19, ఏప్రిల్ 2016, మంగళవారం

ఈశ్వరుడంటే హితకరుడు
     ఈశ్వరుడంటే హితకరుడు ఈశ్వరుడంటే శుభకరుడు
ఈశ్వరుడంటే హృదయస్థితుడౌ శాశ్వతపదసంపత్కరుడు

   


ఈశ్వరాఙ్ఞయే లేకుండినచో నిచ్చట నీవే లేవుకదా
ఈశ్వరాఙ్ఞయే కాకుండినచో నేది సుఖేఛ్చ, లేదు కదా
ఈశ్వరునందు నీదు చిత్తమే యెల్లవేళల నిలచినచో
ఈశ్వరుడే నీవాడని తెలియుట కేమి యడ్డము లేదు కదా
ఈశ్వరు డంటే


ఈశ్వరసంకల్పముగా కలిగిన దీజన్మంబని తలచినచో
ఈశ్వరకార్యము నెఱవేర్చుటకే యిలనుంటినని తలచినచో
ఈశ్వరబుధ్ధుల సత్సంగమునే యెల్లవేళల వలచినచో
ఈశ్వరుడే నీవాడైయుండుట కేమి యడ్డము లేదుకదా
ఈశ్వరు డంటే


ఈశ్వరుడిచ్చిన కాల మంతయును నీశ్వరభావన నుండినచో
ఈశ్వర సాంగత్యమునే కోరుచు నెల్లవేళల నిలచినచో
ఈశ్వరమయ మీ జగమున నెల్లడ నీశ్వరునే కనగలిగినచో
ఈశ్వరుడును నీ వొకటి యగుట కింకేమి యడ్డము లేదు కదా
ఈశ్వరు డంటే
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.