19, ఏప్రిల్ 2016, మంగళవారం

నీవార లెవరన్న నేనేమి చెప్పుదు


    నీవార లెవరన్న నేనేమి చెప్పుదును
నీవాడ ననుటకు నిన్ను వారెఱుగరే

   


కాపాడు తండ్రివై కలవు నీ వొకడవని
యీ పేరు కలవాడ వీ యూర నుందువని
రూపురేఖలు నీవి రూపింప నిటులని
యే పగిది నితరులకు నేర్పడ జెప్పుదు
నీవార


నినుగూర్చి తెలియక నిష్ఠురంబుల నాడు
మనుజులే యధికమౌ మహిలోన నినుగూర్చి
వినుతించి చెప్పుచో వినువార లెందరు
పనిమాలి చెప్పినా ఫలితముండదుగ
నీ‌వార


నీవార లెవరైన నావారలే నాకు
భావించి నను గుర్తుపట్టగల రయ్య
ఏ విధంబుగ నితరు లెంచిన నాకేమి
నావాడ  వో రామ నా కదియె చాలు
నీ‌వార
1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.