29, సెప్టెంబర్ 2016, గురువారం

తెలిసికొన్న కొలది తత్త్వముతెలిసికొన్న కొలది తత్త్వము తెలియలేమియె తెల్లమగురా । అది
తెలియవశము కాదు రామదేవునింక శరణువేడర

వయసు మీఱుటచేత మీదికి వచ్చిపడిన ప్రభుతవలన
దయను జూపుచు పెద్దవారు తత్త్వబోధలు చేయుచుందురు
భయము నయము వినయమొప్ప వాదులాడక వినెద వీవు
పయిడి పలుకుల తత్త్వమాధురి భావవీధుల నిలువకుండును
తెలిసి

కొంత పెద్దలవద్ద నేరిచి కొంత గురువుల వద్ద నేరిచి
కొంతతెలిసి కౌతుకముతో కోరి గ్రంథము లరయ బోతే
యెంతచదివిన కాని తత్త్వచింతనము సిధ్ధించకుండును
సుంతలాభము లేక చిత్తక్షోభయే తరచగుచునుండును
తెలిసి

ఘనముగా బోధించు వారు కాంచినదియు స్వల్పమేనా
ఘనతకెక్కిన గ్రంథరాశిని మనకుదొరకున దల్పమేనా
యనుచు నంతవిచార పడబో కసలు తత్త్వము రామతత్త్వమె
మనసు రామార్పణము చేసిన మంచిగా తత్త్వమ్ము తెలియును
తెలిసి


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.