9, జనవరి 2016, శనివారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 3

అర్జునుడు చాలా మాసాలనుండీ తపస్సు చేస్తున్నాడు. అందువల్ల బాగా చిక్కిపోయి కూర్చున్నాడు. తనదగ్గర ఆయుధాలన్నీ ఉంచుకున్నా ఆయన వాటితో సాధన చేయటం లేదు కాబట్టి అభ్యాసం తప్పి ఉండాలి. అదీ కాక కొండలూ‌ అడవులూ వంటి ప్రాంతాల్లో యుధ్ధం చేయటం తమకు అలవాటైన వ్యవహారం‌ కాని పట్టణవాసి ఐన అర్జునుడికి కొత్తే‌ కదా. అదీ‌ కాక  తమను స్వయంగా దేవసేనాపతి ఐన కుమారస్వామివారు యుధ్ధానికి తీసుకొని వచ్చారు. అర్జునుడికి ప్రక్కన ఎవరూ వ్యూహకర్తలుగా లేరు. తామా మంచి బలగంగా ఉన్నారు. అర్జునుడా ఒంటరిగా ఉన్నాడు. పైగా ఈ యుధ్ధాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుడే ప్రోత్సహించి స్వయంగా దానిలో‌ పాల్గొన వచ్చాడు. ఇంక తమకు తిరుగేముంది. అర్జునుడికి తమతో తలపడటం ఎలాసాధ్యం?

ఇలా ఆలోచించారేమో ప్రమథులు. కాని అర్జునుడు వాళ్ళమీద విరుచుకుపడి వాళ్ళ ధైర్యాన్ని క్షణంలో మటుమాయం చేసాడు. హఠాత్తుగా అనుకోనిది జరిగితే ఎంతవారూ వెనుకంజ వేయక తప్పుతుందా? దానితో ప్రమథగణం పలాయనం చిత్తగించసాగారు. అప్పుడు చిరాకుపడి కుమారస్వామి వాళ్ళని మందలించి యుధ్ధానికి పురికొల్పటానికి పూనుకొని ఇలా అంటున్నాడు.

మా విహాసిష్ట సమరం
సమరంతవ్యసంయతః
క్షతం క్షుణ్ణాసురగణై
రగణైరివ కిం యశః 

ఇది ఈ కిరాతార్జునీయం, పదిహేనవ సర్గలోని 8వ శ్లోకం.

దీని భావం ఏమిటంటే, మీరెంత గొప్ప వీరులో మీకు గుర్తుందా? మీరంతా యుధ్ధాన్నీ ఆటనీ సమానంగా చూస్తారని పేరే!  అలాంటిది మీరు ఇప్పుడు యుధ్ధరంగం  నుండి పారిపోతారా? యుధ్ధం వదిలిపోవద్దు. మీరంతా అసురగణాల్ని క్షుణ్ణం చేసేవారే (అంటే పొడిచేసేవారే అని) అలాంటిది మీరే ఒక గణంగా (ఒక జట్టుగా) నిలబడలేక తలొకదారీ పడుతున్నారా? ఇలా సామాన్యుల్లాగా ప్రవర్తించి మీ‌ కీర్తికి నష్టం కలిగించే పనిని మీరే స్వయంగా చేస్తున్నారు సుమా అంటున్నాడు కుమారస్వామి.

ఇప్పుడు ఈ శ్లోకంలోని విశేషం చూదాం.

శ్లోకంలో‌ కొన్ని చోట్ల క్రీగీటులు పెట్టంట‌ం‌ జరిగింది గమనించారు కదా?  మొదటి పాదం చివర సమరం అని వచ్చింది. ఆ సమరం అనే దానితోటే రెండవపాదం మొదలయ్యింది. మూడవపాదం చివర రగణై అని అన్నది ఉన్నది కదా అదే నాలుగవపాదం మొదట్లోనూ వచ్చింది.

ఇలా కొన్ని పదాలు లేదా పదభాగాలు మళ్ళామళ్ళా రావటాన్ని యమకం అంటారు. ఇక్కడ ఉన్న యమకం విశేషాన్ని పాదాంతాది యమకం అంటారు. పాదాంతం అంటే పాదం చివర అనీ పదాది అంటే పాదం మొదట అని అర్థం.

యమకం అనేది ఒక అలంకారం. మనకి అలంకారం అంటే నగ అన్న సామాన్యార్థం తెలుసు. కావ్యాల్లో అలంకారం అన్నమాటకు అర్థం చూదాం.

పాఠశాలల్లో తెలుగు నేర్చినప్పుడు ఉపమా ఉత్ప్రేక్షా అంటూ కొన్ని అలంకారాలు హడలేసి చదివించి ఉంటారు కదా. మార్కుల చదువుల్లో అవి భట్టీయం వేసి హమ్మయ్య అని గట్టెక్కేయటమే‌ కాని రసదృష్టితో‌ వాటిని ఆలోచించే అవకాశమూ‌ మనకు ఆరోజుల్లో ఉండదు. దానికి తగిన పరిణతీ‌ మనకు అప్పుడు ఉండటమూ‌ అరుదే. అందుచేత ఇప్పుడు మరొకసారి అవసరమైనంతగా ఈ విషయాన్ని స్పర్శిద్దాం.

అలంకారాలను అసలు ఎందుకు ధరిస్తారు ఆడవాళ్ళు? "ఆ మాటకు వస్తే పూర్వం మగవాళ్ళూ ఆడవాళ్ళతో పోటీగా సమానంగానే నగలు ధరించే వారు. ఇప్పుడు వాళ్ళకు చేయించటానికే ఎక్కడి డబ్బులూ సరిపోవటం లేదు కాబట్టి మగాళ్ళు నగలు వేసుకోవటం మానేసా"రని ఒకసారి మానాన్నగారు చమత్కరించారు. అది సరే, ఎందుకు ధరిస్తారు నగలు అన్న ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం అందం కోసం అని. అందగా ఉన్నా అలంకారాలు ధరిస్తూనే ఉన్నారే మరి?  అలాగంటే, అలంకారాలవలన అందం ఇనుమడిస్తోంది కాబట్టి అని సమాధానం.

అలాగే కావ్యం యొక్క సౌందర్యం దానిలోని రసమే. ఆ రసాన్ని అవిష్కరించేవి కథా, కథాగమనమూ, కవితాపుష్ఠీ వగైరా. ఐతే ఒక రసపుష్ఠి కల కావ్యానికి కూడా దాని సౌందర్యాన్ని ఇనుమడింప జేయటానికి కొన్నికొన్ని కవితాప్రక్రియలను కవులు వాడుక చేస్తూ ఉంటారు. అవి అనేక రకాలు. అన్నింటి గురించీ వ్రాయటానికి ఇది సందర్భం కాదు. కాని వాటిలో ముఖ్యమైనవి కావ్యానికి శోభను ఇనుమడింప జేసేవి కొన్ని విధానాలను అలంకారాలు అంటారు. అవి సాధారణంగా మాటలపొందిక కారణంగా చేసే చమత్కారాలూ (అంటే శబ్దాలంకారాలు) అలాగే చిత్రవిచిత్రమైన భావనలనూ అన్వయాలనూ చూపటంతో చేసే చమత్కారాలూ (అవి అర్థాలంకారాలు) అంటారు. ఇవి చదువరులకు మరింత అహ్లాదాన్ని కలిగిస్తాయి. అప్పుడు కావ్యం‌ మరింతగా బాగుంటుంది. భలే అందమైన కావ్యమే‌ అని మనచేత అనిపిస్తాయీ ఈ‌ అలంకారాల చమత్కారాలు.  అందుచేత కావ్యంలో అలంకారం అంటే సౌందర్యం అనే అర్థం చెప్పుకోవాలి. ఉన్న కావ్యగత సౌందర్యానికి ఈ‌ అలంకారాలు జోడింపు సౌందర్యాలన్నమాట.

అందుకనే వామనుడు తన కావ్యాలంకారసూత్రంలో సౌందర్యమలంకారః అని చెప్పాడు. వాచా ఈ మాటల కర్థం అలంకారం అంటే సౌందర్యం అనే.

అలంకారశాస్త్రగ్రంథం ఐన అలంకారసర్వస్వం అని ఒకటుంది. దాన్ని వ్రాసింది 12వ శతాబ్దం వాడైన రుయ్యకుడు.  ఎందకనో కాని ఆయనను రాజానక రుయ్యకుడు అని పిలుస్తారు. అందులో ఆయన యమకానికి నిర్వచనంగా "స్వరవ్యంజనసముదాయపౌనర్యుక్తం యమకమ్‌" అని చెప్పాదు.

స్వరములు అంటే అచ్చులు . అ, ఆ.. మొదలైన అచ్చులు.
వ్యంజనాలు అంటే హల్లులు. క, ఖ,గ,ఘ... మొదలైనవి.
సముదాయం అంటే ఒకటి కన్న ఎక్కువగా ఉండటం.
స్వరవ్యంజన సముదాయం అంటే ఒకటికన్న ఎక్కువ అక్షరాలలో అచ్చులు హల్లుల వరుస అని.
పునరుక్తి అంటే చెప్పినదే మళ్ళా చెప్పటం.
పౌనర్యుక్తం అంటే ఏవైనా మరలా మరలా చెప్పబడినవి అని అర్థం.
ఇప్పుడు స్వరవ్యంజన సముదాయ పౌనర్యుక్తం అంటే వరుసగా ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో అచ్చులూ‌ హల్లులూ పునరుక్తిగా వచ్చిన సందర్భం అన్నమాట.
దీనినే రుయ్యకుడి సూత్రం యమకం అంటోంది.

వరుసగా కొన్ని అక్షరాలు సామ్యంగా (అవే అచ్చులూ హల్లులుగా) ఉండటం అన్నారు కాని అవే పదాలు అనలేదు. ఇది బాగా గమనించాలి మనం.

ఇలా సామ్యం కల భాగం పూర్తి మాట కానక్కరలేదు. అందుచే ఆ ఫణంగా దానికొక అర్థం ఉండవలసిన పనిలేదు. ఒకవేళ పూర్తిమాట ఐతే  కూడా కావచ్చును. అభ్యంతరం‌ లేదు.

పునరుక్తి అంటున్నాం కదా, ఒక చోట పూర్తిమాటగా ఉండి మరొక చోట అంతకన్నా పెద్దపదంలో భాగం కావచ్చును. అందుచేత ఒకచోట ఆ అక్షరసముదాయం అర్థవంతంగా ఉండి మరొకచోట ఉండకపోవచ్చును.  ఒకవేళ రెండుచోట్లా పూర్తిగా అదే పదం ఐన పక్షంలో వేరు వేరు అర్థాలు చెప్పుకొనేలా ప్రయోగించబడాలి.

ఇక్కడ పరిస్థితి చూదాం.

మావిహాసిష్ట సమరం అన్నప్పుడు సమరం అన్నది యుధ్ధం అన్న అర్థంలో ఉన్నది. వెంటనే రెండవపాదంలో సమరంత అన్న చోట  సమ రంత అని రెండు మాటలున్నాయి. సమ అంటే తెలిసిందే సమానంగా అని. రంత అంటే క్రీడించే వాడు అనీ అర్థం. సమరంత అన్న సమాసోక్తిగా చూస్తే సమరం అన్న అక్షరసముదాయం వచ్చింది.

అలాగే  క్షుణ్ణాసురగణైః అని మొదటి ప్రయోగాన్ని క్షుణ్ణ + అసుర గణైః అని విభజించుకోవలసి ఉంది. వెంటనే వచ్చే రెండవ ప్రయోగం కొంచెం చిత్రం. ఎందుకంటే గణైః + అగణైః అన్న చోట సంధి కార్యం వలన గణైరగణైః అయ్యింది ఈ ర- నుండి నాలుగవ  పాదం మొదలై రగణై అన్న అక్షరసముదాయం పునరుక్తి ఐనది.

ఈ విధంగా కవి ఇక్కడ యమకం అన్న అలంకారాన్ని వాడాడు.

ఈ శ్లోకంలో శబ్దాలంకారం ఉన్నది కాని చిత్రకవిత్వం లేదు. నిజమే. కాని ప్రతిశ్లోకంలోనూ‌ ఉండక్కర్లేదుగా. అత్యథికశాతం శ్లోకాల్లో ఉన్నాయి. మొత్తం మీద శ్లోకాని కొక తీరున చిత్రంగా అనిపించే విధంగా ఈ‌ సర్గ అంతా ఉంటుంది. అందుచేత చిత్రకవిత్వం నేరుగా లేదు కదా అని ఈ‌ శ్లోకాన్ని టూకీగా తేల్చకుండా విస్తృతంగా వ్రాయవలసి వచ్చింది. మొత్తం సర్గకు మనం వ్యాఖ్యానించుకున్నాక మరలా అన్ని శ్లోకాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఈ‌ సర్గయొక్క వైభవం కవి యొక్క కవితాపాటవం మనకి బాగా అనుభూతిలోనికి వస్తాయి. ముఖ్యంగా యమకాలతో అక్షరాలా సర్కసుఫీట్లు చేయించటమూ మనం బాగా ఆనందించగలం.