19, సెప్టెంబర్ 2016, సోమవారం

బాపు దైవమా (అన్నమయ్య)బాపు దైవమా మా పాలిభవమా
తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం

కాలనేమి పునుకిది కంచువలె లెస్స వాఁగీ
తాళమెత్తరే తత్త తత తత్తత్త
కాలమెల్ల మాభూతగణమెల్ల వీఁడె కాచె
నేలఁబడి నేఁడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం
బాపు

పగగొని మానక పచ్చినెత్తు రెప్పుడును
తెగి కొనుఁ దానె తి త్తి తి త్తి తి త్తి తి
తగు మహోదరువీఁపు ధణధణమని వాఁగీ
బిగియింహరే తోలు బింభిం బింభిం బింభింభిం
బాపు

మురదనుజుని పెద్ద మొదలి యెముకఁ దీసి
తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు
తిరువేంకటగిరిదేవుఁడు గెలిచిన స
మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ
బాపు


(మాళవి రాగంలో అన్నమాచార్యసంకీర్తనం 20వ రేకు)


వ్యాఖ్య:

ఈ పాటను అన్నమాచార్యులవారు శివమెత్తి పాడుతూ చెప్పినట్లుగా అనిపిస్తోంది.

కాలమెల్ల మాభూతగణమెల్ల  అన్నచోట ఎల్ల అన్నది పునరుక్తిగా ఉంది కాని సంకీర్తనాల్లో అడపాదడపా ఇలాంటివి చెప్పుకోదగ్గ దోషాలు కావు.

కాలనేమి, మహోదరుడు, మురాసురుడు అనే రాక్షసుల్ని శ్రీవారు సంహరించటాన్ని ప్రస్తావిస్తూ ఈ సంకీర్తనలోని చరణాలున్నాయి.

పునుక అంటే కపాలం. కాలనేమి పుఱ్ఱె ఒక కంచు పాత్రలాగా మోగుతోందట. దాంతో భేషుగ్గా తాళం వేసుకోవచ్చును పాటకి అని చెబుతున్నారు.

మహోదరుడి వీపైతే ధణధణ మని మోగుతుందట. ఆ తోలుతో‌ ఢక్కా బిగించి వాయించండి పాటకి వాయిద్యంగా అంటున్నారు.

తురులు అన్నది ఆ కాలంలో ఉన్న ఒక గొట్టాంలాంటి గాలిఊది వాయించే వాద్యవిశేషం కావచ్చు.  మురాసురుడి నుండి తీసిన పెద్ద యెముకను అలా తురులుగా చేసి ఊదండి పాటకి అంటున్నారు.

శ్రీవేంకటేశ్వరుడి విజయగీతికలు పాడటానికి ప్రక్కవాయిద్యాలుగా అలాంటివీ ఇలాంటివీ‌ కాదు ఆ చచ్చిన రాక్షసుల శరీరాల్లోంచే వాయిద్యాలు చేసిమరీ బాదుదాం అంటున్నారు.

అవును మరి భూతగణాలన్నింటినీ పీడించిన కాలనేమినీ, పచ్చినెత్తురు తాగి వినోదించే మహోదరుణ్ణీ చంపినందుకు శ్రీవారి మహిమని వాళ్ళ శరీరాల్నే కీర్తించేటట్లు చేయటం గొప్పగా ఉండదా.

మురాసురుడైతే తనని ముట్టుకున్నవాళ్ళు మరణించాలి తక్షణం అని బ్రహ్మగారిని అడిగి అలా వరం పొందాడు. చివరకు విష్ణువు చేతిలో వాడు చావక తప్పలేదు.

ఇలా లోకకంటకులను చంపిన శ్రీవారి మహిమలను వాళ్ళ శరీరభాగాలతో చేసిన వాద్యాల సహకారంతోనే పాడదాం అంటున్నారు అన్నమయ్య గారు.
1 వ్యాఖ్య:

  1. అన్నమయ్య స్పృశించని జీవన పార్శ్వం లేదనిపిస్తుంది. ఏమి వైవిధ్యం. తెలుగు లోనే కాదు. ప్రపంచ సాహిత్యంలోనే అటువంటి కవి ఉండడు. He is the greatest poet.

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.