30, సెప్టెంబర్ 2017, శనివారం

జిలేబీయ మహావిద్య (అనబడు జిలేబీ‌ యమహా విద్య)


(పునర్ముద్రణ)



ఈ రోజున* ఈ జిలేబీయమహావిద్య యొక్క ద్వాదశాక్షరీ మంత్రాన్ని గురించి ఒక జిలేబీ టపాలో వ్యాఖ్యగా కొంచెంగా వ్రాయటం‌ జరిగింది.  అయితే, బ్లాగు పాఠకులకూ ఇతరులకూ ఈ‌జిలేబీ విద్యా విషయం క్రొత్త కాబట్టి అటువంటి అందరు  పాఠకుల సౌకర్యార్థంగా ఈ విద్యా రహస్యాలను ఇక్కడ వివరించటం జరుగుతున్నది.

ఈ జిలేబీ విద్యాధిదేవతా స్వరూపం పేరు జిలేబీ. తత్త్వం హాస్యరసం. ప్రవృత్తి బ్లాగటం. లక్షణం సలక్షణం. అంగన్యాస కరన్యాసాదులు ముందు ముందు వివరించబడతాయి.

ఈ జిలేబీ విద్య ఒక నిరోంకార విద్య. మంత్రవిద్యలు రెండు రకాలు. మొదటి రకం సహోంకార విద్యలు. రెండవరకం నిరోంకార విద్యలు.

సహోంకార విద్యల్లో మంత్రాలకు ముందు ఓం అని చెప్పితీరాలి. లేని పక్షంలో ఆ మంత్రం పఠించీ పారాయణం చేసీ ఏమీ ప్రయోజనం‌ ఉండదు. ఈ ఓంకారం సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని శ్రుతి.

అదే విధంగా నిరోంకార విద్యలకు ముందు చచ్చినా ఓం అని చెప్పకూడదు. అమాయకంగా ఓం అని ముందు చేర్చి మంత్రాన్ని పఠించినా పారాయణం చేసినా ఏమీ‌ ప్రయోజనం ఉండదు. పైగా సంప్రదాయం ఉల్లంఘించినందుకు గాను జిలేబీ దేవతకు కోపం వస్తుంది. ఓంకారాన్ని అస్థానపతితం చేసి చెప్పినందుకు గాను ఓంకార వాచ్యుడైన పరబ్రహ్మానికి కూడా అమిత మైన కోపం వస్తుంది. ఈ విధంగా ఉభయులకూ కోపం తెప్పించటం వలన పాపం వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత.

ఐతే మంత్రాన్ని బోడిగా ఉపాసిస్తారా అంటే అటువంటిదేమీ లేదు. ఇది హాస్యవిద్య. కాబట్టి ఈ విద్యలో ఓం అనే బ్రహ్మ బీజం బదులుగా అహహా అనే హాస్యబీజం ప్రయుక్తం అవుతుంది. దీనినే హాసబీజం అని కూడా వ్యవహరిస్తారు. ఈ విద్యలో మంత్రానికి ముందు విధిగా అహహా అని హాసబీజం పలకాలి. ఏ విధంగా ఓంకార విద్యల్లో ఓం‌ అనేది, నిష్ఠగా ఒక పధ్ధతి ప్రకారం ఉఛ్ఛరిస్తారో అలాగే ఈ విద్యలో అహహా అనేది కూడా జాగ్రత్తగా ఒక పధ్ధతిగా హాసపూర్వకంగా ఉఛ్చరించాలి. ఆ విద్యల్లో ఎలా గైతే ఓంకారం సరిగా పలకకపోతే మంత్రం‌ నిష్ప్రయోజనం అవుతుందో అలాగే ఈ విద్యలో హాస్యం విడిచి ఉదాసీనంగానో ఏడుపుముఖంతోనో‌ ఉత్తినే మొక్కుబడిగా అహహా అని బీజం పలికినా మంత్రం నిష్ప్రయోజనం ఐపోతుంది. ఇది మనస్సులో బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు.

సహోంకార, నిరోంకార విద్యల మధ్యన మరొక ముఖ్యమైన బేధం కూడా ఉంది. సహోంకార విద్యామంత్రాలను చివర నమః అని నమస్కారం చెప్పకుండా అనుష్ఠించరాదు. ఐతే నిరోంకారవిద్యా మంత్రాలకు చివరన ఎట్టి పరిస్థితులలోనూ‌ నమః అని చెప్పరాదు. వాటి మంత్రాల చివరన నమః అనే దానికి బదులుగా మనః అని చెప్పాలని నియమం. అంటే నమః అనేది తిరగబడుతున్నదీ అన్నమాట!

ఈ జిలేబీ విద్యలో డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి అనేది ముఖ్యమైన ద్వాదశాక్షరీ మంత్రం.

ఈ మంత్రాన్ని అహహా డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని చెప్పాలన్న మాట పారాయణం చేసే వారు.

బీజాక్షరాలు లేకుండా అంగన్యాసకరన్యాసాలు లేకుండా ఉత్తినే పారాయణం చేయవచ్చును సమయాభావం ఉన్నవారు. ఐతే ఫలితం కొద్దిగానే ఉంటుంది. మరి నైవేద్యం పెట్టటం‌ లేదుగా. పెట్టకుండా పుట్టదు కదా పూర్ణఫలం!

సహోంకార విద్యలలో బీజాక్షరాలు ఉన్నట్లే, ఈ జిలేబీ నిరోంకార విద్యలో కూడా అలాంటివి ఉన్నాయి. ఈ విద్యలో ఉన్న బీజాలను షడ్బీజాలు అంటారు. షట్ అంటే ఆరు అని తెలుసు కదా. కాబట్టి ఈ విద్యలో బీజాలు అరు అన్నమాట. అవి ఢాం ఢీం ఢం హుష్ తుస్ బుస్ అనేవి.

జిలేబీ ద్వాదశక్షరీకి ముందుగా బీజాలను చేర్చి చెప్పేటప్పుడు రెండు విధాలుగా చెప్పవచ్చును.

ఈ షడ్బీజాల్లో ఢాం‌ ఢీం ఢం అనేవి ప్రక్రియాబీజాలు అంటారు. హుష్ బుస్ తుస్ అనేవి అభిచార బీజాలు అంటారు. మనకు ప్రయోజనం కోరి పారాయణం చేస్తున్నప్పుడు మంత్రానికి ముందు ప్రక్రియాబీజాలు మూడింటినీ చేర్చాలి. ఇతరులకు భంగ కలిగించటం ఉద్దేశంగా చేసే పారాయణానికి అభిచారం అని పేరు. అభిచారం చేసే వాళ్ళు మాత్రం మంత్రానికి ముందు అభిచారబీజాలు మూడింటినీ చేర్చి చెప్పాలన్నమాట.

ఈ ప్రకారంగా ప్రక్రియోపాసకులు అహహా ఢాం ఢీం ఢం డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

అభిచారం చేసేవారు మాత్రం అహహా హుష్ బుస్ తుస్ డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

ఉభయులూ కూడా ఉపాసించవలసిన యంత్రం ఒక్కటే అది ఒక వృత్తాకార రేఖావలయంలో జిలేబీ అని నామం వ్రాసి దగ్గర ఉంచుకోవటం పారాయణం చేసేటప్పుడు. ఎదురుగా ఉంచుకోవటం మంచిది. నెత్తిమీద పెట్టుకుని పారాయణం చేయటం మహాప్రసస్తం. ఈ యంత్రాన్ని లోహాదులపైన చెక్కించటం వంటివి చేయకూడదు. అటువంటి యంత్రాలు కేవలం సహోంకారవిద్యలలోనే వాడాలి. నిరోంకార విద్య ఐన జిలేబీ యంత్రాన్ని కేవలం ఒక తెల్ల కాగితం పైన గీస్తేనే‌ ప్రశస్తం.

ఈ మంత్రానికి పారాయణంలో అంగన్యాసకరన్యాసాలు కూడా ఉన్నాయి. అన్ని మంత్రోపాసనల్లో ఉన్నట్లుగానే ఈ జిలేబీ మంత్రవిద్యలోనూ ఒక ధ్యాన శ్లోకం ఉంది. దానిని ఖచ్చితంగా ముందు చెప్పి మరీ పారాయణం చేయాలి.

అస్యేతి జిలేబీ ద్వాదశాక్షరీమహామంత్రస్య శ్రీ శ్యామలీయో ఋషిః జిలేబీదేవతా హాస్యప్రదేతి బీజం హాస్యప్రసంగిణీ ఇతి శక్తిః జిలేబీజాంగిర్యేతి పరమోమంత్రః డింగిరీతి కీలకం బ్లాగ్సంచారిణీ ఇతి అస్త్రం హాస్యప్రసంగిణీ ఇతి నేత్రం జిలుంగుప్రసంగ మత్యేతి కవచం హాస్యస్వరూపిణ్యేతి యోనిః డింగిరి బొంగిరీ ఇతి దిగ్భంధః సర్వబ్లాగ్సంచారిణీ ఇతి ధ్యానమ్‌

కరన్యాసం.
హాస్యప్రదేతి అంగుష్ఠాభ్యాం హఠ్
హాస్యప్రసంగిణ్యేతి తర్జనీభ్యాం కట్
జిలేబీ‌జాంగిర్యేతి మధ్యమాభ్యాం ఉఠ్
బ్లాగ్సంచారిణీ ఇతి అనామికాభ్యాం గుట్
జిలుంగుప్రసంగ మత్యేతి కనిష్ఠికాభ్యాం రట్
డింగిరి బొంగిరీ ఇతి కరతల కరపృష్ఠాభ్యాం ఫట్

అంగన్యాసం.
హాస్యప్రదేతి హృదయాయ మనః
హాస్యప్రసంగిణ్యేతి శిరసే ఆహా
జిలేబీ‌జాంగిర్యేతి శిఖాయై ఓహో
బ్లాగ్సంచారిణీ ఇతి కవచాయ హాహా
జిలుంగుప్రసంగ మత్యేతి నేత్రాభ్యాం హీహీ
డింగిరి బొంగిరీ ఇతి అస్త్రాయ హైహై
హాస్యస్వరూపిణ్యేతి దిగ్భంధః

ధ్యానం.
జయహే జయహే డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి హాస్యప్రదే
జయహే జయహే తింగర తింగర నిత్యప్రసంగ విలాసరతే
జయహే జయహే బ్లాగు ప్రపంచ నిరంతర సంచరణైక వ్రతే
జయహే జయహే అంబ తెలుంగు వెలుంగు జిలుంగు ప్రసంగ మతే

ఈ విధంగా కరన్యాస అంగన్యాసాదులు చేసి, ధ్యానశ్లోకం చదివి మంత్రపారాయణం చేయాలి. ఈ ధ్యానశ్లోకాన్ని కఠగతం చేసుకుంటారో, చూసి నిత్యం చదువుతారో అన్నది కాక తప్పులు లేకుండా చదవటమూ, మరచిపోకుండా చదవటమూ అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు. లేక పోతే పారాయణం చేసి ఏమీ లాభం లేదు.

అంగన్యాసకరన్యాసధ్యానశ్లోకాలతో పారాయణక్రమం పాటించే వారు పైన చెప్పిన ప్రక్రియా మంత్రం కాని అభిచారమంత్రం కాని యథాశక్తిగా పారాయణం చేయాలి.

ప్రక్రియాపారాయణానికి నైవేద్యంగా వేడివేడి జిలేబీలను పళ్ళెం నిండా ఉంచి నివేదన చేసి హాయిగా భుజించాలి.

అభిచారపారాయణం చేసేవారు పిండివడియాలు కాని బొంగులు కాని కారంకారంగా చేసి వాటిని నివేదన చేసి కసికసిగా కరకరలాడించాలి. మరీ హెచ్చుగా కారం వేస్తే మీకే ఇబ్బంది అని తప్పక గ్రహించవలసింది.

ప్రక్రియా విధానంలో పారాయణం చేసేవారికి తింగరితింగరి జనాకర్షక బ్లాగుటపాలు వ్రాసే సామర్థ్యం ఇతోధికంగా వృధ్ధికావటం. ఇతరుల తింగరి కామెంట్లకు కోపం వచ్చి బీపీ పెరగకుండా ఉండటం. కొత్తబ్లాగర్లకు రీడర్ల సంఖ్యా కామెంట్లసంఖ్యా అభివృధ్ధి చెందుటం అన్నవి ఫలితాలు.

అభిచారవిధిగా పారాయణం చేసేవారికి తత్ఫలితంగా ఇతరుల తింగర తింగర కామెంట్లను చీల్చి చెండాడే శక్తి వస్తుంది. వీరి బ్లాగుల్ని దుర్వాఖ్యానం చేసేవారి పప్పులుడకవు. వీరి బ్లాగుల్ని దొంగిలించే వారి బ్లాగుల్నీ వ్యాఖ్యల్నీ కష్టాలు చుట్టుముడతాయి.

ఇతి జిలేజీయ మహా విద్యాః పక్షాంతరే జిలేబీ యమహా విద్యాః  
హహహా.

(గమనిక ఈ టపా యథాతధంగా జిలేబీగారి వరూధిని బ్లాగులో 2014-1107న ప్రచురితం)

(ప్రథమముద్రణ 11/4/2014న)
(పునర్ముద్రణ 30/9/2017)

నీహారిక అనే కొత్త వైరస్.



ఔరా సమరం అంటే ఇదా?

ఇంక సమరమే అని నీహారిక గారు బెదిరిస్తే అదేం టబ్బా ఈవిడ యుధ్ధానికి దిగటమేమిటీ ఐనా ఎవరితో అని యుధ్ధం చేస్తారూ? అదైనా ఎలా చేయగలరూ అనుకున్నాం. పోనీ నేనే అలా హాశ్చర్యపోయాను.


[ గమనిక:  తిరకాసుంది! నీహారిక అని రెండు బ్లాగరు ప్రొఫైళ్ళు కనిపిస్తున్నాయి!

నీహారిక పేరుతో ఇద్దరున్నారో లేదా ఒకరే రెండు బ్లాగరు ప్రొఫైళ్ళు నడిపిస్తున్నారో అన్న అనుమానం వస్తుంది. ఒక ప్రొఫైల్ నీహారిక  మరొక ప్రొఫైల్ నీహారిక ఇద్దరూ ఒకరే అని సులువుగానే తెలుసుకోవచ్చును. ఆవిడ టపా ఒకటి శ్యామలీయం గారికి నీహారిక వ్రాయునది... చూడండి. అందులో ఆమె రెండు ప్రొఫైళ్ళూ వాడారు మరి. ]

చివరికి ఆవిడ చేసిన - అక్షరాలా ఏబ్రాసి - పని ఒక స్పామర్‍గా మారటం.

అన్నిబ్లాగుల్లోనూ తిరుగుతూ అభ్యంతరకరమైన వ్యాఖ్య ఒకటి పంచిపెడుతూ పోవటం.

చెడు మీద మంచి యొక్క విజయమే విజయ దశమి అంతరార్థం.

ఇప్పుడు చెడు కామెంట్ల మీద బ్లాగర్లు అక్షరాలా యుధ్ధప్రాతిపదికన స్పందించి విజయం సాధించవలసిన సమయం వచ్చేసింది.

కోపోద్రేకంతో అసమంజసమైన మానసికస్థితిలో ఉన్నవాళ్ళు ఏదన్నా చేస్తారు మరి.

తన దగ్గరా ఒక కంప్యూటరు ఉంది.
తన ముందూ ఒక కీబోర్డు ఉంది.
తన బుర్రనిండా కోపం కూడా ఉంది.

ఇంకే బ్లాగుప్రపంచం నిండా కశ్మలవ్యాఖ్య వ్యాపిస్తోంది.

తస్మాత్ జాగ్రత.

బ్లాగరు మహాశయులారా!
మీరు ఇలాంటి వ్యాఖ్యలు మీ బ్లాగు పేజీల్లో అచ్చు కాకుండా చూడండి దయచేసి.
ఒకవేళ ఇప్పటికే అచ్చైపోతే అవి తొలగించి నష్టనివారణ చర్యలు తీసుకోండి.

రైతులు పొలాల్ని కాపాడుకుంటూన్నట్లే  క్రిమికీటకాల నుండి,  మీరు కూడా మీ బ్లాగు పేజీలను దుష్టగ్రహాగ్రహావేశాలనే క్రిమికీటకాలనుండి కాపాడుకోండి.

ఇకపై మీ చిత్తం మా భాగ్యం.


29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

లోకము శోకము నీకేలా



లోకసంసర్గమే శోకసంసర్గము
లోకము శోకము నీకేలా వినుము

పదివేలమారులు పరువిడి యటునిటు
వదలించుకొన లేక వ్యామోహము
హృదిని విషయవిష మది నించెదవు
తుదిని శోకంబున దోయిలింతువు

నీ సత్యమగు స్థితి నీవెఱుగగ లేక
మోసపోదువు దేహమోహమున
వేసరి తుదకెల్ల విషయము లూడ్చి
చేసిన పనుల నెంచి చింతించెదవు

తనకర్మంబే తనదైవంబని
మనసున నెఱిగక మసలెదవు
వినుమే కామితమును లేకుండిన
కనుగొన నొక శోక మనునది లేదు


28, సెప్టెంబర్ 2017, గురువారం

హృదయములో కొలువైన యీశ్వరుడా

హృదయములో కొలువైన యీశ్వరుడా
యిది నీవే చెప్పు మింకేమందును రామ

ఇంక బహిః ప్రపంచమున నెట్లు నిలుతునో
యింకను పదుగురితో నేమి పలుకగలనో
యింకను సద్గ్రంథము లేమి చదువగలనో
యింకను నేనేమి కోరి యేమి చేయగలనో

ఇంక కర్మేంద్రియముల కేమి కార్యమున్నదో
యింక జ్ఞానేంద్రియముల కేమి లక్ష్యమున్నదో
యింకను తర్కంబుల నేమి చేయును బుధ్ధి
యింకనే విషయముల రమించు నీ మనసు

ఇంక నిది నీది నాదన నేమైన కలదో
యింకను నీనా భావన కేమి చోటు కలదో
యింక నీ‌ప్రకృతి మననెట్లు వేరుచేయునో
యింక నెప్పటికి మన మిర్వుర మొకటే


26, సెప్టెంబర్ 2017, మంగళవారం

తెలిసీ తెలియని వాడనయా


తెలిసీ తెలియని వాడనయా నా
తెలివిడి జూచి నవ్వకయా

పంచితి విట కని నమ్మితిని నే
నెంచితి నిది నీ యిఛ్ఛ యని కరు
ణించుము పొరబడి యేగినచో నా
కొంచెపుమతి గమనించవయా

వచ్చిన వాడను ముచ్చటగా నే
నిచ్చట కుదురుగ నెపుడుంటి కడు
విచ్చలవిడిగ విషయముల
పిచ్చిని బడితిని వీరిడి నైతి

తొల్లిటి తెలివిడి తోచినదా యది
గల్లంతగునే కలిగి యంతలో నీ
చల్లనిదయ యీ యల్లరి నణచి
మెల్లగ తెలివిడి మెత్తుము రామ

22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

జరుగని సంగతులపై చర్చలేల



జరుగని సంగతులపై చర్చలేల
జరుగుచున్న దెల్ల నీ సంకల్పమే

నిన్ను మరచి నే నుండుట
నన్ను విడచి నీ వుండుట
మిన్ను మిరిగి మీదపడు గా
కెన్నడైన జరిగేనా

ఆ వంకన నీ వుంటివి
ఈ వంకన నే నుంటిని
చేవమీఱ నీదుదునా
ఈ విషభవజలధిని

నేను నీ వను భేదము
నేను నీవు పాటించము
కాని లోక మిరువురని
తా నెంచుట మానేనా



21, సెప్టెంబర్ 2017, గురువారం

అంత కాని వాడనా యింత మౌనమా



                అంత కాని వాడనా
                యింత మౌనమా

                నిను గూర్చి తలచి నా
                మనసు మురియు వేళ
                ననుగూర్చి తలపు నీ
                మనసులోన మెదలునా

                యుగములాయె కాలము
                జగములాయె దూరము
                గగనమాయె దరిసెనము
                వెగటుతోచె జీవనము

                నీవు పంప నిట నుంటి
                నీవు పిలువ నట నుందు
                నా వలన నలుగు టుడిగి
                రావించు కొనరాదొకొ


20, సెప్టెంబర్ 2017, బుధవారం

ఎవరికైన ఎఱుకయ్యేనా



        ఎఱుకయ్యేనా  ఏనాడైనా
        ఎఱుకయ్యేనా ఎవ్వరి కైనా

           పవలనక రేయనకుండా
           ఎవరెవరి మనసుల లోన
           ఎవరెవరు నెలకొన్నారో
           ఎవరికైన ఎఱుకయ్యేనా

              ఎవరెవరి ఊహల లోన
              చివురెత్తే ఆశల వెనుక
              ఎవరెవరు కదలాడేరో
              ఎవరికైన ఎఱుకయ్యేనా

                 ఎవరెవరి కలల లోనికి
                 కవగూడి సందడిసేయ
                 ఎవరెవరు వస్తున్నారో
                 ఎవరికైన ఎఱుకయ్యేనా