11, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఊటుకూరి కోనేటిరాయా! (అన్నమయ్య సంకీర్తనం)కోరిక లీడేరె నేఁడు కోనేటి రాయ - ఇట్టె
కూరిముల వూటుకూరి కోనేటిరాయ

కుమ్మరించేవు సిగ్గులు కోనేటిరాయ - యీ
కొమ్మలెల్లఁ జూడఁగాను కోనేటిరాయ
కొమ్మువంటి కొనగోరఁ గోనేటిరాయ - మేను
కుమ్మెలుగా నొత్తకుమీ కోనేటిరాయ
కోరిక

కొప్పుగడు వెడజారె కోనేటిరాయ - నిండా
గుప్పేవు సెలవినవ్వు కోనేటిరాయా
కుప్పరింపుఁ జెమటలఁ గోనేటిరాయ - యెంత
గొప్పవాఁడవయ్య నీవు కోనేటిరాయ
కోరిక

కొండికపాయ మమరెఁ గోనేటిరాయ - పైఁడి
గొండెలపచ్చడముతోఁ గోనేటిరాయ
అండనే శ్రీవేంకటాద్రి నలరి నన్నేలితివి
కొండలలో నెలకొన్న కోనేటిరాయ
కోరిక


(సామంతం రాగంలో అన్నమాచార్య సంకీర్తనం. 1650వ రేకు)

వ్యాఖ్య:

ఈ సంకీర్తనంలో కనిపించేది ఊటుకూరి కోనేటిరాయడు.

ఆ ఊటుకూరికీ అన్నమాచార్యులకూ మంచి అనుబంధమే ఉంది.

అన్నమాచార్యులవారి పితామహుడు నారాయణయ్య. అయనకు చదువు అబ్బలేదు. తండ్రి బాగా అలోచించి  ఊటుకూరిలోని తనబంధువుల ఇంటికి పంపాడు. అమ్మానాన్నల గారాబం వలన చదువురావటం లేదేమో బంధువుల వద్ద ఐతే కాస్త దారిలోనికి వస్తాడని ఆయన ఊహ కాబోలు. ఈ ఊటుకూరు కడపజిల్లాలో, రాజంపేట మండలంలో ఉంది. అక్కడికిపోయి అయ్యవార్లదగ్గర చేరి ఎంత ప్రయత్నించినా ఆ నారాయణయ్యకు చదువు అబ్బింది కాదు. బంధువులూ విసుక్కుంటున్నారు. చదువుపైన ఆసక్తి లేక కాదు, బుధ్ధికుశలత లేక ఆపిల్లవాడికి చదువు రావటం లేదు. అందరూ చీదరిస్తుంటే, తోటిపిల్లలు చక్కగా ప్రయోజకులౌతుంటే అవమానభారంతో క్రుంగిపోయాడు ఆ అబ్బాయి.

గ్రామదేవత చింతాలమ్మవారి గుడికిపోయి మొఱపెట్టుకున్నాడు. ఆవిడ ఏమీ పలకనేలేదు. తాను వ్యర్థుడనని తెలిపోయింది. జీవితాశ నశించిపోయింది. అంతే గుడిబయట ఉన్న పుట్టలో చేయి దూర్చేసాడు! పాము కరువలేదు. చింతాలమ్మ ప్రత్యక్షమైంది.

బాలుడిని చింతాలమ్మతల్లి ఓదార్చింది. గొప్పహరిభక్తుడై మీ వంశాన్నే తరింపచేసే మహానుభావుడికి నువ్వు తాతవు కావలసి ఉందయ్యా. మీ ఊరు తిరిగివెళ్ళు. మీ తాళ్ళపాక పెన్నిధి చెన్నకేశవస్వామిని దర్శనం చేసుకో - అయన అన్నీ అనుగ్రహిస్తాడు నీకు అని చెప్పింది. ఆవిడ చెప్పినట్లే స్వామిదర్శనం చేసుకొని ఆయన అనుగ్రహంతో‌ నారాయణయ్య మహావేదవిద్వాంసుడయ్యాడు.  ఆ నారాయణయ్య కొడుకు నారాయణసూరి. ఆ నారాయణసూరి తనయుడే మన అన్నమాచార్యుల వారు.

ప్రస్తుతం చింతాలమ్మ గుడి లేదు ఊటుకూరిలో. అక్కడి శివాలయంలో చింతాలమ్మ అని అందరూ చెప్పుకొనే ఒక దేవత విగ్రహం ఉంది.

ఈ సంకీర్తనంలో అన్నమాచార్యులవారు ఆ ఊటుకూరిలో ఉన్న విష్ణువును ప్రార్థిస్తున్నాడు.

ఇందులో వర్ణించబడినది నాయికానాయకుల మధ్య సంయోగశృంగారం. నాయకుడైన శ్రీవేంకటాద్రీశుడే ఊటుకూరిలోని కోనేటిరాయడు. నాయిక అలమేల్మంగమ్మయే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.  కోరికలన్నీ నెఱవేరాయని అమ్మవారు అయ్యవారితో చెబుతున్నట్లుగా ఉంది ఈ సంకీర్తనంలో.

అమ్మవారు అయ్యవారి వద్దకు చెలిమికత్తియలతో సహా వచ్చినది. అందరూ చూస్తూ ఉండగా వేంకటేశ్వరుడు ఎంతో సిగ్గు అభినయిస్తున్నాడు. అదంతా దొంగవేషం. ఆడవాళ్ళతో మాట్లాడాలంటేనే బెరుకూ సిగ్గూ అని గొప్ప అభినయం. కాని నిజానికి ఆయన ఈ స్త్రీజనం అంతా ఎప్పుడు తమని వదిలి సెలవు తీసుకుంటారా ఎప్పుడు తమ ఇద్దరికీ ఏకాంతం దొరుకుతుందా అని తహతహలాడుతున్నాడు. కాని వాళ్ళేమే ఆ దంపతుల్ని ఒకచోట చేర్చి వాళ్ళని తనివితీరా చూస్తూ ఆ ముచ్చట్లూ ఈ‌ముచ్చట్లూ చెప్పుకొంటూ వారితో రకరకాల పరిప్రశ్న చేస్తూ అక్కడే పాతుకుపోయారు. ఒకపట్టాన వదిలేలా లేరు. వారు అయ్యవారి అవతారాదికాలను మహిమాదికాలనూ వర్ణిస్తూ రకరకాల ప్రసంగాలూ చేస్తూ ఉంటే అమ్మవారికి ఎంతో ఆనందంగా ఉంది. వారి కర్ణపేయమైన వాక్చమత్కృతులను ఆస్వాదిస్తూ ఎంత ప్రొద్దుపోతున్నదీ కూడా గమనించటం లేదు. శ్రీవారికి అసహనంగా ఉంది. తన పరోక్షంలో ఐతే అది వేరే సంగతి. తన సమక్షంలో తనగొప్పల్ని వీళ్ళంతా చిలువలు పలువలు చేసి ఆకాశమే హద్దుగా అనర్గళంగా మట్లాడుతూ పోతుంటే చికాకు వస్తోంది. సామాన్యంగానే సజ్జనులకు తమను ఎవరన్నా ఎదుటపడి కీర్తిస్తూ ఉంటే వినటానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి భగవంతుణ్ణే వాళ్ళు ఈ‌ఇబ్బందికి గురిచేస్తున్నారే. పైగా ఎంతకీ కదలరే.

అందుచేత శ్రీవారు ఏంచేస్తున్నారయ్యా అంటే, ఇంక చాల్లే, వీళ్ళని ఎలాగో అలా పంపించేసేయ వలసింది అని ఆమెకు సన్నలు చేస్తున్నాడు. ఎదురుగా ఉన్న జనం చూడకుండా ఎలాగయ్యా అవైనా చేయటం? కంటిచూపుతో సైగ చేయాలంటే ఎదురుగా జనం ఉండగా కుదరదు కదా. ఏదన్నా నర్మగర్భంగా మాట్లాడి దేవేరికి చెబుదాం‌ అంటే వాళ్ళంతా విజ్ఞానులు జాణలు వాళ్ళకు దొరికిపోవటం తథ్యం.

కాబట్టి శ్రీవేంకటేశ్వరుడికి మిగిలింది ఒకటే మార్గం. ప్రక్కనే ఉన్న దేవేరిని కొనగోళ్ళతో గిచ్చుతున్నాడు. ఎలాంటి గోళ్ళవీ అంటే వాటికొసలు కొమ్ముల్లాగా ఉన్నాయట. అంటే కొమ్ముల్లాగా మొనదేరి ఉన్నా యన్నమాట.

అమ్మవారికి తెలియనివా అయ్యవారి వేషాలు! అందుచేత ఆవిడ అయనతో అందరిముందూ ఏమి సిగ్గులు నటిస్తావూ పైగా నన్ను గిచ్చిగిచ్చి పెడుతున్నావూ‌ అని హాస్యమాడుతున్నారు.

అందర్నీ ఎలాగో ఆవిడ మెత్తగా మాట్లాడి సెలవిచ్చి పంపిన తరువాత అయ్యవారి అసలురంగు బయటపడింది.  ఆయన కొంటే చేష్టలకు ఆమె ఎంతో కష్టపడి సింగారించుకున్న అందమైన కొప్పు కాస్తా జారిపోయి ఎడాపెడా ఐపోయింది. ఐనా ఆవిడ సింగారించుకుందా స్వయంగా ఆవిడ నెచ్చెలులే ఆవిడ మెచ్చాలనీ ఆకొప్పుసోయగాన్ని శ్రీవారు మెచ్చాలనీ ఎంతో శ్రధ్ధగా తీర్చిదిద్దారా మరి. అదికాస్తా అయన చెదరగొటేశాడు. పైగా అలా కొప్పు జారిపోవటం చూసి ఆయన పెదవుల చివరినుండి ముసిమిసి నవ్వులు చిమ్ముతున్నాడు. ఆవిడ విడివడ్డ కొప్పుతో చీకట్లు అలముకున్నట్లుగా ఐతే ఆయన చిరునవ్వుల ప్రకాశంతో ఆ గదినిండా వెలుగు క్రమ్ముకున్నట్లు ఐనది. శ్రీవారి గొప్పదనం ఇంతా అంతా అనరాదు.

అదిదంపతుల శృంగారక్రీడ వారికి చెమటలు పట్టించినది అట. అన్నమయ్య ఈ మాటను అతివేలంగా ఉపయోగిస్తాడు. వెంకన్న గొప్పదనాన్ని అమ్మవారు ప్రశంసిస్తున్నారు చెమటలు పడుతున్నా చిరునవ్వులు చెదరనీయవు కదా అని.

అవును మరి. శ్రీవారికి వయసు ఎంతనీ? అమ్మవారికి వయసు ఎంతనీ? వారు పురాణదంపతులే కావచ్చును ప్రపంచానికి. కాలమే వారి కనుసన్నల బానిస అన్నప్పుడు వారికి ఎప్పుడూ నూత్నయౌవనమే కాదా. ఇద్దరూ ఎప్పుడూ కొత్తదంపతులేను. ఆ దాంపత్యంలో పాతబడటం మొగమ్మొత్తడం లాంటివేమీ‌ ఉండవు సుమా. అవన్నీ లౌకికుల గోలలు. ఇది పారలౌకికం.

ఆ వేంకటరాయడు పైడికొండెలపచ్చడం ధరించిన వాడట. ఆయన ధరించిన బంగారు వన్నెల వస్త్రానికి అంచుల్లో అందమైన కుచ్చుల ముడులు ఉన్నాయట.  ధగధగలాడే ఆ బంగారు పంచెను ధరించి శ్రీవారు మరింత కుఱ్ఱదనంతో కనిపిస్తున్నారని అమ్మవారు ముచ్చట పడుతున్నారట.

ఇదంతా గతరాత్రి జరిగిన విశేషంగా మనం భావించాలి. అవన్నీ గుర్తుచెస్తూ అమ్మవారు శ్రీవారితో ఇలా ముచ్చటించారని ఈ‌కీర్తన నేపథ్యంగా మనం అర్థం చెసుకోవాలి.

ఓ క్షీరాబ్దినిలయుడవైన వేంకటేశ్వరుడా నువ్వు ఏడుకొండలపై వెలసి ఇలా సంతోషంగా నాతో‌కలిసి విహరిస్తున్నావు గతరాత్రి ముచ్చటలు ఇవీ అని అమ్మవారు అంటున్నారని అన్నమయ్య సంకీర్తనాన్ని ముగిస్తున్నాడు.

ఈ కీర్తనకు కొంచెం వేదాంతపరమైన వ్యాఖ్యానం ప్రయత్నిద్దాం.

యథాప్రకారం నాయిక అంటే ఇక్కడ జీవుడు. నాయకుడు ఈశ్వరుడు. ఈ జీవేశ్వరుల కలయికయే మోక్షం. దానికే కైవల్యం అని పేరు. ఎందుకంటే కలయిక అనటమే ఇద్దరు ఒకటి కావటం కాబట్టి.

జీవుడికి ఈశ్వరసాన్నిధ్యం కలిగినా తాదాత్మ్యం కలుగకుండా చెసేవి ప్రకృతిసంబంధమైన తత్త్వాలు. అవే ఇక్కడ చెలిమి కత్తెలు అనుకుందాం. లేదా జీవుడికి ఉన్న సంస్కారరూపబంధాలనే ఆ చెలిమికత్తెలు అనుకోవచ్చును. ఏవిధంగా అనుకున్నా తాత్పర్యం‌ ఒక్కటే జీవేశ్వరులమధ్యన బహురూపియైన ప్రకృతి బంధాలుగా పరిణమించి ఉంటుంది. ఈశ్వర సాన్నిధ్యం అన్నది సిధ్ధించినట్లే ఉన్నా అది ఈశ్వరుడికి తనకూ‌ మధ్య అడ్డుగా ఉండనే ఉంటుంది. దానిని కూడా విసర్జిస్తేనే ఆ కైవల్యప్రాప్తి అనేది.

జీవుడికి ఈశ్వరుడిలో ఐక్యం కావాలన్న కోరిక ఎంత బలీయమైనదో ఈశ్వరుడికి జీవుడు ప్రకృతిని తరించి తనను చేరుకోవాలన్న అనుగ్రహదృష్టి కూడా అంతకన్నా బలమైనది. ఈశ్వరుడి కోరిక అనకూడదు. ఈశ్వరుడికి కోరికలు ఏమీ‌ ఉండవు. అలా చెప్పటం అశాస్త్రీయం. జీవుడు బంధవిముక్తికోసం చేసే యత్నంలో ఆయన అనుగ్రహం అంతకు పదింతలుగా ఉంటుందని చెప్పటమే జరుగుతున్నది. జీవుడిని ఈశ్వరుడు  బంధాలు వదిలించుకో అని పదేపదే హెచ్చరించి చెప్పటం అన్నమాటనే ఇక్కడ నాయికను నాయకుడు నఖక్షతాలరూపంలో హెచ్చరించటం‌గా సూచించటం జరిగింది.

ఈశ్వరుడుతో జీవుడు తాదాత్మ్యం చెందటంతో అన్ని బంధాలకు చెల్లు చీటీ ఇవ్వటం  జరిగిందన్నదానికి సూచనగా ఇక్కడ నాయిక యొక్క అందమైన కొప్పుజారిపోవటం.  కొప్పు పరంగా నాయకుడిది శృంగారచేష్ట ఐతే ఈశ్వరుడు జీవుడి బంధాలను స్వయంగా తొలగించాడన్నది ఇక్కడ వేదాంతపరమైన సమన్వయం. జీవుడు ప్రయత్నం మాత్రం చేయగలడు. కాని అంతిమంగా జీవుడి బంధాలు తొలగేది ఈశ్వరానుగ్రహం వలననే సుమా అన్నది సూచితం.

ఈశ్వరుడు జీవుడి ఉన్నతి కోసం క్లేశం పొందటాన్ని ఆనందంగా చేయటమే ఇక్కడ నాయకుడు నాయికప్రియం కోసం‌ చెమటలు పట్టేలా శృంగారం నెఱపటం అని అర్థం చేసుకోవాలి. భక్తాధీనుడైన దేవుడు జీవుడికోసం ఇదంతా చిరునవ్వుతోనే జరిపించుతాడు.  అక్కడ క్లేశం అంతా లీలామాత్రం. ఈశ్వరుడికి నిజంగా క్రియలూ‌ శ్రమలూ ఏమీ‌ఉండవు కదా.

నిజానికి బ్రహ్మసత్యం జగం‌మిథ్య అంటుంది వేదాంతం. కాని లోకం వ్యావహారిక సత్యం అని ఒప్పుకోకపోతే బండి నడవదు.అలా అనుకున్నప్పుడు జీవుడు నిత్యత్వం‌ కలవాడే, ఈశ్వరుడూ‌ నిత్యత్వం కలవాడే అనా అంటే కాదు. ఈశ్వరుడే నిత్యం. జీవుడి ఉనికి ఒక ప్రతిబింబం లాంటిది. అది కనిపిస్తున్నంత వరకే సత్యం అన్నమాట. నిజానికి బింబప్రతిబింబాలెట్లాగో ఈశ్వర జీవులు అట్లాంటి వారు.

ప్రకృతిలో ఉన్న జీవుడు తాను తనకొక ఉనికి ఉన్నదను కుంటాడు. ఆ తాను అనేదే మొదటి బంధం. అది మిగిలిన బంధాలను కలిగిస్తుంది. అవన్నీ వదల్చుకోవటానికి ఈశ్వరానుగ్రహం కారణం. యోగసిద్ధులైనా ఈశ్వరానుగ్రహంతో ప్రకృతి బంధాలు వదల్చుకొని అపిదపనే ఈశ్వరుడితో కలుస్తున్నారు.

ఆవరణ రహితుడైన ఈశ్వరుడికి ప్రసస్తమైన ఆవరణం (అంటే వస్త్రం)గా భాసించేది ప్రకృతి. అది ఆయన సంకల్పం చేత నిత్యం. ఆయన ఎలాగూ నిత్యనూతనుడు. ఆ ప్రకృతిని దాటి ఈశ్వరుడిని కలిసిన జీవుడికి ఆ ఆవరణంతో శోభించే ఈశ్వరుడు మరింత సొగసుగా అనిపిస్తున్నాడట. ప్రకృతిమాయను దాటితే ఆ ప్రకృతి జీవుడిని భయపెట్టేదీ‌ బాధపెట్టేదీ‌ ఏమీ ఉండదు. ఈశ్వరుడితో దాని చేరికలోనూ అందమే కనిపిస్తుంది.

ఇలా నిగూఢంగా ఈ సంకీర్తనంలో జీవేశ్వరుల ఐక్యతకు సంబంధించిన సంగతి ప్రాతిపదికగా కనిపిస్తుంది.


3 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.