5, సెప్టెంబర్ 2016, సోమవారం

సింగారరసము లోన ... (అన్నమయ్య) సవ్యాఖ్యానంసింగారరసములోనఁ జీకాకులేలే
అంగన నీవే నేను అనుమానమేలే

మాణికాలపెట్టె వంటి మగువ నీనోర నన్ను
జాణ నిష్టూరా లిన్నేసి చల్లఁదగదే
ఆణిముత్యాల చిప్పలయంతలు గన్నుల నన్ను
రాణించు వేఁడిచూపుల రమణి చూడకువే
సింగార

చల్లనిచందురువంటి సతి నీమోమున నన్ను
చల్లు వెడబొమ్మలను జంకించనేలే
యెల్లగాఁ జిగురువంటి నివిగో నీ కరములు
వెల్లవిరిగాఁ బట్టితే విదిలించనేలే
సింగార

బంగారువోవరివంటిపడఁతి నీ కాఁగిటిలో
చెంగలింపు సిగ్గులనే చీఁకటు లేలే
రంగగు శ్రీవేంకటాద్రిరాయఁడ గూడితి నిన్ను
ముంగురుల నీలాలముసుఁ గింకనేలే
సింగరా


(హిందోళవసంత రాగంలో అన్నమాచార్య సంకీర్తనం 1624వ రేకు)

వ్యాఖ్య:
ఈ సంకీర్తనంలో ప్రతిచరణమూ ఒక చిత్రమైన సమాసం ప్రయోగించటంతో మొదలౌతుంది. సమాససంప్రదాయానికి కొంచెం భిన్నంగా ఉంటుందీ సంకీర్తనలో.  మాణికాలపెట్టె వంటి మగువ నీనోర అన్న చోట మాణికాలపెట్టె వంటిది నోరు. అలాగే చల్లనిచందురువంటి సతి నీమోమున అన్నచోటనూ బంగారువోవరివంటిపడఁతి నీ కాఁగిటిలో చోట కూడా అంతే కదా. చల్లనిచందురువంటిమోము అన్నది మధ్యలో ఖండితమై పడతీ నీ అన్న మాటలు ఇరికించారు ఆచార్యులు. బంగారువోవరివంటికాఁగిటిలో అన్నది సమాసం. ఇక్కడ సాహిత్యపరంగా యతి అన్నది తప్పని సరి కావటంగా నియమం ఉంది కాబట్టి అలాంటి చమత్కారమైన ప్రయోగాలు.

ఇది అద్వైత సిద్ధాంతప్రతిపాదకమైన ఒక చక్కని శృంగారసంకీర్తనం.

మొదటగా మనం ఈ సంకీర్తనానికి నాయికీనాయకులమధ్యన నడిచే ప్రణయకలహం పరంగా అర్థవిశేషం చెప్పుకుందాం.

దక్షిణనాయకుడైన పతిపైన నాయిక అలిగి ఉంది. యథాప్రకారం నాయకుడు వచ్చి సతీవియోగం భరించలేక బ్రతిమలాడుకుంటూన్నాడు.

నాయిక నోరు మాణిక్యాలపెట్టె అట. మాణిక్యం ఎఱ్ఱగా ఉంటుంది. మాణిక్యాలతో నింపిన పెట్టె తెరువగానే ఆ ఎఱ్ఱదనం కళ్ళుజిగేల్మనేలాగా ఉంటుంది. తాంబూలచర్వణం శృంగారోద్దీపనం అని పెద్దలభావన. అందుకే పూర్వం విద్యార్థిదశలో ఉండిన వారికి తాంబూలం నిషిధ్ధవస్తువుగా ఉండేది. గృహస్థులకు మాత్రమే తాంబూలసేవనాధికారం ఉండేది. నాయిక నిత్యతాంబూలసేవనాతత్పర అని ఇక్కడ ఒక సూచనామాత్రంగా సంకీర్తనాచార్యులు సెలవిస్తున్నారు. తాంబూల సేవనంతో అమె నోరంతా ఎరుపుదనంతో నిండి ఉంటుంది. మరి తాంబూలం సేవించేదే తనకు పతియెడల శృంగారభావోద్దీపనానికీ ఆయనకు తనయెడల అనురాగాధిక్యతకూ అన్నప్పుడు అలా తాంబూలం యొక్క అరుణిమతో నిండిన నోట శృంగారోద్దీపనకరమైన శుభవాక్యపరంపర రావాలి కానీ ఆవిడ నోట నిష్టూరపు మాటలు రావటం విడ్డూరంగా ఉండదా? పైగా ఏదో ఒక పరిహాసానికి అన్నమాటో పోనీ ఒక పుల్లవిరుపు మాటో అని కాదుట. అనేకంగా నిష్టూరాలు. అన్యాయం‌ కదా అని నాయకుడి ఘోష.

పెద్దపెద్ద కన్నులు అన్నవి మనదేశంలో అందంగా భావిస్తాం. చిన్నచిన్నకళ్ళే అందం అనుకొనే దేశాలూ ఉన్నాయట. మనకు పెద్దకళ్ళ అమ్మాయిలే అందకత్తెలు. అందులోనూ నాయిక కళ్ళున్నాయే - అవి ఆణిముత్యాల చిప్పలట. అంటే పెద్దవి సౌష్టవంగా ఉన్నవీ ప్రశస్తమైన ముత్యాలకు నిలయంగా ఉండేవీ‌ ఐన ముత్తెపు చిప్పలు ఆ కళ్ళు. నాయిక తన పెద్దపెద్ద కన్నులతో ఓరచూపులతో నాయకుణ్ణి పరవశుణ్ణి చేయటం శృంగారోద్దీపనాల్లో ఒకటి. ఓరచూపు కోరచూపు ఒకటనుకోకోయ్ అని ఒక సినిమా పాటలో వస్తుంది. అలాగ అంత పెద్దకళ్ళతో అందమైన ఓరచూపుకు బదులు కోపోద్రేకంతో నాయిక కోరచూపులు విసిరితే? నాయకుడు ఆ చూపుల వేడిమికి తట్టుకోగలడా చెప్పండి? పైగా ఆ చూపులు రాణిస్తూ ఉండటం అంటే వాటి వేడిమికి ఆ కళ్ళబడ్డ ఏవస్తువూ తట్టుకోలేక పోతోందట - అంటే ఆమె కోపంతో కంటబడ్డ వాటిని దహించేలా చూస్తోందో, ధ్వంసమే చేస్తోందో! ఎదటబడటానికి నాయకుడికి గుండెధైర్యం చాలటం లేదన్నమాట. ఆమె తనకు తెలిసి రమణి కదా? అంటే ఆమె భావాలూ చేష్టలూ మనస్సును రంజింపచేసేలా ఉండాలి కదా, మరి ఇదేమి ఉపద్రవం! అదీ ఆయన గోల.

నాయిక ముఖం చల్లని చంద్రుడట. చంద్రుడికి హిమకరుడు అని కూడా పేరుంది కదా. ఎంత చంద్రుడైనా నిత్యశీతలత్వం కష్టం. అయనకు వృద్ధిక్షయాలున్నాయి మరి. నిండుచంద్రుడు మాత్రమే నిజంగా చల్లని వెన్నెల కురిసే వాడు. కాబట్టి నాయకుడిదృష్టిలో నాయిక ముఖం చల్లని నిండుచంద్రుడి వంటిది. చంద్రుడిలాగా ఆహ్లాదం కలిగించేది కదా ప్రియసఖి నెమ్మోము. కాని ఇప్పుడు పరిస్థితి అలాగు లేదు. అవిడ కనుబొమలు అనిష్టాన్ని సూచిస్తూ నాయకుణ్ణి తిరస్కరిస్తున్నాయి. ముఖం చిట్లించుకుంటున్నది అమె. అందుచేత పెడపెడగా అవుతున్నాయి ఆమె కనుబొమలు. అది చూసి నాయకుడికి జంకు కలుగుతోంది. బడాయి కాకపోతే తప్పులేని వాడికి జంకెందుకు చెప్పండి. నన్నలా నీ కనుబొమలు పెడగాపెట్టి జడిపించకు అని దీనంగా బ్రతిమాలుకుంటున్నాడు.

నాయిక కరములు అంచే చేతులు చిగురు రెమ్మలవంటివి అట. అంటే ఆమె లేలేత వయసుకత్తె అని చెప్పటం. నాయకులు అలా భావించటమూ చెప్పటమూ అన్నది సరసంలో భాగం. కొంచెం ముసలిదానివై పోతున్నట్లున్నావు అని ఎవడైనా సతితో అని బ్రతక్కలడా? అందులోనూ అభిముఖుడైన నాయకుడికి నాయిక యొక్క తనులాలిత్యం నిత్యభావనాగోచరంగా ఉంటుంది కదా. ఐనా దేవతలకు త్రిదశులు అని పేరు. అంటే వారికి ముఫై ఏళ్ళ వయసే ఎల్లప్పుడూ. వారి నాయికలు కొంచెం చిన్నగా పాతికలోపే ఉంటారు కదా అందుచేత వారి తనువులు నిత్యలలితాలు. ఆయన నాయికను బ్రతిమలాడుకోవటంలో భాగంగా అమె చెతులు పట్టుకొని అనునయించటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కాని అమె కోపోద్రేకంతో ఉన్నది కదా - ఆయన చేతుల్ని విదిలించి కొడుతున్నది. ఎలా విదిలిస్తోం దనుకున్నారు? వెల్లవిరిగా - అంటే ఎలాపడితే అలా, అన్నివైపులకున్నూ. ఇక్కడ కొంచెం సారస్యం తెలుసుకోవాలి మనం. ఆవిడ తన నాయకుడి ప్రయత్నాన్ని అడ్డుకుంటోంది. చేతుల్ని పట్టుకోనీయకుండా అటూ ఇటూ శరీరాన్ని త్రిప్పుతోంది. ఆయనేవో తిప్పలు పడుతున్నాడు. ఎలాగో అలా ఆమె లేలేత చేతుల్ని దొరికించుకుని అనునయంగా ఏదో చెబుతున్నాడు. అవిడ తనపతి చేతుల్ని విదిలిస్తోంది అంతే తీవ్రంగా ప్రయత్నిస్తూ. ఈ వ్యవహారంలో వాళ్ళిద్దరూ అన్ని వైపులకూ తిరుగుతున్నారు. ఆ చేతుల్ని విదిలించటం అన్నిదిక్కులా అమె చేస్తోంది. ఏదిక్కునా ఆయనకు లొంగటం లేదు. అదీ సంగతి.

ఓవరి అంటే అంతఃపురం. బంగారం శ్రేష్ఠత్వానికి చిహ్నం. ప్రియసఖి కౌగిలి బంగారం లాంటి అంతఃపురం అట. అంతఃపురం అంటే అక్కడ తానూ తనవారూ తప్ప మరెవరూ ఉండరు. ఇద్దరి మధ్యా ఏ అరమరికలూ లేని చనువు ఉండే ఏకాంతస్థలం. బ్రతిమలాడగా బ్రతిమలాడగా ప్రియసఖి సుప్రసన్న ఐనది. ఆనందంగా అమె పతికౌగిట చేరినది. కాని అంతలోనే అమె కడులజ్జను పొందింది. తాను పతిని అన్న మాటలకూ ఆయనపై చూపిన చేష్టలకూ ఎంతో సిగ్గుపడుతూ ఉంది. తలచుకొన్న కొద్దీ ఆ సిగ్గు అతిశయిస్తోందే కాని తగ్గటమే లేదే. అన్నమాటలన్నీ తలచుకొని ముడుచుకుంటున్నది. చేసిన చేష్టలను తలచుకొని తలచుకొని ఆయనకు ఎంత కష్టం కలిగించానో కదా అని తల్లడిల్లుతూ ఉంది. అమె అలా బిడియపడుతూ ఉండటం గమనించి నాయకుడు అమెను ఓదారుస్తున్నాడు. ఎందుకే అంతగా సిగ్గులు నీకు? ఆ సిగ్గులన్నీ మనిద్దరి మధ్యా చీకటి తెరల్లాగా అడ్డం వచ్చేస్తే ఎలా? నేనేమీ అనుకోవటం లేదులే అలా సిగ్గుపడక్కర్లేదు ఇలా చూడు అని అడుగుతున్నాడు.

చూడు నేను నీకెంతో ఇష్టమైన ప్రాణసమానుడనైన వేంకటేశ్వరుణ్ణి కదా. నేను నీతోనే ఉన్నాను కదా ? నీ కౌగిట్లోనే ఉన్నాను కదా? ఎప్పటిలాగే నిన్ను కలిసే ఉంటాను కదా? అలాగే ఉన్నాను చూడు. ఇందాకటినుండి నువ్వు అపార్థం చేసుకొని అలిగి కూర్చుని ఉన్నావు. నీ ముంగురులన్నీ నీ విరహతాపానికి చెదరి ఉన్నాయి. అవన్నీ నీ ముఖమండలాన్ని ఒక నల్లముసుగు కప్పినట్లు కప్పేస్తున్నాయి. ఇప్పుడు అలకతీరింది కదా? ఇంకా ఆ ముంగురులు చెదరి ఉండటం ఏమీ ఉచితంగా లేదు అంటున్నాడు. అయన తన మునివ్రేళ్ళతో సఖి ముంగురుల్ని సరిచేస్తున్నాడని ఇక్కడ కవి సూచనామాత్రంగా చెబుతున్నాడు.

ఇలా ఆలుమగలైన అలమేలుమంగా వేంకటేశ్వరస్వాముల మధ్య జరిగిన ప్రణయకలహం తీరును ఈ దివ్యసంకీర్తనం వివరిస్తోంది.

ఇంక వేదాంతపరంగా ఈ‌ శృంగారసంకీర్తనం యొక్క పరమార్థం ఏమిటో చేతనైనంతగా వివరించటానికి ప్రయత్నిస్తాను.

సృష్టిలో పరమాత్మ ఒక్కడే పురుషుడు. తక్కిన జీవులందరూ స్త్రీలు. ఇది సనాతనధర్మంలో ఒక అనూచానమైన అందమైన భావన. ఈ భావనను ఆశ్రయించుకొని అనేకమంది భక్తులు భగవంతుడిని నుతిస్తూ అనేక శృంగారపరమైన కీర్తనలను వెలయించారు. వీటిలో పైకి కనబడేది లౌకికమైన శృంగార భావన. కాని పరమార్థమూ భక్తి తత్త్వమూ ఆ కృతిలో అంతర్లీనంగా ఉంటుంది. లౌకికార్థం తీసుకొని అక్షేపించటం పామరత్వం. అంతరార్థంతో సహా గ్రహించగలగటం భాగవత లక్షణం. అలా గ్రహించగల స్థితికూడా భగవత్కృపవలననే సాధ్యమేమో.

ఇక్కడ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడే పరమపురుషుడు. భక్తుడు స్త్రీ తత్త్వంతో ఆరాధించే జీవుడు.

నారదభక్తిసూత్రాల్లో భక్తి తత్త్వాన్ని వివరిస్తూ సాత్ అస్మిన్ పరమ ప్రేమరూపా అని ఒక సూత్రం ఉంది. జీవుడికి పరమాత్మపై ఉండే భక్తి పరమప్రేమ. అది ఒక్క క్షణం ఎడబాటును కూడా తట్టుకోలేదు.

కొద్దిసేపు ప్రియుడు దూరమైతే ప్రియురాలి మనస్సు పరిపరివిధాల ఎలా పోతుందో మనకు తెలుసు. అత్యంతమైన తహతహతో ఆమె తన పతి మరొక స్త్రీ యందు ఆసక్తి కలిగి తనను నిర్లక్ష్యం చేసాడా అని కూడా భయపడుతుంది.

అలాగే భగవంతుడు తనకు నిత్యసుముఖుడు అని పరమప్రేమతో ఆరాధించే భక్తియుక్తజీవుడు కూడా కించిత్తుగానైనా సరే భగవంతుడితో విరహం కలిగినట్లు భావించినా సరే, ఆయన తనయందు విముఖుడయ్యాడా అని పరిపరివిధాల ఆలోచిస్తాడు.

అత్యంతమైన ఆత్మీయత కల ఆ జీవుడు భగవంతునిపై అలుగుతాడు కూడా. అది మనబోటి సామాన్యులకు వింతగా అనిపించ వచ్చును. ఆని ఆ దివ్యమైన ఆత్మీయత కల భగవంతుడికి-భక్తుడికి మధ్య అది సహజం. చాలా సహజం.

భగవానుడిని మనం ఎంత ఆత్మీయుడిగా కొలుస్తామో మననూ భగవానుడు అంతే అత్మీయుడిగా భావిస్తాడు. అవసరం ఐతే ఆ భక్తుడి విరహాన్ని పోగొట్టేందుకు తహతహ లాడుతాడు తాను కూడా.

భక్తుడు నిష్టూరాలు పలుకుతాడు. ఏమయ్యా నువ్వు దర్శనం ఇవ్వటం లేదు. కలల్లోకూడా కరువైపోయావు. అంటూ కోప్పడతాడు. నామీద నీకు ప్రేమ ఉందను కున్నానే - నువ్వు నన్ను వదిలి తిరుగుతున్నావే అని గొడవపడతాడు. నిత్యం భగవన్నామం అనేది సేవించే నోట నిష్టూరాలు తప్ప మరేమీ రావటం మానేస్తాయి. భగవంతుడు ఆయనకు నిదర్శనాలు చూపుతున్నా ఆయన వాటిని చిలిపి చేష్టలుగా కొట్టివేసి ఇల్లాంటి ఆటలు కావు ఏదీ రావేం అని అలిగి కూర్చుంటాడు. భగవత్కథలను చదువుతూ ఉంటాడు కాని మాటిమాటికీ భక్త్యావేశంలోని విరహం వలన కన్నులు మూస్తూ తెరుస్తూ ఆయనెందుకు వస్తాడూ అని కనుబొమలు చిట్లిస్తూ ఉంటాడు. అయన్నే తలుస్తూ తాదాత్మ్యంతో ఉండే ఆభక్తుడి విరహార్తి కారణం దేహస్పృహ సరిగా ఉండక ఆయన దేవుడికి నిత్యం చేసే ఉపచారాలన్నీ చెల్లా చేదరుగా నడుస్తూ ఉంటాయి. మాటవరసకు దేవుడికి పుష్పార్చన చేస్తుంటే అవి ఎక్కడెక్కడో పడుతుంటాయి కాని ఆయన వేదనలో ఉండి గమనించేస్థితిలో ఉండడు. ప్రేయసి భర్తకు నిత్యం ఉపచారాలు చేసే చేతులతోనే ఆయన్ను త్రోసివేస్తూ కూడా తన ప్రణయకోపంలో అపచారం అని గుర్తించే స్థితిలో ఉండనట్లే ఇది కూడా.

ఇలా ఉండే భక్తుడికి భగవంతుడు క్రమంగా స్వాంతన కలిగిస్తాడు. ఆ భక్తుడి మనస్సును రంజింపచేసే నిదర్శనాలతో ఆతడిని తిరిగి తనవాడిగాచేసుకుంటాడు. భక్తుడు కూడా అలకతీరి సంతోషం పొందుతాడు భగవంతుడు తనవాడే అని సంబరపడుతూ. అంతలోనే తన వలన భగవంతుడికి మహాపచారం జరిగిందని గుర్తెరికి తీవ్రమైన వేదనకు లోనైపోతాడు.

భగవంతుడు మరలా నేను నీ వాడనే కాని పరాయి వాడనా? అలా కించపడవద్దు అని అనునయిస్తాడు. నీముఖంలో విషాదం నాకు సమ్మతం కాదని హెచ్చరించి అది తన ప్రేమపూర్వకమైన చేష్టలతో తొలగించి భక్తజీవుడికి పరమానందం కలిగిస్తాడు.

ఎలా చెబుతే కోపించిన ప్రియురాలు అలక తీరుతున్నది. నీవే నేను నీవే నేను అని పతి పదేపదే నమ్మబలికిన పిమ్మటనే కదా? ఎలా చెబుతే భక్తుడికి విరహార్తి తీరుతున్నది? నీవే నేను నీవే నేను అని జగత్పతి పదేపదే నమ్మబలికిన పిమ్మటనే!

జీవేశ్వరుడైన దేవుడూ నేనూ ఒకటే అని భక్తుడు ఊరడిల్లుతాడు. తానూ తనపతీ ఒకటే అని విరహార్త ఐన సతి చివరకు ఊరడిల్లినట్లే.  ఎలా చూసినా ఇద్దరూ ఒకటేను సుమా.

జీవుడికీ దేవుడికీ అభేదం అని దేవుడి నోటనే అద్వైతసిధ్ధాంతం వినిపిస్తున్నది ఈ సంకీర్తనం2 వ్యాఖ్యలు:

  1. ప్రత్యుత్తరాలు
    1. మిత్రులు శర్మ గారు,
      నాకు చేతనైనంతగా వ్యాఖ్యానాన్ని జోడించానండి ఈ‌అన్నమాచార్యసంకీర్తనానికి. బాగోగులు ఉచితజ్ఞులైన మీరే చెప్పాలి మరి.

      తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.