29, నవంబర్ 2015, ఆదివారం

రామాయణ పాదపం





        పాదపము.
        వారినిధిల్ పొడిబారెడు దాకన్
        తారలు నింగికి తప్పెడు దాకన్
        వారిజమిత్రుని పంచత దాకన్
        ధారుణి రామకథామృత ముండున్





పాదపం.

ఈ పాదపం అనేది మరొక పొట్టి వృత్తం. దీనికి గణాలు భ - భ - భ - గగ అనేవి. యతిస్థానం 7వ అక్షరం.
ప్రబంధసాహిత్యంలో పింగళిసూరనగారి కళాపూర్ణోదయం నాలుగవ ఆశ్వాసం చివరి ఆశ్వాసాంత పద్యం చూడండి.

      మాన సుయోధన మంగళ నిత్యా
      నూన యశోధన యుజ్వల కృత్యా
      దాన సుబోధన ధర్మద కృత్యా
      దీన మహాధన దీపిత సత్యా

ఎమెస్కోవారిప్రతిలో పై పద్యాన్ని పొరపాటున తోటకము అని పేర్కొనటం జరిగింది. కాని పాదపవృత్తానికీ తోటకమనే పేరు కూడా ఉందని తెలుస్తోంది.

ఈ‌ పాదపవృత్తానికి  దోదక, తోధక , తోదక , తోటక , దోధక , తరంగక , బందు , భిత్తక అనే నామాలు కూడా ఉన్నాయట! ఒక్క వృత్తానికి ఎన్ని పేర్లో, అందులోనూ తోటక వంటి వేరే లక్షణాలు కల వృత్తాలపేర్లూ కలుపుకోవటం. అంతా నానా కంగాళీగా ఉంది వృత్త నామాల పరిస్థితి చూస్తే.

ఆధునికులు శ్రీ నేమాని సన్యాసి రావు గారి పాదపవృత్తం శంకరాభరణం బ్లాగు ప్రత్యేకవృత్తాలు-3  టపా నుండి క్రింద చూపుతున్నాను.

      శ్రీరఘునందన! చిన్మయ! రామా!
      మారుతి సేవిత! మంగళధామా!
      వీరవరేణ్య! త్రివిక్రమ! రామా!
      క్ష్మారమణా! పర గర్వ విరామా!

ఈ పాదపవృత్తంలో వ్రాసిన పై పద్యాలలో అంత్యానుప్రాసను కూర్చటం గమనించండి.

నేను ఇక్కడ వ్రాసిన పద్యాన్ని పోలిన పద్యం ప్రాచీనమైనది ఒకటి ఉంది.

     యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
     యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
     యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
     తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో

కొంచెం పలుగురాళ్ళ పాకంలో ఉన్న ఈ పద్యం హనుమంతులవారు వ్రాసారని ప్రతీతి కల హనుమద్రామాయణం లోనిదట. ఆసక్తి కలవారు అర్థతాత్పర్యాలతో సహా ఈ పద్యం గురించి  శంకరాభరణం - చమత్కార పద్యాలు - 144 టపా ద్వారా తెలుసుకోవచ్చును.

సరే ప్రస్తుతం‌ ఈ‌ పాదపం‌ నడక దగ్గరకు వద్దాం. దీని నడక గణానువర్తిగా కనిపిస్తోంది. యతిస్థానం దగ్గర విరామం. ఇతరత్రా గణాంతాల్లో కించిల్లఘువిరామంగా చతురస్రగతిలో దీని నడక పొడచూపుతున్నది.

        వారిని - ధుల్పొడి - బారెడు - దాకన్
        తారలు -  నింగికి - తప్పెడు - దాకన్
        వారిజ - మిత్రుని - పంచత - దాకన్
        ధారుణి - రామక - థామృత - ముండున్

ఆసక్తి కలవారు ఈ‌ పాదపాలను కూడ సులభంగా సాధించవచ్చును. వీలైతే ప్రయత్నించండి.