24, నవంబర్ 2015, మంగళవారం

సత్యనారాయణ వ్రతం సంగతులు

సత్యనారాయణ వ్రతం.

ఈ రోజు సత్యనారాయణవ్రతం గురించి ఒక టపా క్రింద ఒక వ్యాఖ్యను ఉంచాను.

తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకోవన్నారు కదా. ఆట్టే ప్రమాదం లేదనుకున్న చోటో,  ఈ మాట చెప్పటం వలన ఆవలి వారికి ఉపయోగం ఉందను కున్నప్పుడో ఒక ముక్క వ్రాస్తూ ఉంటాను.  తరచుగా, లేని ప్రమాదం కొని తెచ్చుకున్నట్లు అవుతూ ఉంటుంది -ఎవరెవరో ఏవేవో అంటే పడవలసి రావటం వలన. ఎవరికో ఉపయోగం ఉండవచ్చునూ అనుకొని చెప్పిన ముక్కబుట్టదాఖలా అవుతూ ఉంటుంది. మధ్యలో ఎవరెవరో వచ్చి ఏమేమో మాట్లాడతారు. ఎలాగూ‌ మన మాటకు ఆట్టే విలువా ఉండదు. అలాంటప్పుడు ఊరుకోవచ్చును కదా అంటారా. అంతే నండీ అనకుండా ఉండలేం‌ పడకుండా బయట పడలేం అన్నమాట. అదంతా ఇప్పుడు అవసరం లేదు లెండి వ్రతం గురించిన వ్యాఖ్యకు చీవాట్లు ఏమీ రాలేదు.  ఈ‌రోజున చాలా అదృష్టవంతుణ్ణన్నమాట.

మా నాన్నగారికి సత్యనారాయణ వ్రతం అంటే ఇష్టంగా ఉండేది.  చాలా భక్తిశ్రధ్ధలతో చేసేవారు.  అందరిళ్ళలో లాగే మాయింట్లో కూడా మొదట్లో పురోహితులవారు వచ్చి చేయించటం జరిగేదని గుర్తు.  కాని మా నాన్నగారు పురోహితుడి అవసరం లేకుండా స్వయంగా చేసుకోవటం మొదలు పెట్టారు. మొదట్లో కారణం నాకు తెలియదు. నిజానికి  ఈ విషయమై నేను మా నాన్నగారిని ప్రశ్నించటం కూడా ఎన్నడూ జరుగలేదు.

కొత్తపేటలో మేము గర్ల్స్ హైస్కూల్ ఎదురుగా ఉన్న తాడిగడప రాఘవరావుగారి యింటిలో అద్దెకు ఉండే వారము. దగ్గరలోనే గోటేటి నరసింహమూర్తిగారనే ఒక సౌమ్యమూర్తి మా నాన్నగారి స్నేహితులు ఒకాయన స్వంతయిల్లు కట్టుకొని నివాసం ఉండేవారు. నరసింహమూర్తిగారూ మానాన్నగారూ ఇద్దరూ ఉపాధ్యాయవృత్తిలో ఉండటమే కాదు స్నేహకారణం. ఇద్దరూ చిన్నతనంలో కలసి చదువుకున్నారు కూడా. ఈ సందర్భంలో మరొకాయన గురించి ప్రస్తావించాలి. మా నాన్నగారితో కలసి చదువుకున్న స్నేహితులు కందుకూరి భాస్కరరావుగారు కూడా మా యింటికి దగ్గరలోనే ఉండే వారు. ఆయనదీ స్వంతయిల్లే. గోటేటివారి పిల్లలు మాకు స్నేహితులూ పాఠశాలలో సహాధ్యాయులూ. కందుకూరివారి అబ్బాయి,  నా క్లాస్‍మేట్ వీర వేంకట సత్యనారాయణ నాకు చాలా మంచి స్నేహితుడు కూడా.  కార్తీకమాసం వచ్చిందంటే కందుకూరివారు నాకు మనస్సులోనికి వస్తారు.  శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారిగుడిలోని శివాలయంలో కందుకూరివారు ప్రతియేటా లక్షపత్రిపూజ నిర్వహించేవారు. ఆనాడు పూజ తరువాత వారింట్లో తప్పక లక్షపత్రిపూజా సమారాధన జరుగుతుంది. గోటేటి వారు సత్యనారాయణ వ్రతం చేసేవారు కార్తీకమాసంలో. కొత్తపేటలో చాలా మంది కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతాలు చేసే వారు. పున్నమి నాడు మరీ జోరుగా.

ఒకసారి ఒక తమాషా జరిగిందట.  ఈ సంగతి నాకు అది జరిగిన చాలా కాలం తరువాత మా అమ్మగారు నాతో ఏదో మాటల సందర్భంలో ప్రసావించారు. గోటేటివారింట్లో జరిగిన ఒక కార్తీకపౌర్ణమీ సత్యనారాయణ వ్రతం సంగతి. వ్రతం సాయంకాలం జరిగింది. ఉదయం నుండీ కుటుంబంలో అందరూ ఉపవాసం  చేసి వ్రతం నిష్ఠగా చేసుకున్నారు.  వ్రతం చేయించే పురోహితులవారు కూడా ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆయనకూ నీరసంగానే ఉందట. మధ్యలో ఆయన పాలు కాఫీలు సేవించి కొంత సేదదీరారు. ఇలా వ్రతం బాగా చేసుకున్న ఒకటి రెండు రోజుల తరువాత ఒక విషయం తెలిసి అందరూ విస్తుపోవటమూ బాధపడటమూ జరిగింది. నిజానికి వ్రతం చేయించిన పురోహితుడు ఉపవాసం ఏమీ చేయలేదు. మధ్యాహ్నమే ఆ ఊళ్ళోనే ఒకరి ఇంట్లో తద్దినం పెట్టించి భోక్తగాకూడా కూర్చొని హాయిగా బొజ్జనిండా తిని వచ్చాడట.  పైగా ఉపవాసం అని ఆపసోపాలు నటన అన్న మాట! ఇది తెలిసి చాలా బాధపడ్దారట మా నాన్నగారు కూడా - అయ్యో ఇలాగు చేసాడేమిటీ ఆయన అని. ఏమాట కామాట చెప్పుకోవాలి. ఆ పురోహితులవారి అన్నగారు చాలాపేరున్న నిష్ఠాగరిష్ఠుడైన సద్బ్రాహ్మణుడు - గజారోహణం చేసి సువర్ణకంకణం తొడిగించుకొన్న మహా వేదవేత్త. బాగా పేరున్న  ఘనాపాఠి. ఆయన తమ్ముడేమో ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అన్నట్లు ఘనాపాఠిగారి కుమారుడు  లక్ష్మీనారాయణ నాకు స్నేహితుడే. అతడిని తండ్రిగారు వైదికవృత్తిలోనికి తీసుకొని రాలేదు. ఆధునిక విద్యను బేర్పించారు. ఈ లక్ష్మీనారాయణ మంచివాడే కాని కొంచెం చిలిపి కుఱ్ఱవాడు లెండి. అది వేరే సంగతి.

ఈ తమాషాగురించి చెప్పి మా అమ్మగారు మరొక మాట చెప్పారు.  ఇలాంటి సంఘటన ఒకటి ఒకప్పుడు మాయింట్లో కూడా జరగటంతో మా నాన్నగారికి మనస్తాపం కలిగి అప్పటినుండి ఎవరినీ వ్రతం చేయించటానికి పిలిచేది లేదూ లక్షణంగా నేనే చేసుకుంటాను స్వయంగా అని ప్రకటించటమూ, ఊరికే అప్పుడు కొంచెం ఆవేదనతో ఆ మాట అనటం కాదు, నిజంగానే అప్పటినుండీ సత్యనారాయణవ్రతాన్ని స్వయంగా తానే చేసుకోవటం చేస్తూ వస్తున్నారట. ఇంతకీ మా యింట్లో జరిగిన సంగతి ఏమిటంటే పునఃపూజ చేయకుండానే పురోహితులు వ్రతాన్ని సమాప్తం చేసి ఉద్వాసన మంత్రాలు చదివేసి కలశం ఎత్తేశారట. అందుకే మా నాన్నగారు బాగా నొచ్చుకున్నది.

ఇలా ఇదంతా వ్రాసానని నాకు పురోహితులపైన కాని పురోహితవృత్తిపైన కాని చులకన భావం ఉందని దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి. నిజానికి పురోహితుల అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది. వారిని సమాజం వినిమయవస్తువుల్లాగా చూసి చులకన చేయటమే కాని తగినంత గౌరవం ఇవ్వటం లేదన్నది బాధాకరమైన సత్యం.  ఈ పరిస్థితి నన్నయ్యగారి కాలానికే ఉందని అనిపిస్తుంది. శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వంలో అమృతాపహరణోపాఖ్యానంలో గరుత్మంతుడి దెబ్బకు దేవతలు పలాయనం చిత్తగించటాన్ని వర్ణిస్తూ ఆదికవి నన్నయ గారు ఒక మాట అన్నారు "వసువులు వసుహీన విప్రుల క్రియ పరిగి దక్షిణాశ్రితులైరి" అని. అంటే డబ్బులేని బ్రాహ్మణులు దక్షిణకోసం పరుగులు పెట్టినట్లుగా అష్టవసువులు దక్షిణ దిక్కుకు పారిపోయారట. 

వర్ణాశ్రమధర్మం బ్రాహ్మణులకు విధించిన విహితధర్మాలు ఆరే. అవి అధ్యయన-అధ్యాపనములు, యజన-యాజనములు, దాన-ప్రతిగ్రహములు అనేవి. అంటే భ్రాహ్మణులు వేదాధ్యయనం చేసుకోవటమూ,  అర్హులైన ఇతరులచే వేదాధ్యయనం చేయించటమూ, యజ్ఞాలు చేయటమూ, యజ్ఞాలు చేయించటమూ, దానాలు ఇవ్వటమూ, దానాలు పుచ్చుకోవటమూ అన్న ఈ ఆరు తప్ప ధనార్జనకోసం భ్రాహ్మణులు ప్రాకులాడకూడదు అని విధించారు శాస్త్రంలో.  బ్రాహ్మణులది నిష్కామంగా విద్య నేర్పటం తప్ప ధనవ్యామోహానికి వారు లోబడకూడదని శాస్త్రకారుల ఉద్దేశం. ఈ బ్రాహ్మణులని సమాజమే పోషించాలి. అదే సమాజవిధి-సమాజహితమూ. అందుచేత బ్రాహ్మణులు సంతోషంగా బీదగానే ఉండే వారు. కాని వారి జీవనపరిస్థితులు ఏమంత బాగా ఉండేవి కావు. ఈ విషయంలో శ్రీనాథుడి పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది.

దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్
బాసిన వంటకంబు పసి బాలుర శౌచము విస్తరాకులున్
మాసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు వంట కుండలున్ 
రాసెడు కట్టెలున్ తలపరాదు పురోహితునింటి కృత్యముల్

పురోహితవృత్తిలో ఉండే వారి పరిస్థితిని ఇది ఎలా ఎత్తిచూపుతోందో చూసారా!

ఆధునిక యుగంలో పరిస్థితి వేరు. వర్ణాశ్రమధర్మాల స్థితిగతులు మారాయి. బ్రహ్మద్వేషమూ నాస్తికత్వమూ కూడా పెరిగాయి. పూజాపునస్కారాలూ, పితృవిధులూ అన్నీ మ్రొక్కుబడి తంతులైపోయాయి. అపరాహ్ణకాలంలో చేయవలసిన పితృతిథి క్రియాకలాపం అంతా ఉదయం నుండే చేసేస్తున్నారు. ఎందుకలా అంటే ఆఫీసులో లీవు దొరకదూ, ఆరోగ్యం సహకరించదూ అన్న మాట వినవస్తోంది. బ్రాహ్మణులూ నవీన విద్యాభ్యాసానికి, నవీన జీవనవిధానానికి రాక తప్పలేదు. చాలా మంది బీదవారే వీరిలో. వైదికవృత్తిలో ఇంకా చాకచక్యంగా రాణించ గలుగుతున్న వారూ ఉన్నారు. విద్వత్తు ఉన్నా ఆదరణలేక తిండికి ముఖంవాస్తున్నవారూ ఉన్నారు నేడు.

చాకచక్యం అంటే గుర్తు వచ్చింది ఒక ఐతిహ్యం. బ్రతుకు తెరువు కరవై ఒకాయన గోదావరిజిల్లాలనుండి డభ్భైల్లో వలసవచ్చారు. ఎవరో సినిమావాళ్ళకి అర్జంటుగా ఒక పురోహితుడి అవసరం వచ్చింది - సమయానికి అనుకున్నాయన రాలేకపోవటంతో. ఎవరో వచ్చి ఈ కొత్తాయనను పిలుచుకొని వెళ్ళారు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఇంకేముందీ. ఈ గోదావరిశాస్త్రుల్లు గారినే పిలవండి ముహూర్తం షాట్‍కి అని ఆయనకు గిరాకీ వచ్చింది. మేడలు కట్టాడట ఆయన ఆ తరువాత! ఆయన గారి పేరే గోదావరిశాస్త్రి అని రూఢికెక్కిందట.

కాని సాధారణంగా చాలా మందికి జరుగుబాటు ఈ వృత్తిలో అంతంత మాత్రం అని వింటున్నాను. మరొక పిట్టకథ చెప్పాలిక్కడ. ఇది మా స్నేహితుడు చావలి నరసింహం చెప్పినది. అతడూ నేనూ ఒకేసారి ఉద్యోగంలో ఒకే ఆఫీసులో చేరాం. అతనూ నేనూ ఒకే బల్లకు అటూ ఇటూ కూర్చుని పనిచేసే వాళ్ళం. అప్పట్లో, నలభై ఒక్క సంవత్సరాల క్రిందట,  అతను చెప్పినది ఈ మామిడిపళ్ళ రాజుగారి కథ. సాధారణంగా వైదికులకు రాజు అని పేరుచివర ఉండటం తక్కువ అనుకుంటాను. నియోగుల్లో మామూలే. మరెందుకనో ఆయన పేరు రాజుగారు. సదరు పురోహితుడు రాజుగారు కాస్తా మామిడి పళ్ళ రాజుగారిగా మారటమే కథ. అందరికీ తెలిసిందే కదా వైదికవృత్తిలో ఉన్నవాళ్ళు తరచుగా బొడ్డూడని పసిపిల్లలకి ఒడుగు చేసేస్తూ ఉంటారు - బ్రాహ్మణీకాలకి పనికొస్తారని.  ఈ రాజుగారి మనవడూ ఆ బాపపతే. ఈ తాతా మనవళ్ళు ఒకరోజు ఒకరింట్లో తద్దినం భోజనం చేస్తుంటే ఆ గృహమేథి వాళ్ళకి మామిడిపళ్ళు విస్తళ్లలో వేసారు. పిల్లవాడు రుచి చూసి, "తాతా పొధ్ధున వాళ్ళు వేసిన మామిడిపళ్ళే బాగున్నాయి కదా" అన్నాడు.  తినేటప్పుడు మౌనంగా తినాలని శాస్త్రం. ఈ అమాయకపు బాల బ్రహ్మచారికి శాస్త్రం తెలుసునా లౌక్యం తెలుసునా? అందుకని తుసుక్కున పొద్దున్నే వేరే చోట తద్దినం భోజనం ఒకటి చేసే మళ్ళా ఇక్కడకు వచ్చి తద్దినం పెట్టిస్తున్న సంగతి బయటపెట్టేశాడు! అప్పటినుండి ఆ రాజుగారు మహరాజులాగా మామిడిపళ్ళ రాజుగారు ఐపోయారట.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను? బ్రాహ్మల పరిస్థితి ఇలా దీనంగా ఏడ్చింది అని.  పొద్దున్నే ఒక తద్దినం పెట్టి మళ్ళా సత్యనారాయణ వ్రతం చేయంచినా మరొక తద్దినం పెట్టించినా అదంతా పాపం పొట్టతిప్పల్లో భాగమే.  మాయింట్లో పునఃపూజ చేయకుండా హడావుడి పడ్ద పురోహితులకు కూడా మరేదో కార్యక్రమానికి సమయం ఐపోబట్టే కంగారులో మరచిపోయారేమో.

అన్నవరంలో సాక్షాత్తూ స్వామివారి గుడిలో సత్యనారాయణ వ్రతం ఐనా అది క్లుప్తీకరించబడుతోందీ అంటే అందులో పూజార్ల తప్పు ఉందని అనుకోను. గుడి యాజమాన్యం ఒక ప్రక్క నుండి టిక్కట్లు అమ్ముతూ ఉంటుంది.  టిక్కట్లు కొన్న ప్రతివారికీ ఎంతత్వరగా తమను వ్రతానికి పిలుస్తారా అన్న ఆదుర్దా ఒకటి ఉంటుంది. పండగలూ పబ్బాలూ వచ్చాయంటే టిక్కట్లు మరీ జోరుగా తెగుతాయి. అందరికీ సావధానంగా చేయించటానికి అక్కడ అవకాశం తక్కువ. ఒకరిద్ధరు పూజార్లను అదనంగా పురమాయించినా, మరొక హాలు వ్రతాలకు కేటాయించినా ఆ రద్దీకి సావధానంగా చేయించుకొనే అవకాశం ఉండదు. అందుకని పూజార్లనే తప్పుపట్టలేమేమో. వ్యవస్థను సరిదిద్దుకోవలసి ఉంది కాని బక్క పూజార్లను ఏమని నిందించగలం. పాపం వారికి ఇచ్చిన సమయానికి వారు బేచ్ తరువాత బేచ్ చొప్పున పూర్తిచేసి చూపవలసి ఉంది. లేకపోతే వేచి ఉన్న జనం అసహనం వ్యక్తం చేస్తారు. అధికార్లు పూజార్లను బాధ్యులను చేసి నిందిస్తారు. జీతపురాళ్ళకోసం పనిచేసే వారు అధికార్లు చెప్పింది చేయక మరే దారీ లేదు కదా.

ఇక పోతే, ఈ సత్యనారాయణ వ్రతం ఏమీ వరలక్ష్మీ వ్రతం ఏమీ అసలు ఏ వ్రతమైనా సరే సీడీలూ కాసెట్లూ సహాయంతో ఎవరింట్లో వారు చేసుకోవటమూ ప్రచారంలో ఉంది.  మా బంధువుల ఇంట్లో అలా చేయటం చూసాను. కాని వారింట్లో అలా వ్రతాలు చేయొంచే సీడీల్లో కొన్ని కొన్ని లోపాలు కనిపించాయి. కాని నోరు తెరచి ఇది పొరపాటుగా ఉందని అనటం దండగ కాబట్టి అలాంటి విషయాలని ఎత్తిచూపటం ఎన్నడూ‌ చేయట్లేదు. చేసినా పెద్దగా ఉపయోగం ఉందదు. ఒకప్పుడు శివుడు తెల్లగా ఉంటాడండి అని ఒక నీలంరంగు శివుడి ఫోటోను ఉద్దేశించి చెబితే బంధుబలగంలో అనేకులు వీడికేమీ తెలీయదే అని జాలిపడ్డారు నామీద. అదీ సంగతి.

సరే మా యింట్లో సత్యనారాయణవ్రతం మేమే స్వయంగా చేసుకోవటం అన్నది మొదలు పెట్టాం. అది చాలా కాలం కొనసాగింది. నాకు కూడా వావిళ్ళవారి పుస్తకంలో ఉన్నప్రకారం వ్రతం చేసుకోవటం అలవాటైనది.ఇలా వ్రతం చేసుకోవటంలో ఒక సంఘటనా బాగా గుర్తుంది. ఇక్కద ప్రస్తావించటం‌ బాగుంటుంది.

సూర్యప్రభగారని నా సహోద్యోగి ఒకావిడ నాకు బాగా ఆప్తమిత్రురాలు. మా యింట్లో సత్యనారాయణవ్రతం రండీ అని పిలిస్తే చెల్లెళ్ళూ‌ తమ్ముళ్ళతొ సహా వచ్చిందావిడ. ఐతే నా వ్రతం ఎప్పటికీ తెమలటం లేదు. సూర్యప్రభగారికి బాగా నీరసం వచ్చేసింది. మా అమ్మగారు ఆ సంగతి కనిపెట్టి, ఆమెతో, "నువ్వేమన్నా కొంచెం పాలో మరొకటో తీసుకోవమ్మా, వీడి పూజ ఇప్పట్లో అయ్యేలా లేదూ" అని ఆవిడ ఆకలి తీర్చారు. "ఇంత సేపేవిటయ్యా నీ‌ వ్రతం" అని ఆవిడ నామీద సున్నితంగా కోప్పడ్డారు తరువాత.  అదెప్పుడో‌ నా చిన్నతనం రోజులు. ఇప్పుడు ముసలాణ్ణై పోయాను కదా, ఆట్టే సేపు నేను ఆగలేను. అన్నట్లు అదొక కారణం వ్రతాదికాలు త్వరగా పూర్తికావాలని జనం కోరుకోవటంలో. ఏ కొత్తదంపతులో పెళ్ళైన మర్నాడు వ్రతం చేస్తున్నారనుకోండి. అప్పటికే వాళ్ళ ఒళ్ళు పచ్చిపులుసై ఉంటుంది క్రిందటి రోజు తంతులతో, ఇప్పుదు ఆట్టే సాగదీస్తే ఎలా పాపం. నాలాంటి లేదా నాకన్న వృధ్ధులుంటారు. వారు ఆట్టే సేపు కూర్చోలేరుగా. ఇల్లాంటి సందర్భాల్లో పురోహితులు గబగబా కానివ్వటం అనే చాకచక్యం చూపుతారన్న మాట.

కాలం ఒకే తీరుగా ఉండదు కదా. ప్రస్తుతం పురోహితులను పిలిచే వ్రతం చేస్తున్నాం మేం కూడా.

బ్లాగులోకంలో చూస్తూనే ఉన్నారు కదా, నాకేమీ తెలియదని వెక్కిరించే వారికి కొదవేమీ లేదు. వారి అభిప్రాయం వారిది. వారు నా వ్రాతలు చదువనవసరం లేదు. అంతే. అక్కడితో సరి. బ్లాగుప్రపంచంలో లాగానే నిజప్రపంచంలో కూడా నాకేమీ తెలియదని నమ్మే వారు కూడా బాగానే ఉన్నారు. ఇంకొంచెం బాగా చెప్పాలంటే మా కుటుంబ సభ్యుల్లో సగం మంది అన్నమాట, వారితో నాకు ఈ వ్రతం స్వయంగా చేసుకునే సామర్థ్యం ఉంది అని వాదించి ఒప్పించటం అంత అవసరం అనిపించలేదు. అందుచేత అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటోంది కదా అని సత్యనారాయణ వ్రతాన్ని పురోహితుల సహాయంతోనే నిర్వహిస్తున్నాం మా యింట్లో కూడా. గత చాలా సంవత్సరాలుగా మా కుటుంబానికి పౌరోహిత్యబాధ్యతలు చూస్తున్న దత్తాత్రేయశర్మగారు చాలా సమర్థులూ  మంచివారు కావటంతో ఏ ఇబ్బందీ లేదు కూడా.


రేపు కార్తీకపౌర్ణమి సందర్భంగా మాయింట్లో సత్యనారాయణవ్రతం!