14, నవంబర్ 2015, శనివారం

సీతారాముల పెళ్ళికి జాతకాలు చూసారా?      ఉ. రాముడు వింటి నెత్తె పెను
           రావముతో నది ముక్కలాయె నిం
      కేమని జానకీరఘుకులేశుల
           పెండ్లిని చేసినారయా
      భూమిపతుల్ మునీంద్రులును
           పొంతన లెంచరు జాతకంబులన్
      భూమిని మున్ను లేరు మరి
            పుట్టరుబో ఘను లట్టి దంపతుల్
10 వ్యాఖ్యలు:

 1. జాతకాలు కలవకపోయినా రాజు కూతురు పైగా అందగత్తె నల్లటివాడికి పిల్ల దొరకటం కష్టం కదా అని పెళ్ళి చేసుకుని ఉంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అబ్బే అలా చూడక పోవటం వల్లే గదా ఏండ్ల తరబడి వనవాసమూ, కందమూలాలు, నార చీరలు , రావణుడి తో కిడ్నాపు గట్రా లు ! జాతకం చూసి ఉంటె ఇవన్నీ ముందస్తే తెలిసి పోయి ఉండును - వాటి కి గ్రహ శాంతి గట్రా చేసి ఉండవచ్చు గదా !
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీరామచంద్రులవారు పదునొకండువేల సంవత్సరాలు రాజ్యం చేసారు. అందులో సీతాసమేతులై రాజ్యంచేసినది పదివేలవర్షాలు. సీతాపరిత్యాగానంతరం మరొక వేయేండ్లు. పదునొకండువేల సంవత్సరాలజీవనంలో పదునాలుగుసంవత్సరాలు అంటే ఎంత చెప్పండి? ఐనా సీతాకళ్యాణసందర్భంలో జరిగినవి నాలుగు పెండ్లిండ్లు -ఎవరి జాతకాలూ ఎవరూ చూడలేదు. ఇదంతా నేటికాలం వాళ్ళ పిచ్చి.

   తొలగించు
 3. ప్రత్యుత్తరాలు
  1. నమోన్నమః అసలు విషయం చెప్పారు.

   తొలగించు
  2. శర్మ గారు ,

   అసలైన పాయింటు పట్టేరు ! సూపెర్

   జిలేబి

   తొలగించు
  3. ఈ కాలపు ఏ జ్యోతిశ్శాస్త్రవేత్తనైనా అడగండి. అమ్మాయి జన్మలగ్నపత్రిక లేకపోతే, వివరాలు తెలియకపోతే నామ నక్షత్రం ప్రకారం ఐనా పొంతనం చూడాల్సిందే అంటాడు. అమ్మాయి మీకు దొరికిందంటున్నారు కదా, ఆ సమయం చెప్పండి ఆసందర్భాన్నే మనం లగ్నంగా గ్రహించి చక్రం భేషుగ్గా వేసుకోవచ్చును అంటాడు. అసమయమూ సరిగా గుర్తించలేదూ‌ అంటారా, ఫరవాలేదండి, ఇప్పుడు వివాహప్రశ్న వేసారు కదా, ప్రశ్నాశాస్త్రవిధానంలో పోదాం అంటాడు. ఉపాయాలే లేవా చెప్పండీ? వాళ్ళమాటలకు అప్పీలు లేదు. అదీ‌ పరిస్థితి.

   కాని కొంచెం‌ మార్పు వస్తున్నట్లే ఉంది. మొన్నటిదాకా వివాహాల్లో అబ్బాయిల యిష్టారాజ్యమే. ఫోటో జాతకమూ అనేవి రెండూ బ్రహ్మాస్త్ర నారాఅయణాస్త్రాలే, వంకలు పెట్టేందుకు, ఇప్పుదు అమ్మాయిల రాజ్యం వచ్చేసింది అనుకుంటున్నాను. వీళ్ళు అబ్బాయిల జాతకాలని వాళ్ళ ముఖాలు చూసే చెప్పేస్తారాయె. ఇంకేమీ! బాగుంది బాగుంది.

   తొలగించు
 4. రాముడి అందానికి మాత్రమేం తక్కువయింది - ఆజానుబాహుడు, అరవిందదళాయతాక్షుడు, రాజీవలోచనుడు. పైగా ఓ రాజకుమారుడు, రఘుకులానికి రత్నదీపం. ఆయనకి ఎవరూ పిల్లనివ్వరు అనే దిగులెందుకుంటుంది? అయినా స్వయంవరంలో జాతకాలేమిటండి? స్వయంవరవిజేతే వరుడు.

  జాతకం చూపించుంటే సీతకి వనవాసం, కిడ్నాపు, అగ్నిపరీక్ష తప్పేవా? అవునులెండి, ద్రౌపది విషయంలో కూడా జాతకం చూపించుంటే పాపం కురుసభలో అవమానం, అరణ్యవాసం, సైరంధ్రీ ఉద్యోగం వగైరా కష్టాలు తప్పిపోయేవేమో కదా? దమయంతి కూడా అంతే కదా? జాతకం ద్వారా జరగబోయేవి ముందే పట్టెయ్యగలిగితే జీవితం ఆనందమయమే !

  నా స్నేహితుడొకాయన తండ్రి పోయిన తర్వాత తమ్ముళ్ళ చదువు, చెల్లెళ్ళ పెళ్ళి బాధ్యతలు నెరవేర్చి తన 36 / 37 ఏళ్ళ వయస్సుకి పాపం పెళ్ళి చేసుకున్నాడు. జాతకాలు దివ్యంగా ఉన్నాయన్నారు, సుముహూర్తం అన్నారు; ఆ "సుముహూర్తా"నికే పెళ్ళి జరిగింది. పెళ్ళి అయిన మూడు నెలలకి ఏక్సిడెంట్ అయి ఆవిడ పోయారు. అయ్యా, అదీ జాతకాల సంగతి (నా అనుభవం మేరకు చెప్తున్నానులెండి).
  అసలు ఆ తరం వారు సంబంధం నచ్చకపోతే ఆ మాట మొరటుగా చెప్పకుండా, అవతలి వాళ్ళు నొచ్చుకోకుండా ఉండడానికి జాతకాలు కుదరలేదని సున్నితంగా చెప్పేవారు. ఆ ప్రయత్నంగా జాతకాన్ని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ముందే జాతకం జాతకం అంటుంటారు. జాతకాలు చూపించేసుకుని, "మాచ్" అయ్యాయనుకుంటేనే ముందుకి వెడతారట. బాగానే ఉంది, కానీ దాని తర్వాత అమ్మాయిని చూసినప్పుడు నచ్చకపోతే మీ అమ్మాయి నచ్చలేదు అని చాలా మోటుగా చెప్పి ఆ అమ్మాయి మనసు బాధపెట్టడం తప్ప వేరే మార్గం లేకుండా చేసుకుంటున్నారు. సున్నితత్వానికి చోటు లేకుండా పోతోంది. సరే ఎవరి నమ్మకాలు వారివి లెండి.

  జాతకాలు చూసేవారంటే నా చిన్నప్పటి జ్ఞాపకం ఒకటుంది. మా ఊళ్ళో చుట్టుపక్కల కాస్త పేరున్న జ్యోతిష్కుడు ఒకరు ఉండేవారు. ఆయనకి చాలాసార్లు సంతానవియోగం కలిగింది. ఆయన్ని గురించి ఓ పెద్దావిడ (చాదస్తం పాలు కొంచెం తక్కువ ఆవిడకి) అంటుండేది - వాడికి పిల్లలు పుడుతున్నారు పోతున్నారు, పుడుతున్నారు పోతున్నారు; వాడి జాతకమే వాడికి సరిగ్గా తెలియదు, ఊళ్ళో వాళ్ళకి జాతకాలు చెప్తాడట. అలా ఉంటుంది జ్యోతిష్కుల వ్యవహారం. వాళ్ళయితే, రాత తప్పించలేం గదా అంటుంటారు (నిర్లక్ష్యపు డాక్టర్లు కూడా మేం ప్రాణం పొయ్యలేం కదా అంటుంటారు చూడండి). లేకపోతే పుట్టిన సమయం కరక్టుగా ఇవ్వలేదు మీరు అంటుంటారు. వాళ్ళ కత్తికి రెండు వైపులా పదునే.

  ఏతావాతా చెప్పేదేమిటంటే సీతారాముల పెళ్ళికి జాతకాలు చూపించినా రామాయణం అలాగే జరిగుండేది అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ, ఒకవేళ జాతకాలు చూపిస్తే వాటిల్లో రాబోయే కడగండ్లు తేటతెల్లం అవుతుంటే, అమ్మాయి తండ్రి "ఠాట్, వీల్లేదు, నువ్వు స్వయంవరం గెలిస్తే నాకేమిటి, నా కూతుర్ని నీకిచ్చి పెళ్ళి చెయ్యను" అని అడ్డం తిరిగితే ఇక చెప్పలేం :) కాని అది పరువుతక్కువ అవుతుంది కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రాముడి అందం గురించి ఒక ముక్క వినవస్తుంది 'పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్' అనే మంగళానుశాసనంలో. ఇంకా చెప్పవలసిందేముంది? జాతకాలు చూడటం అవసరం ఐన పక్షంలో స్వయంవరంలో ఐనా కాకపోయినా చూడాలి కాని ఏ స్వయంవరమూ జాతకపరీక్షతో జరిగినట్లు లేదన్నదే గమనార్హమైన సంగతి. జాతకం ద్వారా భవిష్యత్తుని పట్టెయ్యాలన్నది మనిషి ఆశ అనే అనుకుంటాను. జ్యోతిష్యపండితులైనా పామరులైనా జగల్లీలను జ్యోతిషం సాయంతో విశ్లేషించుకుంటూ సంతోషించగలరేమో కాని ముందే దాని స్క్రిప్టులోనికి తొంగిచూసెయ్యలేరని నా గమనిక కూడా.

  లీలావతీగణితం అనే పుస్తకానికి భాస్కరాచార్యులుగారు ఆ పేరెందుకు పెట్టారో అని చెప్పే ఐతిహ్యం ఒకటుంది. ఆయన కూతురే లీలావతి, శీఘ్రవైధవ్యయోగంతో జనించింది. ఆ యోగాన్ని తృణీకరించి ఆమెను దీర్ఘసుమంగళిని చేసే బ్రహ్మాండమైన ముహూర్తాన్ని అయన నిర్ణయించి పెండ్లి చేసారట, కాని ఆ వైధవ్యం రానే వచ్చింది పాపం! నా లెక్కెలా తప్పిందీ అని ఆయన ఆరా తీయగా తేలిన సంగతి వినండి. తైలధార ఆధారంగా నిండే ఘటికాయంత్రం ఒకటి ఆయన నిర్మించారు. దానిలోనికి పైపాత్రలోని తైలం పడి క్రిందిపాత్ర పూర్తిగా నిండే సమయం సుమూహూర్తం - సూర్యోదయాదిగా. అంతా సరిగ్గా నిర్మించినా. అది సరిగా పనిచేయలేదన్నమాటే కదా. ఎందుకంటే ముహూర్తబలంపై అపోహ అక్కర్లేదు - అంత బలమైనది. పరిశీలించగా, ఆ యంత్రం పైపాత్రలో ఒక చిన్న గింజ కనిపించింది. అది వివాహవేడుక మధ్యలో, ఇంకా ఎంత తైలం ఉందా అని, ఆ యంత్రాన్ని ఆత్రుతతో లీలావతి పరికించగా ఆమె తలనుండి పాత్రలోకి పడిన ఒక బియ్యపు గింజ! అది రంద్రానికి అడ్డుపడి తైలధార కొద్దిగా మందగించి సుముహూర్తం తప్పిపోయింది కొద్దిలో. అందుకే తానొకటి తలస్తే దైవఘటన తాను మరొకలా వర్తించిందట, దరిమిలా కుమార్తెకు కొంచెం సంతోషం కలిగించాలని తాను రచిస్తున్న గణితగ్రంథానికి లీలావతీగణితం అని భాస్కరులు పేరుపెట్టారట. అలా లీలావతి పేరుకు చిరకీర్తిని కల్పించారట. విధినిర్ణయాన్ని తెలుసుకోవాలనీ అవసరం ఐతే దాన్ని ఎలాగైనా దాటాలని మనిషిపడే అరాటం యొక్క పేరే జ్యోతిషం అనీ, ఐనా విధిబలీయం అనీ ఈ ఐతిహ్యం చెప్పే నీతి.

  రామాయణాన్ని నిర్ణయించింది సాక్షాత్తూ చతుర్ముఖబ్రహ్మ కూడా కాదు. ఆ శ్రీమన్నారాయణుడే. అది పురాణదంపతులు లక్ష్మీనారాయణుల లీల. ధర్మస్థాపనార్థం వారు నడిపించిన కథ. అదంతేను.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.