10, సెప్టెంబర్ 2016, శనివారం

వన్నెల పెండ్లికొడుకువలె నుంటివి (అన్నమయ్య సంకీర్తనం. సవ్యాఖ్యానం)ఎన్నిపోలికలకు నీ విరవైతివి
వన్నెల పెండ్లికొడుకువలె నుంటివి

పొలఁతులు నీవుఁ గూడి పువ్వుల వసంతమాడి
లలి సింగారపుఁ దోటవలె నుంటివి
బలువుగా నప్పటిని పన్నీట వసంతమాడి
తొలుకరికాలమువలె నుంటివి
ఎన్ని

కడలేని వేదుకతో‌ కప్పురవసంతమాడి
వడిఁ జుక్కలలో చంద్రునివలె నుంటివి
జడిగొని కుంకుమవసంతములు సారెనాడి
గిడిగొని మాణిక్యాల కొండవలె నుంటివి
ఎన్ని

తిరముగ నీవు ముత్తెములవసంతమాడి
వరుసఁ‌ బాలజలధివలె నుంటివి
నిరతి శ్రీవేంకటేశ నీవు నలమేల్మంగయు
సురతవసంతమాడి సోనవలె నుంటివి
ఎన్ని


(దేవగాంధారి రాగంలో 1665వ రేకులోని అన్నమాచార్యసంకీర్తనం)

వ్యాఖ్య:

అన్నమయ్య తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరుని వివిధకోణాల్లో తనివితీరా అభివర్ణిస్తూ ఉంటాడు.

అలా స్వామిని అనుక్షణమూ వివిధభంగులుగా భావించటంలో ఉన్న ఆనందం కేవలం‌ మహాభక్తులైన వారికే అనుభవైక వేద్యం. మనబోటి సామాన్యులం అంత ప్రగాఢమైన అనుభూతిలో శతాంశమైనా ఆయన సంకీర్తనలను చదివీ వినీ వాటిని మనసా ధ్యానించీ స్వంతం చేసుకోగలగటం ఒక అదృష్టం అనే చెప్పాలి.

ఈ పరమమనోహరమైన శృంగారసంకీర్తనంలో ఆన్నమాచార్యులవారు తనకు శ్రీవేంకటేశ్వరుడు వన్నెవన్నెల పెండ్లికొడుకులాగా కనిపిస్తున్నాడని ఇలా వర్ణిస్తున్నారు.

ఓ శ్రీనివాసుడా ఎన్ని ఎన్ని రకాల పోలికలకు నువ్వు తావుగా ఉన్నావయ్యా - వన్నెల పెండ్లికొడుకులాగా అంటూన్నారు
నువ్వూ నీ‌ దేవేరులూ కలిసి పువ్వులతో వసంతం ఆడుకున్నారు కదా. ఎక్కడ చూసినా పువ్వులే. మీ ఒళ్ళ నిండా పువ్వులే. తోటనిండా పువ్వులే. అన్ని లతా గుల్మాలనే కాదు నేలంతా కూడా పువ్వులమయం చేసేసారు కదా. నీ‌ఒంటి నిండా రంగురంగుల పూలతో నువ్వే ఒక పూలతోటలాగా ఉన్నావే! అచ్చం ఒక శృంగారవనం అని నిన్నే అనాలి సుమా బాగుంది బాగుంది.

అని అన్నమయ్య తన దేవదేవుణ్ణి ప్రశంసిస్తూ ఉండగానే ఆయన తన దేవేరులతో‌ కలిసి పన్నీటికొలనులో జలకాలాడటం‌ మొదలు పెట్టాడు. ఇంతసేపూ మరి ఆయన పూవులతోటలో వసంతాలాడుతో కలయదిరిగి అలసిపోయడు కదా. అలసట తీరటానికి అన్నమాట ఈ‌జలక్రీడ. పాపం ఆయన ఎంత అలసిపోయాడో పూవులు జల్లుతూ‌జల్లించుకొంటూ పూలవనం అంతా తిరుగుతూ - అందుచేత చాలా సేపు జలకం ఆడిమరీ బడలిక తీర్చుకున్నాడుతున్నాదు. ఇలా జలక్రీడా వసంతోత్సవం ఆడుతున్న ఓ శ్రీవేంకటేశ్వరుడా నీవే ఒక వర్షాకాలం అనే దైవతం లాగా ఉన్నావయ్యా అంటూన్నాడు అన్నమయ్య.

జలక్రీడలయ్యాయండీ. దేవుడూ దేవేరులూ అందరూ ఆహ్లాదం‌ కొఱకు కర్పూరం తమ ఒడళ్ళకు అలదుకున్నారు. ఇంకేముంది అందరూ తెల్లగా ధగధగలాడుతూ‌ ఉన్నారు. అన్నమయ్య కండ్లకు ఆ దేవేరులంతా నక్షత్రాలుగా కనిపిస్తున్నారు. అందరూ తమతమ ఒడళ్ళకు కర్పూరం అలదుకుంటే అందరూ ఒకే మాదిరి ధావళ్యం‌ కలిగిఉండాలి కదా. అవునంతే ఆ దేవేరులంతా అలాగే ఇంచుమించు సమధావళ్యంతో ఉన్నారు. కాని వాళ్ళంతా పోటీలుపడి మరీ వారిప్రియపతి ఒళ్ళంతా దట్టంగా కర్పూరం అద్దేశారు. దానితో ఆయన ధావళ్యం ఇంతింత అనరానట్లుగా ఉంది. అందుచేత చుక్కల మధ్య చంద్రుడికి మరింత ప్రకాశం ఉన్నట్లుగా అయన ధావళ్యం అందరి ధావళ్యాలనూ అతిక్రమించి ఉంది. ఈ కర్పూరవసంతోత్సవంతో, ఓ శ్రీవేంకటేశ్వరా నీవు ఈ మెరుపుచుక్కల దేవేరుల మధ్యన సాక్షాత్తూ చుక్కలమధ్య చంద్రుడిలాగా ఉన్నావయ్యా అని అన్నమయ్య ఆనందంగా ప్రశంసిస్తున్నాడు.

అందరూ ఇలా స్నానానంతరం మైపూతగా కర్పూరం అలదుకొని శ్రీవేంకటేశ్వరుడైతే ఇబ్బదిముబ్బడిగా కర్పూరం అలదించుకొని సేదతీరారు.

దేవేరు లందరూ సింగారించుకొన్నారు. శుభ్రవస్తాలు ధరించారు. అందరూ పాపట కుంకుమ ధరించారు. పనిలో పనిగా శ్రీవేంకటేశ్వరునికీ కుంకుమదిద్దారు. మళ్ళీ వాళ్ళల్లో స్వామివారిసేవ విషయంలో పోటీలు పడటం ఒకటుంది కదా. పొలోమని ఎగబడి ఆయన్ను కుంకుమతో ముంచెత్తేశారు. శ్రీవేంకటేశ్వరుడు ఈ‌కుంకుమవసంతోత్సవం కారణంగా ఒక మాణిక్యాల కొండలాగా బహుసొగసుగా ఉన్నాడని అన్నమయ్య ఆంటున్నాడు.

ఇంక తరువాతి కార్యక్రమం అలంకరణలు చేసుకోవటం‌ ఒకటుంది కదా. అందరూ ముత్యాలసరాలు ధరించారు. మళ్ళా పోటీలుపడి మరీ పతిదేవుడి ఒంటినిండా తమ ముచ్చటతీరా ముత్యాలగొలుసులూ ముత్యాలదండలూ అంగుళం ఎడంలేకుండా ముంచెత్తేసారు. తెల్లని బట్టలు - అవును ఆయన త్రైలోక్యచక్రవర్తికదా - అందుకని చక్రవర్తికి ఉచితంగా తెల్లని వస్త్రాలు, ముత్యాల తలపాగా, ఒంటినిండా ముత్యాలతో పెండ్లికొడుకులాగా అలంకరణలు. ఇలా ముత్యాల వసంతోత్సవంతో అన్నమయ్య కంటికి శ్రీవేంకటేశ్వరుడు సాక్షాత్తూ పాలసముద్రంలాగా కనిపిస్తున్నాడట.

సాయంకాలపు వనవిహారం పూర్తయింది. శ్రీవేంకటేశ్వరుడు అలమేలుమంగమ్మ అంతఃపురానికి విచ్చేసాడు. ఇంకేముంది తెల్లవార్లూ ఒకటే కోలాహలం చేసారు. అలసి చెమటలు కారుతున్న స్వామి శ్రీవేంకటేశ్వరుడి అవతారం అన్నమయ్య కండ్లకు అది ఒక అందమైన వర్షం అనే వసంతోత్సవంలా కనిపించింది.

ఇలా శ్రీవేంకటేశ్వరుడు ఆడిన వసంతోత్సవంలో ఆయన రంగురంగుల్లో దర్శనం ఇచ్చి భక్తుడిని ఆనందపరవశుణ్ణి చేసాడు.

ఇప్పుడు ఈ‌ శృంగారసంకీర్తనం యొక్క వేదాంతపరమైన ఆర్థాన్ని ఆకలింపు చేసుకుందాం.

ఈ సంకీర్తనంలో శ్రీవేంకటేశ్వరుడు ఎప్పటిలాగే‌ కేంద్రస్థానంలో ఉన్నాడు. ఆయనకు దేవేరులుగా ఉపచారాలు చేసిన సతులు జీవకోటి అనే భావించాలి. వారితో ఆయన పుష్పవసంతం ఆడటం వారి పూజలను స్వీకరించటం. పూవుల్లో వివిధవర్ణాలుంటాయి. అలాగే పూజలు వివిధాలు. కొందరి పూజ శ్రుతివిహితమైన మంత్రాలతో ఉంటుంది. కొందరి పూజ కల్పోక్తవిధానంలో శ్లోకాదుల రూపంలో ఉంటుంది. కొందరు మానసికపూజాదురంధరులు - బాహిరమైన పూజాకలాపాదుల అవసరం దాటిన వారు. కొందరు వేదాంతులు వారి పూజ అయన తత్త్వాన్ని చింతించటం అనే విధం. కొందరికైతే ఏవిధమైన పూజావిధానమూ తెలియదు. భక్తిపూర్వకంగా నమస్కరించటమో, ఏదైనా ఆలయంలో తోచినది కానుకచేయటమో చేసి సంతోషిస్తారు. ఏలాంటి విధమైన పూజ ఐనా అయన ఆనందంగా ఒకేలా స్వీకరిస్తాడు. అందులో ఏమీ సందేహం లేదు. బొత్తిగా శ్రుతిబాహ్యమైన పూజనైనా తిన్నని పూజను పరమేశ్వరుడు ఆనందంగా స్వీకరించలేదా మరి. కుమ్మరి వాడు మట్టిపువులను మాత్రం అర్పించగలిగితే శ్రీవేంకటేశ్వరుడు వాటినే పరమానందంగా స్వీకరించలేదా చెప్పండి. జీవులు దేవుణ్ణి తమకుతోచిన విధంగా తమశక్తి మేరకు సంతోషపెడతారు. అది ముఖ్యం. నావాడు అని భావించి ఎవరు కోరినా వారికి ఆయన సదా సుముఖుడే అన్నది ఇక్కడ మనం భావించాలి

అలాగే జీవులు భగంతుడికి చేసే పూజలో భాగంగా విలేపనవస్త్రాభరణాదులను సమర్పించటమే ఇక్కడ దేవేరులు పోటీలు పడి మరీ స్వామికి తమ సేవను అందించంటం అన్నది భావించాలి. ఆయన ఎవరిసేవనూ వద్దనడు. ఏసేవనూ వద్దనడు. నీకిది ఇవ్వాలనుందా - అలాగే కానివ్వు. నీకీ సేవ చేయాలనుందా - ఆలాగే కానివ్వు అనే శ్రీవారు ఎప్పుడూ అనుమతిస్తారు. మన సేవలతో స్వామిని ముంచెత్తటం వలన ఆయనకు ఏమీ ఇబ్బంది ఉందదు. అదంతా ఆయకు ఒక ఉత్సవంగానే ఉంటుంది. భక్తుల సంతోషమే భగవానుడి సంతోషం అన్నది ఆయన సిద్ధాంతం మరి.

సంకీర్తనం ముగింపులో వచ్చే అలమేల్మంగా శ్రీవేంకటేశ్వరుల దివ్యసమాగమం అన్నది ఆత్మనివేదనం అన్నదానికి సూచకం. భక్తజీవుడు ఎంతో ఆర్తితో తన యొక్క అస్తిత్వాన్ని శ్రీనివాసుడికి ధారపోస్తాడు. నిజానికి అత్మనివేదనం అన్నది జీవుడి సంకల్పం ఐనా నామరూపాత్మకమైన ప్రకృతిలో ఉన్న జీవుడిని ఉధ్దరించటానికి భగవంతుడు కొంత కృషి చేయవలసి ఉందన్నది కఠోరవాస్తవం. ఆయన జీవుడిలోని చతుర్వింశతి తత్త్వాలను తనలో ఐక్యం చేసుకున్నప్పుడు కాని జీవుడు కేవలం ఆత్మస్వరూపుడుగా కాడు. జీవుడికి ఈ‌ ఉధ్ధరణ కలిగించటంలో ఆయన ఆనందంగా గ్రహించీన క్లేశాన్నే ఈ సంకీర్తనంలో సురతానంతరం చెమటపట్టటంతో పోల్చటం జరిగింది.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.

ఇలా భక్తిలో వివిధమైన మార్గాలు చెబుతుంది భాగవతం. అన్నింటికంటే పరమమైనది ఆత్మనివేదనం. అందుకే దానిని సంకీర్తనం చివరన ప్రస్తావించారు అన్నమార్యులు.

ఈ విధంగా అందరు జీవులను వివిధావస్థల్లో ఉన్నవారిని వివిధంగా తనను సేవించే వారిని చేపడుతూ శ్రీవేంకటేశ్వరుడు నిత్యపెండ్లికొడుకు లాగా ఉన్నాడు.

అలమేల్మంగమ్మకైతే ఆయన ఎప్పుడు కొత్తపెళ్ళికొడుకేను.

6 వ్యాఖ్యలు:

 1. శ్యామలీయంగారు,
  బాగుంది, చిన్న మాట సుమా! తెలియని కీర్తన చెప్పినందుకు ధన్యవాదాలు. మరికొన్ని..... ఏమనుకోకండీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తప్పక ప్రయత్నిస్తానండీ. ఏమేరకు చేయగలనా అన్నది దేవేఛ్ఛ.

   తొలగించు
 2. "మాణిక్యాల కొండ"లరాయని గురించిన ఈ కీర్తన పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
  ~ లలిత

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కీర్తనకు మీరు వ్రాసిన వివరణ అద్భుతంగా ఉంది. సంపూర్ణంగా అనుభూతిచెంది తాదాత్మ్యం చెందితే తప్ప ఇటువంటి వ్యాఖ్య చేయలేరు. అన్నమయ్య పాటలోని భావం పూర్తిగా అర్థమైతే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండి. అందుకే తెలిసిరామచింతనతో నామము చేయవే ఓ మనసా అన్నారు. తెలిసిన కొద్దీ ఆ రుచే వేరు కద. అందుకే శక్తిమేరకు నా అవగాహనను మీతో పంచుకున్నాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.