుడంతా సరిగ్గానే ఉంది కదా?

మొదట ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికో చిట్కా ఏమిటంటే 0336, 1462, 5035 అనే సంఖ్యలను గుర్తుపెట్టుకోవటమే. రెండవది కొన్ని ఇరవయ్యవ శతాబ్దపు తారీఖులకు వారాలు గణనం చేస్తూ ఈ గణితాన్ని బాగా ఆభ్యాసం చేయాలి. 

మరొక చిట్కా గుర్తుపెట్టుకోవాలి. చివరన 7 చేత భాగించి శేషం మాత్రం వాడతాము. కాబట్టి ఎక్కడికక్కడ 7చేత భాగహారం చేసుకోవచ్చును.  1996-1-1 ఏ వారం? అన్నప్పుడు 96 + 96/4 + 0 + 1 = 121 అని ప్రయాస పడనక్కరలేదు. 96 బదులు 5 తీసుకొని దీనికి 24 బదులు 3 కలిపితే 8 అంటే 1 దీనికి 0 కలిపితే 1 మళ్ళా 1 కలిపితే 2. కాని లీపు సంవత్సరంలో మార్చికి ముందు నెలలు కాబట్టి 1 తగ్గిస్తే 2-1=1 సోమవారం అని వేగంగా నోటి లెక్క చేయవచ్చును. 7వ ఎక్కం బాగా రావాలి ముందు.

రాబోయే టపాలో ఈ సూత్రాన్ని విస్తరించి ఏశతాబ్దంలో ఐనా ఎలా గణనం చేయవచ్చునో చెబుతాను.

5, అక్టోబర్ 2018, శుక్రవారం

సీతమ్మా రామయ్యకు


సీతమ్మా రామయ్యకు చెప్పరాదటమ్మా
మా తప్పులు మన్నించి మమ్మేలుకొమ్మని

ఈ కలియుగమున మే మెంత యత్నించినను
మాకు ధర్మము పైన మనసు నిలువదే
ఆ కారణముచేత నగచాట్లు పడుచుంటిమి
మా కర్మమింతే నని మమ్ము వదలవద్దని

వదలలేకుంటి మీ పాడు కామక్రోధముల
తుదకేమో పరస్పరద్రోహములే
చిదుమ మా బ్రతుకులు చింతింతుము మిమ్ము
మదనారిసన్నుతుని మమ్ము వదలవద్ధని

తల్లిదండ్రులు మీరు తనయులము మేము
చల్లగా మీరు మమ్ము సాకకుందురే
యెల్లవేళల మీరు యించుకదయ చూపినచో
మెల్లగ నొకనాటికి మేము బాగుపడుదుము


దేవదేవ నిన్ను


దేవదేవ నిన్నునేను తెలియజాలను
నీ విధానము లెఱుగ నేనెంత వాడను

నే నెవడ ననునది నేనే యెఱుంగనే
నేననగ లోన ని న్నెఱుగు టెట్టిది
నీ నిజతత్త్వంబును నీరేజభవుడును
లో నెఱుంగడన్న నేనెంతవాడనో

విశ్వంబులన్నియు వెలయించితి వీవు
విశ్వంబులందు వెలెగె దీవు
విశ్వరూపుడ వీవు విశ్వాత్మకుడ వీవు
కావుమ నిన్నే కరణి తెలియు వాడను

నీవే రాముడవని నిన్నదాక తెలిసితినా
భావించ నిప్పు డో భగవంతుడ
నీవే తెలిపితివి గాన నే నెఱింగితి నిదే
భావనాతీతప్రభావ నీ దాసుడను


4, అక్టోబర్ 2018, గురువారం

హాయిగా రామరామ యనుచు


హాయిగా రామరామ యనుచు పాడేవు
తీయగా ఓ చిలుకా దిక్కులు నిండగను

ఎవరు నేర్పించిరే యీ రామనామము
చవులూరంగ చక్కగ నీ
వవలంబించితి వందాలచిలుకా
చెవులకు సుఖమగు శ్రీహరినామము

పడియుండితి విటు పంజరమున నీవు
కుడుచెద విదె కొన్ని గింజలే
యిడుమల మధ్యన నిదె రామనామము
కడువేడ్క నేర్చి చాల గడితేరితివే

మంచిపంజర మను భ్రమలేని చిలుకా
మంచివాడంటే మనరాముడే
యించుక తాళవే యీ రామనామమే
మంచితాళపుచెవి మాయపంజరానికి


3, అక్టోబర్ 2018, బుధవారం

చూడ నందరకు


చూడ నందరకు పెద్దచుట్టంబవ నీవు
వేడుకతో విందువు మా విన్నపంబులు

మాకు ధర్మ మెఱుకగు మార్గమే దంటేను
లోకావననిపుణ నరాకారము దాల్చి
శ్రీకర దయాళో శ్రీరామమూర్తివై
నీకథయే మార్గముగా మాకొసగిన చుట్టమవు

తరణోపాయ మొకటి దయచేయ మంటేను
నరులకిచ్చితివి నీ నామమంత్రము
పరమపామరులము పతితపావననామ
కరుణాలయ నీవే కడుపెద్ద చుట్టమవు

కలిమాయ క్రమ్మిన కపటలోకమునందు
వెలుగుదారి మాకు వెల్లడిచేయు
నళినాక్ష నీ దివ్య నామమంత్రము కాన
నిలనెల్లవారి కీవె యెంతోపెద్ద చుట్టమవు

2, అక్టోబర్ 2018, మంగళవారం

ఇప్పటి కిది దక్కె


ఇప్పటి కిది దక్కె నింతయ చాలు
నెప్పటి కైన ముక్తి నీయక పోవు

నీవు లోకేశుడవని నిశ్చయముగ నెఱిగి
నీవుదక్క గతిలేదని నిశ్చయముగ నెఱిగి
నీవు మోక్షదాతవని నిశ్చయముగ నెఱిగి
భావంబున నిలచెను భక్తి నీమీద

నీవు నావాడవని నిశ్చయముగ నెఱిగి
నీవు రక్షింతువని నిశ్చయముగ నెఱిగి
నీవు నా సర్వమని నిశ్చయముగ నెఱిగి
భావమున ప్రేమ నీ పైననే నిలచెను

నీవు నాలో గలవని నిశ్చయమగ నెఱిగి
నీవు నా ఆత్మవని నిశ్చయముగ నెఱిగి
నీవు నేను నొకటని నిశ్చయముగ నెఱిగి
భావంబిది రామ పరమశాంత మాయెను

చేయలేని పనుల


చేయలేని పనుల దలచి చింతించి ఫలమేమి
చేయగలిగినట్టి పనులు చేసిన చాలు

శక్తికి మించి ధనము సంపాదించుటకై
యుక్తులెప్పుడు పన్నుచుండు చిత్తము
రక్తిమీఱ కొద్దిసేపు రామచంద్రమూర్తిని
ముక్తి కొఱకు ప్రార్థించి మురిసితే చాలదా

ప్రొద్దుపొడిచినది మొదలు నిద్దుర కొఱగుదాక
సద్దుచేయ కుండలేని చచ్చు నాలుక
కొద్దిసేపైన గాని గోవిందనామస్మరణ
ముద్దుముద్దుగా చేసి మురిసితే చాలదా

వారివీరి సేవించి బ్రతుకీడ్చెడు కాయము
ఘోరమైన రోగాల కుప్ప కాయము
పారమార్థికము తలచి పరగ నొక్క ఘడియైన
చేరి శ్రీహరి సేవ చేసిన చాలదా

ఇచటి కేమిటి కని

ఇచటి కేమిటి కని యిందరు వత్తురో
విచిత్రమగు నెల్లవిధముల చూడ

మాయముసుగులు తొడిగి మతిమాలి గంతులు
వేయుచు తిరిగేరు వెంగళులై
చేయరాని పనులు చేసి చెడుఫలితము లొంది
మోయలేని కష్టాలు మోయుచు తిరిగేరు

వచ్చిన దెందుకో భావించ రెవ్వరును
వచ్చి చేసే రెన్నో పిచ్చి పనులు
ఎచ్చోటి నుండి వచ్చి రెన్నాళ్ళ ముచ్చటో
యిచ్చట నే యొక్కరి కిసుమంత పట్టదు

తిరిగిపోవ దారేదో తెలియనేరమి జేసి
తిరుగుచునే గడిపేరీ ధరను వీరు
పరమాత్ముడు రాముని పాదములు పట్టి
మరల స్వస్థితికి కొద్దిమంది చేరెదరు

వేరువారి జేరి నేను


వేరువారి జేరి నేను విన్నవింతునా
శ్రీరామ నీకే నేను చెప్పుకొందు గాక

ఊరక సంసారమం దుంచితి విదె నీవు
తీరిక లేనట్లు మోము త్రిప్పు కొందువా
నా రక్షణభార మది నమ్మకముగ నీదేను
ఔరౌరా కాని వాడ నైతినా సీతాపతి

తప్పించుకు తిరుగుట నీ తరముగా దొకనాడు
తప్పక నిన్ను చేరి తప్పులెంచనే
యిప్పటి కైన న న్నొప్పుగ కరుణించితే
తప్పును నా ఘోష నీకు దశరథరామయ్య

సర్వలోకరక్షకుడే సంరక్ష జేయకున్న
నిర్వహించుకొను టెట్లు నే నీ బ్రతుకు
దుర్వారమైన తాపదోషముచే తిట్టితే
గర్వ మనుకొనక దయగనుము నీ దాసుడ

1, అక్టోబర్ 2018, సోమవారం

ఆశలపల్లకి నధిరోహించుము


ఆశలపల్లకి నధిరోహించుము
దాశరథి దయజూచె నిను

బహుభవములుగా పరితపించితివి
అహరహమును శ్రీహరికై నీవు
ఇహమున పొందిన నిడుము లడగును
తహతహ లన్నియు తగ్గునని

పరబ్రహ్మమును భావించితివి
నిరతము మదిలో నిండుగ నీవు
పరము కలిగినది బహుధన్యుడవు
హరి నీవాడై యుండునని

నోరునొవ్వగ తారకమంత్రము
నారాధించిన వీరుడ వీవు
కూరిమి చూపెను శ్రీరఘునాథుడు
మారుజన్మమను మాటే లేదని

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

అందరూ దేవుడంటే


అందరూ దేవుడంటే అవు ననుకొందురు
కొందరు కాదంటే కొంత సంశయింతురు
   నరులకు నీపైన నమ్మక మిట్లుండును
   పరమాత్మ కలిని జనుల బ్రతుకు లిట్లుండును

రాముడే దేవుడని ప్రేమించు వారుందురు
రాము డెవ్వడని పల్కు రాలుగాయి లుందురు
రాముడా ఇట కలిమాయామోహితు లందున
యేమియు నిదమిత్థముగ నెఱుగలేరు జనులు

నీ నామము విడువని నిష్టగల వారుందురు
నీ నామ మెఱుగని నిర్భాగ్యులుందురు
నీ నామమహిమ నెఱిగి నిలచిన ధన్యులకు
నీ నిజధామమును నిశ్చయముగ పొందుదురు

నమ్మితే కలవని నమ్మకుంటే లేవని
నమ్మకముగ వాదించు నరులమధ్య నిలచి
యుమ్మలికము లెన్నెన్నో యోర్చుచు నిన్నే
నమ్ముకొన్న కలుగు పో నారాయణ మోక్షము


దేవుడ వని నిన్ను


దేవుడ వని నిన్ను తెలియ లేనైతి
జీవుడనగు నేను నా చిత్తమందున

భావించవచ్చునా పామరుడగు నాకు
భావనాతీతుడ పరమాత్ముడ
భూవలయమున నరులు పొందెడు తెలివిడి
నీ విధానము తెలియ నేర్పించు నంతదా

అవధారు శ్రీరామ యవనిజారమణ
దివిజారికులనాశ దీనబాంధవ
భవరోగగ్రస్థుడనై పడియున్న నాకు
చవిగానిదాయె నీ సచ్చరిత్రమక్కట

రామనామము నందు రక్తి నా నాలుక
కేమాత్రము లేక హీనుడనైతి
నేమయ్య యికనైన నిప్పించవయ్య నీ
నామదీక్ష కృపాళో నా కిప్పటికైన

అన్నులమిన్న సీత


అన్నులమిన్న సీత యమరగ సరసన
వెన్నెలలో రాముడు విహరించినాడు

మొన్నమొన్నటిదాక మొనసి యయోధ్యలో
నున్నవాడై హాయి నువిదను గూడి
నన్ని భోగంబుల నలవోక గైకొనుచు
యెన్నో పూదోటల వెన్నలల గొన్నాడు

ఇదిగో పినతల్లి కోర్కె యింతపని చేయగ
ముదమున నడివిలో ముదితను గూడి
సదమలహృదయుడై సౌమిత్రి రక్షలో
సదా వెన్నెలల భోగచతురుడై యున్నాడు

అన్నన్నా ఆ రావణాసురుని పుణ్యాన
వెన్నెలలే వేడైతే విలపించిన వాడు
కన్నెఱ్ఱజేసి వాని కడతేర్చి యిదిగిదిగో
పన్నుగ మబ్బువిడిన వెన్నెలఱేని వలె

విల్లెత్తి నిలచినాడు


విల్లెత్తి నిలచినాడు వీరాధివీరు డనగ
నల్లనయ్య ఇదె నయనానందముగ

కనుగొని తల్లులు కమలాయతాక్షుని
మునుకొని పొగడ ముదమున
తనరార తన దీర్ఘతరభాహువుల ఠీవి
ఇనకుల తిలకుడై యిదిగో రాముడు

పైకొని పదునాల్గువేలమంది రాగా
రాకాసు లందరిని రణమున
నేక ముహూర్తమున నిలనుండి వెడలించి
చీకాకు నడగించి చెన్నొంది రాముడు

సురలకునైన తేరిచూడరాని రావణుని
పరదారామోహ పతితుని
శరధారావర్షశమితతేజుని చేసి
పరిమార్చె ధర్మతత్పరుడైన రాముడు28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఎంచ బోతె కంతలే మంచ మంతట


ఎంచ బోతె కంతలే మంచ మంతట మా తప్పు
లెంచు నంత శ్రమయు నీ కెందుకు లేవయ్య

పెద్ద లెంత మంచిమంచి సుద్దులే చెప్పినా
వద్దని పెడదారులు పట్టు వారము
ముద్దుగా నేర్పించిన విద్దెల సారములు
మొద్దు బుఱ్ఱల కేమొ మోయరాని వాయె

చిలుకకు నేర్పినట్లు శ్రీరామనామము
తలిదండ్రులు నేర్పినా పలుకమాయె
గులకరాళ్ళు సొమ్ములను గురువుల పలుకులు
దులుపుకుపోయి నేడు దుఃఖించెద మాయె

తప్పుడు మాటలతో తప్పుడు చేతలతో
తప్పుడు దారులలో తడుబడు వారము
తప్పుడు బ్రతుకులని తలచి యెంతేడ్చినా
యిప్పుడేమి లాభము నీ వెటులో రక్షించుము

కలిగినవేవో కలిగినవి


కలిగిన వేవో కలిగినవి యవి హరికృప వలన కలిగినవి
కలుగని వానికి ఘనవిచారము కలుగక పోవుట మంచిది

ఇది హితము వీని కని యెంచి హరి ఇచ్చు నది
ముదమార గొనుటయే ముఖ్య మటుల కాక
ఇది వీని యున్నతికి హితవు గాదని హరి
మది నెంచి యీయనివి మరచిపోవలయును

అట బొమ్మల నడుగ నమ్మ చేతికి యిచ్చు కత్తి
పీట నడుగ నీకు పిలచి చేతి కీయదు
గాటముగ జీవునకు కలుగు నట్టి కోర్కుల
చేటు మేళ్ళెరిగి హరి చిత్తగించి తీర్చును

ఇల మీదను జీవుడు మెలగ వలయు విధమును
తెలియ జెప్ప లేదే  దేవుడే రాముడై
పలుమాట లేమిటికి భగవంతు డిచ్చునది
తలప మీ కెన్నటికి తగినదై యుండునది

27, సెప్టెంబర్ 2018, గురువారం

దయగల దేవుడా


దయగల దేవుడా దండప్రణామాలు
జయము నీకగు గాక సర్వేశ్వరా

దుష్ఠులు చెలరేగి దురితము మితిమీరి
శిష్టుల బ్రతుకులు చెడునపుడు
కష్టాలు సురలకు కలిగినచో ధర్మ
భ్రష్టుల నడచగ వచ్చు మహాత్మా

పుట్టించునది నీవు పోషించునది నీవు
తుట్టతుదకు నెట్టి దుర్మతిని
పట్టు విడువక మంచిపధ్ధతికి తెచ్చి
యెట్టన బ్రోచు గోవింద మహాత్మా

ఇనకులమున బుట్టి యిది ధర్మమని చెప్పి
మనుజుల కాదర్శమును చూపి
తనుబంధములు విప్పు తారకమంత్రము
ననువుగ మాకిచ్చి నట్టి మహాత్మా

కలలోన నీరూపు కనుగొని


కలలోన నీరూపు కనుగొని నెలదాటె
నలిగితివా యేమి ఆలసించేవు

వచ్చి నీవు నన్ను పరికించి చిరునవ్వు
ముచ్చటగా విసరి పోరాదా
హెచ్చిన భక్తితో నిచట నేనున్నానే
నిచ్చలు నీపైన పిచ్చితో నున్నానే

కరుణామృతవృష్టి కాస్తంత చిలికించి
మురిపించితే యేమి పోయేను
నిరుపమ భక్తితో నిలచి నేనున్నానే
తరళాక్ష కలనైన మరువ కున్నానే

ఇనకులతిలక నీ విపుడైన విచ్చేసి
కనికరించి ప్రోవగారాదా
వినవయ్య రామయ్య వేరెవరి నెన్ననే
దినములు లెక్కించు కొనుచు నున్నానే

చిత్తగించ వలెను మనవి


చిత్తగించ వలెను మనవి శ్రీరామ నే
నుత్త మాటల ప్రోవు నోహో శ్రీరామ

పట్టరాని కోపమొకటి పైన వేదాంత మొకటి
చెట్టలాడు బుధ్ధియొకటి యట్టులుండగ
మెట్టవేదాంతమును జెప్ప మేటినైతిని నా
యుట్టుట్టి మాటలకు ఫలిత ముట్టిదేకాదా

పలుకుపలుకు వినయనటన చిలుకుచుండును
విలువనిచ్చి పలికినటుల పెద్దలెంచగ
చిలుకపలుకుల నట్లు చాల చెప్పనేర్చితి నా
పలుకులాడితనము నాకే  ఫలిత మిచ్చేను

నేను భక్తుడ ననుచు తలచి నీకునై యిట్లు
పూని పలుకు కీర్తనలును లోన డొల్లలా
జ్ఞానహీనుడనయ్యు నేమో చాల చెప్పుదు
దానికే తప్పెంచకయ్య దశరధాత్మజా

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

తనవారి గొప్పలు తాను చెప్పును


తనవారి గొప్పలు తాను చెప్పును కాని
మునుకొని పొగడడు ముఖ్యుని గొప్ప

తనవారి ధనములు తనవారి మదములు
తనవారు చేసిన దానములు
తనకింత గొప్పని తరచుగ పొగడును
తనవాడు హరియని తలపడయా

తనవారి భోగాలు తనవారి త్యాగాలు
తనవారి కీర్తుల తళతళలు
తనకేమి యొరిగించు తానంత పొగడును
తనహరి యనురాగమును చెప్పడే

తనవారి గొప్పలు తనకేమి పరమిచ్చు
తనకెప్పుడు భవతారకుడగుచు
తనహృత్కుహరాన తనరారు రాముని
కొనియాడవలె నని కొంచెమెంచడే

కుప్పలుతిప్పలు తప్పులు

కుప్పలుతిప్పలు తప్పులాయెర కోదండరామ ఆ
తప్పులు చేయక తప్పనిదాయెర దశరథరామ

మాయను మునిగిన మానవమాత్రుడ మన్నింపుము రామ యీ
మాయను దాట నశక్తుడనయ్యా మన్నింపుము రామ
నీ యనుంగు సుతునిగ నన్నెం చి నేడైనను రామ నీ
చేయందించి కావవె నన్ను సీతాపతి రామ

ఈ సంసారము దాటజాలరా యీశ్వర శ్రీరామ ఈ
దోసం బిది నా జీవలక్షణము దుర్వార్యము రామ
దాసుని తప్పులు దండముతో సరి దయచూడుము రామ మా
యా సంసారవిమోహము నణచు మంగజగురు రామా

నీరేజాసనవినుత రామ నిరుపమగుణధామ
పారావారబంధన రామ పావనశుభనామ
కారుణ్యాలయ కామిఫలద కలుషాంతక రామ
దారుణసంసారార్ణవమగ్నుడ దరిజేర్చుము రామ

ఇతడే కాదా యేడుగడ

ఇతడే కాదా యేడుగడ సన్ని
హితుడగు సీతాపతి యెల్లెడల

తగిన యింటిని నీకు తానే చూపించేను
తగువిధి రక్షించు తల్లి గర్భమున
జగమున నీవుండదగు రీతి సూచించు
జగదీశుడు కడు చల్లని మనసుతో

తప్పుదారి ద్రొక్కు వేళ తా నంతరంగాన
నొప్పుగ నిలచి హిత ముపదేశించును
తిప్పలు పడువేళ దిక్కుతోచని వేళ
చప్పున తనచేయి చాచి రక్షించేను

తొల్లిటిచోటు చేర తొందరించగ మనసు
నల్లనయ్య నీవంక నడచివచ్చేను
చల్లగ రామతారక సన్మంత్రమే యిచ్చి
అల్లన స్వస్వరూప మందించేను

23, సెప్టెంబర్ 2018, ఆదివారం

అన్నిట నీకు సాటి


అన్నిట నీకు సాటి యనుచు మా సీతమ్మ
నెన్నిక సేయరే యింద్రాదులు ఋషులు

తల్లి గొప్ప దండ్రి దనగ తండ్రి గొప్ప తల్లిది
అల్లిదండ్రుల గొప్పదనము లవి
యెల్లరి బిడ్డల గొప్ప లేవేళ లోకమందు
చల్లని వారు మీరు తల్లిదండ్రులు మాకు

ఛాయేవానుగతా యని జనకుడాడిన మాట
మాయమ్మ సత్యముగ మలచినది
వేయేల నీవలె పితృవాక్యపాలనమున
మాయమ్మ సీతమ్మ మరినీకు సాటి రామ

మాయ గొని నీ వొక్క మనుజరూపము దాల్చ
మాయయే వచ్చె సీతామాతగను
మీ యిరువురి యందు మిక్కిలి భక్తులము
మాయందు దయగల మా పితరులు మీరు

22, సెప్టెంబర్ 2018, శనివారం

కర్మవిగ్రహుడ నేను


కర్మవిగ్రహుడ నేను కటకట పడుచుండ
ధర్మవిగ్రహుడ కొంత దయచూప రాదా

చేయగ రాని వెల్ల చేయుచు నమ్మకచెల్ల
హేయమైన తనువు లెత్తి యేడ్చుట లెల్ల
మాయచేత నైతే నది మణుగుట మరి కల్ల
చేయి నీ వందించి చేరదీయక

నీ నామ కీర్తనవేళ నిలువరించ కలి గాడు
లేనిపోని యాశల మది లీనమాయె చూడు
ఈ నరుని జన్మ మెల్ల నిట్లు చెడెను చూడు
నేనేమి చేసేది నీ దయరాక

రాముడా నీకన్న నిక రక్షకుడు లేడని
నీ మీదను భారమును నిలిపి యున్నానని
స్వామి నీవిది యంతయు చక్కగ నెఱుగుదువని
యేమేమో తలచితి నింత పరాకా


21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఎట్టి వాని నైన మాయ


ఎట్టి వాని నైన మాయ పట్టక మానేనా
పట్టినదా గర్వించిన తల కొట్టక మానేనా

గర్వింతురు కులము వలన గర్వింతురు బలము వలన
గర్వింతురు వయసున తనుకాంతి చేత ననగ
గర్వింతురు ధనము వలన గర్వింతురు ప్రభుత వలన
గర్వించె నివియె కాక కలిగి బ్రహ్మ వరము వాడు

చదివినట్టి చదువు లకట సమయజ్ఞుని చేయలేదు
కదిలి వచ్చి మాయ వాని కమ్మినట్టి వేళ
విదులు చెప్పు పలుకు లతని వీనుల చొరబారలేదు
మదమణచ రాముడు వచ్చి యెదుట నిలిచినట్టి వేళ

ఎట్టి వారి నైనను పడ గొట్టు నట్టి కాల మొకటి
తుట్టతుదకు వచ్చు ననుచు తోచక రేగి
యిట్టిట్టి వన రానట్టి చెట్టపనులు చేసిచేసి
కొట్టబడినాడు రాముని కోలలచే నిదె చూడరె


20, సెప్టెంబర్ 2018, గురువారం

దొంగెత్తు వేసి వాడు


దొంగెత్తు వేసి వాడు తొయ్యలి గొనిపోవ
వెంగలియాయె నని విబుధులు నవ్విరి

కోరికోరి మృత్యువును గొప్పగా చెఱబట్టి
పారిపోవుచున్నాడు పాపాత్ముడు
వీరుడనని నిత్యము విఱ్ఱవీగు వీనికిదె
తీరిపోయె నూకలని తెలిసె నేడనుచు

దశదిశలు గెలిచి చాల దర్పించియున్నాడు
దశముఖుడు నేడు కదా దొరకినాడు
దశరథుని కోడలిని తానిదే చెఱబట్టి
వశుడాయె సమవర్తి పాశమునకు నేడని

మాయచేసినా నని మదమత్తు డెంచేను
మాయలోన బడినాడని మన కెఱుక
ఈ యయోగ్యుని విష్ణు మాయపట్టిన దిదే
వేయేల నిక పీడ విరుగ డాయెనని


18, సెప్టెంబర్ 2018, మంగళవారం

నారాయణుండ వని నలువ


నారాయణుండ వని నలువ పలికి నంతట
శ్రీరాముని యోగమాయ శీఘ్రమే విడచినది

విడివడి నిజయోగమాయ వీరరాఘవున కపుడు
వడివడి ఘనశంఖచక్రపద్మశూలాదులును
నిడుదకరవాలముతో నిర్మలదరహాసముతో
నొడయు నెదుట నిలచి మ్రొక్కి నుడివె నాజ్ఞ యేమని

నీయాజ్ఞ మేరకే నీకు మానుషము గూర్చి
యీ యుధ్ధపర్యంతము నీయందే నిలచితిని
ఈ యిరువది కరముల వా డీల్గె నిక విడచితిని
పోయి వచ్చెదను నేను నీయాజ్ఞ యేమనె

నీసత్యము నీనామము నీశీలము నీచరితము
దాసజనపోషకమై ధరను సుస్థిర మగును
వాసవాదిసకలదేవవంద్యపాద రామ
నీ సోదరి యోగమాయ నిలచె నీయజ్ఞ కనె


16, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఈ నే ననుమాట నేనాడు విడతువో


ఈ నే ననుమాట నేనాడు విడతువో
ఆ నాడే ముక్తి కాని యందాక గలదె

నేనుంటి నిల నుంటి నే నొనరించిన
మానిత పుణ్యఫల మగు నీ జన్మ
నేను కర్మఫలభోగనిష్ఠుడ నైయుంటి
నా నిజభావమిది నానెంచే

యుగము లెన్నో కలవు యుగములన్నిట
జగమున నేనుంటి చక్కగా ననెడు
భగవంతుడిదె నన్నిటు  జేసె ననెడు
తగ నిది నానిజ తత్త్వం బనెడు

తన్ను దానెఱుగక నెన్ని యెఱిగిన గాని
చిన్నమెత్తు లాభమైన చేకూరేనా
పన్నుగ శ్రీరామపాదాబ్జముల బట్టి
తిన్నగా నజ్ఞాన తిమిరంబు వెడలి

ఏనాటికి నిన్ను గాక నెన్న నొకనిని


ఏనాటికి నిన్ను గాక నెన్న నొకనిని
నానాటికి పెరిగెడునది నా భక్తి కనుక

మానక నీ గుణనామమహి మానుకీర్తనమున
నేనెప్పుడు నుండనే నీ వెఱుగగ
జ్ఞానము నీ విచ్చినదై సర్వాత్మనా నేను
పూనికాడనై నిన్ను పొగడుచుండు టరిదియే

ఎన్నుకొంటి నేనాడో నిన్ను నా దేవునిగా
తిన్నగా నీయందే దృష్టి నిలిపితి
మన్నించు నీవుండ మరి యితరుల పనియేమి
నిన్ను నే నడుగున దేమున్న దొక్క ముక్తి కాక

నీవే సర్వస్వమని నిన్ను నమ్మి యుండు వారు
నీ వారై యుందురని నే నెఱుగుదును
నీవు భక్తపోషకుడవు నీవు జగద్రక్షకుడవు
నీ వాడ నైన నన్ను బ్రోవుము శ్రీరామచంద్ర

12, సెప్టెంబర్ 2018, బుధవారం

'కలలో నీలిమ కని' పాటకు వివరణ


ఈ కలలో నీలిమ కని అన్న మాటను గూర్చిన సమగ్ర వ్యాసం కలలో నీలిమ కని .... వేణువు విని! మనకు వేణువు బ్లాగులో లబిస్తున్నది.  తప్పక చదవండి. అన్నట్లు ఈ పాటను వ్రాసినది ఎస్.వి. భుజంగ రాయ శర్మ గారు.

ఈ పాట వినవలసిన పాటల్లో ఒకటి. దీని ఆడియో లింక్ ఆ వ్యాసంలో కూడా లభిస్తున్నది.

ఒకటపా డియర్ లార్డ్ కృష్ణా! నీ బర్త్ డే కి …. అనే దానిలో ఒక వ్యాఖ్య కనిపించింది.

Chiranjeevi Y
"చిన్నప్పుడు రేడియోలో నాకు బాగా నచ్చిన పాట అది. 2 సం.. క్రితం దాన్ని వెతికి పట్టుకోని దాచుకున్నాను. ఇప్పటికి కూడా నాకు దాన్లో ఒక్క ముక్కకి కూడా అర్ధం తెలియదు .

ఈ వ్యాఖ్యను చూసాకనే ఆ బ్లాగు తెరచి ఈ పాటను గమనించటమూ వినటమూ జరిగింది. ఇంంతవరకూ ఈ పాటను ఎన్నడూ విననే లేదు!

ఈపాట సాహిత్యాన్ని వేణువు బ్లాగునుండి తీసుకొని క్రింద చూపుతున్నాను. (గమనిక: పాటపాడేటప్పుడు అక్కడక్కడా పల్లవి వగైరాలు పునరావృత్తం అవుతాయి. ఇక్కడ సాహిత్యం మాత్ర్రమే వ్రాస్తున్నాను.)

కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

ఇంక చిరంజీవి గారు అన్నట్లుగా ఈ పాట అర్థం కాని వారి కోసం కొంచెం వ్యాఖ్యానించటం అవసరమే.

ఈ పాటలో  చెప్పుకోవలసిన విశేషం శ్రవణసుభగత్వం. అంటే చెవికి ఇంపుగా ఉండటం. ఈ లక్షణం ఎలా వస్తున్నదీ అంటే దానికి ఒక కారణం పల్లవిలో నీలిమ, చారిమ, రక్తిమ అనే ఒకే రకంగా ముగిసే పదాలూ అలాగే చరణాల్లో మువ్వలు, నవ్వులు, సవ్వడి, వేదన వేదన  వంటి ప్రాసపదాల వలన. ఐతే అంతకన్నా ముఖ్యకారణం ఈ పాటలో విస్తృతంగా కనిపించే ముక్తపదగ్రస్తాలంకారం వలన. అంటే ఒకపదాన్ని వెంటవెంటనే వాడటం అనే చమత్కార ప్రక్రియ వలన.

కలలో ఒక నీలిమ కని అని మొదలవుతుంది పాట. నిజానికి కలలో ఒక నీలిమ కని అని ఉంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. నీలిమ అంటే నలుపురంగు. కలలో ఒక నలుపురంగు కనబడింది అంటే అంత గొప్ప మాటగా అనిపించదు గబుక్కున. నీలిమ అంటే నల్లదనం అన్నది వాస్తవమే కాని ఇక్కడ సూచించేది ఏమిటంటే ఒక నల్లటి వస్తువు అని. వస్తువేమిటయ్యా వస్తువూ? కలలో ఒక నల్లపిల్లాడు కనిపించాడూ అని అర్థం తీసుకోవాలి. ఎవడి నీలివర్ణం ఒకవిశేషమో అతడు కనిపించాడూ అని చెప్పటమే నీలిమ కని అని చెప్పటంలో ఉద్దేశం. నీలాకాశం అటే మబ్బుపట్టిన ఆకాశం - అది చూడగానే కృష్ణుడు మనస్సుకు స్ఫురించటం అనేది ప్రసిధ్ధంగా అనేకానేక పాటల్లో కనిపిస్తూనే ఉంటుంది కదా.  ఐతే, ఈ పాటలో చెప్పిన విధం ఏమిటంటే కలలో ఒక నల్లని వాడు కనిపించాడు అని చెప్పి, మనల్ని అతడు కృష్ణుడే అని  గ్రహించమనటం జరుగుతోంది. ఏమిటయ్యా అందుకు ఋజువూ అంటే, కాస్త ఆగండి. మరికొంచెం అర్థవివేచన చేసాక పునరాలోచన చేస్తే అంతా స్పష్టం అవుతుంది కదా.

ఆ నీలిమలోకమల పత్ర చారిమ గని అని నీలిమను స్మరించటం వెంబడే చెబుతుందీ పాట. కమలపత్రం అంటే ఏమిటీ అన్నది మొదట తెలుసుకోవాలి. కమలం అంటే తామరపువ్వు, పత్రం అంటే ఆకు కాబట్టి కమలపత్రం అంటే తామరాకు అను చెప్పుకున్నామా కుదరనే కుదరదు అన్వయం. పత్రం అంటే పువురేకు కూడా. కమలపత్రం అంటే తామరపూవు రేకు.

అయోద్యాకాండలోని ఈ శ్లోకం చూడండి

స మామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః.
రామః కమలపత్రాక్ష: జీవన్నాశమితో గతః. (2.66.8)

అలాగే

రామః కమలపత్రాక్ష:,సర్వ సత్వమనోహరః!
రూప దాక్షిణ్య సంపన్నః,ప్రసూతే జనకాత్మజే!!

అలాగే

రామః కమలపత్రాక్ష. సర్వసత్వ మనోఠథః  అని హనుమంతుడు రాముని వర్ణిస్తాడు.

భగవద్గీతల్లో పదునొకండవ అధ్యాయంలో అర్జునుడు చెప్పిన శ్లోకం

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా
త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయమ్

ఇందులో అర్జునుడు కృష్ణుణ్ణి కమలపత్రాక్షుడని అంటాడు.

అందుచేత కమలపత్రచారిమ అన్న మాటలో, చారిమ అన్న సౌందర్యసూచకపదానికి అధారం ఐన కమలపత్రం ఏమిటీ అంటే అది ఒక తామరపూవు రేకుతో పోల్చబడిన సౌందర్యం అని గ్రహించాలి.

మనం చూసాం కదా, ప్రసిధ్ధంగా కమలపత్రాక్ష అని విష్ణువునీ ఆయన అవతారాలైన రామ, కృష్ణులనీ సంబోధిస్తున్నారని?

అందుచేత కమలపత్రచారిమ అంటూ తామరపూరేకువంటి ఒక ఆందం కనిపించిందంటూన్నారే అది ఆ నల్లని స్వరూపంలోని కన్నుల సౌందర్యమా? మరొకటా?

మరింత పరిశీలనగా చూదాం మరి.

కమలపత్రచారిమలో కనిపించినది సౌహృద మృదు రక్తిమ అట. ఏమిటండీ ఈ సౌహృద మృదు రక్తిమ అన్నది?

సౌహృదం అంటే సుహృద్భావం అనగా స్నేహం.  మృదు శబ్దం కూడా తెలిసినదే - మెత్తనిది అని అర్థంలో. ఇక రక్తిమ అంటే ఏమిటి? ఆ మాటకు మూలం రక్త శబ్దం! రక్తం ఎఱ్ఱగా ఉంటుంది కదా. అందుచేత రక్తిమ అంటే రక్తవర్ణం - ఇంగ్లీషు వాడు బ్లడ్ రెడ్ అంటాడే ఆ రంగు అన్నమాట. ఈ సౌహృద మృదు రక్తిమ అన్న పదగుంభనంలో అన్ని మాటలకూ విడిగా అర్థాలు చూసాం కదా. ఇప్పుడు సమాహారంగా ఈ సౌహృద మృదు రక్తిమ అంటే ఏమన్న మాటా?
 మొట్ట మొదట మధ్యలో ఉన్న మృదు శబ్దం రక్తిమ పైననా సౌహృదం పైననా అన్వయించేదీ అన్నది నిర్థారించుకోవాలి.  మెత్తని ఎఱుపు అన్నది అసందర్భం కాబట్టి చచ్చినట్లు ఆ మృదుశబ్దం కాస్తా సౌహృదం పైననే ప్రయత్నించాలి. మెత్తని స్నేహం అన్నదేదో కొంచెం బాగానే ఉన్నట్లుంది. కొందరి దృష్టిలో కొంచెం కవిత్వపుపైత్యం అనిపించినా సరే. ఎంతో అభిమానంతో కూడిన స్నేహం అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది మొత్తానికి. ఇప్పుడు ఆపైన రక్తిమ అన్నది ఎలారుద్దేదీ చూడాలి. అభిమానమో స్నేహమో దేనికైనాను ఎలా రంగుపులిమేదీ? అది ఎంత అందమైన ఎరుపు ఐతే మాత్రమున్నూ?

కొంచెం క్లిష్టమైన వ్యవహారంగా అనిపిస్తోంది కదూ? అక్షరాలా క్లిష్టమైన సంగతేను.

ముందు మనం రక్తిమకు ఎక్కడైనా మానవదేహంలో అన్వయం దొరుకుతుందేమో చూదాం.  అందంగా ఎఱ్ఱగా ఉన్నాయీ అని సాధారణంగా మన కవులు తెగ వర్ణించేవి ఏమిటబ్బా అంటే సులభంగానే పోల్చుకోవచ్చును.
అమ్మాయిలకైతే బింబాధరి అని ఒక పర్యాయపదం కూడా ఉంది చూడండి. ఇక్కడ బింబం అంటే దొండపండు. దొండపండు ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది కదా అని అమ్మాయిల పెదవులకు దానితో పోలిక అన్నమాట. ఇంకా చిగురుటాకుల్లాగా మృదువుగా ఎఱ్ఱగా ఉంటాయి అరచేతులూ అరికాళ్ళూ అని కూడా అమ్మాయిల పరంగా మనకి వర్ణనల్లో కనబడటం మామూలే.

ఎంతలేదన్నా విష్ణుమూర్తినీ - కృష్ణస్తు భగవాన్ స్వయమ్ - అని చెప్పటం ప్రసిధ్ధం కాబట్టి కలేసి కృష్ణుడినీ కూడా అమ్మాయిలకి చెప్పినట్లే అరవిందాక్షుడనీ గట్రా వర్ణించటం మామూలే. కావాలంటే చూడండి లీలాశుకుడు ఎలా బాలకృష్ణుణ్ణి వర్ణించాడో

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయం తం
వటస్య పత్రస్య పుటే శయానాం
బాలాం ముకుందం మనసా స్మరామి

ఇన్ని అరవిందాలున్నాయే ఈ శ్లోకంలో, అసలు అరవిందం అంటే ఏమిటో తెలుసునా? తామరపువ్వు. విశేషంగా ఎఱ్ఱతామర పువ్వు అన్న అర్థం ఉంది ముఖ్యంగా.

అమ్మయ్య. పట్టు దొరికింది కదా?

ఇప్పుడు సౌహృద మృదు రక్తిమలోని రక్తిమ అన్నది ఎఱ్ఱతామరలోని ఎఱుపున్నూ, ఆఎఱుపు రంగు ఉన్నది సౌహృదం చిందే మృదువైన పెదవులున్నూ అనుకుంటే అంతా చక్కగా అహ్లాదకరంగా అన్వయం సిధ్ధిస్తున్నది. అదీ సంగతి.

ఇప్పుడు పాట పల్లవిని ఒకసారి మరలా చూదాం.

కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని

కలలో ఒక నల్లని స్వరూపం (అంటే నల్లనయ్య రూపం అన్నమాట) కనిపించింది. అది ఆట్టే స్పష్టంగా లేదింకా. క్రమంగా అందులో ఒక కమలపత్ర చారిమ కనిపించింది పరిశీలనగా చూస్తేను. ఆ కమలపత్రచారిమ అంటే అందమైన తామరరేకులవంటి కన్నుల సొగసు అన్నమాట. ఆ కమలపత్రచారిమలో అంటే అందమైన తామరకన్నులున్న రూపంలో అన్నట్లుగా అన్వయం చెప్పుకోవాలి - అందులో ఒక సౌహృద మృదు రక్తిమ కనిపించిందట. అంటే స్నేహపూర్వకమైన (చిరునవ్వుకల) మృదువైన అందమైన ఎఱ్ఱని పెదవులు కనిపించాయట. అంటే నల్లనయ్య స్వరూపం స్థూలంగానూ క్రమశః అందులో ఆయన అందమైన కన్నులూ పెదవులూ కనిపించాయంటున్నారు. ఇక్కడ అందచందాల ప్రసక్తి ఎందుకూ అంటే చూడండి కళ్ళు మనపట్ల ప్రసన్నంగా ఉంటేనే కదా అవి అందంగా కనిపించేదీ? అలాగే చిరునవ్వులు చిందే పెదవులే కదా అందంగా కనిపించేదీ? ఇక్కడ అంతర్లీనభావం ఏమిటంటే ఆ నల్లనయ్య మోము ఎంతో ప్రసన్నంగా ఉన్నదీ అని చెప్పటం.

ఇక్కడ మరొక రెండు మాటలు చెప్పుకోవలసి ఉంది. కమలపత్రచారిమ అన్నప్పుడు ఆ కమలపుటాలుగా కనిపించినవి పాదాలో అరచేతులో లేదా  ముఖమో అనుకోవచ్చును కదా అన్నది ఎందుకు పరిశీలించలేదూ అని ఎవరైనా అనవచ్చును.  సౌహృద అనే పదం కూడా అన్వయం కావలసి ఉన్నది కాబట్టి కేవలం కన్నులను మాత్రమే తీసుకొనటం జరిగింది కమలపత్రచారిమ కొరకు అని సమాధానం. కమలపు రేకులతో పోల్చటానికి కన్నులకున్న సౌలభ్యం ఇక్కడ మరింత బాగున్నది కాబట్టి అనీ మనం గ్రహించాలి.

ఈ స్వప్నదృశ్యానికి మనస్సు ఎలా స్పందించిందీ అంటే

అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే  మనసు - ఎంత వెఱ్ఱిదే

అగరుదూపం అంటే అగరు వత్తి పొగ. అదిసన్నగా ఒక తీగలాగా గాలిలో పైకి కొంచెం మెలికలు తిరుగుతూ వెళ్ళటం అందరికీ అనుభూతం ఐన విషయమే కదా. లత అన్నా లతిక అన్నా ఒక తీగ అని అర్థం.  క అనేప్రత్యయం అల్పార్థాన్ని సూచిస్తున్నది కాబట్టి లతిక అంటే సన్నని తీగ అని తీసుకోవాలి. నిజమే కదా అగరువత్తి పొగ ఒక సన్నని తీగలాగా గాలిలో తేలుతూ పైకి ప్రాకుతూ పోతూ ఉంటుందీ.

ఇక్కడ అలాంటి తీగలాగా ఎగసిపోతున్నదట మనసు. ఎగసిపోవటం అంటే పైపైకి ఎగిరిపోవటం అన్నమాట. ఈ మనసు అలా ఎందుకయ్యిందీ అంటే అవశమవటం కారణం. అవశత్వం అంటే తనపై తనకు అదుపుతప్పిపోవటం - అనగా - మైమరచిపోవటం అన్నమాట. బాగుంది కదా?

మరి అలా మైమరచిపోవటం ఎటువంటిదీ అంటే అగరువత్తి ధూమపు పొగకు తనపై తనకు అదుపులేక ఎగిరిపోతూ ఉంటుందో అలాగన్నమాట. బాగుంది బాగుంది.

మరి ఆమనస్సును పట్టుకొని వెఱ్ఱిది అనటం ఎందుకూ అన్న ప్రశ్న వస్తుంది.  మరి వెఱ్ఱి అంటేనే తనపై తనకు అదుపు లేకపోవటమే కదటండీ. ఎంత పిచ్చిపట్టినట్లుగా అయ్యిందీ  అని చెప్పటం బాగున్నది కదా సార్థకంగానూ.

ఇలా అవశత్వం పొందటానికి ఆకలలో మరొక కారణం కూడా పాటలో తరువాత వచ్చే చరణాలు తెలుపుతున్నాయి.

మొదటి చరణం.

కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని

అన్నది.

కలల్లో దృశ్యమే కాదు శ్రవణం కూడా అందరికీ అనుభవమేను. ఇక్కడ ఆ శ్రవణానందమూ అనుభవం లోనికి వచ్చిందట. కలలో మువ్వల సవ్వడి వినిపించిందట. ఆ మువ్వల సవ్వడితో పాటే సిరిసిరి నవ్వులూ వినిపించాయట. ఆ నవ్వుల వెనుక ఒక మూగవలపు కూడా ధ్వనించిందట. ఇదంతా చాలా వరకూ సులభంగా అనిపిస్తోంది అర్థంచేసుకుందుకు. కాని మూగ వలపు అని ఎందుకన్నారూ?

అన్నట్లు సిరిసిరి నవ్వులూ అన్నారేమీ చిరుచిరు నవ్వులూ అనకుండా అన్న సందేహం వస్తుంది. సిరి అంటే శోభ అన్న అర్థం తీసుకొంటే ఎంతో శోభాయమానంగా ఉన్న నవ్వులు అని చెప్పుకోవచ్చును. నవ్వు శోభాయమానంగా ఉండటం అంటే ఆ నవ్వులే ఎంతో అందంగా ఉన్నాయని చెప్పట అన్నమాట.

మూగవలపు అంటే ఒకరి మనోభావాలని మరొకరితో ప్ర్రేయసీ ప్రియులు పంచుకోలేనిస్థితి. భాషతో వ్యక్తంచేసుకోలేని పరిస్థితి. దీనికి లోకవ్యవహారంగా ఐతే ఇతరుల వలన అడ్డంకులు. మరి ఇక్కడ? భాష చాలక అని అర్థం. ఏవిధంగానూ జీవుడు ఎంతప్రయత్నించినా భగవంతుడి పట్ల  తనప్రేమని పూర్ణంగా  భాషసహాయంతో వ్యక్తం చేయలేడు. భగవంతుడు వ్యక్తం చేయలేడు అనలేము కాము జీవుడు అందుకోలేడు కదా అని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ మూగవేదన అనటం. పై చరణం కూడా వ్యాఖ్యానించుకుందాం. అప్పుడు మరింత స్పష్టత వస్తుంది.

రెండవ చరణం చూదాం.

కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని


అలా శ్రవణం చేసినది ఒక వేణువు రవళి కూడా

ఆ వేణుగానంలో ధ్వనించినది ఒక మధురమైన విరహ వేదన అట.

ఆ విరయవేదన అన్నది ప్రణయతత్త్వాన్ని సూచిస్తున్నది అంటున్నారు.

అసలు విరహం అంటే ఎడబాటు. సాధారణంగా ప్రేయసీప్రియుల మధ్య కలిగిని ఎడబాటుగా చెప్పుతూ ఉంటాం. తల్లీబిడ్డలమధ్యనో అన్నాచెల్లెళ్ళ మధ్యనో కలిగిన ఎడబాటును విరహం అని చెప్పరు. అది సంప్రదాయం కాదు.

ఇక్కడ ప్రియుడు మురళీగానవినోదుడు. అంటే కృష్ణుడు.

మరి ఆ ప్రేయసి ఎవరూ అంటే జీవుడు.

భగవంతుడు ఒక్కడే పురుషుడు అని మీరా అన్నమాట ప్రసిధ్ధం. ఒకసారి ఆవిడ ఒక స్వాములవారిని చూడటానికి వెడితే ఆయన శిష్యులు అడ్డుపడి తమ గురువుగారు స్త్రీలను చూడరూ అని సెలవిచ్చారట. అప్పుడు అన్నదట మీరాబాయి. ఓహో పరమాత్ముడొక్కడే పురుషుడు అనుకుంటున్నాను ఇప్పటిదాకా.  ఇప్పుడు మీగురువుగారు అనే మరొక పురుషుడు బయలుదేరాడా అని. స్వాములవారి శిష్యులూ ఆ స్వాముల వారూ కూడా సిగ్గుపడ్డారట అని వేరే చెప్పనవరం లేదు కదా.

పరాభక్తిని గురించి 'సాతు అస్మిన్ పరమ ప్రేమరూపా' అని నారదులవారు సూత్రీకరించారు. ప్రేయసికి ప్రియునితో ఐక్యం కావటమే పరమార్థం ఐనట్లుగా జీవులు అనే స్త్రీలు భగవంతుడు అనే పురుషుడితో కలయికకు మరమప్రేమతో తపించటమే భక్తి అని దాని అర్థం.

ఈ భగవంతుడేమో దూరంగా ఉన్నాడనుకోండి. జీవుడికి విరహవేదన. అదే భక్తి. శివానందలహరిలో ఈ భక్తి అనేదానిని గురించి శంకరభగవత్పాదులు చెప్పిన శ్లోకం చూడండి

అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా
స్వాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభమ్
ప్రాప్నో తీహ యథా తథా పశుపతేః పదారవింద ద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే

ఈశ్లోకానికి ఇప్పుడు మనం వ్యాఖ్య చెప్పుకోవాలంటే చాలా గ్రంథం అవుతుంది కాని, ఇక్కడ అందులోని ఒక ఉపమానాన్ని మాత్రం చూద్దాం. అది 'స్వాధ్వీ నైజవిభుం' అన్నది.  పతివ్రత ఐన స్త్రీమూర్తి ఎలా తన భర్తను సర్వకాలసర్వావస్థల్లోనూ ఆశ్రయించి ఉంటుందో అలా ఉండటమే జీవుడు భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉండటమే భక్తి అని అంటారు అని ఈశ్లోకం నిర్వచనం చెబుతోంది.

ఇప్పుడు పాటదగ్గరకు వద్దాం. చరణంలో ' వేణువులో విరహ మధుర వేదన విని'  అన్నారు కదా.

ఇక్కడ  న్యాయంగా చదువరికి ఒక సందేహం కలగాలి.  విరహం అనేది ప్రేయసికి ప్రియుడు పట్ల కలిగేది కదా అని. కాదండీ పొరబడకండి. విరహం అన్నది ప్రేయసికీ ప్రియుడికీ కూడా సమానావస్థయే. కాకపోతే అది రసాభాసం అవుతుంది. ఇంగ్లీషువాడంటాడే వన్ సైడ్ లవ్ అనగా ఏకపక్షప్రేమ అనీ అలాగు అన్నమాట.

మనం సాధారణంగా జీవుడు భగవంతుడికోసం తపనపడటం గురించే ఎక్కువగా చదువుతూ ఉంటాము. అలాగే ఆ ప్రభావంతో ఆలోచిస్తూ ఉంటాము.

ఈ పాటలో అమురళీ రవంలో విరహం ధ్వనిస్తోందని చెప్పటం ద్వారా భగవంతుడు కూడా విరహంతో ఉన్నాడని చెప్పటం కనిపిస్తోంది కదా. అది గొప్పగా ఉంది.

అవునండి. అయనకూడా ఈజీవుడు ఎప్పుడు తనను చేరుకుంటాడా అని ఎదురుచూస్తూ ఉంటాడట. జీవుడు తనవైపుకు ఒక అడుగు వేస్తే అయన ఆత్రంగా ఆ జీవుడివైపుకు పది అడుగులు వేస్తాడని చెబుతారు.

సర్వశక్తిమంతుడు కదా ఆయన జీవుణ్ణి కొంచెం జబర్ధస్తీగా తనవైపుకు నడిపించుకొన వచ్చును కదా అన్న మాట వస్తుంది సహజంగా. కాని అలా కాదు. ఆయన అలా చేయడు. అది ఆయన నియమం. ఆయన చేసిన సృష్టికి ఆయన పెటిన ఒక నియమం. జీవుడికి కర్మస్వాతంత్ర్యం ఉంది. అది ఆ ప్రభువు ఇచ్చినదే. అందుచేత అ జీవుడే తనవద్దకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు. అదే, ఆ ఎదురుచూపే విరహం. భగవంతుడికి భక్తుడికోసం కలిగిన విరహం అన్నమాట,

పాటలో విరహ మధుర వేదన అని ఎందుకన్నారూ అంటే విరహవేదన ఎంత దుస్సహంగా అనిపిస్తుందో అది అంత మధురంగానూ ఉంటుంది అంటారు కాబట్టి.  ఎందుకంటే ఆవలి వ్యక్తి గురించిని ఆలోచనా పరంపరతో ఇతరప్రపంచాన్ని మరచి ఆ వ్యక్తి సాన్నిధ్యాన్ని మనసా అనుభవిస్తూ ఉండటం చేత. అందుకే కదా ప్రసిధ్ధమైన సినిమా పాటలో 'విరహపు చింతన మధురము కాదా' అని అంటాడు కవి.

వేణు గానం మధురంగా ఉంటుంది. అది మరింత మధురంగా ఉందట - విరహమాధుర్యాన్ని సంతరించుకోవటం వలన.

ఈ విరహ మధుర వేదనలో ఒక ప్రణయ తత్త్వ వేదం వినిపిస్తోందని పాట అంటోంది.

ఇక్కడ జీవుడికీ దేవుడికీ మధ్యన ఉన్న ఉత్తమోత్తమమైన ప్రణయం అన్నదే కదా విరహం అనే స్థాయీ భావానికి కారణం? అందుచేతనే అలా చెప్పటం జరిగింది. ఇది చాలా బాగుంది.

మరి దాన్ని వేదం అని ఎందుకన్నారూ అని సందేహం రావాలి.

విద్ అన్న ధాతువుకు తెలుసుకోవటం అన్నది అర్థం కాబట్టి వేదం అంటే జ్ఞానం అన్న అర్థం సిద్ధిస్తోంది.

ఈ భగవంతుడికీ జీవుడికీ మధ్యన ఉన్న ప్రణయభావనయే జ్ఞానం! ప్రేయసీ ప్రియులు తాము ఒకటే అనుకుంటారు. అలా అని తెలుసుకోవటమే వారి ప్రణయానికి పరమార్థం. అలా జీవుడు దేవుడితో ఒకటి కావటమే ఆ ప్రణయానికి పరమార్థం కదా. అలా తెలుసుకోవటమే అంతిమమైన జ్ఞానం. దానికి మించిన జ్ఞానం లేదు.

మరి ఆ దివ్యప్రణయాన్ని తత్త్వం అని ఎందుకంటున్నారూ అని ఆలోచించాలి.

తత్త్వం అన్న మాట తత్ + త్వం అన్న మాటల కూడిన అంటే అది నీవే అని అర్థం.  ఆ భగవత్త్వత్త్వం - జీవుడూ ఒకటే. రెండుగా మాయచేత అనిపించటమే కాని ఆ దేవుడూ జీవుడూ ఒక్కరే. అదే ఆ ప్రణయతత్త్వం.

ఇదీ ఈ పాట వెనుక ఉన్న తాత్తికమైన వివేచన.

ఏదో నా చేతనైనంతగా పాటకు వివరణ ప్రయత్నించాను. ఎంత వరకూ నప్పుతున్నదీ చదువరులే చెప్పాలి.

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

త్రిజగన్మోహన రూపుని


త్రిజగన్మోహనరూపుని రాముని ఋషివరులే వలచేరే
త్రిజగద్వంద్యచరిత్రుని రాముని దేవతలే కొలిచేరే

కుజనులు రాక్షసమూకలు రాముని కోదండముగని పారేరే
సుజనజనావను సీతారాముని శూరులు మిక్కిలి పొగడేరే
ప్రజలందరును సమ్మోదముతో ప్రభువుచరితము పాడేరే
విజయరాముని వీరగాథను వీనులవిందుగ పాడేరే

రాముని చరితము నిత్యము కవులు వ్రాయుచు మిక్కిలి మురిసేరే
రాముని కథలే గాయక శ్రేష్ఠులు రక్తిగొలుపగ పాడేరే
రాముని గాథలు బిడ్డ లందరకు రమణులు నిత్యము చెప్పేరే
రాముని మూర్తిని మనసున నిలిపి పామరులైన తరించేరే

రాముని సద్గుణధాముని రవికుల సోముని భాగవతోత్తములు
ప్రేమమీఱగ నాడుచు పాడుచు వివిధగతుల సేవించెదరు
భూమిని రాముని మించిన రాజును పుత్రుని మిత్రుని సోదరుని
ప్రేమమయుండగు భర్తను వీరుని వేరొక్కరిని కనలేము


అలసట కలిగినది


అలసట కలిగినది యలసట కలిగినది
అలసట హరివలన కలిగిన దొక్కనికి

అలసట కలిగెను హరిస్మరణముచే
నలసట యెవరికి కలిగెనయా
అలసట కలిగెను హరిభజనముచే
నలసట యెవరికి కలిగెనయా

అలసట కలిగెను హరిసేవలతో
నలసట యెవరికి కలిగెనయా
అలసట కలిగెను హరిపూజనమున
నలసట యెవరికి కలిగెనయా

కలియన నొక్కడు కలడయ్యా యీ
యలసట వానికి కలిగెనయా
యలసిన దుష్టుడు నిలువక నాలో
విలవిల లాడుచు వెడలెనయా


ఇంత మంచివాడ వని


ఇంత మంచివాడ వని యెఱుగక పోతినే
ఎంత వెఱ్ఱినైతినే నెన్నెన్ని యుగములుగ

కామక్రోధవశుడనై కానిపనులు చేయుచునే
శ్రీమంతుడనగుటకై చింతించు నేను
రామరామ యనుచుంటిని రవ్వంత నగుచు నీ
తామసుని మన్నింతువు దయతోడ రామా

పామరులని యితరులను పడ దిట్టుచు తిరుగుచునే
నా మూఢతనే దాచుకొందును నేను
రామ రామ యనుటలో రక్తినటించుదు నీ
తామసుని మన్నింతువు దయతోడ రామా

ఇంత మంచి తండ్రివి నిన్నెంత మోసగించితి
నింతటితో నటనలు చాలించెద గాక
చింతించుచుంటి నేను చేసిన పనులకు నీ
వెంతో దయచూపి మన్నింతువు రామా


ఇది రాత్రియైతే నేమి

ఇది రాత్రియైతే నేమి యిది పవలైతే నేమి
మది నిండి రాముడున్న మాకంతా వెలుగే

మాకంతా వెలుగే ఈ లోక మంతా వెలుగే

లోకము చీకటి లోన జిక్కి విశ్రాంతి
గైకొని నిదురించు కాలమనంగ
శ్రీకరుడగు హరి చింతనమునకు
మాకన ధ్యాననిమగ్నులమగు వేళ

నరులు మేలుకాంచి నానాదిశలకు
పరువులెత్తి ధనముపార్జించు వేళ
హరిస్మరణముతో నఖిలకృత్యములు
జరుపుచుందుము మేము హరిసేవలుగ

వెలుగుల కెల్ల పెద్దవెలుగైన శ్రీహరి
నిలచి  హృత్సీమల వెలుగులు నింప
వెలుగులె కాని చీకటులు మాకు లేవు
వెలుగుచీకటులు పామరులకే కలవు


10, సెప్టెంబర్ 2018, సోమవారం

ఆశ లన్నియును తీరుటన్న దొకటి జరుగునా


ఆశ లన్నియును  తీరుటన్న దొకటి జరుగునా
దాశరథ దయయున్న తప్పక జరుగును

కుదురులేని యీమనఫే అదుపునకు వచ్చునా
సదయుడగు శ్రీరాముడె కుదుటపరచు దానిని
మదిలో నేమరక రామమంత్రమునే చేయుదునా
అదియును శ్రీరాముని దయ యమరినచో జరుగదా

ఎన్నడైన నీషణత్రయ మన్నది శమియించునా
పన్నుగ శ్రీవిభునిదయ వచ్చిన శమియించదా
కన్నులతో శ్రీరాముని కనుగొనుట జరుగునా
నిన్ను శ్రీరాముడే మన్నించిన జరుగదా

చిందులే వేయు యహము చితుకుటయే జరుగునా
తొందరలో రామకృపయె తూలించును దానిని
అందరాని మోక్షమే యందుకొనుట జరుగునా
అందించును శ్రీరాముడె  యందుకు సందేహమా


బుధ్ధి శ్రీహరివైపు

బుధ్ధి శ్రీహరివైపు పోవదే మయ్యయ్యో
యుద్ధమే చేసి దీని నొంచ వలయును

రామరామ యనుమంటే రాలుగాయి బుద్ధి
కామునే తలచు నెంత కాదన్నను
కోమలముగ చెప్పనే కూడదండి దీనికి
తామస మడగించు శిక్ష తలచ వలయును

చెవియొగ్గు లోకులాడు చీదర మాటలకు
శ్రవణము చేయదు శ్రీహరి కీర్తి
అవినయ బుధ్ధి హరియందు నిలుచుదాక
చెవులు మెలిపెట్టి గట్టి శిక్ష వేయ వలయును

హరికీర్తనాసక్తియే యలవడు నందాకను
హరిగాథలందు రుచి యబ్బుదాక
హరిసేవలకే యిది యంకిత మగుదాక
మరలమరల దండించి మరలించ వలయును

హరిసంకల్పమే హరిసంకల్పమే


హరిసంకల్పమే హరిసంకల్పమే
ధరమీద సర్వమును హరిసంకల్పమే


ధరాతలమున చరాచరకోటి యనగ
పరాత్పరుడు భగవంతుడు శ్రీహరి
నిరంజనుడు చేసిన నిర్మాణమే
సరిసరి ఈ సృష్టి హరి సంకల్పమే

హరిసంక ల్పమనగ నమరుజీవులను
నరుల నీజీవి విన్నాణముతో
ధర మీదను పొడముట తాను హరినే
సరగున పొగడుట హరి సంకల్పమే

జరిగిన దంతా హరిసంకల్పమే
జరుగుచున్నది హరిసంకల్పమే
జరుగబోవునది హరిసంకల్పమే
సరిసరి సర్వము హరిసంకల్పమే


9, సెప్టెంబర్ 2018, ఆదివారం

సుఖము సుఖమని సుజనులు


సుఖము సుఖమని సుజనులు పలికే
సుఖమును గూర్చి సుంత తెలియుడీ

హరిభావనలో నమరును సుఖము
హరిస్మరణములో నమరును సుఖము
హరికీర్తన మం దమరును సుఖము
హరిధ్యానములో నమరును సుఖము

హరి సన్నిథిలో నమరును సుఖము
హరిసేవనమం దమరును సుఖము
హరిపరజీవన మం దగు సుఖము
హరిభక్తుల కడ నమరును సుఖము

హరిభక్తునిదే అసలగు సుఖము
హరిని రాముడని ఆత్మను దెలసి
పరమానందము నందుట సుఖము
హరిని కలయుటే అసలగు సుఖము

8, సెప్టెంబర్ 2018, శనివారం

ఏవారి తప్పులెన్న నెంతవాడనో


ఏవారి తప్పులెన్న నేమిటి కయ్య
యీవల తన తప్పులే యింతింతలాయె

మనతప్పు లెన్నువారు మహి నెందరున్న
మన తప్పు లేక మనకేల భయము
మునుకొని తప్పులెన్నుమనుజులతో వాదాల
మునుగుటే పెద్దతప్పు ముమ్మాటికిని

పనిగొని వృధాలాప పరులతో తలపడి
అనరాని మాటలు వారన్న కినిసి
మనసు కష్టపెట్టుకొనుట మతిలేని తనమని
తనకు తోచకుండుతే తప్పుముమ్మాటికి

తేపతేప కిటులేల తిట్టులు దిని యూరక
నాపసోపములు పడు నన్యాయము
కాపురుషుల జోలి యేల కాకుత్స్థుఁడు రాముని
శ్రీపదములు మరచి చీచీ యిది తన తప్పే


7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

హరవిరించ్యాదులైన హరిమాయకు


హరవిరించ్యాదులైన హరిమాయకు లోబడుదురు
పరమసత్య మిది యని భాగవతులు పల్కుదురు

మోహినియై మురారి ముష్కరుల దానవుల
మోహితుల జేసి సుధను మొత్తమా సురల కీయ
శ్రీహరి స్త్రీరూపు గన శివుడు కడు ముచ్చటపడి
మోహితుడై తానె జగన్మోహినిని వెంటాడెను

గోపబాలకుడు జేయు గొప్పపనుల తిలకించి
పాపమా బ్రహ్మ హరిని పరీక్షింపగ నెంచి
గోపగోవత్సములై గోవిందుడు తనరారగ
నే పాటివాడ నని యెఱిగి హరిని శరణుగోరె

అరయ నట్టిమాయకే యాజ్ఞజేసి తననంట
హరిమాయామానుష మైన రూపము దాల్చి
తరలివచ్చె భువిపైకి దాశరథి యగుచు నొప్పె
నరులార మీ రెల్లరు నారాయణు గొలువరే


6, సెప్టెంబర్ 2018, గురువారం

చక్కని వాడే అంతు చిక్కని వాడేచక్కని వాడే అంతు చిక్కని వాడే
పెక్కువిధముల వాడు వీడే వీడే

సుదతి నెత్తుకపోయు శూరుడై పోరిన
పదితలల వాని పని పట్టినది వాడె
సుదతి వైదర్భి గోరి కదనంబున బారిన
వదరుబోతు వాని పని పట్టినది వాడె

ఇనసుతుడును రవిసుతుడు నెదురెదురై పోరగ
తననేర్పున రవిసుతుని ధరగూల్చిన దితడె
ఇనసుతుడును రవిసుతుడు నెదురెదురై పోరగ
తననేర్పున నినసుతుని ధరగూల్చిన దితడె

ఒక్కతియే చాలునని యూరకున్నది వీడె
పెక్కురైన నేమనుచు పెంపుగొన్నది వీడె
మక్కువతో నా నుతులు మరిగిన గోవిందుడె
చక్కనయ్య ముచ్చట లెటు సాగినను మేలె

రాముడా పదితలల రావణుని చంపిన


రాముడా పదితలల రావణుని చంపిన
నేమాయె నీనా డీ యిల నిండ రాకాసులె

జీవితము నందొక్క చిన్నసత్యము కూడ
నే వేళ పలుకని హీను లైనను నీవు
లేవు లేవని మాట లావంక బలుకుచు
నీ వంక నీతప్పు లెన్ను చున్నారు

ఏరీతి ద్రుంచెదో యీ రావణాసురుల
నేరీతి కాచెదొ యీభూమి పుత్రికల
కారుణ్యమూర్తివని కడు వింటిని నీదు
క్రూరనారాచాల గొబ్బున విడువవే

ఈ వేదనిందకుల కెంత ప్రల్లదనము
రావణునే పొగడెడు  రాలుగాయి తనము
దైవమా నా మాట దయచేసి వినుము
వేవేగ ధర్మధ్యుతి నీ వసుధ నింపుము

5, సెప్టెంబర్ 2018, బుధవారం

మాయను బడకే మనసా


మాయను బడకే మనసా రాముని
హాయిగ తలచవె మనసా

చేయందించి చేదుకొనునది సీతారాముడె కనుక
వేయివిధముల వివిధదైవముల వేడిన ఫలితము కలదా
మాయగురువుల బోధల సారము మంచిదికాదే మనసా
నీ యానందము రాముని సన్నిధి నిలచుటలోనే మనసా

నీ కడ నున్నవి నీవిచ్చటనే నిజముగ విడుతువు కనుక
సేకరించుచును చిళ్ళపెంకులను చింతలబడకే మనసా
ఈ కొంచెపు సుఖభోగంబులకన నెట్టిది ఫలమే మనసా
నీ కెప్పుడు నీ రాముని సన్నిధి నిలచుట సుఖమే మనసా

ఆదిదేవుడగు నారాయణుడే ఆ పరదైవము కనుక
వేదవేద్యుడగు వానిని నీవు వేడుట మంచిది మనసా
శ్రీదయితుడు నిను చేరగ బిలిచే సీతారాముడు మనసా
నేదే భాగ్యము చిత్తమలరగ సేవించవె ఓ మనసా


నోరార బలుకుడీ శ్రీరామనామం


నోరార బలుకుడీ శ్రీరామనామం
వీరువారనక బ్రోచు శ్రీరామనామం

పోరాడలేక నలసిపోయినట్టి జీవులను
చేరదీసి రక్షించును శ్రీరామనామం
వారివారి కెల్ల కర్మబంధంబుల నూడదీసి
కారుణ్యము చూపునది శ్రీరామనామం

వేదవిదూరులగుచు వేరుదారి ద్రొక్కిరని
చీదరించు కొనదండి శ్రీరామనామం
చీదర కలి చేతిలోన చిక్కరని జాలిగొని
చేదుకొని లాలించును శ్రీరామనామం

నారాయణుని వేయి నామంబు లందున
జోరైన మహిమగల శ్రీరామనామం
పారాయణము జేయు వారికి ముక్తినిచ్చి
తీరుదునని పలుకునీ శ్రీరామనామం


కల్లదైవముల వేడి


కల్లదైవముల వేడి కడగండ్లు పడుదురే
యెల్లరు శ్రీరామచంద్రు నేల వేడకుందురో

కర్మబంధముల చేత కానిబుధ్ధులే కలిగి
ధర్మావతారుడైన దాశరధిని తలపరో
నిర్మలాత్ములకు హరినిష్ఠ కలుగునే గాని
దుర్మతులకు శ్రీహరి తోచకుండు నేమో

అల్పులు గురువులై అందరకు బోధించు
అల్పభాగ్యప్రదులైన ఆయా వేల్పుల నకట
నిల్పి మదిలోన చెడుట నిశ్చయమగు చుండ
పొల్పుగ హరిభక్ర్తి వీరి బుధ్ధికే రాదేమో

కలిమాయ యిట్టిదని తెలియగా వలయునో
యిలమీద నెల్ల జీవుల కిది నిశ్చయ మేమో
తెలియ నెంత వాడను తెలివిడి యది హరియే
కలిగించిననే కద మొలకలెత్తు జీవులలో


బాలరాముని చేత బంగారువిల్లు


బాలరాముని చేత బంగారువిల్లు
లీలగా నిలిపినది లోలాక్షి కైక

నిజమైన విలుబూని నీవొక్క నాటికి
ప్రజలను రక్షించు ప్రభుడ వగుదు వోయి
ఋజువుగా నీకీర్తిధ్వజము నింగినంటు
విజయరాముడవని పేరుగొందు వనుచు

వరధనుర్ధరుడవై వర్థిల్లగలవు నీవు
సురవైరులను గెల్చి శోభిల్లగలవు నీవు
ధరాధరంబులును సాగరము లుండు వరకు
నరులనాలుకలపై నాట్యమాడు నీ పేరని

ఏరీ నీ సాటివా రిల నెన్నడు కలుగరని
శూరులు హరిహరులే చూడ నీకు సాటి యని
వీరనారి కైక దీవించినది రాముని
భూరివింటి వీరు నదే ముద్దాడి మురిసినది


నరజన్మ మెత్తి కూడ


నరజన్మ మెత్తి కూడ హరి హరి హరి యనడా
నరుడా మరి వాడు నడచు మొద్దు కాక

గోవింద నారాయణ గోపీజనవల్లాభా
భావనాతీతదివ్యప్రభావకృష్ణ
దేవదేవ వేదవేద్య దీనబాంధవా యని
యేవేళను పలుకలేని దెంత చెడ్డబ్రతుకు

మామకాభీష్టప్రద మాయామానుషవేష
రామచంద్ర రావణాది రాక్షసాంతక
భూమిసుతాప్రాణనాథ పుండరీకాక్ష యని
ప్రేమమీర పిలువడా భూమి కెంత బరువు

హరే రామ హరే కృష్ణ హరే నృహరి కేశవ
హరే భక్తజనప్రియ హరే మాధవ
మురారీ మాధవా ముకుందా బ్రోవుమని
పరాత్పరుని వేడడా వాని దేమి బ్రతుకు


చీకటిగుహ లోన నేను


చీకటిగుహ లోన నేను చిన్నబోయి యున్న వేళ
నాకొర కొక వెలుగురేఖ నడచి వచ్చెను

అజ్ఞానపు చీకటుల అంతుచూచెను
విజ్ఞానప్రభలకప్పి వెన్నుదట్టెను
ప్రజ్ఞకలిగి నేను కాలు బయటపెట్టితి
ఆజ్ఞ తెలిసి ఆ వెలుగు ననుసరించితి

ఏ వెలుగు దయచేత నింత కాలమునకు
నా వివేకము నాకు నమ్మకముగ గలిగె
నా వెలుగు దారిలో నడుగులే వేసితి
భావనాతీతశాంతిపధము ననుసరించితి

విభుని తర్జనిగోటి వెలుగు నన్నుధ్ధరించి
అభయదాయకుని చెంత కల్లన జేర్చినది
రభసముగా చేరితి నా రాముని పదసీమ
ఉభయలోకముల నిదే యున్నత శుభసీమ


ఇంత బ్రతుకు


ఇంత బ్రతుకు బ్రతికి నే నిక మీదటను
చింతపడుదునో చిక్కి జముని చేతను

తెలియక నీ భక్తులను తెలివిమాలి తిట్టినది
కలయరాని వారితో కలసిమెలసి యున్నది
విలువైనవని చిళ్ళపెంకులకై బొంకినది
తొలినాళ్ళవవి నిన్ను తెలియక ముందటివి

నీ దాసుడ నైతిరా నిన్ను నమ్మి యుంటిరా
ఓ దయామయా జముడు నాదెసకు రాకుండ
నా దైవమా రామ నీ దూతల బంపవేని
యేదయ్యా దిక్కు నా కిదే పొంచి యుండె వాడు

పాపుల దండించువాడు పాశహస్తుడగువాడు
కోపముగలవాడు మిడిగ్రుడ్ల మొగమువాడు
లోపములే యెన్ని నన్ను రూఢిగా శిక్షించును
నాపాలి దైవమ నను కాపాడుము తండ్రీ


2, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఇహము కాక పరము గూర్చి


ఇహము కాక పరము గూర్చి యించుక యోచించ నీక
తహతహ లాడించు కలిని తట్టుకొనగ లేక

నేనేమి చేసితిని నీ నామ మెంచితిని
ఆనామమే నా కన్నివిధముల
నానా కలిబాధలను నాకంట నీయక
మానుగ రక్షించి నిలిచి మంచి చేసెను

నేనేమి చేసితిని నీ మరువు సొచ్చితిని
దాని కన్న హితమన ధరమీదను
మానవునకు కలదా మరినీవు వేవేగ
మానక రక్షించితి నావు మంచి వాడవు

నేనేమి చేసితిని నీ వాడ నైపోయితి
జానకీనాథ చాల సంతోషము
నేను నీ వాడనని నీవు నా వాడవను
జ్ఞానమే కలిని గెలిచె సర్వవిధముల


హరి చాల మంచివాడు


వరతారకమహామంత్రభావనాగోచరు డగు
హరి చాల మంచివాడు - ఆతని వేడుడు

పాపకర్ముడైనను పాహిపాహి యన్నచో
కాపాడెడు బుధ్ధివాడు
శ్రీపతి పరమాత్ముడు క్షేమంకరుడు
రాపాడు కలిబాధ రాల్చువాడితడు

కోపాలసు డైనను కుమతి యైనను గాని
ఆపదల జిక్కి వేడుచో
కాపాడు దీక్షగల కరుణాసముద్రుడు
చేపట్టి ముక్తినిచ్చు చేరిన వారందకు

లోపము లెంచక మీ తాపత్రయంబుల
బాపు నీ శ్రీరాముడు
ద్వాపరమున తానె వాసుదేవుడైనాడు
ఱేపుమాపు గొలువుడీ గోపబాలుని


1, సెప్టెంబర్ 2018, శనివారం

చెప్పతరము కాదుగా


చెప్పతరము కాదుగా జేజేలకును
ఒప్పైన తీర నుండు జీవుని గూర్చి

ఈ విశ్వంబున నెల్లరు జీవుల
దేవుని యంశల తీరుగను
భావనచేసెడు భాగవతుండగు
జీవుని యున్నతి చెప్పగ తరమా

ఆవల నీవల నంతయు తానగు
శ్రీవిభుడే తన చిత్తమునే
కోవెలగా గొని కుదురుగ నుండిన
జీవుని విభవము చెప్పగ తరమా

గోవిందా హరి గోపాలా హరి
జీవేశ్వర హరి శ్రీరామా
నీవే దిక్కని నిలచితి నేనను
జీవుని సద్గతి చెప్పగ తరమా

ఇదే మంచిపూవు


ఇదే మంచిపూవు నా హృదయాంబుజ మిది నీదు
పదములపై నుంచితి నిక వసివాడదు

ఇన్నాళ్ళును కలిగాడ్పుక కెంతెంతో వేగినది
చిన్నపెద్ద నీడపట్లు చేరగ పరువిడుచు
అన్నన్నా యలసిసొలసి యాయాస పడుచు
నిన్నమెన్న తెలిసి నిన్ను నేడు చేరుకొన్నది

ఘోరకలిసముద్రమున కొట్టుకు పోవుచును
తీరమే కనరాక దిగులు పడుచును
శ్రీరామచంద్ర కృపాసింధుడా యిన్నాళ్ళకు
చేరుకొన్నది నీదు శ్రీపాదముల కడకు

కలియనే కారడవిని కామాది మృగములకు
పలు దురాశావిషపన్నగములకు
కలవరపడుచు నింత కాలమునకు నిన్ను
కలసిమురిసి చేరినది కనుగొను మిది నేదె


తొలగునా కర్మఫలము దుఃఖపెట్టక


తొలగునా కర్మఫలము దుఃఖపెట్టక
నిలచినకడ నిలువనీక నిన్ను త్రిప్పక

కడచిన భవముల గర్వించి యెవరిని
యడచినావో నే డడిగియుండగ
పడినవారు నాడు నీ పయిన వాపోయినవి
విడువక నేడు నిన్ను పీడించ కుండునే

జరిగిన జన్మముల సన్మార్గ మెఱుగక
పరిపరివిధముల భాగవతులను
పరిభవించి నవ్విన ఫలితముగా నేడు
పరిహసించి విధి నిన్ను బాధించకుండునే

హీనజన్మచక్రంబున నిటులుండ నేరవా
మానక శ్రీరాముని మందినెంచుమా
దాన కర్మక్షయమగు తాపోపశమనమగు
జ్ఞానివై హరిజేర జాలుదు వాపైన


31, ఆగస్టు 2018, శుక్రవారం

ఎందుకు హరిని మీ రెఱుగరయా


ఎందుకు హరిని మీ రెఱుగరయా వా
డందరి వాడాయె నెందైన కలడాయె

తొందరించ కామాది దుర్వృత్తులు మీ
రందరు తోచినట్లాడుచును
కొందలమందుచు కుమిలేరు గాక గో
విందుని మనసార వేడరు వేడరు

ఇందిరాపతిదయ యించుక కలుగక
ముందువెనుకల శుభముండేనా
చిందులు వేయించు చిక్కులి తీర్చు గో
విందుని మనసార వేడరు వేడరు

ఎందును సుఖములే దీశ్వరు హృదయార
విందములందు గాంచి వేడక వా
డందగాడు రాముడు నల్లరి కృష్ణుడు గో
విందుడు చెంతనుండ వేడరు వేడరు

దాశరథీ మంచివరము దయచేయవే


కౌశికమునివరఛాత్రా కౌసల్యా వరపుత్రా
దాశరథీ మంచివరము దయచేయవే నాకు

రాశులు కాలేదు ధనము రామచంద్ర యేనాటికి
రాశులాయె పాపములు రామరామ నానాటికి
దేశమున పలుచనైతి దీనుడనై నిను జేరితి
ఆశాపాశములు ద్రెంచు నట్టి మంచి వర మీవే

ఏమి కామ మేమి మోహ మేమి క్రోధ మేమి మద
మేమి లోభ మేమి మత్సర మెట్లు వీటి పై గెలుపు
తామసుడ నైతి నన్ను దయజూడుము రామచంద్ర
సామాన్యుడ వీటి నణచ జాలు మంచి వర మీవే

నరజన్మము దుర్లభమని నమ్మి నేను నరుడనైతి
కరమరుదాయె సుఖము పరమార్థము కనరాదు
పరమదీనుడ నైతి కరుణించుము రామచంద్ర
మరల పుట్టుకే లేని మంచి వరము నీయవే


29, ఆగస్టు 2018, బుధవారం

సుందరక్క

"అవును కానీ అమ్మా నాకీ పాత చింతకాయ పచ్చడి పేరు పెట్టారేమిటే" అంది నా కూతురు ఫోనులోనే చిరాకుపడుతూ.

వెంటనే సుందరక్క గుర్తుకు వచ్చింది.

సుందరక్క ఎప్పుడు గుర్తుకు వచ్చినా సరే మనసంతా చేదు తిన్నట్లుగా ఐపోతుంది.

సుందరక్క పుట్టుక ఒక విశేషం.

సుందరక్క బాల్యం ఒక విశేషం.

సుందరక్క పెళ్ళి ఒక విశేషం.

సుందరక్క వెళ్ళిపోవటం ఒక విశేషం.

అసలు సుందరక్కే ఒక పెద్ద విశేషం.

ఇంక పిల్లలు పుట్టరని నిరాశచేసుకున్న తల్లికి ముట్లుడిగిపోతున్న తరుణంలో కడుపున పడిందిట సుందరక్క. ఆ మాట తనతల్లే ఎన్నో మార్లు తనతో అనేదని సుందరక్కే చెప్పింది. ఆ సుందరక్కను ఆమె తల్లీ తండ్రీ కాలు క్రింద పెట్టనివ్వకుండా నెత్తిన పెట్టుకొని పెంచారు. అందుచేత తన చిన్నప్పుడు తనంత పెంకిపిల్ల ఊరుమొత్తంలో మరెవర్తీ లేదటని సుందరక్కే నవ్వుతూ ఒకటి రెండుసార్లు చెప్పింది. అత్యంత సౌమ్యురాలైన సుందరక్కేమిటీ పెంకిపిల్ల యేమిటీ అని తనకు అప్పట్లో భలే ఆశ్చర్యంగా అనిపించింది.

పాపం సుందరక్క పమిటవేయటం మొదలెట్టిన కొత్తలోనే మేనమామ గారింట చేరవలసి వచ్చింది అనాధగా. ఆ మేనమామ గారంటే ఆయనా వరసకు మాకు పెదనాన్న గారేను.

అలా వచ్చి సుందరక్క మావూరి బళ్ళో ఎనిమిదిలో చేరింది.

అప్పుడు నేనేమో ఇంకా రెండో తరగతేను.

సుందరక్క వీలున్నప్పుడల్లా మాయింటికి వస్తూ పోతూ ఉండేది.

నేను మూడులో ఉండగా కాబోలు పక్కింటి యతిరాజ్యం పెళ్ళి జరిగింది. ఆపిల్ల ఎందుకనో మాయింటికి వచ్చి చాలాసేపు ఏడ్చి వెళ్ళింది. తనకు ఆ పెళ్ళి వద్దట. ఏమో మరి ఎందుకో నాకేం తెలుసునూ. అమ్మేమో నన్ను "బయటకు పోయి ఆడుకోవే" అని కసిరి పంపేసిందాయిరి. అప్పుడు సుందరక్క మా యింట్లోనే ఉంది.

సుందరక్క బాగా పాడుతుంది.

ఎప్పుడన్నా హాయిగా పాడుకోవాలనిపిస్తే మా యింటికి వచ్చి బోలెడు పాటలు పాడేది. మా అమ్మకి తన పాటలంటే ఎంతిష్టమో. నాకైతే ఇంకా యిష్టం. ఎందుకంటే నాక్కూడా చిన్నచిన్న పాటలు నేర్పేది కదా మరి.

యతిరాజ్యం వాళ్ళింటి ముందు పెద్దపందిరి వేసారు. అక్క నడిగితే "యతిరాజ్యం పెళ్ళికదా పందిరెయ్యరా" అంది. పెళ్ళంటే అదో పెద్ద పండగనీ యింటి ముందు పందిరేస్తారనీ అర్థమైంది. అసలు పెళ్ళంటే ఏమిటీ అని సందేహం వచ్చింది.

ఆ సందేహం సుందరక్కనే అడిగాను వెంటనే.

అక్క యిచ్చిన జవాబును జన్మజన్మాలకీ మర్చిపోలేను.

"ఆడదానికి పెళ్ళంటే ఒకనరకం నుండి మరొకనరకానికి వెళ్ళటం" అంది.

నాకైతే చచ్చే భయం వేసింది.

"నేను చచ్చినా పెళ్ళిచేసుకోను" అని సుందరక్క దగ్గర శపథం చేసేసాను.

"అంతా నీ చేతులో ఉందటే" అని సుందరక్క నవ్వింది.

ఎందుకో ఆనవ్వు నచ్చలేదు.

ఎందుకుండదూ అని ఉక్రోషం వచ్చిందంతే.

కొన్నేళ్ళయ్యాక సుందరక్కకి పెళ్ళిచూపులయ్యాయి.

అప్పటికి నేనూ కాస్త పెద్దదాన్నయ్యానేమో ఆరిందాలా ఆ పెళ్ళిచూపుల విశేషం చూడ్డానికి నేనూ వెళ్ళాను.

తనకన్నా పది పదిహేనేళ్ళు పెద్ద ఆ పెళ్ళికొడుకు. సుందరక్క ఒప్పుకోదని అనుకున్నాను కాని ఆ పెళ్ళి జరగనే జరిగింది.

"అమ్మా ఏమిటే ఈ అన్యాయం" అన్నాను పెళ్ళికి అమ్మతో కలిసివెడుతూ.

"దాని ప్రాప్తం అలా ఉందే, ఏంచేస్తాం చెప్పు? తల్లీదండ్రీ లేనిపిల్ల. మీ పెదనాన్నదా అంతంత మాత్రం సంసారం. తనకే మరో ఇద్దరాడపిల్లలాయె. పాపం సుందే సర్దుకుపోతోంది. బంగారం లాంటి పిల్ల పాపం" అంది అమ్మ బాధపడుతూ.

సుందరక్క పెళ్ళైన తరువాత సంవత్సరం కాబోలు అత్తారింటి నుండి వచ్చింది. ఉన్న నెల్లాళ్ళలోనూ మాయింటికి మూడు నాలుగు సార్లు వచ్చింది.

అప్పుడు ఒకసారి నేను తెలిసీ తెలియక అన్న ఒక్క ముక్క ఇప్పటికీ నన్ను బాధిస్తూ ఉంటుంది.

"బాగున్నావా సుందరక్కా, అత్తారింట్లో ఐనా సుఖంగా ఉన్నావా" అన్నాను.

"ఆడబతుక్కి సుఖం అన్నది మూడో యింటికి వెళ్ళాకనే లేవే" అంది.

అముక్క నాకు అర్థం కాలేదు ఎంత తన్నుకున్నా.

కాని సుందరక్క ముఖంలో ఉన్న ఉదాసీనతను చూసి "ఆ మాటకి అర్థం ఏమిటీ" అని అడిగే ధైర్యం లేకపోయింది నాకు.

సుందరక్క తిరిగివెళ్ళిపోయాక మళ్ళా ఆమె తిరిగి ఎన్నడూ రాలేదు.

ఓ ఏడాది పోయాక కాబోలు సుందరక్కను గురించిన వర్తమానం ఐతే వచ్చింది.

కాని అది ఎంత చెడ్డ వర్తమానం!

ఇంక సుందరక్కే లేదు.

ఒకరోజు ఏదో పాత సిసిమా వస్తుంటే టీవీలో చూస్తున్నాను.

ఇల్లు యి ల్లనియేవు ఇల్లు నా దనియేవు
నీ యిల్లు యెక్కడే చిలకా
ఊరికీ ఉత్తరాన వలకాటి పురములో
కట్టె యిల్లున్నదే చిలకా

అని ఆ సిసిమా మధ్యలో ఒక పాట వచ్చింది.

ఎందుకో ఆ పాట విన్నాక మమసులో ఎంతో ఆందోళన కలిగింది.

ఆరోజున స్ఫురించింది మూడో యిల్లు అంటే ఏమిటో!

"సుందరక్కా మూడో యింటికి వెళ్ళిపోయావా" అని తలచి తలచి బాగా రోదించాను.

కాని నా సుందరక్క నా నుండి ఎంత దూరంగా పోగలదూ?

నాకూతురికి బాలాత్రిపురసుందరి అన్న పేరు పెట్టుకొన్నప్పుడు అమ్మ కళ్ళొత్తుకుంది.

ఆ పేరు మీద చాలా యుధ్ధమే జరిగింది నాకూ మా ఆయనకూ.

అయన తప్పేం లేదు పాపం.

కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలీ, గ్రహపాటున కూతురు పుడితే ఏం పేరు పెట్టాలీ అని ఆయన చాలానే కసరత్తు చేసారు.

ఫైనల్ లిష్టులో అరడజను అబ్బాయిల పేర్లూ మరొక అరడజను అమ్మాయిల పేర్లూ తేలాయి. వాటిలో నుండి మా కుటుంబసభ్యులందరూ కలిసి పాల్గొనే ఎన్నికల్లో చెరొక పేరూ తేలాలి అని నిర్ణయం కూడా జరిగింది.

ఎందుకిందంతా చెబుతున్నానూ అంటే ఆ ఫైనల్ పట్టీ తయారు చేయటంలో నేనూ ఉత్సాహంగానే పాల్గొన్నాను కాబట్టే.

కానీ పుట్టిన ఆ పిల్ల కాస్తా ఆ పట్టీలు రెండింటినీ త్రోసిరాజంది మరి, ఏం చేసేది చెప్పండి?

ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక అత్తయ్య గారితో చెప్పాను.

"మీ మొగుడూ పెళ్ళాల యిష్టమమ్మా. అమ్మవారి పేరు వధ్దనవచ్చునా తప్పుకాదూ? వాడికీ నచ్చితే అలాగేను. నిజానికి మా అత్తగారు మహాలక్ష్మమ్మ గారి పేరు పెట్టమని అడుగుదా మనుకున్నాను. అమ్మవారి పేరు ఏది పెడితేనేమీ. మీ యిద్దరూ ఆలోచించుకొని చేయండి" అంది ఆవిడ.

ఆయనా, మా మరిదులిద్దరూ పడీపడీ నవ్వారు.

"అంత పాచ్చింతకాయపచ్చడి పేరేమి" టొదినా అన్నాడు చిన్నమరిది.

ఆయనకైతే అలక వచ్చేసింది.

కాని చివరికి నా పంతమే నెగ్గింది.

అత్తయ్యగారి సపోర్టుతో నేను గెలిచానని మా మరుదు లనుకున్నారు కాని అది నిజం కాదు. ఆయనకూ చివరికి సమ్మతం ఐనది కాబట్టే బాలాత్రిపురసుందరి మళ్ళా మా యింట వెలిసింది.

ఇదంతా ఒకప్పుడు మా ఆయనకు చెప్పిన కథే.

ఈ రోజున మా అమ్మాయికి చెప్పాను.

"ఓ. మీ అక్క పేరు పెట్టుకున్నావన్న మాట నాకు" అంది అమ్మాయి.

"కాదు సుందరక్కా, నువ్వు నా కడుపున పుట్టబట్టే మళ్ళా నీకు ఆపేరే పెట్టాను" అన్నాను కొంచెం పూడుకుంటున్న గొంతుతో,

"ఊరుకో అమ్మా. అవేం మాటలూ. నేనేమిటీ మీ సుందరక్క నేమిటీ నాన్సెన్స్" అందమ్మాయి.

నేనూ మా సుందరక్కా కలిసి దిగిన ఫోటో అంటూ ఒక్కటైనా లేదు. దానికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలీ?

12, ఆగస్టు 2018, ఆదివారం

పంపకం


అప్పట్లో,  పెద్దబ్బాయీ చిన్నబ్బాయీ కూడా అమెరికా చెక్కేసే సరికి, రాఘవయ్య గారికి పిచ్చెక్కినట్లయింది.

అక్కడికీ చిన్నబ్బాయి విమానాశ్రయానికి పరిగెత్తే హడావుడిలో ఉండగా ఉండబట్ట లేక ఒక ముక్క అననే అన్నారు. "ఒరే చిన్నాడా, ఈ తోటలూ పొలాలూ, ఈ రెండిళ్ళూ అన్నీ ఇంకెవరికోసంరా? నువ్వూ అన్నా కూడా మమ్మల్ని విడిచి ఎగిరిపోతుంటే" అని.

చిన్నోడు పెద్దాడిలా గుంభన మనిషి కాదు. నోటికేదొస్తే అదే అనేస్తాడు. "మరేం జెయ్యమన్నావూ? ఇంత చదువూ చదివి ఇక్కడ ఎడ్లను తోలుకుంటూ వ్యవసాయం చేయమన్నావా?" అని దులిపినట్లుగా ఒక్క ముక్క అనేసి చక్కా పోయాడు.

ఆరాత్రి మాత్రం పెద్దాడు ఫోన్ చేసాడు గొప్పగా ఓదారుస్తూ, "నువ్వేం  బెంగెట్టుకోకు నాన్నా, వస్తూపోతూనే ఉంటాంగా? అమ్మను చూడు ఎంత ధైర్యంగా ఉందో" అని గొప్ప మాటన్నాడు.

అసలు ఆ రాజ్యలక్ష్మమ్మగారు ఎంత బెంగపడుతున్నదీ ఎంత నిరాశపడుతున్నదీ ఈ కుర్రకుంకలిద్దరికీ ఏం తెలుస్తున్నదీ అని రాఘవయ్యగారు నిర్వేదం చెందాడు. తనకైతే ఏదో వ్యవసాయం పనులూ గట్రా ఉంటాయి. ఇంటికే పరిమితం ఐన తన ఇల్లాలు ఒక్కర్తీ కూర్చుని ఈ పిల్లాళ్ళ కోసం ఎలా అంగలారుస్తున్నదీ వీళ్ళకి తెలియటం లేదే అని బాధపడ్డారు.

ఇంక ఇంట్లో మిగిలినది ముసలాళ్ళం ఇద్దరమే అనుకొని ఆయనకు క్రమంగా ఏపని మీదకూ ఆసక్తి కలగటం మానేసింది.

అదీ కాక చిన్నబ్బాయి విమానం ఎక్కివెళ్ళిపోయన ఆర్నెల్లకు పిల్లలమీద బెంగతో రాజ్యలక్ష్మమ్మ మంచం ఎక్కింది.

ఓ ఆర్నెల్లపాటు వైద్యం నడిచింది.

కోలుకుంటున్నట్లే ఉండటం మళ్ళా జబ్బు తిరగబెట్టటమూ జరిగింది.

బాగా ఆలోచించి పొలాలూ తోటలూ కౌళ్ళ కిచ్చి రాఘవయ్యగారూ ఇంటిపట్టునే ఉండసాగారు.

అయన ఉపచారాల పుణ్యమా అనో వైద్యం గొప్పదనమనో చెప్పలేం కాని రాజ్యలక్ష్మమ్మ మరొక ఆర్నెల్ల తరువాత లేచి తిరగటం మొదలు పెట్టింది.

కాని మునుపటి ఉత్సాహం లేదు.

బాగా ఆలోచించి పెద్దాడికి ఫోన్ చేసారు రాఘవయ్య గారు.

కోడలు ఎత్తింది ఫోన్. పుత్రరత్నంగారు ఎక్కడికో కేంపుకు వెళ్ళారట. వచ్చాక చెబుతాను లెండి. ఐనా ఈ సీజనులో టిక్కెట్లు బాగా ఖరీదు. అదీ కాక పిల్లలకీ వీలు కుదరాలిగా. మెల్లగా వీలుచూసుకొని వస్తాం అని పెట్టేసింది.

ఇక చిన్నాడికీ ఫోన్ చేసి చెప్పారు, ఒకసారి వచ్చె వెళ్ళరా అని. వాడు గయ్యిమన్నాడు. నీకే మన్నా పిచ్చానాన్నా. నేను వచ్చి ఏడాది ఐందో లేదో ఇప్పుడే ఎలా వస్తానూ. మళ్ళీ ఏడాది చూదాంలే అని విసుక్కుని పోను ఠపీ మని పెట్టేసాడు.

కోడలి గొంతులోని నిరాసక్తతా చిన్నకొడుకు నిర్లక్ష్యమూ రాఘవయ్యగారికి విరక్తి కలిగించాయి.

ఇంక ఆయన ఎన్నడూ పిల్లలకు ఫోన్ చేయలేదు.

వాళ్ళు ఊరికే కుశలం కనుక్కుందామని అన్నట్లు అరుదుగా చేసే ఫోనులకు ముక్తసరి సమాధానాలు చెప్పి ఊరకుంటున్నారు.

కాలం ఇలాగే గడిచిపోతుందా? మనం ఇలాగే వెళ్ళిపోతామా అని రాఘవయ్యగారు మథనపడుతూ ఉన్న రోజుల్లో - అంటే చిన్నబ్బాయి కూడా తనకు అమెరికా సిటిజెన్ షిప్ వచ్చేసిందని సంబరపడుతూ ఫోన్ చేసిన మర్నాడు వాళ్ళింటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు.

ఆ పిల్లవాడి పేరు వీరేశం. వీరేశం తండ్రి రాఘవయ్యగారి దగ్గరే పాలేరుగా ఉండే వాడు. వీరేశం అన్నగారు పట్నంలో ఒక స్టీలు దుకాణంలో వాటాదారుగా చేరాడు. తండ్రిని పని మానిపించి తీసుకొని పోయాడు. కొన్నాళ్ళు సమాచారం ఏమీ లేదు రాఘవయ్యగారికి. ఇదిగో ఈమధ్యన ఆ కొట్టు ఎత్తేసి వాటాదారు డబ్బుతో సహా మాయం అయ్యాడట. అప్పులవాళ్ళు మీదకు వస్తే వీరేశం అన్న తట్టుకోలేక ఇంట్లో అందరికీ విషం కలిపి పెట్టేసాడు. అన్నా వదినా పోయారు. హాస్పిటల్లో తండ్రికీ వీరేశానికి బాగయ్యింది. కాని దిగులుతో ఆ తండ్రికాస్తా ఎంతో కాలం బ్రతకలేదు. వీరేశం చేతికి ఒక ఉత్తరమ్ముక్క ఇచ్చి, నేను పోయాక, నువ్వు పోయి రాఘవయ్యగారి పంచన బ్రతుకు అని చెప్పాడు.

ఇదంతా విని రాఘవయ్యగారూ రాజ్యలక్ష్మమ్మగారూ ఎంతో బాధపడ్డారు.

పదేళ్ళ పిల్లాడికి వచ్చిన కష్టానికి చలించిన రాజ్యలక్ష్మమ్మగారు, "ఇంక వీడు నా కొడుకే" అని ప్రకటన చేసేసింది.

రాఘవయ్యగారికి మళ్ళా ఉత్సాహం వచ్చింది.  ఇదిగో ఈ పిల్లాడి చదువుసంద్యలని ఏమి, వాడికి వ్యవసాయం పనులు నేర్పటం అని ఏమి మళ్ళా మునపటి మనిషిలా అవటానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు.

ఉన్నట్లుండి ఒకరోజున పెద్దాడూ చిన్నాడూ కలిసి అదేదో కాల్ చేసారు. సారాంశం ఏమిటంటే చిన్నోడికి అక్కడే మంచి అమ్మాయి దొరికిందట ఆరోజునే పెళ్ళి చేసుకున్నాడట.

రాఘవయ్యగారికి కోపం వచ్చి కేకలు వేసారు ఫోనులోనే.

రాజ్యలక్ష్మిగారు కూడా కొంచెం దుఃఖపడి చివరకు "అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడా" పోనివ్వండి. అసలే ఈ మధ్య మీ ఆరోగ్యం బాగోలేదు అని ఊరడించింది రాఘవయ్యగారిని.

ఆ చిన్నాడి పెళ్ళి అంత ముచ్చటగా దేశాంతరంలో కన్నవారిపరోక్షంలో జరిగిన ఐదేళ్ళకు కాబోలు పెద్దాడి ఇంట్లో ఏదో శుభకార్యం సందర్భంగా అందరూ కలిసి జరుపుకున్న సందడి తాలూకు వీడియో ఒకటి రాఘవయ్యగారికి పంపింది చిన్నకోడలు.

దానితో పాటే ఒక ఉత్తరం. తామంతా ఎన్నో తప్పులు చేసామనీ పెద్దమనసుతో మీరు క్షమించి దీవించాలనీ మీదగ్గరకు అందరం ఒకసారి తొందరలో వద్దామనుకుంటున్నామనీ దాని సారాంశం.

ఆ ఉత్తరం చేరిన నాడో మరునాడో చిన్నాడి నుండి ఫోన్. నాన్నా ఈ నెలాఖరుకు అన్నయ్యా నేనూ కుటుంబాలతో వస్తున్నాం అని.

రాఘవయ్యగారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
రాజ్యలక్ష్మమ్మ గారికి ఎంతో ఆనందం కలిగింది.

నెలాఖరు కల్లా ఇల్లంతా పిల్లా మేకాతో కళకళలాడి పోయింది.

చెరొక నెలరోజులూ సెలవులు పెట్టుకొని వచ్చారట. పెద్దకోడలు ఎన్నడూ ఎరుగనంత వినయవంతురా లయింది. కొడుకు లిద్దరూ తండ్రిని అరచేతితో ఆకాశానికి ఎత్తుకొంటూ గౌరవించుతున్నారు.

మనవలకైతే ఈ వాతావరణం అంతా చాలా అబ్బురంగా ఉంది. పెద్దాడి ఇద్దరుపిల్లలకీ తెలుగు అర్థమౌతుంది కాని మాట్లాడలేరు. చిన్నాడి కూతురికి తెలుగు అర్థం కూడా కాదు.

కొడుకులిద్దరూ వీరేశాన్ని గమనించుతూనే ఉన్నారు.

ఇంటిపనులన్నీ వాడే చూసుకొంటూన్నాడు. వ్యవసాయం పనులన్నీ వాడే చక్కబెడుతున్నాడు.  అమ్మేమో నాన్నా వీరేశా అంటుంది.  నాన్నైతే అబ్బిగా అంటాడు.

వీడూ మరీ అన్యాయమే, నాన్నగారూ అంటున్నాడు. ఇదిగో ఈముక్క కంపరంగా తోచింది అన్నదమ్ములిద్దరికీ.

ఓరోజున అమ్మకు హితోపదేశం చేసాడు చిన్నబ్బాయి. అమ్మా పాలేరును పాలేరుగానే చూడాలి కాని వీడికి ఈ చనువేమిటమ్మా అని.

రాజ్యలక్ష్మమ్మగ్సారు చర్రుమంది. ఒరే, మీరిద్దరూ దేశాలట్టుకుపోతే మాకు రెక్కాసరా ఇస్తున్నది వీడేరా - వీరేశాన్ని ఎప్పుడూ పరాయి చేసి ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది.

అరోజు రాత్రే ఆస్తిపంపకాల గురించి తండ్రితో మాట్లాడాడు పెద్దబ్బాయి. ఆలోచించి ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు కాని రాఘవయ్య గారు అలాగే అన్నాడు కాదు.

అక్కడే వింటూనే ఉన్న చిన్నబ్బాయి అందుకున్నాడు. అదికాదు నాన్నా, నువ్వా పెద్దాడివి ఐపోయావు - నీ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. పంపకాలు చేస్తేనే బాగుంటుంది కదా అని.

రాఘవయ్యగారు కంటగించుకొన్నాడు. ఒరే ఎప్పుడేమిచేయాలో నాకు నువ్వు చెప్పాలా గ్రుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు? ఈ ఆస్తి అంతా నాస్వార్జితం. ఇప్పుడు నువ్వూ నీ అన్నా వచ్చి ఆస్తి పంచివ్వూ అంటే కాదు - నాకు తోచినప్పుడే ఆస్తి పంపకాలు చేస్తాను సరా అని ఉరిమాడు.

కొడుకులకు ఇంక మాట్లాడటానికి ఏమీ దారి ఇవ్వలేదు ఆయన.

నెల పూర్తవుతూనే వెళ్ళారిద్దరూ కుటుంబాలతో తమతమ స్వస్థలాలకి.

పోతూపోతే చిన్నబ్బాయి వీరేశాన్ని పిలిచి ఒక్క ముక్కన్నాడు. ఎక్కడుండ వలసిన వాళ్ళు అక్కడుండాలి, నువ్వు మా పాలేరువు కదా మాయింట్లోనే ఉండట మేమిటీ?  లోకంలో ఇలా ఎక్కడన్నా ఉంటుందా? ఇదేమీ బాగోలేదు అని.

వీరేశం ఏమీ సమాధానం చెప్పలేదు.

వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు చిన్నబ్బాయిగారు ఇలా అన్నారండీ అని రాజ్యలక్ష్మమ్మగారితో చెప్పి పనమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

రాఘవయ్యగారు అగ్గిరాముడై పోయాడు.

ఇదంతా జరిగి మూడేళ్ళు కావస్తున్నది.

ఇప్పుడు మళ్ళా ఇల్లంతా పెద్దబ్బాయీ చిన్నబ్బాయిల కుటుంబాలతో బిలబిలలాడుతూ ఉంది.

కార్యక్రమాలన్నీ ముగిసిన మరునాడు, పెద్దబ్బాయి తల్లిదగ్గర ఆస్తి పంపకాల సంగతి ఎత్తాడు.

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు.

నాన్న పంపకాలు చేసి వెళ్ళిపోతే బాగుండేదా. ఇప్పుడు మేమే చేసుకోవాలి అన్నాడు చిన్నబ్బాయి.

ఆవిడ ఏమీ మాట్లాడలేదు.

కొంచెం ఆగి నాన్నా వీరేశా అంది.

వీరేశం వచ్చి పిలిచావా అమ్మా అన్నాడు.

స్టుపిడ్ అమ్మగారూ అనలేవా అమ్మా ఏమిటీ అన్నాడు చిన్నబ్బాయి.

అమ్మని అందరూ అమ్మా అనే పిలుస్తారు అన్నాడు వీరేశం శాంతంగా,

వీరేశా నువ్వెళ్ళి పోష్టుమేష్టార్నీ గవర్రాజుగారిని పిలుచుకురా నాయనా అంది రాజ్యలక్ష్మమ్మ.

గవర్రాజుగారికి చెప్పి పొలం వెళ్తానమ్మా చాలా పనులుండిపోయాయీ అన్నాడు.

సరే నాన్నా అంది రాజ్యలక్ష్మమ్మగారు.

ఓ. నాన్నగారు పంపకాలు చేసారన్న మాట ఐతే అన్నాడు పెద్దాడు,  వీరేశం అటు వెళ్ళగానే

రాజ్యలక్ష్మమ్మగారు ఏమీ మాట్లాడలేదు,

గవర్రాజు గారూ రాఘవయ్యగారూ బావా అంటే బావా అని పిలుచుకొనే వారు - ప్రాణస్నేహితులు. పోష్టుమేష్టారు కూడా రాఘవయ్యగారికి ఒకప్పుడు చదువుచెప్పిన మాష్టారి కొడుకున్నూ రాఘవయ్యగారికి సన్నిహితుడున్నూ. వాళ్ళిద్దరితో పాటు గవర్రాజు గారి కొడుకూ, కూతురూ వచ్చారు. వాళ్ళ వెనకాలే పోష్టుమేష్టరు గారబ్బాయి శేఖరం వచ్చాడు. అతను లాయరు.

పనమ్మాయి అందరికీ ఫలహారాలూ కాఫీలు అందించింది.

అన్నట్లు శేఖరానికి చిన్నబ్బాయి క్లాసుమేటే.

మీ నాన్నగారు విల్లు వ్రాసి రిజిష్టరు చేయించారు అన్నాడు శేఖరం.

రాజ్యలక్ష్మమ్మగారు కొడుకుల ముఖాల్లోకి తొంగిచూసింది.

ఆస్తిపాస్తులన్నీ ఆయన రెండు భాగాలుగా విభజించారు అన్నాడు శేఖరం.

చెప్పండి నా వాటలోకి ఏం వచ్చాయో అన్నయ్య వాటా యేమిటో అన్నాడు చిన్నబ్బాయి.

శేఖరం చిరునవ్వు నవ్వి. "మీ అన్నదమ్ము లిద్దరికీ రాఘవయ్యగారు ఏమీ ఇవ్వలేదు" అన్నాడు.

మీద పిడుగుపడిన ట్లైంది అన్నదమ్ములకీ వాళ్ళ భార్యామణులకీ,

"మరి?" అన్నాడు పెద్దాడు ముందుగా తేరుకొని.

సగం ఆస్తి రాజ్యలక్ష్మమ్మగారికి చెందేలాగున్నూ మిగతా సగమూ తన పెంపుడుకొడుకు వీరేశానికి చెందేటట్లున్నూ వీలునామా వ్రాసారు మీనాన్నగారు, రాజ్యలక్ష్మమ్మగారు తనతదనంతరం తనవాటా ఆస్తిని తన ఇష్టానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చును అని కూడా వ్రాసారు. అన్నాడు శేఖరం వీలునామా చూపుతూ.

"ఇదంతా అన్యాయం అమ్మా. నీక్కూడా తెలియకుండా నాన్నెంత పని చేసాడో చూసావా?" అని చిందులేశాడు చిన్నబ్బాయి.

"ఇలా పంచమని మీనాన్నగారికి నేనే చెప్పాను. మరొక సంగతి వినండి, నా తదనంతరం నా వాటాకూడా వీరేశానికే ఇస్తాను." అంది స్థిరంగా రాజ్యలక్ష్మమ్మ.

"అన్యాయం అమ్మా" అన్నాడు పెద్దాడు నోరు తెరచి.

 "మీకు అమ్మ అక్కర్లేదు. నాన్న అక్కలేదు. స్వదేశం అక్కర్లేదు. ఎక్కడికో పోయి కూర్చున్నారు. అక్కడ మీరు బాగానే ఉన్నారు. ఇక్కడి ఆస్తులెందుకు అమ్ముకుందుకు కాకపోతే? ఆమధ్య చిన్నాడేమన్నాడూ 'ఇక్కడేముందమ్మా మట్టి అని కదూ'. ఇప్పుడు ఆ మట్టికే రేట్లు బాగా పెరిగి కోట్లు పలుకుతున్నాయని కదా మళ్ళా మీకు మా మీద ప్రేమ పుట్టుకొచ్చిందీ? అందుకే కదా మీరంతా ఆమధ్య వచ్చి వెళ్ళిందీనూ? మీ యిద్దరూ ఇక్కడి పొలాలు ఏమాత్రం పలుకుతున్నాయో వాకబు చేసుకొని వెళ్ళిన సంగతి మీ నాన్నగారికి తెలియలేదని అనుకుంటున్నారా ఇద్దరూ? మీ యిద్దరూ ఇల్లు వదలి మీదారిన మీరు పోయాక దైవికంగా దొరికిన బిడ్ద ఈ వీరేశం. వాడు మమ్మల్ని అమ్మా నాన్నా అంటుంటే మీ కెందుకు అంత కంటగింపుగా ఉన్నదీ? మీ అమ్మానాన్నల్ని వాడూ అమ్మా నాన్నా అంటున్నాడనా? ఎక్కడ మీ నాన్న వాడికేదన్నా దోపుతాడో అన్న కచ్చ తోనా అన్నది నాకు తెలియదా మీ నాన్నకి తెలియదా?  వాడికీ ఏదో ఏర్పాటు  చేయండీ అన్నాను. అన్నీ ఆలోచించే ఇలా విల్లు వ్రాస్తానన్నారు మీనాన్న. సరే అన్నాను. అప్పుడే మీనాన్న సలహా ఇచ్చారు. వీరేశానికే ఇవ్వు నీ వాటాకూడా అని."

పెద్దాడి ముఖంలోనూ చిన్నాడి ముఖంలోనూ కత్తి వాటుకు నెత్తురుచుక్క లేదు.

"మనం ముందే మేలుకొని ఈ వీరేశం గాడిని ఇంటినుండి తరిమి వేసుంటే ఈ తిప్పలొచ్చేవి కావు" అంది చిన్నకోడలు అక్కసుగా.

"మా నాన్నగారితో మాట్లాడదాం. మనకు వాటాలు ఎందుకురావో తేల్చుకుందాం" అంది పెద్దకోడలు. ఆవిడ తండ్రి కూడా ప్లీడరేను.

"లాభం లేదమ్మా. ఈ ఆస్తిపాస్తులన్నీ రాఘవయ్యగారి స్వార్జితం." అన్నాడు శేఖరం.

"మావయ్య గారు పూర్తి స్వస్థతతో ఉండే వ్రాసారా ఈ విల్లు? ఈ వీరేశం ఏదో మతలబు చేసి వ్రాయించాడేమో" అంది ప్లీడరుగారమ్మాయి. "పైగా అయన ఆరోగ్యం గత యేడాదిగా బాగుండటం లేదుట కదా? ఈ విల్లు చెల్లదేమో "అని కూడా అంది.

"అలాగా? ఈ సంగతి  కూడా వినండి. పోష్టుమాష్టార్నీ గవర్రాజుగార్నీ సంప్రదించి మరీ ఇలా విల్లు వ్రాసారు. మీరు ఆమధ్య వచ్చి వెళ్ళిన మూడోరోజునే ఈ విల్లు వ్రాయటం రిజిష్ట్రీ చేయటం  కూడా జరిగింది. అప్పుడు మీ మావయ్యగారు నిక్షేపంగా ఉన్నారు. ఆయనా పెద్దమనుషులూ పట్నం వెళ్ళి విల్లు రిజిష్టరు చేయించుకొని మరీ వచ్చారు." అని నిష్కర్ష చేసింది రాజ్యల్క్ష్మమ్మ.

"అమ్మాయీ, నేను గవర్నమెంటు డాక్టర్ని అన్న సంగతి నీకు తెలియదేమో" అన్నాడు గవర్రాజు గారు.

"ఇంకేం పని మనకిక్కడ" అంది పెద్దకోడలు విసురుగా.

కొడుకులూ కోడళ్ళు రుసరుసలాడుతూ లేచ్చక్కాపోయారు అక్కణ్ణుంచి.

ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ ఐంది.

నువ్వూ నీ వీరేశం గాడూ ఉట్టికట్టుకొని ఊరేగండి. మాకింత అన్యాయంచేసిన వాడు ఎలాబాగుపడతాడో చూస్తాంగా అని తల్లిముందు రంకెలు వేస్తూ మరీ వెళ్ళాడు చిన్నబ్బాయి.

పెద్దబ్బాయి కాస్త గుంభన మనిషి అని చెప్పాను కదా.  తమ్ముణ్ణి సముదాయించాడు, బోడి ఈ మట్టి లేకపోతే మనం బ్రతకలేమా? జస్ట్ డోంట్ కేర్. వీళ్ళిలాంటి ప్రేమలూ అభిమానాలూ లేని మనుషులనే నాకు ఇక్కడికి రావటానికే అసహ్యం. లెట్స్ గో" అన్నాడు.

10, ఆగస్టు 2018, శుక్రవారం

పరమదయాశాలి యైన వాడు రాముడు


పరమదయాశాలి యైన వాడు రాముడు వాడు
దరిజేరిన వారి నెల్ల దయజూచెడు వాడు

చెడుబుధ్ధులు కైకమ్మకు చెవిలో నూది
వడిగా పట్టాభిషేకభంగము చేసి
అడవికంపు మంథర యడుగుల బడిన
కడుగడు కరుణతో కాపాడిన వాడు

కావరమున సీతమ్మను కాకియై హింసించి
శ్రీవిభుడు బ్రహ్మాస్త్రము చేగొని విసర
తీవరమున లోకములు తిరిగివచ్చి వాడు
కావుకావు మనగానే కాపాడిన వాడు

పగతుని తమ్మునకు మంచిపదవి నిచ్చు వాడు
పగతుని చారులను కూడ వదలిన వాడు
పగతుడా యలసిన రావణ రేపు రమ్మని
తెగవేయక కాపాడిన దేవుడు వాడు

9, ఆగస్టు 2018, గురువారం

వలదు వలదు వలదు


వలదు వలదు వలదు మీకు వలదయ్యా వలదు
తెలిసి తెలిసి తప్పుజేయ వలదయ్యా వలదు

రామనామ సుజపానురక్తుల కేల
పామరులను జేరి వాదప్రతివాదములు
రామహిత కార్యానురక్తుల కేల
పామరులను జేరి పిచ్చి పనుల నుండుటలు

రామచంద్రకీర్త నానురక్తుల కేల
పామరుల ప్రశంస జేసి భంగపడుటలు
రామపాద పూజానురక్తుల కేల
సామాన్యదేవతల సాగి కొల్చుటలు

రామకథాపఠ నానురక్తుల కేల
ఏమేమో యైహికకథ లిక చదువుటలు
రామపదము జేరగోరు వారలకేల
ఈ ముల్లోకముల యందెట్టి పదవులు

8, ఆగస్టు 2018, బుధవారం

చిరుజీవికి హితవు.


ఓయి చిరుజీవీ,

ముదుక నని తిట్టినట్టి యో మూర్ఖ జనుడ
మొగ్గ పూవౌను కాయౌను ముదిరి పండి
నేల వ్రాలును సృష్టిలో కాలగతిని
ముసలితన మేల నీకు రాబోదు చెపుమ

కాలగతి జేసి బాల్యము కరిగిపోవు
కాలగతి జేసి యుడుకు రక్తము శమించు
కాలగతి జేసి వార్థక్య గరిమ కలుగు
కాలగతి జేసి తొలగెడు క్షణము కలుగు

కాలమున జేసి సర్వము కలుగుచుండు
కాలమున జేసి సర్వము తొలగుచుండు
కాలమున జేసి విశ్వమే కలుగు తొలగు
కాల మెఱుగు విజ్ఞానులు గర్వపడరు

స్వస్తి.


(Originally posted today as a comment at blog racca banda.)

7, ఆగస్టు 2018, మంగళవారం

మనఃపుష్పార్చన


ఉన్న దొకే చిన్న పూవు మన్ని కైన పూవు
నిన్ను చేరు తహతహతో నున్నదీ పూవు

సేవించగ వచ్చినదీ చిన్న పూవు దాని
తావి నీవు మెచ్చిన కడు ధన్యమగు పూవు
ఈ వెఱ్ఱి మనసనే యెంతో చిన్నపూవు
నీవు గైకొన్న గాని నిలువలేని పూవు

నీ పై యనురక్తితోడ నిండిన దీ పూవు
ఓప లేని తహతహతో నున్నదీ పూవు
చేపట్టి యేలుదువని చేరిన దీ పూవు
నీ పాదసన్నిధిని నిలచిన దీ పూవు

తనరు భక్తిపరీమళము దాల్చిన పూవు
జనకజారమణు కరుణ జాలను పూవు
తనకు వేరు గతి వలదని తలచు పూవు
మనసనే పూవు మంచి వినయము గల పూవు

28, మే 2018, సోమవారం

రామరామ పాహిమాం


రామ రామ అఖిలాండకోటిబ్రహ్మాండనాథ పాహిమాం
రామ రామ నిజభక్తలోకక్షేమదాయక పాహిమాం

రామ రామ జయ రావణాది ఘనరాక్షసాంతక పాహిమాం
రామ రామ జయ సత్యధర్మపరాక్రమా హరి పాహిమాం
రామ రామ జయ నిర్మలాచరణ రమ్యసద్గుణ పాహిమాం
రామ రామ జయ కోసలేంద్ర  ఘనశ్యామలాంగ పాహిమాం

రామ రామ నిజపాదుకాపరి రక్షితోర్వీ పాహిమాం
రామ రామ ఘనశాపమోచనరమ్యపాద పాహిమాం
రామ రామ పవమాననందనారాధ్యపాద పాహిమాం
రామ రామ నిజభక్తసేవిత పాదయుగళ పాహిమాం

రామ రామ సురనాథసంస్తుత రమ్యవిక్రమ పాహిమాం
రామ రామ అజ శంకరస్తుత పరాక్రమా హరి పాహిమాం
రామ రామ భవబంధనాశన నామవైభవ పాహిమాం
రామ రామ యోగీంద్రహృదయవిరాజమాన పాహిమాం

23, మే 2018, బుధవారం

హరిని వదలి ఇటులనటుల


హరిని వదలి ఇటులనటుల నలమటించ నేల
మరలమరల పుట్ట నేల మరణించ నేల

చాలును నీ మంత్ర్రపునశ్చరణాయాసంబులు
చాలును నీ వివిధవ్రతాచరణోద్యోగంబులు
చాలును పలుచోట్ల నదీజలములలో మునకలు
మేలు వీటి వలన నీకు మిక్కిలిగా లేదు

తన యనంతవిభూతికి తబ్బిబ్బు పడు నీకు
తనను చేరు దారి చూప ధరమీద పుట్టెను
తన దివ్యనామమిచ్చి ధర్మమాచరించి చూపి
యినకులేశుడై హరి యెంతెంతో చేసెను

మనాసార రామనామ మంత్రపఠన చేయక
తనివారగ రామపాదముల కీవు మ్రొక్కక
దినదినమును రామసేవనమున నీ వుండక
మనుజుడా నీకు ముక్తి మాటయే లేదు


21, మే 2018, సోమవారం

హరికి నచ్చెడు రీతి


హరికి నచ్చెడు రీతి నరు డుండ నేర్చిన
పరమసుఖము వాని పరమగును

హరినామమును నోట ననిశము పలికించు
నరుని నాలుక దుష్టనామముల
పొరబడి యైనను చెఱబడి యైనను
కెరలి పలుక కుండు దాని హరిమెచ్చ

హరిగుణములు మెచ్చు నంతరంగం బది
పరుల గుణముల కడు స్వల్పముల
పరిగణించక నొల్లక స్వప్నమందైన
హరి మెచ్చు నటు లుండి యలరేను

శ్రీరాము డైనట్టి శ్రీహరి సత్కథను
పారవశ్యమున చదువు భక్తునకు
చేరదే కష్టము సిధ్ధము సుఖము
ధారాళమైన హరి దయవలన


8, మే 2018, మంగళవారం

ఒక్కటే నామము


ఒక్కటే నామము చక్కగ సరిపోవును
అక్కజ మగు బాధలైన అణగిపోవును

ఆ యొక్క నామమే యన్ని తాపములకు
తీయనైన మందనుచు తెలియము
ఆ యొక్క నామమే యందరు సజ్జనులకు
ధ్యేయ మైన మంత్రమని తెలియుము

ఆ యొక్క నామమే అఖిలలోకాధార
మైయున్న దని పెద్దలందురు
ఆయొక్క నామమే ఆన్నివేళల శివుడు
హాయిగా ధ్యానించు నందురు

ఆ యొక్క నామమే ఆ రామనామమే
మాయపైన జయమునకు మార్గము
ఆ యొక్క నామమే అందుకొన్నచో
వేయేల మముక్తుడౌ విబుధుడు


ఏమమ్మ సీతమ్మ


ఏమమ్మ సీతమ్మ యిత డెంత వాడో చూడు
ఏ మెఱుగనటు లుండి యెన్ని చేసేను

చారెడేసి కన్నులతో సభలోన నిలచెను
ఊరక  విల్లు చూడ నుంకించెనట
చేరదీసి యెక్కుపెట్టి చిటుకున విరచెను
ఔరా పదాఱేండ్ల అతిసుకుమారు డట

రాముని నిన్ను నొక్క రాకాసి విడదీసె
తామసమున వాని పోర తాకి వీరుడు
ఏమో వాడలసె నని యెడమిచ్చి పంపెను
ఏమమ్మ యిట్టి చోద్య మెందున్న దందుము

ఎంచ పరమభక్తు డైన ఎంతగ సేవించిన
కంచర్ల గోపన్నను కారనుంచెనే
అంచితమగు కరుణ నమ్మరో నీవు  చెప్ప
త్రెంచి బంధములు జేరదీసి దీవించెను

7, మే 2018, సోమవారం

పరమసుఖద మీ హరిపదము


పరమసుఖద మీ హరిపదము
పరమాత్ముడు శ్రీ హరిపదము

పరమయోగిగణ భావితపదము
కరుణాకర మీ హరిపదము
నిరుపమాన మీ హరిపదము
సురసేవ్యము శ్రీ హరిపదము

పరమభక్తుడగు బలితలనిలచి
వరమిచ్చిన దీ హరిపదము
భరతుని చేత పట్టము గట్టుక
ధరనేలిన శ్రీ హరిపదము

మురియుచు తలచు హరిభక్తులకు
పరమనిధానము హరిపదము
సరిసిజాసనుడు చక్కగకడిగి
మురిసిన దీ శ్రీహరిపదము
5, మే 2018, శనివారం

ఎందుకయా యొకరి తప్పు లెంచగ నాకు


ఎందుకయా యొకరి తప్పు లెంచగ నాకు
ముందు నా తప్పు లవే వందలు కావా

ఇతడు సత్యసంధుడని యినకులేశ్వరుని పొగడి
ప్రతిదినమును మురియు నే నబద్ధములు లాడి
మతిమాలి మరల యితర మానవుల తప్పెంచి
యతి డాంబికముగ లోక మందు వర్తించెదను

పరమదయాశాలి యని భగవంతుని రాముని
తరచుగా పొగడు నేను దయలేక నడచుచు
పొరపాటున గాక బుధ్ధిపూర్వకముగ సాయము
పొరుగువారి కొనరించక పరుల తప్పెంచెదను

రాముడు నిష్కాముడని రమ్యముగా పొగడుదు
నా మనసున కోరికలే నాట్యమాడు చుండును
కామాదుల వదలరని కసరుదు నే నితరులను
సామాన్యము కాదు నా జన్మసిధ్ధడాంబికము


దేవున కొక కులమని


దేవున కొక కుల మని తెలుపవచ్చునా
ఆవిధమగు భావనయే యపరాధము

వామనుడై పుట్టినపుడు బ్రాహ్మణ కులము
రాముడై పుట్టినపుడు రాజుల కులము
పామరత్వమున నీవు పలుకవచ్చునా
యేమయ్యా యీశ్వరున కిందేది కులము

అల్లరి రాజుల నణచినట్టివాని దేకులము
గొల్లలింట పెరిగిన నల్లవాని దేకులము
ప్రల్లదనమున నీవు పలుకవచ్చునా
చెల్లునా యీశ్వరునకు చెప్ప నొక్క కులము

నరహరియై వెలసెనే నాడతని దేకులము
తిరుపతిలో వెలసెనే మరి యిపు డేకులము
నరుడా యీ కులపిచ్చి నాశనకరము
హరికిలేదు కులము నరులకేల కులము

25, ఏప్రిల్ 2018, బుధవారం

ఇదిగో యీ రామనామ మింత గొప్ప దున్నది


ఇదిగో యీ రామనామ మింత గొప్ప దున్నది
వదలక సేవించు నాకు ప్రాణ మదియై యున్నది

అన్ని సౌఖ్యము లాత్మకింపుగ నందజేయుచు నున్నది
అన్ని కష్టము లందదే నన్నాదు కొనుచు నున్నది
అన్ని వేళల తోడు నీడై యనుసరించుచు నున్నది
అన్ని విధముల జన్మజన్మల పెన్నిధి యన దగినది

కనులు తెరచిన క్షణము నుండి మనసున మెదలాడుచు
కనులు మూసిన క్షణము నుండి కలల తానే మెదలుచు
మనసున తా నిండి యుండి మధురమధుర మగుచును
తనకు తానై కరుణతో‌ నన్ననుక్షణమును నడపుచు

నియమనిష్ట లెఱుగడే‌ యని నింద జూపి వదలక
భయము భక్తి లేని వాడని వదలి దూరము పోవక
దయయు సత్యము వీని బ్రతుకున తక్కువే‌ యని జూడక
జయము నిచ్చును బ్రోచుచున్నది చాలునది ముమ్మాటికి


22, ఏప్రిల్ 2018, ఆదివారం

మణులు మంత్రాలు మనకు మంచి చేయునా


మణులు మంత్రాలు మనకు మంచి చేయునా
మనసులోని రాముడే మంచి చేయునా

మణులు మంత్రాలతో మనకబ్బు నట్టివి
మనసుల రంజింపజేయు మాట సత్యమే
తనువుండు నన్నాళ్ళె మన కవి భోగ్యములు
మన వెంట రానట్టివి మన కెంత మంచివి

అకళంక చరితుడై యలరు శ్రీరాముడు
సకలసుగుణధాముడు సద్భక్త వరదుడు
సకలలోక హితునిగా సంభవించిన వాడు
ఒకనాటికి విడువక నొడ్డు చేర్చు వాడు

జనులార యోచించుడు చక్కగా మీరు
తనకు మాలిన ధర్మ మనగ లేదు కనుక
వెనుకముందు లెంచి సద్వివేకబుధ్ధి కలిగి
మనసెటు మ్రొగ్గునో జనుడటు హాయిగా

21, ఏప్రిల్ 2018, శనివారం

తీయనైన మాట యొకటి తెలిపెద


తీయనైన మాట యొకటి తెలిపెద వినుమా
హాయిగొలిపి మంచి చేయు నందమైన మాట

ఎవరెంత తీయగా నేమి మాట్లాడినను
చివర కట్టి మాటలలో చిన్నగా నేని
యవలివారి స్వార్థమే యగుపించును
భువి నట్టిది కానిదై రవళించు నీమాట

ఇది మేలు చేయనని యెవరేమని చెప్పిన
నది కొంతగ మేలు చేయు నట్టి దైనను
వదలక నిహపరముల పట్టి మేలు చేయు
సదమలమై నట్టి దిది చక్కగా వినుడు

అన్నిమంత్రముల సారమైనట్టి మాట
చిన్నదైనను మోక్షసింహాసనమున
నిన్నుంచెడి మాట నీవుపాసించుమా
అన్నా శ్రీరామమంత్ర మదే గొప్పమాట

20, ఏప్రిల్ 2018, శుక్రవారం

హరి నీ వుండగ నన్నిటికి


హరి నీ వుండగ నన్నిటికి నిక
పరుల నెంచెడు పనిలేదు కద

కలదని లేదని కలహము లాడుచు
కలదో లేదో కలయో నిజమో
తెలియని మాకు తెలివిడి కలుగ
నిలపై కలిగి యినవంశమున

రాముడనే శుభనామముతో మా
భూమిని ధర్మము పొసగ నిల్పితివి
కామితార్థములు కలిగించెడు నీ
నామమె చాలును నరులందరకు

ఇహమో పరమో యెట నగు గాక
మహిమలు జూపుచు మాకడ నీవే
యహరహ ముండగ నానందమున
విహరింతుము నిర్భీతులమై

18, ఏప్రిల్ 2018, బుధవారం

దేవతలూ అప్సరసలూ

ఈ రోజున మిత్రులు మధుసూదన్ గారి నుండి ఒక ప్రశ్న విన్నాను. అందఱను స్వర్గ సౌఖ్య సంతృప్తులనుగాఁ జేయుచున్న దేవవేశ్యలందఱను సతులుగాఁ బరిగణింపవచ్చునా?" యని.

కొంచెం‌ బాధ కలిగినా అది అనేకమందికి ఉండే సందేహమే‌ కాబట్టి అలా వారు అనటాన్ని తప్పుబట్టలేను. ఇది లోకసహజమైన అభిప్రాయం కాబట్టి.

ఈ విషయంలో నాకు తెలిసిన నాలుగు ముక్కలు వ్రాయాలని అనిపించింది.

దేవతలు ప్రధానంగా తైజసమైన రూపం కలవారు. అంటే వారందరూ తేజోమూర్తులే ఐతే వారు శారీరకంగా కరచరణాద్యవయవాలూ మానసికమైన కామాదిక వికారాలూ లేని వారా అంటే లేని వారే కాని కార్యార్థం రూపధారణం చేస్తా రంతే.

మనం ఇంద్రుడు అంటాం. విశ్వనాథవారు శచీపురందర ఋషి అంటారు. సినిమాల్లోనూ‌ నాటకాల్లోనూ వారి అవసరాలకోసం నీచపాత్రను చేసి చూపుతారు నిరభ్యంతరంగా. అంటే కథాగమనం కోసమూ, వారు పైకెత్తవలసిన పాత్రలు పండటం కోసమూ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రుడైనా మరెవరైనా సరే దుష్టపాత్ర కావలసి వస్తుంది తరచుగా.

కాని నిజం ఏమిటి చూదాం.

ఇంద్రుడు త్రిలోకాలనూ‌ పాలించే కర్తవ్యం ఉన్నవాడు.

ముఖ్యంగా అయన మునులందరకూ‌ పరీక్షాధికారి.

మీరొక పోటీ పరీక్షకు బాగా తయారవుతారు. ప్రశ్నాపత్రం మరీ సులభంగా ఉందనుకోండి.

అయ్యయ్యో‌ అందరూ సుబ్బరంగా చాలా బాగా వ్రాసేస్తారు. నాలా బాగా తెలివైన వాడికి అది చూపించే‌ అవకాశం ఈ‌డొక్కు పరీక్ష పుణ్యమా అని తప్పిపోయింది అని అనుకుంటారు. ఇబ్బడిముబ్బడిగా అందరికీ మంచి మార్కులు పడిపోతే మనం గుంపులో గోవిందా ఐపోతామే అని ఆదుర్దా పడతారు. నిజమే‌ కదా?

సరే నండి. వీళ్ళిలా అనుకుంటారు అభ్యర్థు లంతానూ అని ఊహించుకొని ప్రశ్నపత్రాన్ని కాస్త కఠినంగా బిగించి ఇచ్చారను కోండి. ఏమవుతుంది?

హారి వీడి దుంపతెగా. ఇంత కర్కోటంగా పరీక్షాపత్రం ఉంటే ఎలాగూ? అందరినీ‌ బాగా ఏడిపించాలని ఎవడో శాడిష్టు మన కొంపముంచాడే! ఏంత బాగా తయారయ్యానూ, ఎంత కాలం నుండి తరారయ్యానూ, దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డానూ, వేరే అవకాశాలు ఎన్ని వదలు కున్నానూ అంటూ రాగాలు తీస్తారు. ఇదీ నిజమే‌ కదా.

అసలు పరీక్షా పత్రం అనేదానిలో కాఠిన్యం ఎందుకూ అవసరమా?

మీరే ఒక పరీక్ష పెడుతున్నారనుకోండి. మీ‌ అఫీసులో‌ ఒక జూనియర్ సైంటిష్టో మరొకటో‌ అని.

ఉన్నదేమో ఒక్క పోష్టు. అభ్యర్థులు అక్షరాలా మూడువేలమంది అని కూడా అనుకోండి.

సరే లెక్కప్రకారం పరీక్షలో ఫష్టు పదిమందికీ ఇంటర్వ్యూ నిర్వహించి మీరో మరొక టీమో చివరకు ఒకరిని నిర్థారించాలి. అదీ ప్లాను.

ఐతే మూడువేల మందిలో దాదాపు అందరూ ఒకేలా సరైన సమాధానాలు ఆటోమాటిగ్గా గీకి పారేసేలా PV = RT అనే సూత్రాన్ని ఏమని పిలుస్తారూ. అందులో R అంటే ఏమిటీ అనొకటీ, సోడియం క్లోరైడ్ అనే రసాయనపదార్థాన్ని ఏమంటారూ దాన్ని ఎందుకు వినియోగిస్తారూ, గ్రిగ్నార్డ్ రియేజెంట్లు ఎందుకు పనుకొస్తాయీ లాంటి ప్రశ్నలు సంధించారనుకోండి. చివరికి ఏంజరుగుతుందీ. సగానికి పైబడి అభ్యర్థులంతా నూటికి నూరు తెచ్చికొని గుమ్మంలో కూర్చుంటారు? ఏ పదిమందిని పిలుస్తారు వాళ్ళలోంచి?

అందుచేత ప్రశ్నాపత్రం అవసరానికి తగినంత కఠినంగా ఉండవలసి వస్తుంది. తప్పదు. నిజానికి అవసరమైన దానికన్నా కూడా సాధారణంగా కష్టంగానే ఉంటుంది మరి.

ఏదో నూరు యజ్ఞాలు చేసేస్తే చాలు ఇంద్రుడి పదవి ఊడగొట్టి ఆ యజ్ఞకర్త కాస్తా ఇంద్రుడైపోతాడూ అందుకే ఇంద్రుడు ఎవరి యాగాలూ సాగనివ్వడూ. అలాగే మునులు తపస్సు చేస్తుంటే వాళ్ళ తపస్సు వల్ల ప్రకృతి వారికి వశమై పోతుందీ‌ తన ప్రభ పదిపోతుందీ అని అందరి తపస్సులనూ ఇంద్రుడు చెడగొడుతూ ఉంటాడూ‌ అని కూడా జనం అనుకుంటారు.

నిజం‌ కాదు.

అయనకు తపస్సూ తెలుసును. దాని విలువా తెలుసును. ఆయస స్వయంగా గొప్ప ఋషి, వేదమంత్ర దృష్ట. అమ్మవారి ముఖ్యభక్తులలో ఒకడు.

ఎవరైనా తపస్సు ద్వారా ఏదన్నా ఉద్దేశాన్ని సాధించుకొనేందుకు చేస్తున్నా రనుకోండి. అది ఫలిస్తే వారికి అపూర్వమైన అవకాశంగా ప్రకృతిపై పెత్తనమే వస్తుంది అనుకోండి. ఇంకా గొప్పగొప్ప మంచీ చెడులు వారి అధీనంలోని వస్తాయనుకోండి.

అప్పుడు ఇంద్రుడు కలుగ జేసుకోవాలి.

అదికావాలీ‌ ఇదికావాలీ అని తపస్సు చేసే వాళ్ళకు ఆ తపఃఫలితంగా లభించే‌ శక్తిని భరించే సామర్థ్యం ఉండాలి ముందుగా.

అది ఉందా వాళ్ళకి అని చూసే పూచీ ఆ ఇంద్రుడు తీసుకోవాలి.

ఉదాహరణకు విశ్వామిత్రుడు కేవలం వశిష్ఠమహర్షి పైన కక్షసాధింపు కోసమే తపస్సును ఎన్నుకున్నాడు. తపశ్శక్తితో ఆయన ముందుకు వెళ్ళి చూడూ‌ ఇప్పుడు నా తపస్సే గొప్పది అని చూపా లనుకున్నాడు. ఆయన లక్ష్యంగా నిర్దేశించుకొన్న బ్రహ్మర్షిత్వం అన్నది ఎంత గొప్ప శాంతమూర్తికి తప్ప సాధ్యం కానిదో ఆయన తొలుత అవగాహన చేసుకోలేదనే చెప్పాలి.

ఇంద్రుడు ఆయనకు పరీక్షలు పెట్టాడు. రకరకాలుగా విసిగించాడు.

ఆయనతో కాపురంచేసిన మేనక అలాంటి ఒక కథానాయకి.

ఆయన కోపాగ్నికి బలై శిలారూపం ధరించిన రంభ మరొక పాత్ర.

కాని ఈ‌పరీక్షలే విశ్వామిత్రుడిలో మొదట అసహనాన్నీ కోపాగ్నినీ‌ రగిల్చినా ఆయన చివరకు విషయం అర్థం చేసుకున్నాడు.

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావటమే‌ కాదు. విష్ణ్వతారమైన రామచంద్రమూర్తికి గురువు కూడా కాగలిగాడు.

ఇంద్రుడి పరీక్షల వలన మంచే‌ జరిగించి.

ఆయన స్వయంగా అందరూ నిత్యం ఆరాధించే గాయత్రీ మంత్రదఋష్ట అన్నది మనకు తెలుసు.

అయన గొప్పదనానికి ఇంద్రుడు కూడా గొప్ప కారణమే.

అనవసరంగా ఇంద్రుడి సోది ఎందుకు చెప్పాను అనవచ్చును. సరే, ఇంక అప్సరసల సంగతి చూదాం.

పురూరవుడు అని గొప్పరాజు. అయన ఊర్వశిని వలచి ఇంద్రుడి అనుమతితో‌ భార్యను చేసుకొన్నాడు.

కొన్నాళ్ళ తరువాత ఆవిడ కాస్తా గడువు తీరిపోయింది. సెలవు అని చులాగ్గా అనేసి వెళ్ళిపోతే పురూరవుడు అక్షరాలా లబలబ లాడాడు.

మళ్ళీ కాళ్ళావేళ్ళా పడి ఆమెను వెనక్కు తెచ్చుకున్నాడు.

ఒకసారి ఊర్వశి పురూరవుడితో ఒక కొండమీద విహారానికి వెళ్ళింది ఆ కొండమీద అడవుల్లో కొంత కాలం విహరించారు. అప్పుడు ఆవిడ పురూరవుడితో, రాజా ఈ‌కొండమీద సాక్షాత్తూ విష్ణుమహాదేవుడు వరాహనారసింహద్వయ రూపిగా వెలసి ఉన్నాడు సుమా- ఇది మహనీయమైన పుణ్యక్షేత్రం అన్నది. పురూరవుడికి ఎంతో అబ్బురం‌ కలిగింది. ఎక్కడ ఎక్కడ అని ఆరాట పడ్డాడు. ఆవిడ తాపీగా ఈ కొండమీదా నిశ్చయంగా ఉన్నాడు. ఎక్కడో మనం వెదుకుదాం అన్నది.

ఇద్దరూ శ్రమపడి చెట్లూ పుట్టలూ గుహలూ వగైరా బాగా గాలించి స్వామిని దర్శనం చేసుకొన్నారు.

అదే పరమపవిత్రమైన సింహాచల మహాక్షేత్రం.

ఈవిధంగా ఊర్వశీదేవి మనకు వరాహనరసింహస్వామిని పరిచంయం చేసింది. మహనీయురాలు.

అవిడ దేవత. మనలాగా పరిమితులు కల మానవశరీరి కాదు.

అవిడకు ఆకొండమీద దేవు డున్నాడని ముందే గమనిక కలిగింది.

తన దివ్యశక్తితో భవద్దర్శనం చేసుకొన్నది.

కాని పురూరవుణ్ణి తరింపజేయాలన్నది ఆమె సంకల్పం.

అందుకే తనకు సరిగా తెలియదు అని అమాయకంగా చెప్పి, ఆయనతో జాగ్రత్తగా స్వామిని భక్తితో వెదకించింది.

నిజానికి ఇది ఆమెసంకల్పమా?

దేవతల సంకల్పం.

దేవప్రభువూ‌ పురూరవుడికి శ్రేయోభిలాషీ మిత్రుడూ ఐన ఇంద్రుడి సంకల్పం ఇది.

ఊర్వశి మంచి పాత్రపోషించింది ఈ వ్యవహారంలో.

ఇంద్రుడు ఒక పధకం ప్రకారం ఊర్వశిని పురూరవుడికి పరిచయం చేసాడు నాటకీయంగా. ఆమెను సశరీరంగా చూడటంతో పురూరవుడు ఆమెపై మరులు గొనటమూ దేవసంకల్పమే.  ఆయనద్వారా సింహాచలం దేవుణ్ణి మనకు చూపటం అన్నది దేవతల పధకం. దాని కారణంగా పురూరవుడు నిత్యస్మరణీయుడూ తరించిన వాడూ అయ్యాడు.

చివరికి ఊర్వశీ పురూరవుల కథలో ఏమి జరిగింది.

దేవసంకల్పం నెఱవేరింది,

ఊర్వశి వెనుదిరిగింది.

మళ్ళా ఆ పురూరవుడు ఆమెకోసం‌ ఈ సారి పెద్ద తపస్సు చేసాడు.

దేవతలకు నియమం. తమకోసం తపస్సు చేస్తే వాళ్ళకు యోగ్యమైన వరాలు ఇవ్వాలి. తప్పదు.

ఊర్వశీ దిగిరాక తప్పదు.

వచ్చి ఏమిచేసింది?

ఓ రాజా, శరీరధారులకు ఉండే ఈ‌కోరికలు స్వల్పప్రయోజనం కలవి మాత్రమే సుమా అని చెప్పింది. ఆయనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసింది.

పురూరవుడు జ్ఞానవంతుడై తన శరీరాన్ని కాక సంపూర్ణంగా భగవంతుని ప్రేమించి తరించాడు.

ఈ‌కథలు ఎందుకు చెప్పానో‌ పాఠకులు కొంచెం అవగాహన చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను.

దేవతల తప్పులు వెదకకండి. అది దోషం.

భగవంతుడి తప్పులు వెదకకండి. అది అపచారం.

మన శక్తియుక్తులు అతిస్వల్పమైనవి. మొన్న రాత్రి భోజనంలో ఏమి కూర తిన్నావు అంటే ఈ‌ ఉదయం ఎంతో‌మందికి సరిగా గుర్తుకు రాదు. ఎన్నో‌ జన్మల గురించీ వాటిలో మనం ప్రోగుచేసుకొన్న కర్మఫలాల గురించీ ఎవరికి తెలుస్తుంది?

దేవతలకు తెలుస్తుంది.

వారు సహాయం చేస్తారు.

మనకోసం, అవసరమైతే, మనమధ్యనే ఉండి వారు నయానో భయానో, మనకు అభ్యున్నతిని చేకూరుస్తూ ఉంటారు.

ఒక్కొక్క సారి వాళ్ళు మనని కష్టాల పాలు చేస్తున్నారని అనిపించవచ్చు. వాళ్ళు క్రూరులనీ అనిపించవచ్చును.

వారు ఉద్దేశించిన మంచిని మనం అందుకొన్న నాడు వాళ్ళు సంతోషిస్తారు.

అందుచేత దయచేసి దేవతల పట్ల కాని అప్సరసల పట్ల కాని చులకన మాటలు మాట్లాడ కూడదని అర్థం చేసుకోండి.

మాట వరసకు ఒక అప్సరస స్వర్గంలో ఒకనికి కామాది సుఖాలను అందిస్తున్నది అనుకుంటే దాని అర్థం ఆమె మానవలోకం నుండి వచ్చిన ఒకడి కోసం మానవస్త్రీలాగూ ఐపోయి మన లోకంలో ఉంటారని చెప్పబడే ఒక వేశ్యలాగా ప్రవర్తిస్తుందని కాదు. కానే‌ కాదు. ఆ భోగాల పట్ల ఆజీవికి మిగిలి ఉన్న ఆసక్తిని తగ్గించి నయంచేసేందుకు ఆవిడ దగ్గర ఉపాయం ఉందని. తేజో‌జీవులైన వారి వద్ద ఉండే ఉపాయం ఏమిటంటే వారి తేజస్సుల ప్రభావం ఆ జీవులను ఆకర్షించి వారి నుండి మోహాదులను తొలగించటం. ఆమె అలా తొలగిస్తున్నది అని అర్థం.

లౌకిక సాహిత్యంలోనికి తెచ్చేసరికి ఈ అవగాహనలన్నీ కూడా పరమపవిత్రము లన్నవి పరమ జుగుప్సాకరంగా ప్రతిబింబించబడ్దాయి.

అది కవుల తప్పా మనతప్పా అన్నది పక్కన బెడదాం. ఆచర్చ వలన మనకు ఉపయోగం లేదు.

ఇప్పడు సరైన దృక్పథంతో అర్థం చేసుకోవటం మేలు చేస్తుంది.

చివరగా పాఠకులకు ఒక విన్నపం. నాకు తోచిన ముక్కలు నాలుగు చెప్పాను. అందరికీ‌ నచ్చకపోవచ్చును. ఏదో‌ పత్రికల వాళ్ళకు నా స్వబుధ్ధి వ్యవహారమే అని హామీ ఇచ్చినట్లుగా మీకు కూడా ఇది నాకు తెలిసిన నాలుగుముక్కలే‌ కాని ఎవర్నీ‌ మెప్పించటానికి కాని నొప్పించటానికి కాని కావని వివ్నవించటమైనది అని చెప్పుకుంటున్నాను.