21, జులై 2015, మంగళవారం

అన్నము పానము హరినామమే






అన్నము పానము హరినామమే యనగ
నున్న మాకు పొట్టతిప్ప లన్నవి గలవే




వింతవింతరుచులపైన వెఱ్ఱిమోహములవి లేవు
వింతవింతహరికథలను వినెడు మోహ మొకటె గాని
ఎంత మంచిభోజన మన్న చింతయెన్నడును లేదు
సంతతశ్రీరామనామచింతనాసక్తియె గాని
అన్న



దినదినమీ పొట్ట కెంత తిండితీర్థములతోడ
మనుజుడు బ్రతుకంత సేవ మానకుండ జేయు గాని
తనివితీరునది లేదు తనకు మోక్షప్రాప్తి లేదు
కనుక రామభజనమందు తనియుచుందుమెపుడు గాన    
అన్న



హరినామామృతపాన మదియె చాలునన్న తెలివి
తరచుగాను కలుగు రామదాసులైన వారి యందు
నరులయందు కుక్షింభరులై నడువకుండు వార మగుట
తిరముగ శ్రీరాముడు మమ్ము కరుణ జూచుచుండు గాన           
అన్న