3, జనవరి 2016, ఆదివారం

రామ‌ం వందే ప్రముదితవదనం పునఃపునః






  7వస్థానంలో‌ యతిమైత్రితో:

    ప్రముదితవదన.
    అనుదినమును శ్యామలీయంబునన్
    వినగ చెవుల విందులౌ పద్యముల్
    జనహితకర జానకీ వల్లభా
    నిను పొగడుచు నిత్యముం‌ జెప్పెదన్



  8వస్థానంలో‌ యతిమైత్రితో:

    ప్రముదితవదన.
    కనుగొన వశమే ఘనశ్యామునా
    మునివరహృదయాంబుజారూఢునిన్
    జనహితకరునిన్ సదా జానకీ
    వనరుహనయనా ప్రభున్ రామునిన్    




( ప్రముదితవదన వృత్తంపై మొదటి టపా )

శ్రీ‌ కంది శంకరయ్యగారు ఈ ప్రముదితవదన వృత్తానికి యతిస్థానం 8వ అక్షరంగా ఒప్పుతుందని అభిప్రాయపడుతున్నారు.  లాక్షణికులు కూడా 8వ స్థానాన్నే యతిస్థ్హానంగా చెప్పటం‌ జరిగింది.

శ్రీశంకరయ్యగారు ఉదాహరణగా చెప్పిన పద్యం:

    మునిజన వినుతా - మురధ్వంసకా
    వనరుహ నయనా - వరాంగా హరీ
    నిను మదిఁ దలఁతున్ - నినున్ గొల్చెదన్
    నను దయఁ గనరా - నమో మాధవా!

నా మతం 7వ స్థానం ఐతే బాగుంటుందని. అందుకు కారణాలను ఈ వృతం విషయకమైన తొలిటపాలో వివరించాను.

నేను సూచించన ప్రకారం ఈ‌ ప్రముదితవదనం వృత్తానికి 'ననన - ననన  నాననా  - నాననా' అన్న లయ ఒప్పుతున్నది.  ఉదాహరణకు "వినగ చెవుల విందులౌ పద్యముల్" అన్నట్లుగా  శ్రీ‌శంకరయ్య గారి మతం ప్రకారం   ‘నననన - నననా   ననా - నాననా’ అన్న లయ కర్ణపేయం.  ఉదాహరణకు "దశరథతనయా దయాసాగరా" అన్నట్లుగా. ఉభయవిధానాల లోనూ‌ పద్యాలను పరిశీలించటం అవసరం. ఐతే, విశేషవృత్తాలకు ప్రయోగాలు అరుదు. ఈ ప్రముదితవదన వృత్తాన్నైతే మరెవరైనా కవులు ఇతఃపూర్వం ప్రయోగించిన దాఖలాలున్నాయో‌ లేదో‌ నాకు తెలియదు.

ఒకటి ఒప్పు ఒకటి తప్పు అని నేను అనుకోవటం‌ లేదు. ఐతే గియ్తే తప్పు నా మతమే కావాలి. ఎందుకంటే లక్షణానికి భిన్నంగా ఆలోచించినది నేను కాబట్టి!

మరొకసారి పరిశీలనగా చూదామని రామాంకితంగా రెండు విధాలుగానూ‌ పద్యాలు వ్రాసాను.

విఙ్ఞులైన పాఠకులు ఉభయవిధానాల్లోని లయవిన్యాసాలనూ గమనించ వలసిందిగా విఙ్ఞప్తి.