4, జులై 2016, సోమవారం

ఫలించిన జోస్యం - 8 (గండాలే గండాలు -1)

( మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం  ఐదవభాగం  ఆరవభాగం  ఏడవభాగం)

( ఒకవారం రోజులు cervical spondylosis పుణ్యమా అని ఆటంక కలిగింది)

ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం‌ కలుగుతూ‌ ఉంటుంది నాకే. నా జీవనయాత్రలో ఇన్ని గండాలు దాటవలసి రావటం ఎంతో చిత్రంగా అనిపిస్తుంది.

నిజానికి ఈ‌ గండాలమారి జీవుడి లోకవిహారంలో‌ గండాలకు ప్రారంభం అయ్యేనాటికి భూమిమీద అవతరించటం‌ జరగనే లేదంటే కొందరు నమ్మక పోవచ్చును.

తరచుగా కలలోనికి వచ్చి ఒకావిడ 'పిల్లవాడికి నా పేరు పెట్టవా' అని ప్రాధేయపడుతూ ఉండేదట. అలా పేరు పెడితే అన్ని వేళలా తాను కాపుదలగా ఉంటాననీ లేకుంటే అలాంటి అవకాశం తనకు రాదనీ బ్రతిమాలేదట.  ఒకవేళ అలా చేయటానికి అంగీకరించని పక్షంలో బిడ్డ పుట్టటం కూడా కష్టం సుమా అని బెదిరించేదట కూడా!

మా అమ్మగారు తనకు ఎవరో ఒకావిడ కలలోనికి వచ్చి ఇలా చెబుతోందని చెబితే మొదట్లో మన హేతువాదుల్లాగే, నీదంతా ఒట్టి భ్రమ అని నచ్చచెప్పబోయారట అందరూ. ఐతే ఆ కలలోనికి వస్తున్నావిడ రూపురేఖలు వగైరా మా అమ్మగారు వర్ణించిన తీరును బట్టి ఆ వ్యక్తిని పోల్చుకొని ఆశ్చర్యపోయారట.

ఆ కలలోనికి వచ్చి మా అమ్మగారిని ఇబ్బంది పెట్టిన స్త్రీమూర్తి పేరు శ్యామలాంబ.

ఆవిడ మా నాన్నగారి ప్రథమ ధర్మపత్ని. దురదృష్టవశాత్తూ చాలా చిన్నవయసులోనే ఆవిడ పరమపదం‌ చేరుకోవటం జరిగిందట. తదనంతరం మా నాన్నగారు ద్వితీయ వివాహం చేసుకొన్నారు. మా అమ్మగారి పేరు రంగనాయకమ్మ గారు. ఏ కారణం చేతనో‌ కాని మా నాన్నగారు మా అమ్మగారిపేరును కొంచెం క్లుప్తం చేసి రంగమణిగా మార్చారు!

ఇదంతా మా అమ్మగారే స్వయంగా నాతో ఒకటి కంటే హెచ్చు సందర్భాల్లోనే చెప్పారు. ఎన్ని సార్లు కనిపించి ఎలా ఎలా మాట్లాడేదో‌ కూడా చెప్పారనుకోండి. ఐతే ఆ కలలోనికి వచ్చినావిడ పట్ల మా అమ్మగారి సానుభూతియే మా అమ్మగారి మాటల్లో ఎక్కువగా ధ్వనించేది.

నాకు శ్యామలరావు అని నా తలిదండ్రులు పేరు పెట్టటం వెనుక నున్న కథ ఇది.

నాకు గుర్తున్నంత వరకూ ఈ‌కథకు సంబంధించిన ప్రస్తావన మా నాన్నగారి నుండి ఎన్నడూ‌ రాలేదు.

మేము తరచుగా ర్యాలికి వెళ్ళి వస్తూ ఉండే వారం. అక్కడ జగన్మోహినీ‌కేశవస్వామివారిని సందర్శించి రావటం ఒక మిష ఐతే మరొకటి కూడా ముఖ్యమైనది ఉంది. అది మా అమ్మమ్మగా రింటికి వెళ్ళి రావటం. ఈ‌ర్యాలి అమ్మమ్మగారు మా బామ్మగారికి అన్నగారి భార్య. చిన్నతనంలోనే భర్తగారు పోయారట. ర్యాలిలోని వారింట్లో ఆవిడ ఇద్దరు కూతుళ్ళతోనూ అత్తగారితోనూ‌ కలిసి నివసించేవారు. వాళ్ళు చాలా చాలా బీదవాళ్ళు. అప్పుడప్పుడూ‌ మా నాన్నగారే‌ వెళ్ళి వాళ్ళని చూసి వచ్చేవారు. వాళ్ళు చేసిన చిన్నా చితకా అప్పులూ‌ తీర్చి వచ్చేవారు. నిజానికి అలా వాళ్ళ అప్పులు తీర్చటం మా నాన్నగారికి తలకు మించిన భారం గానే ఉండేది,.

అలా ర్యాలి వెళ్ళిన ఒక సందర్భంలో, మా నాన్నగారితో పాటు ఒకరింటికి వెళ్ళటం‌ తటస్థించింది. నాతో‌పాటు ఆ సందర్భంలో నా పెదతమ్ముడు రామం కూడా ఉన్నాడనే గుర్తు. వాళ్ళెవరో ముసలి వాళ్ళు. ఆ యింటివాళ్ళు నాన్నగారి రాకకు ఎంతో‌ సంతోషించారు. వాళ్ళింట్లో ఒక అరగంటపాటు కూర్చున్నాం అనుకుంటాను. మాకు కారప్పూస వగైరా కూడా పెట్టారు. అది నాకు బాగా గుర్తు. ఇంకా పెద్దగుర్తు ఏమిటంటే ఆ ముదుసళులూ‌ మా నాన్నగారూ‌ కొంచెం విచారంగా ఏమో మాట్లాడుకున్నారు.  తరువాతి కాలంలో నాకు అర్థమైనది ఏమిటంటే వారు మా సవతి తల్లిగారి తలిదండ్రులని.

ర్యాలిలో‌ఉండే మా బామ్మగారి పుట్టింటివారు కూడా మా యింటికి బాగా తరచుగానే వచ్చేవారు. మా తాతమ్మగారు అంటే బామ్మగారి తల్లిగారికి మడీదడీ‌ చాలా హెచ్చు మరియు సుబ్రహ్మణ్యస్వామి భక్తురాలు.

లక్ష్మీపోలవరం వాస్తవ్యులకు మంచినీటి వసతి గోదావరి కాలువే. అది మా యింటికి ఒక వందగజాల లోపు దూరంలోనే ఉండేది. మా దొడ్డిలో ఒక ఉమ్మడి నుయ్యి, వాడకం నీళ్ళ అవసరం తీరుస్తూ ఉండేది.  మంచినీళ్ళకైతే ఆడవాళ్ళంతా కాలువను ఆశ్రయించేది తప్పదు కాబట్టి మా యింట్లో నుండి మా బామ్మగారూ మా అమ్మగారూ‌ బిందెలతో అలాగే నీళ్ళు తెచ్చుకొనేవారు.

మంచినీళ్ళకే కాక ఊరి వారు స్నానానికీ కాలువను ఉపయోగించేవారు.

ఒకరోజు అలా కాలువకు స్నానానికీ, ఆ పిదప మంచినీళ్ళను తెచ్చుకుందుకూ మాఅమ్మగారూ, మా బామ్మగారూ, మా తాతమ్మగారూ ముగ్గురూ కాలువకు వెళ్ళారట. ఇంకా ఊహ సరిగారాని చిన్నపిల్లవాడిని నన్నూ‌ తీసుకొని వెళ్ళారట. ఏం జరిగిందో ఏమో, వీళ్ళు చూసేసరికి నేను అప్పటికే‌ ప్రవాహంలో అంతదూరం కొట్టుకొని పోయానట. మా తాతమ్మగారు తెగించి ప్రవహంలో‌ ఈదుకుంటూ ఎలాగో వెళ్ళి నన్ను రక్షించి తీసుకొచ్చారట. మా తాతమ్మగారి ప్రసక్తి వచ్చినప్పుడల్లా మా అమ్మగారు ఈ‌సంఘటనను తప్పక ప్రస్తావించేవారు. ముక్తాయింపుగా మరొక సంగతీ ప్రస్తావించే వారు - ఆ కాలువ చెడ్డదనీ ఆ సంఘటనకు ముందు రోజనే‌ ఒక చిన్నపిల్లవాడు దానిలో కొట్టుకొని పోయాడనీ చెప్పేవారు.

ఇదొకటే‌ కాదు కొన్నేళ్ళ తరువాత మరొక జలగండమూ‌ తప్పింది నాకు. అప్పటికి మా నాన్నగారు గెద్దనాపల్లెలో మిడిల్‌స్కూల్ ప్రథానోపాధ్యాయులుగా ఉండేవారు. పాఠశాల బిల్డింగుకు ప్రక్కనే మంచినీటికొలను. నేను ఒకటో తరగతి దాటి రెండులోనికి వచ్చానో లేదో. ఒక రోజు ఉదయం పదిగంటల సమయంలో ఆ మంచినీటి కొలనులో కాలు జారి పడిపోయాను. నాకేమో ఈతరాదు. అప్పుడూ‌ రాదు - ఇప్పటికీ‌ రాదు. పడిన విసురుకు కొలని మధ్యగా కొంతదూరం వెళ్ళిపోయాను. అశ్చర్యం ఏమిటంటే, ఎంతమాత్రం‌ ఈ‌తరాని నేను ఎలా ప్రయత్నం చేసి ఒడ్డున ఉన్న రేవు మెట్లను పట్టుకొన గలిగానో కాని మొత్తం మీద గండం గడిచింది.  ధారాపాతంగా నీళ్ళోడుతున్న బట్టలతో హెడ్మాష్టరు గారి పెద్దబ్బాయి అలా స్కూలు ముందు నుండి నడచుకుంటూ వెడుతుంటే, అది వేరే ఎవరి కంటనో‌ కాదు, ఏదో పని మీద బయటకు వస్తున్న మా నాన్నగారి కళ్ళలోనే పడింది. స్వయంగా తనూ స్కూలు బంట్రోతు జగన్నాధమూ కలిసి నన్ను ఇంటికి చేర్చారు. జరిగింది వివరం రాబట్టి తెలుసుకున్న తరువాత అంతా గాభరాపడ్డారు.

ఆ సందర్భంలో, నన్ను చూడటానికి మా ఎలిమెంటరీ‌ స్కూలు హెడ్మాష్టరు సోమరాజుగారు కూడా వచ్చారు. పెరిగి పెద్దై డిగ్రీలోనికి వచ్చాక నేను అమలాపురంలో ఒక గది తీసుకొని అద్దెకుండేవాడిని. ఆ యింటాయన శేషగిరిరావుగారు ఒక ప్లీడరు గుమాస్తా గారు. ఆయనకు ఈ‌సోమరాజుగారు దగ్గర బంధువులట. అందుచేత వారొకటి రెండు సార్లు అమలాపురం వచ్చినపుడు నన్ను చూసి చాలా సంతోషించేవారు.

నా చిన్నతనంలోనే మరొక పెద్దం గండం‌ గడిచింది. ఒకరోజున పాఠశాలలోని మా నాన్నగారి  గది బయట ఆడుకుంటున్నాను. బడి భవనం అరుగు మీద నుండి క్రిందికి దూకాను. ఫరవాలేదులెండి రెండు లేదా రెండున్నర అడుగుల ఎత్తు అరుగే అది.  అరుగు చివరన స్కూలు గంట వ్రేలాడుతూ‌ ఉంది. అదొక ఇనప కమ్మీ. సరిగా దాని క్రిందనుండి నేను క్రిందికి దూకాను. అదే సమయంలో ఆ గంటకూ పై దూలానికీ కలిపి కట్టిన తాడో గొలుసో వదులై ఆ కమ్మీ కాస్తా క్రింద పడింది. ఆ పడటం‌ సరిగ్గా నా మీదనే. నా కుడితొడను రాసుకుంటూ అది క్రిందకు పడింది.  అక్కడే ఉన్న బడిబంట్రోతూ,  ఆ సమయంలోనే భవనంలోనికి వస్తున్న మరొక ఉపాధ్యాయులూ పెద్దగా అరవటంతో‌ మా నాన్నగారూ బయటకు వచ్చారు.  నా కేమీ‌ భయమూ గట్రా అనిపించలేదు కాని మా నాన్నగారు మాత్రం చాలా భయపడ్డారు.

మరొక సంఘటన, అదీ‌ నా చిన్నతనం లోనిదే. గెద్దనాపల్లిలో ఉండగా జరిగినదే. కాస్త అక్షరాలను చదవటం అలవాటయ్యాక, అదొక రంధి ఐపోయింది నాకు. ఎక్కడ నాలుగక్షరాలు కనిపించినా అవి వెంటనే చదివి తీరవలసిందే. సందు మళుపు దాటగానే కొద్ది దూరంలోనే ఉన్న పచారీ దుకాణానికి వెళ్ళి చిన్నచితకా వెచ్చాలు తెస్తూ‌ ఉండే వయసు వచ్చింది కదా.  అలాగే ఒక నాడు ఏదో పొట్లం‌ కట్టించుకొని తెస్తున్నానో లేదా అలా వస్తుంటే రోడ్డు మీద ఏదన్నా కాగితం కనిపించిందో నా దృష్టికి అన్నది ఇప్పుడు సరిగా చెప్పలేను. కానీ దాని వలన ప్రమాదం నా మీదకు ఉరుక్కుంటూ వచ్చి అది కాస్తా, తలవెంట్రుకవాసిలో తప్పిపోయింది.  ఎవడో‌ లారీ వాడు దారిన వస్తూ‌ ఉన్నాడు. ఆ రాత్రి ఏడెనిమి గంటలవేళ చీకట్లో, ఆ లారీ‌ హెడ్ లైట్ల వెలుగులో, నాకు చేతిలోని కాగితంలో ఏముందో చూడటం సులువుగా అనిపించింది. దారి కడ్డంగా నిలబడి మరీ ఆ కాగితం దీక్షగా చదువుతున్నాను!

ఇంకేముంది? ఓ మూడు నాలుగు నిముషాల తర్వాత నేను మా యింట్లో వాళ్ళ ముందు బిక్క ముఖం వేసుకొని నుంచున్నాను. లారీ వాడు నా చెవులు పట్టుకొని మా యింటికి తీసుకొని వచ్చి పంచాయితీ‌ పెట్టాడంటే అది వాడి తప్పా చెప్పండి? ఈ రోజున నా అదృష్టమూ మీ అదృష్టమూ‌ బాగున్నాయి కాబట్టి సరిపోయిందని కళ్ళొత్తుకుంటూ  వాడు మా అమ్మగారితోనూ నాన్నగారితోనూ 'అబ్బాయిగారిని ఒక్కర్నీ ఎప్పుడూ బయటకు పంపకండీ' అని  మరీమరీ‌ చెప్పి చక్కాపోయాడు

అన్నట్లు ఒక ముఖ్య విషయం వ్రాయటం మరచిపోయాను! ఆ లారీవాడికీ నాకూ ముఖాముఖీ జరిగిన స్థలం గెద్దనాపల్లిలోని రామకోవెల ముంగిలి.  (అక్కడి రామాలయాన్ని అలాగే పిలచేవారు.)

ఇంకా చాలాగ్రంథం‌ ఉందండీ. అదంతా రేపు.