14, ఆగస్టు 2017, సోమవారం

నల్లని వాడవని నవ్వేరాఅందచందాలవాడా అందరివాడా
నందునింటి పిల్లగాడా నావాడా

అల్లరి వాడవని నవ్వేరా జనులు
నల్లని వాడవని నవ్వేరా
పిల్లనగ్రోవి పాట మెచ్చేరా జనులు
చల్లని నవ్వులను మెచ్చేరా

మోజుపడి గొల్లతలు వచ్చేరా గో
రాజనాల రాకాసులు చచ్చేరా
రాజులంత నీతెలివి మెచ్చేరా యోగి
రాజులెల్ల నీమహిమ మెచ్చేరా

వేయినోళ్ళ సురలెల్ల పొగడేరా నా
రాయణుడం వీ వని మ్రొక్కేరా
నీయంత వాడ వీవె నినుచేర యీ
మాయతెర తొలగించి బ్రోవవేరామంచి బహుమానమిచ్చి మన్నించితివి


మంచి బహుమానమిచ్చి మన్నించితివి నా
కొంచెపుదన మెంచక కూరిమితో నీవు

ఇదిగో యీ తనువేనా యిదికాదు యిదికాదు
ఇదిగో యీ మనికియా యిదికాదు యిది కాదు
చెదరని సాన్నిధ్యమా చెప్పుకొంటి విదే యిదే
యిదే యిదే నీవు నా కిచ్చిన బహుమానము

నీ సన్నిధి లేకున్న నేనొక్క తరువు నేమొ
నీ సన్నిధి లేకున్న నేనొక పెనుశిల నేమో 
నీ సన్నిధి లేకున్న నేనొక్క జడుడ నేమొ
నీ సన్నిధి దొరకినది నీవాడ నైతి నిదే

చింతలేక నీసన్నిధి చేరియుంటినయ్యా
ఇంతకన్న బహుమానం బేముండు నయ్యా
అంతకంత కథికమై యనుభవైకవేద్య మైన
అంతులేని నీ ప్రేముడి యపురూప మయ్యా


13, ఆగస్టు 2017, ఆదివారం

నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు

నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు
వెనుక నేనాడైన వేడుకగ నేడైన

తనుమాత్రునిగ నన్ను తలచువారే కాని
కనుగొంటిరా నాదు కలరూపు నొకరు
నినునమ్మి యుందునని ననునమ్మ లేని
మనుజులెన్నడు నన్ను మది నెంచగలరు

అటనున్న దిటనున్న దంతయు నొకటన్న
స్ఫుటమైన సత్యమును జూచు వా రెందరు
కుటిలతర్కములందు కూలబడి నట్టి జను
లటమటమున తత్త్వార్థవేత్త లౌదురె

ఏవారలు మెత్తు రేవారలు మెచ్చ
రీవివరముల చింత లెందుకు మనకు
నీవునాకు నీకునేను కావలసిన దింతె
పైవారి తోడ మనకు పంతము లేల


11, ఆగస్టు 2017, శుక్రవారం

నీవే నేనుగ నేనే నీవుగనీవే నేనుగ నేనే నీవుగ
భావించిన శుభపక్షంబున నిక

బంధము కలదా బాధలు కలవా
సంధించగ ప్రశ్నావళి కలదా
గ్రంథము కలదా గాథలు కలవా
అంధలోక మే మనునో యననీ

లోకము కలదా శోకము కలదా
చీకటి కలదా వేకువ కలదా
యేకత్వము గా కితరము కలదా
ఈ‌ కాలం‌ బిక లేక పోవు కద

నేనుండెదనా నీవుండెదవా
ఈ‌ నేనును నీ వేమి పదములు
తానై నిండిన తత్త్వం బొకటే
జ్ఞానత్రిపుటియు లేనే లేదు9, ఆగస్టు 2017, బుధవారం

జగ మిది కలయా ఒక చక్కని నిజమా


జగ మిది కలయా ఒక చక్కని నిజమా
తగు సమాధానము దయచేయ వయ్యా

కలయైనచో మరి కనులు తెరచి నేనేడ
కలగానిచో రేపు కనులు మూసి నేనేడ
విలువైన వివరము వినిపించవే
చెలుడా యిది నీవు కాక చెప్పేదెవరయ్యా

కలలలో పలుతావుల పలురూపుల నుందునే
అలలవలె మంచిచెడులు కలిగి మలగుచుండునే
చెలికాడ తెలుపవే యిలపై నాకు
కలుగు జన్మములు పెద్ద కలలోని సంగతులా

కలయందువా ఈ కల నీదో నాదేనో
కలకానిచో నా కలరూపు కథయేదో
చెలికాడ యికనైన దయచూపవే
తెలుపవే కల్లనిజము తీయతీయగా నీవు

1, ఆగస్టు 2017, మంగళవారం

నను నేను తెలియుదాక

నను నేను తెలియుదాక నిను నేను తెలియలేను
నిను నేను తెలిసితినా నే ననువాడ నేలేను

వెనుక నేను లేనే లేనని విని యుంటి నీవలన
కనుక నేను కలిగిన దెపుడో కనుగొన వలయును
మునుముందు నేనేమై పోవుదునో యెఱుగనయా
నను నేను తెలియలేని మనుజవేష మెందుకయా

ఇదిగో యీ‌యాట నీవే మొదలు పెట్టినావు కాదా
మొదలు తుది లేని యాట వదిలేది లేదు కాదా
అదనుచూచి యాట కీలక మంతా పసిగట్టాలంటే
అది నన్ను నేను తెలియునంత దాక కుదరదయా

తగ్గని పంతాలవాడా నెగ్గిన పందాలవాడా
సిగ్గరివలె దాగ నేలా ముగ్గులోకి  నీవూ రారా
లగ్గుగ నను నేను తెలిసి యొగ్గెద నన్నే రారా
నెగ్గే నీలోన కలిసి నెగ్గువాడ నే నయ్యెదరా