13, సెప్టెంబర్ 2016, మంగళవారం

వనితలు పతిమీఁద వలపు చల్లుదురు (అన్నమయ్య సంకీర్తనం)



దానికేమి దోసము తప్పు లెంచఁ జెల్లదు
అనుకొన్న మగవాని కాదరించ వలయు

మనసులు సోదింతురు మచ్చికలు చూపుదురు
కనుసన్న గావింతురు కాఁక సేతురు
గునుతురు సొలతురు గుట్టు తెలుసుకుందురు
వనితలు పతిమీఁద వలపు చల్లుదురు
దానికేమి

అసలెల్లా రేఁతురు అయము లంటుదురు
బాస సేయించుకొందురు భ్రమయింతురు
పాసివుండ రొరతురు పైకొని పెనఁగుదురు
వాసి నింతు రిట్లానే వలపు చల్లుదురు
దానికేమి

కడుసేవలు సేతురు కాఁగిటఁ గూడుదురు
బడివాయకుండుదురు పై కొందురు
యెడయక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
పడి నావలె నిందరు వలపు చల్లుదురు
దానికేమి


(అన్నమాచార్య సంకీర్తనం 1678వ రేకు)

వ్యాఖ్య:

ఇది అన్నమాచార్యుల వారి మరొక అందమైన శృంగారసంకీర్తనం.

ఈ శృంగారసంకీర్తనంలో అన్నమాచార్యుల వారు నాయిక నోట నాయకుడిని ఉద్దేశించి పలికిస్తున్న మాటలు ఇవి.

ఇక్కడ నాయికానాయకులు అలమేలుమంగా వేంకటేశ్వరులు ఎప్పటిలాగానే. ప్రాకృతమానవులను ఉద్దేశించి అన్నమాచార్యుల వారు గానం చేయరు కదా.

నాయకుడు దక్షిణనాయకుడు.

అందుచేత నాయిక అలిగినది.

యథాప్రకారం నాయకుడు బ్రతిమలాడుకోవటమూ నాయిక ప్రసన్నురాలు కావటమూ జరిగినది.

జరిగిన దానిలో తప్పు ఎవరిదీ?

నాయకుడినే ప్రాణాధికంగా భావించి సేవించుకొనే తనదా?
మరొక స్త్రీని కూడా ఆదరించి వచ్చిన తన నాయకుడిదా?
తన ప్రాణంలో ప్రాణం అయిన నాయకుడిని తన వలపులవలలో వేసుకొన్న ఆ స్త్రీదా?
ఎవరిది తప్పూ అని?

ఇందులో ఎవరి తప్పూ‌లేదు లేవయ్యా అంటున్నది గడుసుగా నాయకుడితో నాయిక.

అవునయ్యా ఇందులో ఎవరి తప్పూ లేదు.
నాలాగే, ఆమెకూడా నువ్వే తన పురుషుడవని కొలుచుకుంటున్నది.
నేనైనా తానైనా సరే మా స్త్రీలందరకూ‌ నీతివర్తనం ఒకటే సుమా.
తనవాడు అని ఒకడిని అనుకున్న తరువాత ఆతడిని ఆదరించి తీరవలసినదే.

నావాడవై తనవద్దకు వచ్చావని ఆమె నిన్ను నిరాదరణ చేయలేదు మరి. అది భావ్యం కాదు.
అలాగే తనవాడవై నా వద్దకు వచ్చావని నేను నిన్ను నిరాదరణ చేయరాదు.
ఇందులో ఆమె దోషమూ లేదు, నాదోషమూ‌లేదులే.
అందుచేత ముఖ్యంగా అమె యేదో నాకు ద్రోహం చేసిందని నేను వగచనక్కర్లేదు.
అందరు స్త్రీల వలెనే ప్రవర్తించింది.
నిన్ను ఆదిరించి తనవాడిని చెసుకొన్నది.
బాగుందిలే.

స్త్రీల సంగతి నీకు తెలియదనా?
ఒకరికంటే ఎక్కువమందికి మగడివై కూర్చున్నావు కదా.
ఐనా మీ మగవాళ్ళకి ఎంత తెలిసినా స్త్రీల గురించి సరిగా తెలియనే తెలియదు సుమా.
నచ్చిన మగవాడి చేత వలపించుకోవటం స్త్రీ అన్నదానికి వెన్నతో పెట్టిన విద్య.

ఆడవాళ్ళు మగవాళ్ళ మనసులు బాగా శోధిస్తారు. ఆ విద్య మీకు చేతకాదులే, ఆడదాని మనసును తెలుసుకోవటం బ్రహ్మతరం కూడా కాదు.
మగవాళ్ళు నచ్చితే ఆడవాళ్ళు వాళ్ళతో చక్కగా స్నేహం చేస్తారు. వారిపై ఎంతో చనువు చూపిస్తారు.
నచ్చినవారికి ఆడవాళ్ళు కనుసైగలు చేస్తారు. అబ్బే అవి మరీ కొట్టొచ్చినట్లుండవు కాని నా కేసి చూసిందా అన్న సందేహమూ ఆశా మీకు కలిగేనా అలా ఓరగా కనీకనుపించకుండా చేస్తారులే.
ఆపైన మీమగవాళ్ళేదో కొంచె చనువు తీసుకోబోతే వేడివేడిగా అలిగిపలుకుతారు.
బెదిరి మగవాడు పారిపోతే కథ సమాప్తం అనుకో, అలాంటి వాళ్ళతో‌పని లేదు. కొంచెం సరసుడై మాటకలపగలిగిన వాడైతే ఎంతో బిడియం నటిస్తూ గునుస్తూ మాట్లాడతారు.
మీతో‌ మాట్లాడితే తమకేదో మర్యాదాభంగం ఐపోతోందని భయం‌ చూపిస్తూ జాగ్రత్తగా విముఖత్వం ప్రదర్శిస్తారు - ఒకప్రక్క ఆనుకూల్యతను చాకచక్యంగా చూపుతూనే.
దానితో మీరేమో గాభరాపడిపోయి ప్రసన్నం చేసుకుందుకు తొందరపాటు చూపిస్తూ ఏవేవో ప్రసంగాలు చేస్తారు. అమ్మాయి ఎక్కడ జారిపోతోందో అన్న ఆత్రుతతో.
అదీ అలాగే బాగా నటన పండించి ఆడవాళ్ళు మీ‌గుట్టుమట్లన్నీ లాగుతారు.
మీకేమీ తెలియదు.
ఆడవాళ్ళు ఇలా మగవాళ్ళ మీద వలపులు చల్లి వశం చేసుకుంటారు.
ఐనా ఆమె తప్పేముందిలే. అందరిలాగే నీవూ ఆ వలపులవలలో పడిపోయావు.
ఆమెవాడి వైపోయావు.
నిన్ను నిరాశపరచరాదు కదా కోరి చేరిన ఆ వనిత.
తప్పులేదు తప్పులేదు. ఆమెదేమీ తప్పులేదు.

ఇంకా చెబుతాను విను. నచ్చినమగవాళ్ళను కొంగునకట్టుకుందుకు ఆడవాళ్ళ దగ్గర చాలానే ఉపాయాలున్నాయి.
ఆశలు రేకెత్తిస్తారు.
వట్టిమాటలకే కొందరు పడిపోతారులే.
కొందరికేమో అవి చాలవాయె.
అలాంటివారిని ఆడవాళ్ళు తాకీతాకనట్లుగా తాకి వాళ్ళకి ఉడుకెత్తిస్తారు.
ఇదేదో మీ విద్య అనుకునేవు సుమా. అచ్చంగా అది మా విద్యేను.
అప్పటికే వలలో పడతారు దాదాపుగా అందరు మగవాళ్ళూ.
ఇంక వాళ్ళని కదలకుండా కట్టెసుకోవమే తరవాయి.
ఓ దానికేం. వాళ్ళతో తీయతీయగా మాట్లాడుతూ కొంచెం దగ్గరైనట్లు వేషం చేసూ వాళ్ళ చేత ఎక్కడలేని ప్రమాణాలూ చేయించేసుకుంటారు ఆడవాళ్ళు.
ఓ దర్జాగా బాసలు చేసేస్తారు మగవాళ్ళు - వాళ్ళని బాగా భ్రమపెట్టేస్తారు ఆడవాళ్ళు పూర్తిగా లోబడినట్లే మెలగుతూ.
ఐనా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళుంటారు కాని మిమ్మల్ని మాత్రం పూర్తిగా నమ్మి ఉండరు. అందుచేత మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటారు.
మీరేదో తమని క్షణం ఎడబాయలేకుండా ఉన్నారని భావిస్తూ బోల్తాపడుతూ ఉంటారు.
మగవాళ్ళను అనుక్షణం తమవశంలోనే ఉన్నారు కదా అని పరీక్షించి చూచుకుంటూ ఉంటారు. మీ బుధ్ధులు ఎలాంటివో ఎవరికి తెలియవు కనుక?
హమ్మయ్య నా వాడే అని రూఢి చేసుకున్నాక అప్పుడు మీతో తామే చనవు తీసుకొని స్వస్త్రీలలాగే మెలగుతారు.
ఇలా మెల్లమెల్లగా తమ మధ్య మంచి అనుబంధం కల్పించుకొంటారు.
అలా ఆడవాళ్ళు మగవాళ్ళ మీద వలపులను చల్లి వశంచేసుకుంటారు.
ఆమె కూడా అలాగే చేసి నిన్ను తనవాడిగా చేసుకుంది.
ఆమెవాడివైపోయావు.
నిన్ను నిరాశపరచరాదు కదా కోరి చేరిన ఆ వనిత.
తప్పులేదు తప్పులేదు. ఆమెదేమీ తప్పులేదు.

ఐనా ఆడవాళ్ళంతా ఎంతలేదన్నా మగవాళ్ళకు విధేయులేలే.
తనవాడైతే చాలు, ఆ మగవాడిమీద ఆడది ఎంతో నికార్సైన ప్రేమనే చూపుతుంది.
నిత్యం ఎన్నో విధాలుగా ఎంతోసేవ చేస్తుంది.
అలా తమవారైన మగవారి కౌగిళ్ళలో వారూ తమసేవాకష్టానికి తగినప్రతిఫలమైన ఊరట పొందుతూ ఉంటారు.
ఒక్కక్షణం‌కూడా విడిచిపెట్టకుండా అంటకాగి ఉంటారు.
ఎప్పుడూ తమ మగలకు ఇంకా ఇంకా ఎలా ప్రియంగా ఉండాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు.
వాళ్ళని అంటిపెట్టుకొని ఉండి తమస్పర్శాసౌఖ్యం నుండి వాళ్ళు దాటిపోకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.
లేకపోతే మీలు బుధ్ధులు ఆడవాళ్ళకు బాగానే తెలుసును కదా. వాళ్ళ జాగ్రత్త వారిది మరి.
ఇదిగో ఇలా అమె కాస్తా నువ్వే నేను నేనే నువ్వు అన్నట్లుగా నిత్యమూ మీదపడి ఉంటే ఆమె వశం అవక మరొకలా ఎలా అవుతుందీ?
ఆమెవాడివైపోయావు.
నిన్ను నిరాశపరచరాదు కదా కోరి చేరిన ఆ వనిత.
తప్పులేదు తప్పులేదు. ఆమెదేమీ తప్పులేదు.

ఐనా ఇప్పుడేం ములిగిపోయిందీ అని?
నాదగ్గరకు వచ్చేసావుకదా?
నాతోనే ఉన్నావు కదా?

ఐనా ఒకర్ననేది ఏముందిలే?
అందరిలాగే నేనూ.
నాలాగే అందరు సపత్నులూ కూడా.

అందరమూ నిజానికి నిన్ను లోబరుచుకొనాలని ప్రయత్నించి మేమే నీకు లోబడి ఉన్నాము.
నేనైనా ఆమె ఐనా ఈవిషయంలో సమానులమే.
నేను నీమీద నా వలపులు చల్లినట్లే పాపం ఆమె కూడా అదే చేసింది.
అందరూ అలాగే చేస్తారు.
నిన్ను వశం చేసుకోవాలని ఆరాటపడతారు.
అందరూ నీకు వశవర్తులై ఉంటారు.

ఇదీ ఈ శృంగారసంకీర్తనంలోని భావం.

వేదాంతపరమైన వ్యాఖ్యానం చూదాం.

ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడే పురుషుడు. తక్కిన జీవులందరూ స్త్రీలే.
స్త్రీలకు భర్త ఎలా ముఖ్యమో, ఎలా భర్తను తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని స్త్రీలంతా ఎలా తహతహలాడుతారో అలాగే జీవులంతా కూడా పరమాత్మను తమవాడిగా చేసుకుందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు.
పరమాత్మకు ఏది ఇష్టమో తెలుసుకొని అలా ఉండటం ద్వారా ఆ జగన్నాథుడిని ఆకట్టుకుందుకు యత్నిస్తారు. అయనను తమకు స్నేహితుడిగా భావిస్తారు. ఆయన తమకు అనుకూలంగా ఏమీ కనిపించటం లేదని అనిపిస్తే తాపానికి లోనైపోతారు. ఎంతగా నేను ఇష్టపడుతున్నా నాముఖం పట్టించుకోవేం అని సణుక్కుంటారు. దీనుల్లాగా ఐపోతారు. ఆగురువుల్ని అడిగీ ఈ‌భక్తుల్ని అడిగీ అయన తమకు అభిముఖుడయ్యే గుట్టుమట్లన్నీ తెలుసుకుంటారు - అక్కడికి దాకా వస్తే అందరూ ప్రయత్నం చేసేవారే కదా. ఇలా ఉంటే నువ్వు ప్రసన్నుడివి అవుతావా అ ఉంటే అవుతావా ఐతే అలానే ఉంటాలే అని ఆయనకే ఆశలు చూపుతారు. ఆయనకు సంబంధించిన గుళ్ళూ క్షేత్రాలూ అన్నీ తిరుగుతూ ఉంటారు - ఎక్కడన్నా చిక్కకపోతాడా అన్న ఆశతో. ఇదిగో ఇది నీకు మహా ఇష్టమైన దివ్యక్షేత్రంట కదా - ఇక్కడికి వస్తే కనిపించాలి మరి అలాగైతే ఇక తరచూ వచ్చి దర్శనం చేసుకుంటాను -కాదు కాదు అక్కడే ఉండిపోతాను అంటూ దేవుడితోనే బాసలూ ఆయననే బెలిపించటాలూ చేస్తారు. ఎప్పుడన్నా ఏదైనా కాస్త ఆనుకూల్యసూచన కనిపించిందా ఆస్థితి నుండి అనుకోండి ఆక్షేత్రాదులనుండి అనుకోండి దూరంగా ఉండాలంటే భయపడుతారు -ఎక్కడ మళ్ళా ఆయన అనుగ్రహం తప్పిపోతుందో అని. కొంచెం అయన అనుగ్రహం సరిగా ఉందాలేదా అన్న అనుమానం కలిగితే పోట్లాడతారు కూడా. ఏవిధంగా ఇంకా ఇంకా సేవించి భగవంతుడి అనుగ్రహాన్ని నిలబెట్టుకోవాలా అని నిత్యం తపిస్తూ ఉంటారు. నిత్యమూ ఆయన యొక్క విభూతివిశేషాలకు కించిత్తు కూడా దూరంగా ఉండకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటూ వాటియందే దర్శనస్పర్శనపూజనాది క్రియలలో నిమగ్నమై ఉంటారు. తీవ్రమైన అభినివేశంతో సర్వేశ్వరుడి సాన్నిధ్యాన్ని అనుభవించుతూ ఉంటారు.

ఈవిధంగా భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించుకున్న భక్తజీవులకి అదే ప్రయత్నంలో వివిధావస్థల్లో ఉన్న సాటిభక్తజీవులపట్ల సానుకూల దృక్పథమే ఉంటుంది. తరించిన వారు తరణమార్గంలో ఉన్నవారిని అభినందనపూర్వకంగా గమనిస్తూ ఉంటారు. వారిపట్ల ఆదరం కలిగి ఉంటారు. భగవంతుడికి జీవులందరూ సమానమే. అందరి యెడలా ఆయనకు అపారమైన ప్రేమయే ఉంటుంది.