16, నవంబర్ 2015, సోమవారం

విశేషవృత్తాల్లో పాహిరామప్రభో శీర్షికలో పద్యాలు ప్రారంభం.



ఈ రోజునుండి పాహిరామప్రబో శీర్షికలో కొన్నాళ్ళపాటు విశేషవృత్తాల్లో పద్యాలు వ్రాయాలని భావిస్తున్నాను.

ఈ విశేష లేదా ప్రత్యేకవృత్తాలంటే అవేమీ ఎక్కడినుండో ఊడిపడినవి కావు. కవులు నిత్యవ్యవహారంలో చాలా తక్కువగా ప్రయోగించే పద్యాలనే మనం విశేషవృత్తాలంటాం.

సాధారణవృత్తాలన్నీ ఒకటినుండి ఇరవైయారు అక్షరాల పాదప్రమాణం కలిగి ఉంటాయి. (అంతకంటే పొడుగైన పాదాలున్న పద్యాలను ఉధ్ధురమాలావృత్తాలంటారు.) ఈ వృత్తాల మొత్తం సంఖ్య ఎంతో పెద్దది. అవి మొత్తం 13,42,17,727.  ఇన్ని వృత్తాల్లోనూ కవులు సాధారణంగా ఉపయోగించేవి పాతికదాటవు!  ఐతే చాలామటుకు వృత్తాలు నడక కుదరక పనికిరా వనుకోండి.

ఐతే నడక బాగున్న వృత్తాలు ఒక రెండువందలదాకా మనవాళ్ళు అక్కడక్కడ ప్రయోగించటమూ అవి లక్షణ గ్రంథాల్లోకి ఎక్కటమూ జరిగింది.

అవి కాక ఆధునికులు ఆంద్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారూ,  మహామహోపాథ్యాయ కొక్కొండ వేంకట రత్నం పంతులుగారూ, రామయణకల్పవృక్షస్రష్ట కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వంటి మహామహులు తామూ కొన్ని కొత్తకొత్త వృత్తాలను పరిచయం చేసారు.

ఇలాంటి విశేషవృత్తాల్లో రామాంకింతంగా పద్యాలు వ్రాయాలని ఆశిస్తున్నాను. వీలైతే నాకు ఎఱుకలోనికి వచ్చిన అన్ని విశేషవృత్తాలనూ ఉపయోగిస్తాను. ఈ వృత్తాలను సూచించటానికి వాటి పూర్తిపేర్లను ఉటంకించటం జరుగుతుంది. (ఉ. చ, శా వంటి ఏకాక్షర సంకేతాలు ఉపయోగపడవు కదా)

ఈ రోజున 'త్వరితగతి' అనే ఒక పద్యంతో మొదలు పెట్టాను.