15, ఏప్రిల్ 2016, శుక్రవారం

బంటునై నిన్నంటి యుండే భాగ్యమే కల్పించవయ్యా   

  

వెంటబడి వేధించు వట్టితుంటరి ననుకొనకు రామా
బంటునై నిన్నంటి యుండే భాగ్యమే కల్పించవయ్యా
ఏటి కొకసారి శ్రీరామచంద్ర యెంచి నిను తలచి
పాటలూ పద్యాలు తప్పులు పాటిసేయక యరచి పాడి
కోటికోరికల చిట్టాను చదివి గొప్పభక్తుడను
సాటి లేరిక నా కటకంచు  జబ్బచరచితినా
వెంటబడి


నిన్నమొన్నటి వాడనా నిన్నెన్నడైనా విడచియుంటిన
ఎన్నిజన్మల నుండి నినునే నెన్నికోరితి నేమి పొందితి
ఎన్నడైనను నన్యదైవము నెన్ని కొలిచుట యున్నదా
వెన్నవంటి మనసు నీదని ప్రేమతో నిను కొలుచుచుంటిని
వెంటబడి


నిన్ను కొలుచు వారిలో నన్నెన్ని చేర్చితి వదియెచాలు
పన్నుగా నన్నంతరంగ భక్తుడంటి వదియెచాలు
ఎన్ని జన్మలు కలుగనేమి ఎన్ని యిడుములు కలుగనేమి
వెన్ను గాచి నాకు నీవు విభుడవై యున్నదియె చాలు
వెంటబడి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.