6, నవంబర్ 2015, శుక్రవారం

వ్యాఖ్యానందుల నుండి బ్లాగులోకాన్ని రక్షించుకోవాలి!

ఆనందం అనేక విధాలు. అందులో ఈ మధ్యకాలంలో కొందరు బుధ్ధిమంతులు కనుగొన్న కొత్త ఆనందం పేరు వ్యాఖ్యానందం. మళ్ళా ఈ వ్యాఖ్యానందంలో రచ్చచర్చానందం, పిచ్చిగోలానందం, వ్యాఖ్యాసంఖ్యానందం లాంటి స్వల్పబేధాలతో రకాలు కనబడతాయి.  మిఠాయికొట్లో శనగపిండితో చేసిన మిఠాయిలు అని అడిగితే కొన్ని రకాలు చూపిస్తాడు. మంచి నేతి మిఠాయిలే చూపమంటే కొన్ని కొన్ని చూపిస్తాడు. ఇలా పలురకాల మిఠాయిలుంటాయి. ప్రతిమిఠాయినీ ఒకటి రెండురకాల వర్గాల్లో చేర్చవచ్చును. శనగపిండిమిఠాయిల్లో రకాలున్నా అన్నీ శనగపిండి మిఠాయిలే కదా. అలాగే ఈ వ్యాఖ్యానందంలో రకరకాల వర్గాలున్నా అవన్నీ మౌలికంగా వ్యాఖ్యానందంలోనికే వస్తాయి.

వ్యాఖ్యలలో విషయసంబంధం లేనివీ, దురుద్దేశాలున్నవీ వగైరా వ్యాఖ్యల్ని ప్రచురించబోమని కొందరూ, ముందు అన్నీ ప్రకటించినా అలాంటి దుర్వ్యాఖ్యల్ని పీకేస్తామని కొందరూ అంటూ ఉంటారు కాని చాలా నిరుపయోగకరమైన వ్యాఖ్యలూ నిందాపూరితమైన వ్యాఖ్యలూ బ్లాగులోకం నిండా  దర్శనం ఇస్తూనే ఉన్నాయి అనునిత్యం. ఇక్కడ తెలుగు బ్లాగులోకం నిండా అని నా ఉద్దేశం, మిగతా భాషల్లోని బ్లాగులగురించి నాకు తెలియదు లెండి.

వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైనవి ఉంటే వాటికి ఆ వ్యాఖ్యానందులు మాత్రమే కాదు, ఆ వ్యాఖ్యలను ప్రచురించిన బ్లాగర్లూ పూర్తిగా బాధ్యులే అన్నది తరచుగా మనం మరచిపోతున్నాం.  నిజానికి నిర్మొగమాటంగా చెప్పాలంటే మన తెలుగు బ్లాగర్లు ఆ సంగతిని పూర్తిగా పట్టించుకోవటం లేదు. ఇది కడుంగడు విచారణీయం అనను కాని ఇది చాలా అభ్యంతరకరం అని చాలా నిర్మొగమాటంగా అనేస్తాను.  ఇక్కడ కొంతమంది మన బ్లాగర్లు కొంచెం తెలివైన మాట ఒకటి వక్కాణిస్తూ ఉంటారు.  ఆ మాట ఏమిటంటే వాక్స్వాతంత్ర్యం అట. ఏమిటండీ వాక్స్వాతంత్ర్యం?   వెక్కిరింపులకు దిగేందుకూ, నిందలు వేసేందుకూ,  తిట్లపురాణంతో విరుచుకు పడటానికి ఎవరికైనా ఎలాంటి స్వాతంత్ర్యం ఐనా ఎలా ఉంటుందండీ అసలు?   పోనీ మీకు తిట్టు అనిపించింది నాకు దీవెన అనిపించింది అంటారా మీరు?  కనీసం మీ టపాల్లోని విషయానికి ఏమీ సంబంధం లేని వ్యాఖ్యలనూ కనీసం బాదరాయణసంబంధం ఐనా చూపలేని వ్యాఖ్యలనూ కూడా మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారా?  ఎలాంటి వ్యాఖ్యలైతే ఏం? మా టపాలకు వ్యాఖ్యలు రాలటం ముఖ్యం - మరిన్ని వ్యాఖ్యలను రాల్చే సత్తా ఉన్న వ్యాఖ్యలు రాలితే మరీ మరీ ఆనందం అంటున్నారా?

ఈ మధ్యకాలంలో తెలుగు బ్లాగర్లు నిస్తేజం ఐపోయారనీ రాయటం తగ్గించిన వారూ మానేసిన, మానేస్తున్న వారూ ఎక్కువైపోతున్నారనీ ఒక మాట వినిపిస్తోంది.  అది విచారించదగిన సంగతే. కాని ఆ పాపం అంతా వెలపరం కలిగిస్తున్న వ్యాఖ్యలతో బ్లాగులోకాన్ని గబ్బుపట్టిస్తున్న వ్యాఖ్యానందులే తమ భుజాలమీద మోయక తప్పదు.

కొందరు రచ్చచర్చానందులుంటారు.  మీరొక టపావ్రాయటం ఆలస్యం. లేదా మీరొక వ్యాఖ్య వ్రాయటం ఆలస్యం మీ వెంటబడి వేధిస్తూ ఉంటారు. వారికి మీరు సంజాయిషీలు చెప్పుకోవాలి, ఋజువులు చూపాలి.  అమాయకంగా ఆపని చేయబోతే మీరు క్రొత్తగా చెప్పినమాటల్లోంచి మళ్ళా పాయింట్లు లేవనెత్తుతారు. అనంతంగా వాళ్లతో వాదించేందుకు మీరు ఉద్యోగం సధ్యోగం మానేయాలి లేదా మీరు పిరికివారు, మీ దగ్గర విషయం లేదు వగైరా మాటలు! ఇలాంటి వారిని తయారు చేసినా చేయకపోయినా, వాళ్ళకు మన నిరుపయోగ చర్చావేదికల బ్లాగులు రాజపోషణ కల్పిస్తున్నాయి. వాదనలతో ఏమి తేలుతుంది? అదీ ఇలాంటివారితో? మీరు కాని నిక్కచ్చిగా మాట్లాడబోయారో మీకు ఎమోషనల్ బ్లాక్‍మెయిలర్ అని ముద్రను కూడా ఈ చర్చావేదికలు అనుగ్రహిస్తాయి. తస్మాత్ జాగ్రత.

ఈ మధ్య ఒక టెక్నిక్ ప్రచారంలోనికి వస్తున్నది. ఒక వ్యాఖ్యను వ్రాయటం అది మాలికలో వ్యాఖ్యల విభాగంలో కనబడే దాకా వేచి ఉండటం అది కాస్తా మాలికలో కనిపించాక తన వ్యాఖ్యను తానే టపాపేజీనుండి తొలగించటం. చాలా బాగుంది. ఏకక్రియా ద్వ్యర్థికరీ.  తన వ్యాఖ్య టపా క్రింద కనిపించదు - కాబట్టి దానిమీద ఎవరూ ప్రతివ్యాఖ్య చేయలేరు - ముఖ్యంగా బ్లాగరు తొలగించేదీ స్పందించేదీ ఏమీ ఉండదు. అదొకటి. కాని తన వ్యాఖ్య మాత్రం మాలికలో తాండవం చేస్తూనే ఉండాలి కొన్నాళ్ళపాటు. అప్పుడు చదువరులకు తన మాట చేరుతుంది. ఇది రెండవది.  ఈ మధ్యకాలంలో ఈ టెక్నిక్కును ఒకాయన (ఒక కిచిడీ పేరు లెండి నాగార్జున రెడ్డి అక్కినేని అట), వరూధిని బ్లాగులో ప్రయోగించారు. అక్కడి తన కామెంట్లు తానే తొలగించుకున్నారు. కాని ఈ నాటికీ అది మాలిక వ్యాఖ్యల విభాగంలో కనిపిస్తూనే ఉంది. అతితెలివి బాగుంది. మాలికవారు కొత్తవ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు చేరుస్తున్నారు కాని పాతవాటిని -ముఖ్యంగా టపాల క్రింద లేని వాటిని - తొలగించరు. ఈ లొసుగును వాడుకోవటం అనేదే వీరి టెక్నిక్.

ఈ పనిలేని వ్యాఖ్యానందుల పుణ్యమా అని చిరాకుపడో నొచ్చుకొనో వ్రాయటం మానుకొన్న వారు ఉన్నారు.  మీ వ్యాఖ్యలు మాకు అవసరం లేదు అని చెప్పి తలుపులు మూసిన వారు కూడా ఉన్నారు. 

బ్లాగర్లు తమ తమ బ్లాగులకు తక్షణం మోడరేషన్ ఎనేబుల్ చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొని ఉంది.  బ్లాగర్లు తమతమ బ్లాగుల్లో వాసి గల వ్యాఖ్యలకు మాత్రమే ప్రచురణార్హత కలిగించితే చాలా వరకూ చెత్తవ్యాఖ్యలని నిరోధించవచ్చును.

నా అభిప్రాయం నేను చెప్పాను. బ్లాగులోకం కాస్త పచ్చగా నాలుగు రోజులు ఇంకా బతకాలని ఆశిస్తున్నవాళ్ళు ఈ విషయంలో కాస్త సీరియస్‍గా స్పందించవలసిందిగా విజ్ఞప్తి.

చివరిమాట. ఈ తెలుగుబ్లాగులోకాన్ని మనమే సృష్టించుకున్నాం. దాని ఉనినికీ మనికికీ మనమే బాధ్యులం. బాధ్యతలేని వ్యక్తులు ఈ బ్లాగులోకంతో ఆటలాడుకోకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మనదే!

4 వ్యాఖ్యలు:

 1. ఎవరికి పరిజ్ఞానం ఉన్న GENRE లో వాళ్ళు వ్రాస్తారు. దాని మీద ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళే చదువుతారు.
  అంతే కాని ఇదే వ్రాయాలి, ఇది వ్రాయకూడదు అనడం అసహనమే.
  అయినా మీ కంఠశోష కాని, ఇక్కడ ఎవరు వింటారు?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఎవరూ వినకపోవచ్చు నన్నది స్వానుభవంలోనే ఉంది కాని. నా ప్రయత్నంగా ఒక మాట, అంతే.

   తొలగించు
 2. బ్లాగులోకంలో బ్లాగులన్నీ కామెంట్లకోసం నడిచేవే. ముఖ్యంగా కూడలి/మాలికల్లోనివి. కొన్నైతే వ్యాఖలకోసమే టపాలు రాస్తుంటాయి.

  కూడల్లో బ్లాగు రాయడం వ్యభిచారంతో సమానం. తనను తార్చుకొనేవాళ్ళుతప్ప స్వాభిమానధనులెవ్వరూ కూడలిలో లిస్టుచేయబడిన బ్లాగుల్లో రాయడంలేదు (కీర్తి కీండూతి, ప్రచార కండూతి ఉంటే దక్క).

  కూదలి అనేది భవిష్యత్తులో ఒక porn siteగా అవతరించినా నామటుకు నేను ఆశ్చర్యపోను. అలాంటి "మరుగుదొడ్డి గోడ"లపైని మీరు జ్ఞానమూ, భక్తీ పిచికారీ చెయ్యాలనుకుంటున్నారు. Best of luck.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు ఆశ్చర్యకరంగా స్పందించారు. అంత తీవ్రమైన మాటలు వద్దండి. మనప్రయత్నం మనం చేదాం అని ఒకమాట చెప్పటం అంతే. ఈ వయస్సులో నాకు ఏ కండూతీ లేదు కాని,నా బ్లాగు నా తృప్తి కోసం వ్రాసుకుంటున్నది. ఇష్టమైన వారు కూడా చదువుకోవచ్చును. చదువరులు ఎవరైనా స్పందిస్తే, స్పందనల్లో అసంభావ్యత లేకపోతే అవీ నమోదు చేయబడతయి అంతే. నాకు చర్చలపట్లా ఆసక్తి లేదు. బోధనలు చేసే స్థాయీ లేదు. నా అభిప్రాయాలు నావి - ఒక్కోసారి ఇతరులకూ నా అభిప్రాయాలను వ్యాఖ్యలో తెలిపేది వారి నెత్తిన రుధ్దటానికి కాదు కదా - వారికి ఉపకరిస్తుందేమో నా అలోచన అన్న ఉద్దేశంతో మాత్రమే. వ్యాఖ్యలతో పండగలపట్ల నా అభిప్రాయాలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా బ్లాగుముఖంగా నేను నమోదు చేసుకున్నాను. అంతకు మించి మరేమీ లేదు.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.