13, నవంబర్ 2016, ఆదివారం

రామకీర్తనల పాఠకులకు విజ్ఞప్తిసర్వేశ్వరుడు హరి శ్రీరాముడై అనుగ్రహించగా ఇప్పటికి రామకీర్తనలు రెండువందలు పూర్తి కావటం‌ జరిగింది

నేటినుండి మూడవ వందకు ప్రారంభం.

మొదట్లో ఈ‌ కీర్తనలను కొన్నింటిని కొండలరావుగారి సౌజన్యంతో వారి జనవిజయంలో ప్రచురించటం‌ జరిగింది.

ఆ తరువాత వాటిని మరలా క్రమబద్ధం చేసి శ్యామలీయంలో ఒక అమరికలో ఉంచటమూ వాటిని ఒక ప్రత్యేకమైన శ్రేణిలో ప్రచురిస్తూ రావటమూ మొదలయ్యింది.

ఈ మధ్యకాలంలో ఈ‌ కీర్తనలు వెలువడటంలో చెప్పుకోదగినంత వేగం‌ వచ్చింది. అలా రావటం‌ కారణంగా వాటిని వెలువడినవి వెంటనే ప్రచురించటం చేయకుండా రోజువారీగా ఏర్పాటు చేసి ప్రచురిస్తూ వచ్చాను. కానీ ఆ పద్ధతి నాకు క్రమంగా అసంబధ్ధంగా అనిపించసాగింది. తప్పుచేస్తున్న భావన కలుగసాగింది.

అసంబధ్ధంగా అనిపించటానికి కారణం కీర్తన వెలువడిన దినాంకానికీ అది బ్లాగులో వచ్చిన దినాంకానికీ తేడా వస్తూ ఉండటమే.

అందుచేత ఆప్పటినుండీ వచ్చిన కీర్తన వచ్చినట్లుగా వెంటనే వెలువరించటం జరుగుతున్నది.

రోజునకు ఒకటి వచ్చినప్పుడు పాఠకులకు అవి పాఠకులకు బ్లాగులో సులువుగా దర్శనం ఇచ్చేవి.

కాని ఇలా క్రమంగా రోజూ రెండు చొప్పున రావటమూ అప్పుడప్పుడూ మూడు లేదా నాలుగు కీర్తనలు కూడా రావటమూ వలన పాఠకలోకానికి కొచెం ఇబ్బంది కలిగిందని అనుకుంటున్నాను.

ఎందుకంటే మాలిక అగ్రిగేటర్లో ఒక బ్లాగునుండి రెండుకు మించి టపాలను చూపరు. రెండుకన్న ఎక్కువటపాలు వచ్చినప్పుడు అంతకు ముందు వచ్చినవి భోషాణంలో పడిపోయి అక్కడ చూస్తే కాని కనిపించవు. అదే రోజున వచ్చిన టపాలైనా సరే భోషాణంలోనికి వెళ్ళిపోతాయి.

బహుశః అందువలన కొన్ని టపాలను పాఠకులు చూసినట్లే‌ కనిపించదు.

ఉదాహరణకు ఈ‌నెల 6వ తారీఖునాటి కొలుచుకొమ్మని కోరినంతనే టపాకు వచ్చిన వీక్షణల సంఖ్య కేవలం 7 మాత్రమే.

నాకు ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తున్న విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రతిదినమూ నియమంగా కీర్తన వస్తూ ఉండకపోవటం. కాని అందుకు నేను చేయగలిగినది ఏమీ లేదు కదా. భగవంతుడి ప్రేరణ లేకుండా వ్రాయటానికి ఏమి స్ఫురిస్తుంది కనుక?

అందుకు తార్కాణం. అప్పుడప్పుడు కొన్ని కీర్తనలు ఒకదాని వెనుక మరొకటిగా తరుముకుంటూ రావటం. అందువలన అప్పుడప్పుడు ఒకటి రెండు రోజులు విరామం వస్తూ ఉండటం కూడా అలాంటిదే అనుకోవలసి ఉంది.

రామకీర్తనలు చదువుతున్న వారు దయచేసి వాటిని బ్లాగులో నేరుగా దర్శనం ఇస్తున్న వాటిని మాత్రమే చదివి ఆనందించటం కాకుండా వీటి తాలూకు ప్రత్యేక పుటనూ పరిశీలిస్తూ ఉన్నపక్షంలో ఆన్నీ‌ వరుసక్రమంలో దేనినీ తప్పిపోకుండా చదువుకోవటం సులభంగా ఉంటుందని గమనించ కోరుతాను.2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.