5, మార్చి 2016, శనివారం

నమ్ముము రామచంద్రుని ......
 

  ఉ. నమ్ముము రామచంద్రుని ననారతమున్ మరి రాముడొక్కడే
  యిమ్మహినుండు వారలకు నెల్లవిధంబుల దోడునీడయై
  యుమ్మలికంబులం బడగ నుండెడి వేళల రక్షగూర్చు వా
  డెమ్మెయి నేని రామజప మించుక జేసిన బెద్ద మేలగున్

  మ. నరుడా నమ్ముము రామచంద్రుని పురాణంబుల్ ప్రశంసించు నే
  హరి నా శ్రీహరి యాతడే యనుట కావంతైన సందేహమ
  క్కర లేదన్న నిజంబెఱింగి మరి యా కారుణ్యవారాన్నిధిన్
  స్థిరబుధ్ధిన్ భజియించి ముక్తిగొనుమా ధీశాలివై వేగమే

  ఉ. కొందరు నమ్మకుండెదరు కొంచెపు వారలు వారి జోలి నీ
  కెందుకు గాని నీ సుగతి కియ్యది యుక్తతమంబు గాన నా
  నందము రామనామ మని హాయిగ నమ్ముము రామచంద్రునే
  పొందుము వేఱు పుట్టువిక పుట్టని సద్గతి పట్టు చక్కగన్

  అ.వె. తండ్రియనుచు నీవు తప్పక నమ్ముము
  రామచంద్రు నతడు ప్రేమ మీర
  బిడ్డ డనుచు గారవించి కోర్కెలదీర్చి
  మోక్షపదము నిచ్చి మురియు నిజము

  కం.  ఒక వేయి జన్మలెత్తితి
  వొక యించుక మేలు జరిగెనో యది చెపుమా
  యకటా యెందుకు మూఢత
  యిక నమ్ముము రామచంద్రునే నీ యెడదన్

  మత్త కోకిల.  రామనామము కాక జీవుని వ్రాతమార్చు నుపాయమే
  భూమిపై గనరాదు కావున బుధ్దిమంతులు చక్కగా
  రామనామము నాశ్రయింతురు రామసేవకు మోక్షమే
  రాము డిచ్చును గాన నమ్ముము రామచంద్రుని సోదరా

  ఉ. పుట్టెను లోకబాంధవుని పుణ్యకులంబున రామమూర్తి  చే
  పట్టెను భూమిజాత యగు బంగరు తల్లిని సీత నుధ్ధతుం
  గొట్టెను రావణాసురుని కొల్చిన భక్తుల కిచ్చె మోక్షముం
  జుట్టము దైవమాతడని సొంపుగ నమ్ముము రామచంద్రునిన్.

  ఉ. నమ్మెను వాయునందనుఁడు నమ్మెను సూర్య కుమారుఁడాత్మలో

  నమ్మెను జాంబవంతుఁడును నమ్మిరి తమ్ములు నంగదాదులున్
  నమ్మెను రాక్షసోత్తముడు నమ్మని సజ్జను డుర్వి లేడయా
  నమ్ముము రామచంద్రుని మనంబున నీవును  మేలు కల్గెడున్

   ఉ.నమ్ముము రామచంద్రుని ననంతవిధంబుల మేలు కల్గు నీ
   కిమ్మహి రామచంద్రునకు నీ డగు నట్టి విభుండు లేడు లేడు చి
   త్తమ్మున రామనామమును దాల్చిన వారల నమ్మకంబులన్
   వమ్మొనరింప డెన్నడు కృపానిథి వాని సమాశ్రయించుమా

4 వ్యాఖ్యలు:

 1. చాలా కాలం తరవాత పునర్దర్శనం. సంతసమే కలిగెన్ కరుణాపయోనిధీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండీ. ఆఫీసు పనుల ఒత్తిడి కారణంగా ఒక్క ముక్క వ్రాయటానికి కూడా తీరిక లేని పరిస్థితిగా ఉన్నది. కొంచెం తెఱపి యిచ్చినదేమో కార్యభారం, ఇలా కొన్ని పద్యాలు వ్రాయగలిగాను. మీకు సంతోషం కలిగినందుకు మహదానందం.

   తొలగించు
 2. 1. నమ్ముము రామచంద్రుని ననారతమున్
  2. కారుణ్య వారాన్నిధిన్ / స్థిర బుద్ధిన్ ---- (తిర + బుద్ధిన్ ---> కూడదు)
  3. కెందుకు గాని నీ సుగతి కియ్యది యుక్తము గాన నా ( ఇంకొక రెండక్షరాలు లుప్తములైనవి)
  4. జాంబవదంగదాదులున్ అన్నప్పుడు జాంబవతుడైన అంగదుడు అన్న అర్థంలో కర్మధారయమై ప్రమాదంలో పడుతుంది . దీన్ని

  నమ్మెను వాయునందనుఁడు నమ్మెను సూర్య కుమారుఁడాత్మలో

  నమ్మెను జాంబవంతుఁడును నమ్మిరి తమ్ములు నంగదాదులున్ అని మీ విచక్షణకు సంబంధించి అనవచ్చును .
  5. నమ్ముము రామచంద్రుని ననంత విధంబుల ----

  ఇవన్నీ పద్యంలో కనిపించే పైపై దొషాలకు సవరణలు మాత్రమే . మీ పద్యాలలో నిక్షిప్తమయ్యే ఆర్తి, భావ శబలత , శయ్యా సౌభాగ్యాలకు మేర లేదని మళ్లీ మళ్లీ చెప్పనక్కర లేదు . పద్యాలన్నీ రస గుళికలే !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విష్ణునందనులవారికి నమోవాకములు. మీరు సూచించిన పరిష్కరణలు దివ్యంగా ఉన్నాయి. మీ అభిమానానికి కృతఙ్ఞుడను. అపండితుడనైన నా పద్యాలను సత్కవులైన మీరు ఆదరించటం మహధ్బాగ్యంగా భావిస్తున్నాను. ధన్యోస్మి. టపాను మీ సూచనలకు అనుగుణంగా సరిచేసానండి.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.