8, జూన్ 2015, సోమవారం

విష్ణుసహస్రనామస్తోత్రంలో పునరుక్తనామాలు

ఈ రోజున నా క్రిందటి టపాను చదివిన భాస్కరంగారు కొన్ని ముఖ్యమైన సందేహాలు ప్రస్తావించారు.  అందులో ఒకటి ' 'కౌలీనికేవలా' అని ఒకే నామంగా చూపించడం పునరుక్తి పరిహరణ కన్నారు. అలాగైతే విష్ణు సహస్రనామాలలో కూడా పునరుక్తులు ఉన్నాయి కదా?' అన్నది.

విష్ణు సహస్రానామస్తోత్రంలో దాదాపు ఇరవై శాతం నామాలు పునరుక్తం అవుతున్నాయి.  కేవలం సరదాకు వాటిని ఒక పట్టిగా ఇస్తున్నాను. గమనించండి.

క్రమసంఖ్య
నామం
ఉక్తస్థానాలు
 1
అచ్యుత
100, 318
 2
అజః
 95, 204. 521
 3
అనంతః
659, 886
 4
అనఘం
146, 831
 5
అనలః
293,711
 6
అనిరుధ్దః
185, 638
 7
అనిర్దేశ్యవపుః
177, 656
 8
అనిర్విణ్ణః
435, 892
 9
అనిలః
234, 812
10
అపరాజితః
716, 862
11
అమితవిక్రమః
516, 641
12
అమేయాత్మా
102, 179
13
అమోఘః
110, 154
14
అక్షోభ్యః
801, 999
15
ఆదిదేవః
334, 490
16
ఈశ్వరః
 36, 74
17
ఉద్భవః
373, 790
18
ఋధ్ధః
278, 351
19
కాంతః
296, 654
20
కుముదః
589, 807
21
కృతజ్ఞః
 82, 532
22
కృతాగమః
655, 789
23
గహనః
382, 544
24
గోపతిః
495, 592
25
గోప్తా
496, 593
26
గోవిందః
187, 539
27
చక్రీ
908, 995
28
చతురాత్మా
137, 769
29
చతుర్వ్యూహః
138, 767
30
తారః
338, 968
31
దక్షః
423, 917
32
దుర్ధరః
266, 715
33
నిరిత్తాత్త్మా
229, 597
34
పద్మనాభః
 48, 196, 346
35
పావనః
292, 811
36
పుణ్యః
687, 925
37
పురుషః
 14, 406
38
పుష్కరాక్షః
 40, 556
39
ప్రజాపతిః
 69, 197
40
ప్రణవః
409. 957
41
ప్రభుః
 35, 299
42
ప్రమాణమ్
428, 959
43
ప్రాణః
 66, 320, 407
44
ప్రానదః
 65, 321, 408
45
భీమః
357, 948
46
భోక్తా
143, 500, 888
47
మహాకర్మా
672, 787
48
మహీధరః
317, 369
49
మాధవః
 72, 167, 735
50
మార్గః
365, 397
51
యజ్ఞః
445, 971
52
వసుః
104, 270, 696
53
వసుప్రదః
693, ???
54
వసుమనాః
105, 687
55
వాయువాహనః
331, 856
56
వాసుదేవః
332, 695, 709
57
విక్రమీ
 75, 909
58
విధాతా
 44, 484
59
విభుః
240, 880
60
విశ్వయోనిః
117, 149
61
విష్ణుః
  2, 258, 657
62
వీరః
401, 643, 658
63
వీరహాః
166, 741, 927
64
వేదవిత్
128, 131
65
శివః
 27, 600
66
శుచిః
155, 251
67
శుభాంగః
782, 586
68
శౌరిః
340, 644
79
శ్రీనివాసః
183, 607
70
శ్రీమాన్
 22, 178, 220
71
సంవత్సరః
 91, 422
72
సతాంగతిః
184, 450
73
సత్యః
106, 212, 869
74
సర్వజ్ఞః
453, 815
75
సవితా
884, 969
76
సహిష్ణుః
144, 565
77
సింహః 200, 488
78
సిధ్ధః
 97, 819
89
సుఖదః
459, 889
80
సుపర్ణ
192. 855
81
సువ్రతః
455, 818
82
స్థవిష్ఠః
 53, 436
83
స్రష్టాః
588, 990
84
హిరణ్యగర్భః
 70, 411
85
హుతభుక్
879, 887
86
క్షామః
443, 854


చూసారా?  మొత్తం 86 నామాలు పునరుక్తం ఐనట్లుగా కనిపిస్తున్నాయి.  మొత్తం ఈ పై నామాలు సహస్రనామావళిలో 86 x 2 + 13 = 185 స్థానాల్లో ఉన్నాయన్నమాట. ఇది  18.5 శాతం!  తక్కువేమీ కాదు!

ఐతే ఇవి పునరుక్తులుగా పరిగణించరు సంప్రదాయికంగా. ఎందువలన అన్న ప్రశ్నకు జవాబు ఉంది.  

విష్ణుః మొదలైన అనేక నామాలు పునరుక్తంగా కనిపిస్తున్నా జాగ్రతతో చూస్తే అవి వేరు వేరు అర్థాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి పునరుక్తి ఎక్కడా లేదు. అంటే  ఒక శబ్దాన్ని వేరు వేరు రకాలుగా విడదీసి చూడవచ్చు నన్నమాట.

మరికొన్ని నామాలకు ఒకటి కంటే ఎక్కువగా అర్థాలు వ్యాకరణాకార్యాపేక్ష లేకుండానే ఉంటాయి. ఉదాహరణకు శ్రీపతి అన్న మాటలో శ్రీ అన్న మాటకు లక్ష్మి అని అర్థమూ ఉంది మోక్షము అని అర్థమూ ఉంది.  ఉభయత్రా విష్ణుప్రైపాదకమైన నామం అవుతున్నది. ఇలా అర్థం పునరుక్తి కనిపించిన చోట్ల ఒకటి కంటే ఎక్కువ అర్థాలున్నాయి.

సకృత్తుగా ఒకే అర్థం ఇచేట్లు కనిపించే నామాలు కొన్ని సందర్భాను సారంగా మరలా వచ్చినా అది దోషం కాదు స్తోత్రాలలో. సందర్భం వేరు కదా.

ఋధ్ధః అన్న నామం 271వదిగా ఉంది. దానికి శ్రీశంకరుల భాష్యం ప్రకారం సమృధ్ధి కలవాడు. వేటి సమృధ్ధి అంటే  ధర్మము జ్ఞానము వైరాగ్యము వంఇ ఉత్తమ లక్షణముల సమృధ్ధి కలవాడు అని అర్థం. ఇదే   351వ నామం కూడా. అక్కడ భాష్యంలో ఋధ్యతి - వృధ్ధిని పొందును. అనగా ప్రపంచరూపము నృధ్ధిని పొందుచున్న వాడుగా ఉన్నాడు.  ఋధు వృధ్ధౌ అనే ధాతువు నుండి క్త ప్రత్యయం ద్వారా ఈ రూపం నిష్పన్నం అవుతున్నది. ఋధ్ధ్ + త -> ఋధ్ధః
ఇలా ఒకే నామం వేరు స్థానాల్లో వేఉ అర్థంతో వ్యవహరించవచ్చును కాబట్టి పునరుక్తి ఏమీ లేదు. 

వేదవిత్ అనే నామం 128వది అలాగే 131వది కూడా! మరీ దగ్గరగా.  అదీ ఒకే శ్లోకార్థంలో! వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవికవిః అని. ఇక్కడ సందర్భాను సారిగా వేదశబ్దాన్వయం మీద అర్థఛ్చాయలతో విడి నామాలే. ఒకే అర్థం చెప్పబడదు. కొద్దిగా విపులంగా చూదాం.

వేదవిత్ అనే 128వ నామానికి వ్యాఖ్య.  వేదం వేదార్థంచ చ యథావిత్ వేత్తిః అనగా వేదమును దాని అర్థమును కూడా వాటివాస్తవరూపంగా స్పష్టంగా తెలిసినవాడు.  వేదాంతకృత్ వేదవిత్ ఏవచ అహం అని గీతలో 15వ అధ్యాయంలో భ్గవద్వచనం. ఉపనిషత్ వేదాంత సంప్రదాయాన్ని ఏర్పరచే వాడినీ, వేదార్థమును చక్కగా అంటే సంపూర్ణంగా తెలిసినవాడినీ నేనే అని కృష్ణోక్తి. భారతంలో 
  సర్వే వేదాః సర్వవేద్యాః సశాస్త్రాః
 సర్వే యజ్ఞాః సర్వ ఇజ్యాశ్చ కృష్ణః
 విదుః కృష్ణం  బ్రాహ్మణాః తత్త్వతో యే
 తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తః

అంటే అన్ని వేదాలూ, వాటిచే తెలియబడే సకలవిషయాలూ, అన్ని యజ్ఞాలూ, వాటిద్వారా ఆరాధించబడే దేవతలూ,  అంతా కృష్ణుడే. ఏ బ్రహ్మవేత్తలు శ్రీకృష్ణుని వాస్తవంగా తెలుసుకుంటున్నారో వారికి సర్వయజ్ఞఫలితాలూ అందుతున్నాయి అని దీని అర్థం.

వేదవిత్ అనే 131వ నామానికి వ్యాఖ్య. వేదాన్  - వింత్తే - విచారయతి. వేదార్థమును చక్కగా విచారణ చేయును అని.

ఇక విష్ణుః అనే నామానికి ఉన్న వివిధ వ్యాఖ్యలను చెప్పాలంటే అదే మరొక పెద్ద టపా అవుతుంది.

అన్నట్లు ఇదే ఇప్పటికి విస్తారం ఐనది కదా. మరొకటపాలో కొనసాగిద్దాం.

7, జూన్ 2015, ఆదివారం

లలితానామావళిలో కొన్ని నామాలకు వివరణలు

శ్రీ కల్లూరి భాస్కరంగారు బ్లాగులోకానికి పరిచితులే. వారు ఒక వ్యాఖ్య చేసారు నిన్నను. దానికి సమాధానం ఆ వ్యాఖ్య క్రిందే ఇవ్వటానికి వీలుపడక ప్రత్యేకంగా టపాగా వ్రాస్తున్నాను.

ముందుగా భాస్కరంగారి వ్యాఖ్యః

శ్యామలరావు గారూ....ఆలస్యంగా చూశాను. మంచి ఉపయుక్తమైన పని చేశారు. కొన్ని విరుపుల దగ్గర సందేహాలు కలిగాయి.
1.(66) సంపత్కరీ సమారూఢసింధూరవ్రజాసేవితా...ఇక్కడ సంపత్కరీ దగ్గర విరుపు ఉండక్కర్లేదా? లేకుండా అర్థం ఏమిటి?
2. (524) హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా...ఇక్కడ హంసవతీ దగ్గర విరుపు ఉండాలా? లేకుండా అర్థం ఏమిటి?
3. (813) 'నిత్యతృప్తా' నా? 'అనిత్యతృప్తా'నా? అనిత్యతృప్తా కు అర్థం ఏమని చెబుతాం?
4. (821) ప్రచండ/ఆజ్ఞా అని విడదీశారు. ప్రచండాజ్ఞా కాదా?
5. (923) కౌళినీకేవలా --అన్నారు. కౌళినీ/కేవలా --కాదా?

సమాధానం.

ముందుగా క్లుప్తంగా నేను వారికి ఇచ్చిన జవాబు, 'మీరు ఉదహరించిన పై నామాలు సరిగానే విభజించి చూపటం జరిగింది' అని.  ఇప్పుడు మరింత వివరంగా వ్రాస్తున్నాను.

మొట్టమొదట అమ్మ యొక్క సహస్రనామస్తోత్రం ఆవిర్భావాన్ని గురించి ఒక సారి మననం చేసుకోవటం సముచితంగా ఉంటుంది.

శ్రీలలితాపరాభట్టారికాదేవి యొక్క సహస్రనామస్తోత్రాన్ని చదివినవారికి అందునా పారాయణం చేసేవారికి తప్పక స్తోత్రం చివర ఉండే ఈ క్రింది వచనం పరిచితమే.

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహహగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితారహస్యనామస్సాహస్రస్తోత్రకథనమ్‍ నామ ద్వితీయోధ్యాయః

శ్రీలలితాపరాభట్టారికాదేవి వశిన్యాది వాగ్దేవతలను పిలిచి ఒకప్పుడు ఇలా సెలవిచ్చింది. మీరు నా ప్రసాదం వల్ల సద్వాగ్విభూతిని పొందారు. మరి నా ఇతర భక్తులకు కూడా అటువంటి వాగ్విభూతి కలిగేందుకు మీరు ఉపయోగపడాలి కదా. శ్రీచక్రరహస్యాలు తెలిసినవారూ, నామపారాయణం పట్ల ప్రీతికలవారూ మీరు. అందుచేత మీరు నా స్తోత్రం చేయటానికి అనుజ్ఞ ఇస్తున్నాను.

కురుధ్వ మండితం స్తోత్రం మమ నామ సహస్రకైః
యేన భక్తైః స్తుతా యా మే సద్యః ప్రీతిః పరా భవేత్

రహస్యార్థములతో సహా మా సహస్రనామస్తోత్రం మీరు నిర్మించండి. ఏది భక్తులు పఠించినంతనే మాకు ప్రీతి కలుగుతుందో అలాంటి స్తోత్రాన్ని మీరు రచించండి.

అమ్మ ఆజ్ఞమేరకు వశిన్యాది దేవతలు తల్లిస్తోత్రాన్ని రచించి అమ్మ  సమస్తదేవతలూ త్రిమూర్తులూ తన్ను సేవించి ఉండగా కొలువుతీరి ఉన్న నిండు సభలో దానిని వినపించారు.

అలా శ్రీలలితాపరాభటారికాదేవి అమ్మవారి సహస్రనామస్తోత్రం అమ్మ సంకల్పంతో వశిన్యాదులు ఋషులుగా ప్రపంచానికి వెల్లడి చేయబడింది.

మరి ఆ స్తోత్రం అంత సులభ గ్రాహ్యం ఏమీ కాదు. అదెందుకో కూడా అలోచిద్దాం.

ఇప్పుడు మనం ఒక్క సంగతి గమనిస్తాం. సహస్రనామస్తోత్రాలు అనేకం ఉన్నాయి. గణపత్యాదిగా అందరు ప్రముఖ దేవీదేవతలకూ సహస్రనామస్తోత్రాలున్నాయి. కాని ఒక్క  శ్రీలలితాపరాభట్టారికాదేవి అమ్మ సహస్రనామస్తోత్రానికి మాత్రమే రహస్యసహస్రనామస్తోత్రం అని పేరుంది.

ద్వీతీయోధ్యాయం ఈ స్తోత్రం ఐతే తృతీయోధ్యాం ప్రారంభ శ్లోకంమే

రహస్యానాం రహస్యంచ లలితాప్రీతిదాయకమ్‍

అని నిష్కర్ష చేస్తుంది!  ఆ అధ్యాయం చివరన హయగ్రీవులవారు అగస్త్యునితో 'నా విద్యావేదినే బ్రూయాత్ నా భక్తాయ కదాచన'. యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్య మిదం మునే,  పశుతుల్యాతు న బ్రూయా జ్జనేషు స్తోత్రముత్తమమ్‍' అని హెచ్చరిక చేస్తారు. శ్రీదేవి భక్తులు కాని వారికీ, బాలాది మంత్రోపదేశం ఏదీ లేని వారికి ఈ స్తోత్రం ఉపదేశం చేయరాదని సంప్రదాయం. అందుకే ఇది రహస్యం. అంతే కాక హయగ్రీవులు 'శ్రీదేవీ పేరణా దేవ మయోక్తం కుంభసంభవ' అని అమ్మవారి ఆదేశం మేరకే నీకు ఉపదేశించాను సుమా  (నీవూ అలాగే చేయవలెను) అని స్పష్టం చేస్తారు.

ఈ స్తోత్రంలో వలెనే అనేక ఇతర స్తోత్రాదుల్లో కూడా ఇటువంటి హెచ్చరికలే ఉంటాయని అందరికీ తెలుసు. ఇలా ఉండటానికి కారణం సులభంగానే గ్రహించవచ్చును. ముక్కస్య ముక్కార్థః అన్నట్లు ఏమాటకు ఆమాటకు అర్థం అన్వేషించి కూర్చుకుంటూ శ్లోకాలకు అన్వయం గ్రహించటానికి ప్రయత్నించటం సముచితం కాదు. అలాంటి ప్రయత్నం చేసేవారు భాషపట్ల అధికారం లేని కారణంగా సులువుగా దారితప్పుతారు. రెండవది సంప్రదాయాలని కొన్ని ఉంటాయి. ఏ విషయం గురించిన శ్లోకాలను అర్థం చేసుకోవటానికి యత్నిస్తున్నామో దానికి సంబంధించిన సంప్రదాయాలను క్షుణ్ణంగా గురుపరంపర నుండి స్వీకరించిన వారికి అవి విదితమయ్యే విధానికీ అటువంటిదేమీ తెలియకుండా కేవలం పదాలకు అర్థాల సహాయంతో శ్లోకార్థనిర్మాణక్రియకు దిగిన వారికి తెలిసే విధానికీ హస్తి మశకాంతరం ఉంటుందన్నది నిర్వివాదం. మాట వరసకు జర్మన్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటీ, ఇంగ్లీష్ టూ తెలుగు నిఘంటువు ఒకటి ముందు పెట్టుకొని ఒక న్యూక్ర్లియర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ లో వచ్చిన సిధ్ధాంతవ్యాసాన్ని జర్మనీ నుండి తెలుగు చేయటం ఎలా ఉంటుందో ఆలోచించండి.  అది కూడా ఎన్నడూ సైన్స్ విద్యార్థి కాని ఒక జర్నలిష్ట్ ఆపని చేస్తే ఎలా ఉంటుందో యోచించండి.

మాక్స్ ముల్లర్ సంస్కృతం నేర్చుకొన్నంత మాత్రాన వేదాల్లోని ఋక్కులకు తర్జుమాలు చేసి వాటి పరువుతీసాడని అరవిందులు ఆగ్రహపడ్దారు. ఒక  ఋక్కుకు యథాతధంగా అర్థం ఐతే, 'ఇంద్రుడి రథం పోతూ ఉంటే ఆ రథాశ్వాల గిట్టల నుండి నేయి కారుతున్నదని' వస్తుందట. అలా గ్రహించి ముల్లర్ ట్రాష్ అన్నాడని మనమూ బోల్తా పడకూడదు కదా. అసలు అర్థం వివరించటానికి అరవిందులు ఆ ఋక్కు గురించి ఒక పుస్తకమే వ్రాసారని గుర్తు,

ఈ శాఖాచంక్రమణం ఎందుకంటే అతినిగూఢమైన అర్థం కల శ్లోకసంపుటిని ఎవరికితోచినట్లు వారు దురుపయోగం చేయకుండా కట్టడి చేయటానికే ఇలాంటి నిబంధనలు అని విన్నవించటానికి.

ఈ క్రమంలో శ్రీలలితాసహస్రనామస్తోత్రానికేమి, అంతకన్నా సులభంగా కనిపించే విష్ణుసహస్రనామస్తోత్రానికేమి మహాత్ములు వివరణ ఇచ్చి లోకోధ్ధరణ చేయవలసి వచ్చింది. కాబట్టి ఈ స్తోత్రాలలోని నామాల గురించి వారి వివరణల సహాయంతో మాత్రమే మనం తెలుసుకోగలం.

గతంలో నేను వ్రాసిన నామవిభజన పట్టికకు శ్రీతుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారి లలితామోదినీ భాష్యాన్ని ప్రమాణంగా తీసుకున్నాను. తుమ్మలపల్లివారు ప్రథానంగా భాస్కరరాయలవారి సౌభాగ్యభాస్కరమూ మరికొన్ని వ్యాఖ్యలూ ఆధారంగా భాష్యరచన చేసారు. తుమ్మలవపల్లివారి భాష్యగ్రంథంతో పాటుగా నేను వావిళ్ళవారు ప్రచురించిన సింహభట్ల రామమూర్తిశాస్త్రులవారి గ్రంథాన్నీ, క్వచిత్తుగానైనా అథునికులు వడ్లమూడి వేంకటేశ్వరరావుగారి శ్రీలలితానామర్థమంజూషనూ పరిశీలించాను.

ఇప్పుడు శ్రీ కల్లూరి భాస్కరంగారి ప్రశ్నలు పరిశీలిద్దాము.

1. సంపత్కరీ సమారూఢసింధూరవ్రజాసేవితా...ఇక్కడ సంపత్కరీ దగ్గర విరుపు ఉండక్కర్లేదా? లేకుండా అర్థం
ఏమిటి?

సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా।
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా॥

అనే 25 వశ్లోకంలోనిది ఈ నామం.  ఈ శ్లోకం పూర్వార్థం అంతా 66 వ నామం ఏకసమాసం. కాబట్టి ఒకటే పదం. ఉత్తరార్థం అంతా అదేవిధంగా 67వ నామం.

అందుచేత సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా అని నామం.  సంపత్కరి అని ఒక దేవత. ఆమెను గురించి స్వతంత్ర తంత్రంలో వివరంగా ఉంది. ఆమె వైభవం ఊహాతీతం. ఆ (మంత్ర) విద్యలో మూడు వర్ణాలున్నాయి.  మంత్రాధిష్ఠాన దేవత పేరు సంపత్కరి. లలితాదేవి తన అంకుశం నుండి సంపత్కరీదేవిని సృజించింది.  త్రిపురసుందరీ దేవి గజసైన్యానికి సంపత్కరీదేవి నాయకురాలు అని లలితోపాఖ్యానంలో ఉంది. ఆ సంపత్కరీదేవి రణకోలాహలం అనే ఏనుగునెక్కి దాని వెనుక కోట్లాది గజసైన్యంతో యుధ్ధానికి వచ్చింది.  ఏనుగుల్లో మూడురకాలు  భద్రగజాలు, మంద్రగజాలు, మృగగజాలు అని వాటి లక్షణాలను బట్టి. అన్ని రకాలవీ సంపత్కరి సైన్యంలో ఉన్నాయి, ఇంత గజసైన్యంతో ఆమె లలితాదేవిని సేవిస్తోంది.

సుఖ సంపద్వికారమైన చిత్తవృత్తికి సంపత్కరి అని పేరు.

ఇది కాక ఈ నామానికి విపులమైన వేదాంతపరమైన వ్యాఖ్యానం కూడా ఉంది. సుఖసంపత్కరమైన చిత్తవ్ర్త్తికి సంపత్కరి అని పేరు. ఈ చిత్తవృత్తిని శభ్దస్పర్శాది విషయసముదాయం సేవిస్తూ ఉంటుంది. ఇదే సింధురవ్రజం.  శ్రీవద్యావిశేషంం ఐన  కాది మతం ప్రకారం శబ్దాది విషయాలు గజములు. అథిష్ఠాత్రి పరమేశ్వరి సంపత్కరి. వివరణంగా చాలా విషయాలున్నాయి. విస్తరణం అవుతుందని వివరించటం లేదు.

శ్రీచక్రంలో త్రికోణాగ్రంలో ఉన్న కామేశ్వరీ దేవికే సంపత్కరి అన్న రహస్యసంజ్ఞ కూడా ఉంది.

ఋగ్వేదీయమైన సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తులో చెప్పబడిన శ్రీ సౌభాగ్యలక్షీ కామకళా ఏకాక్షరమహామంత్రానికి సంపత్కరీ మహామంత్రం అనే సంకేతం కూడా ఉంది శ్రీవిద్యలో. ఆవిడ అధిష్ఠించిన గజమే మంత్రవర్ణస్వరూపం.

అంతేకాని ఈ మంత్రాన్ని సంపత్కరీ, సమారూఢసింధురవ్రజాసేవితా అని విఱచి చెప్పకూడదు. అప్పుడు అన్వయదోషం కూడా వస్తున్నది. సంపత్కరీ అన్నది సంబోధన. లౌకికంగా సంపదలు కలిగించేదేవి అన్న అర్థమూ మరికొన్ని పైన సంపత్కరీ దేవినీ స్మరించటం.  కాని 'సమారూఢసింధురవ్రజాసేవితా' అన్నది అన్వయం కాదు.  సమాశ్రితసింధూరవ్రజాసేవితా అన్నట్లుగా అన్వయం చేసినట్లు సమారూఢ పదంతో అన్వయం రాదు.


2.  హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా...ఇక్కడ హంసవతీ దగ్గర విరుపు ఉండాలా? లేకుండా అర్థం ఏమిటి?

 ఇది 108వ శ్లోకంలో వచ్చే 525వ నామం.

మజ్జాసంస్థా।  హంసవతీముఖ్యశక్తిసమన్వితా। 
హరిద్రాన్నైకరసికా।  హాకినీరూపధారిణీ।  

ఈ శ్లోకం  చక్రదేవలతలను వర్ణింఏ సందర్భం లోనిది..   వారు  డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ,సాకినీ, హాకినీ,యాకినీ అనే వారు. ఈ శ్లోకంలో హాకినీదేవిని గురించిన వర్ణన ఉంది. 

సౌభాగ్యభాస్కరంలో భాస్కరరాయలవారు చెప్పిన ప్రకారం,  హంసవతీముఖ్యశక్తిసమన్వితా అంటే హంసవతీ, క్షమావతీ అనే శక్తులతో కూడినది అని అర్థం. ముఖ్య అంటే ముఖమునుండి పుట్టినది అని.

వావిళ్ళవారి పుస్తకంలో హాకినీదేవి హంసవతీ మొదలైన శక్తులతో కూడి ఉన్నది అని సామాన్యార్థాన్నే చెప్పారు.

ఏకనామంగా కాకుండా హంసవతీ , ముఖ్యశక్తిసమన్వితా అని చెబితే చిక్కు వస్తుంది. అప్పుడు హాకినీదేవినే హంసవతి అని అన్వయం చేసి పిలుస్తున్నటౌతుంది. అది తప్పు.  సంప్రదాయంలో హంసవతి హాకినీదేవి కాదు ఆమె పరివార శక్తుల్లో ఒకరు. అంతే కాక , అప్పుడు 'ముఖ్యశక్తిసమన్వితా' అన్నది అన్వయం కాకుండా పోతుంది.  ముఖ్య అనేది ఒక శక్తి అనుకుంటే ముఖ్యశక్తిసంయుతా అన్నది ఒప్పుతుంది కాని ముఖ్యశక్తిసమన్వితా అని కుదరదు. సమన్వితా అన్నది ఒక బృందాన్ని చెప్పటానికి వాడాలనుకుంటేనే బాగుంటుంది.  ముఖ్యమైన శక్తులతో కూడినది అన్నది పేలవంగా ఉంది, నిర్విశేషణంగా.  ఆజ్ఞాచక్రం ముఖ్యప్రాణస్థానం అని సంజ్ఞ. ఈ ముఖ్యప్రాణశక్తులైన  షట్ ధాతుస్వరూప షడాధార కమలదళ స్వరూప పంచాశద్వర్ణాత్మిక శక్తులే హంసవతీ మొదలైన శక్తులు. వావిళ్ళవారి పుస్తకంలో హాకినీదేవి హంసవతీ మొదలైన శక్తులతో కూడి ఉన్నది అనే  చెప్పారు.

3.  'నిత్యతృప్తా' నా? 'అనిత్యతృప్తా'నా? అనిత్యతృప్తా కు అర్థం ఏమని చెబుతాం?

వేర్వు వేరు నామాలున్నాయిలా.  నిత్యతృప్తా అని 115వ శ్లోకంలో ఉన్న 566వ నామం.

నిత్యతృప్తా।  భక్తనిధిః।  నియంత్రీ।  నిఖిలేశ్వరీ। 
మైత్ర్యాదివాసనాలభ్యా।  మహాప్రళయసాక్షిణీ।  


154వ శ్లోకంలో అనిత్యతృప్తా అని 815వ నామం వస్తుంది.

మూర్తా।  అమూర్తా।  అనిత్యతృప్తా।  మునిమానసహంసికా। 
సత్యవ్రతా।  సత్యరూపా।  సర్వాంతర్యామినీ।  సతీ। 

నిత్యతృప్తా అన్న నామానికి అర్థం కేవల బ్రహ్మానందస్వరూపిణి అని. తల్లి నిత్యమైన తృప్తి కలది. పర్యాప్తకామ (పర్యాత్మ కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామం అని శ్రుతి)

అనితి + అతృప్తా = అనిత్యతృప్తా అని నిరూపణం.  న + ఇతి + అతృప్తా అని చెప్పటం వలన దీనివలన దేవి తృప్తిపడదు అని చెప్పటానికి లేదు అని అర్థం. అంటే తల్లి ఏది ఇచ్చినా తృప్తి చెందుతుంది అని. అంటే భక్తిమాత్రం చేతనే అనిత్యమైన ఉపచారాదులకు కూడా అమ్మ తృప్తి చెందుతున్నదని భావం.

నిత్యతృప్తా అన్న నామానికి పునరుక్తి రాకుండా వ్యాఖ్యాతలు అనిత్యతృప్తా అని స్వీకరించారు.

4.  ప్రచండ/ఆజ్ఞా అని విడదీశారు. ప్రచండాజ్ఞా కాదా?

కాదండి, ఇవి వేరు వేరు నామాలుగా భాష్యం. మీరన్న పధ్ధతిలో కూడ  కొందరు వ్యాఖ్యాతలు చెప్పటం ఉంది.

827వ నామం ప్రచండా.
828వ నామం ఆజ్ఞా.

 ప్రచండా అన్న నామానికి అర్థం ఇలా ఉంది.  చడి కోపనే అని ధాతువు.  భీష్మాస్వా ద్వాతః పవతే, భీషోదేతి సూర్యః అని శ్రుతి. ఉల్లంఘించటానికి వీలు లేని ప్రచండమైన ఆజ్ఞ అమ్మది అని అర్థం.   అమ్మ యొక్క దూతికలు కూడా ఆవిడ ఆజ్ఞను అమలు జరిపే విషయంలో మిక్కిలి కోపనశీలురై ఉంటారు. అటువంటిది అమ్మ అని.

ఆజ్ఞ అన్న  నామానికి వివరణ. వేదవిహితమైన ధర్మం విధి నిషేధము అనే రెండు విధాలుగా ఉంటుంది. శివపురాణంలో రుద్రుని యొక్క ఆజ్ఞాస్వరూపం దేవి అని ఉన్నది. జ్ఞః గుణకాలో గుణి సర్వవిద్యః అని శ్రుతి. సర్వగుణి సర్వవిద్యాస్వరూపం జ్ఞః కాబట్టి జ్ఞః అంటే విధి అన్న అర్థం కాబట్టి అలా గ్రహించటమూ ఉంది.

భట్టనారాయణ వైద్యనాథదీక్షితులు ప్రచండాజ్ఞా అని రెండు నామలనూ కలిపి గణించారు. అతితీక్ష్ణమైన అజ్ఞాప్రవృత్తి కలది అన్న భావంలో.

 5. కౌళినీకేవలా --అన్నారు. కౌళినీ/కేవలా --కాదా?

ఇంతకు ముందు నామాలుగా కౌలినీ, కులాంగనా, కులాంతస్థా, కులయోగినీ ఇత్యాదులు వచ్చాయి కదా. పునరుక్తిని పరిహరిస్తూ ఈ రెండు మాటలూ కలిపే వ్యాఖ్యాతలు ఏకనామంగా స్వీకరించారు.

కౌలినీ కేవలా అన్నప్పుడు ఆమె శుధ్ధకాలస్వరూపిణి అని అర్థం.

కొందరు వ్యాఖ్యాతలు విడినామాలుగా స్వీకరించి చెప్పారు. కాని 94వనామంలో కౌలినీ అని రానే వచ్చింది కదా?

4, జూన్ 2015, గురువారం

ఘటాకాశమూ మహాకాశమూ మతలబులూ వగైరా....

శ్రీ కష్టేఫలీ శర్మగారు నిన్న వరూధిని బ్లాగులో వేసిన ప్రశ్నకి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

ఘటాకాశం, మహాకాశం వేరు వేరా?
లంబకోణంలో ఊర్ధ్వంగా ప్రయాణిస్తే బ్రహ్మరంధ్ర విఛ్ఛిత్తి జరిగితే, ఘటం భిన్నమైతే, ఘాటాకాశం మహాకాశం లో కలుస్తుందా? కలిసినట్టనిపిస్తుందా? వివరించగలరు.

నా సమాధానం చదవండి. మరింత సమయం దొరికి ఉంటే ఇంకా విపులంగా వ్రాసేవాడినే. కాని ఇప్పటికే కొంచెం విస్తారమైపోయింది జవాబు. మీకు ఇదే కొంచెం పెద్దదైతే విసుక్కోవద్దని మనవి.


అక్కడ ఈ ఆకాశాల ప్రసక్తి కనిపించింది.

అథ హ యాజ్ఞవల్క్యో మణ్డలపురుషం పప్రచ్ఛ
వ్యోమపఞ్చకలక్షణం విస్తరేణానుబ్రూహీతి । స
హోవాచాకాశం పరాకాశం మహాకాశం
సూర్యాకాశం పరమాకాశమితి పఞ్చ భవన్తి ।
బాహ్యాభ్యన్తరమన్ధకారమయమాకాశమ్ ।
బాహ్యస్యాభ్యన్తరే కాలానలసదృశం పరాకాశమ్ ।
సబాహ్యాభ్యన్తరేఽపరిమితద్యుతినిభం తత్త్వం మహాకాశమ్ ।
సబాహ్యాభ్యన్తరే సూర్యనిభం సూర్యాకాశమ్ ।
అనిర్వచనీయజ్యోతిః సర్వవ్యాపకం నిరతిశయానన్దలక్షణం
పరమాకాశమ్ । ఏవం తత్తల్లక్ష్యదర్శనాత్తత్తద్రూపో భవతి ।
నవచక్రం షడాధారం త్రిలక్ష్యం వ్యోమపఞ్చకమ్ ।
సమ్యగేతన్న జానాతి స యోగీ నామతో భవేత్ ॥ ౧॥

ఇతి చతుర్థం బ్రాహ్మణమ్ ॥ ౪॥

క్లుప్తంగా చెప్పుకుందాము.

మండలపురుషుడు యాజ్ఞవల్క్యమహర్షితో చెబుతున్నాడు.

ఆకాశం వ్యోమపంచకం అని తెలుసుకోవాలి. (పంచకం అంటే ఐదురకాలుగా ఉన్నది.  వ్యోమం అంటే ఆకాశం.  అంటే space అన్నమాట.) ఆ ఐదు రకాలు ఏమిటంటే,

ఆకాశం
పరాకాశం
మహాకాశం
సూర్యాకాశం
పరమాకాశం

అనేవి.

ఆకాశము బాహ్యాభ్యన్తరమన్ధకారమయము.  అనగా ఆకాశం బాహ్యమునందూ (అంటే బయటా) అంతరమందూ (తనలోనూ) అంధకారమయమైనది (చీకటి గుయ్యారమైనది) (ఇది కేవలం సైధ్ధాంతికం. ఆకాశాన్ని పరమాకాశం నిష్పన్నం చేసినప్పుడు, బీజస్వరూపమైన తన అంశను దానిలో కేవల ద్యుతిగా పరమాత్మ ప్రవేశింపజేయటానికి ముందుగా ఉన్న అత్యంత మూల స్వరూపమైన స్థలకాలాదులతో కూడిన ఆకాశస్థితి. ఏ ప్రకాశనతత్త్వమూ లేనిది కాబట్టి అంతా చీకటే అని చెప్పటం)

మహాకాశానికి బాహ్యమునందూ అంతరమందూ కూడా పరిమితమైన ద్యుతి (ప్రకాశం) ఉన్నది. (ఇది సృష్టికార్యానికి ముందునా, లయకార్యానికి పిమ్మటా ఉండే అత్యంత పరిమితమైన స్థలకాలాదులలో వ్యాపించి కేవలం పరిమితమైన అంటే బీజరూపమైన ద్యుతికలిగిన ఆకాశం)

సూర్యాకాశం అనేది బాహ్యములోనూ అంతరమందూ కూడా అపరిమితంగా సూర్యుడివలే వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. ( ఇది ద్యోతకమైన సృష్టిలోని ప్రకాశావరణస్వరూపమైన ఆకాశం అన్నమాట)

అంతకంటే తీవ్రాతితీవ్రంగా ప్రళయాగ్ని సమమైన ప్రభలు కలది పరాకాశం.  (ఈ ఆకాశాన్ని ప్రకృతి యొక్క సృష్టిలయకార్యాలకు సంబంధించిన వేదికగా తీసుకొనవచ్చును)

ఇక పరమాకాశం.  అది అనిర్వచనీయమైనది (అంటే మాటలతో చెప్పలేనిది. ఏ వర్ణనలూ దానిని సూచనామాత్రంగా కూడా చెప్పలేవు. ఏ ఉపమానాలూ పనికి రావు. అసలు దానిని దేనితోనూ పోల్చలేమి కాబట్టి). అది కేవలం జ్యోతి స్వరూపమైనది.  (కేవలం జ్యోతి అనటంలో తాత్పర్యం అది స్వతఃసిధ్దమైన వెలుగు కలది కాని దేని వలనా దానికి ప్రకాశం రావటం లేదు అని చెప్పటం).   అది సర్వవ్యాపకమైనది (అంటే దాని వ్యాపన శీలం చేతనే మిగిలిన ఆకాశస్వరూపాలు సిధ్ధించటమూ వాటివాటి ప్రకాశాలను వెలువరించటమూ అని ఒకటీ,  అది లేని స్థలకాలాదులు లేవు కాబట్టి అది శాశ్వతమూ, అచ్యుతమూ ఐన స్వరూపం. అనగా భగవత్స్వరూపం అని చెప్పటం). అది కేవలం నిరతిశయానందమే తన లక్షణంగా కలిగి ఉంది. (నిరతిశయమైన ఆనందం కలది పరబ్రహ్మమే.  పరమమైన ఆకాశస్వరూపం అదేను అని చెప్పటం తాత్పర్యం.

ఇక శర్మగారు పటాకాశం అని ప్రస్తావించారు.   ఘటాకాశం, మహాకాశం వేరు వేరా? అంటూ.

అలాగే, అధ్యాత్మోపనిషత్తు అని ఒకటుంది. అక్కడా ఆకాశాల గురించిన ప్రస్తావన ఉంది.

ఆ ఉపనిషత్తు ప్రకారం,
    యస్యాకాశః శరీరం య ఆకాశమన్తరే సంచరన్యమాకాశో న వేద|

అని.  ఇక్కడ  అకాశం ప్రసక్తి ఎలా వచ్చిందంటే,

అన్తఃశరీరే నిహితో గుహాయామజ ఏకో నిత్యమస్య
పృథివీ శరీరం యః పృథివీమన్తరే సంచరన్యం పృథివీ న వేద|
యస్యాపఃశరీరం యో అపోऽన్తరే సంచరన్యమాపో న విదుః|
యస్య తేజః శరీరం యస్తేజోऽన్తరే సంచరన్యం తేజో న వేద|
యస్య వాయుః శరీరం యో వాయుమన్తరే సంచరన్యం వాయుర్న వేద|
యస్యాకాశః శరీరం య ఆకాశమన్తరే సంచరన్యమాకాశో న వేద|
యస్య మనః శరీరం యో మనోऽన్తరే సంచరన్యం మనో న వేద|
యస్య బుద్ధిః శరీరం యో బుద్ధిమన్తరే సంచరన్యం బుద్ధిర్న వేద|
యస్యాహంకారః శరీరం యోऽహంకారమన్తరే సంచరన్యమహంకారో న వేద|
యస్య చిత్తం శరీరం యశ్చిత్తమన్తరే సంచరన్యం చిత్తం న వేద|
యస్యావ్యక్తం శరీరం యోऽవ్యక్తమన్తరే సంచరన్యమవ్యక్తం న వేద|
యస్యాక్శరం శరీరం యోऽక్శరమన్తరే సంచరన్యమ్క్శరం న వేద|
యస్య మృయుః శరీరం యో మృత్యుమన్తరే సంచరన్యం మృత్యుర్న వేద|
స ఏష సర్వభూతాన్తరాత్మాపహతపాప్మా దివ్యో దేవ ఏకో నారాయణః|


శరీరంలో ఉన్నది దివ్యుడు ఒకేఒకడు ఐన నారాయణుడే.  అన్తఃశరీరే నిహితో గుహాయామజ ఏకో నిత్యమస్య అని చెప్పటంలో తాత్పర్యం,  శరీరంలో అజుడూ (అంటే పుట్టువూ -చావూ లేని వాడు), ఆ కారణంగా  నిత్యుడూ (దేశకాలావధులు లేక ఎల్లప్పుడు ఎల్లచోట్లా ఉండేవాడు)  ఐన పరబ్రహ్మస్వరుపుడు నారాయణుడు నివసిస్తున్నాడు. పంచభూతాలైన పృధివీ, వాయువు, జలమూ, ఆకాశమూ, అగ్నీ అనేవీ,  అంతఃకరణ చతుష్టయం అని చెప్పబడే మనోబుధ్యహంకారచిత్తములూ మొదలైన వన్నీ కూడా అ నారాయణుడు తనకు శరీరంగా చేసుకొని ఈ శరీరంలో ఉన్న ఆయా తత్త్వాలలో సంచరిస్తున్నాడు అని. అందుచేత ఇవేవీ నారాయణుని విభూతులకు అన్యం ఐనవి కావని మనం తెలుసుకోవాలి అని.

ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని|
విలాప్యాఖణ్డభావేన తూష్ణీం భవ సదా మునే|| 7 ||

ఇక్కడ ఘటాకాశం అంటే నిర్థిష్టమైన ఆకృతిలో ఇమిడి ఉన్న ఆకాశం అని.  ఘటమందున్న అకాశం ఘటాకాశం అన్నమాట. ఇక్కడ ఘటం పాంచభౌతికమైనది.  దానిరూపంలో కొంత ఆకాశం (space) బధ్దమై ఉంది. అంటే ఘటం అనేది అది ఉన్నంతకాలమూ కొంత స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది. ఇక్కడ ఘటం అన్నది ఏదన్న స్థూలరూపం కలది కావచ్చును.  కుండ అని చెప్పటం ఒక ప్రతీకగా మాత్రమే.

మహాకాశం అంటే ఏ విధమైన పరిమితిలోనూ ఇమడ్చబడకుండా తనకు తానుగా ఉన్న నిత్యస్వరూపమైన ఆకాశం. 

ఘటానికి నిత్యత్వం లేదు.
ఈ ఘటం అనేది  ఒకప్పుడు  ఉనికిలో లేనేలేదు.
ఉనికి లోనికి వచ్చింది ఎదైనా ఒకనాటికి ఆ ఉనికి కోల్పోవలసి రావటం సృష్టి ధర్మం.
ఎందుకంటే శాశ్వతత్వం అనేది కేవలం పరమాత్మవాచకమే కాని ఇతరత్రా ఆ మాట కుదరదు కాబట్టి.

మహాకాశం పంచభూతాలలో ఒకటి.
దాని ఉనికి శాశ్వతమా అంటే కాదు. నిజంగానే.
అది ప్రకృతిలో భాగం.
ప్రకృతి లయం ఐనప్పుడు దాన్ని మహాప్రళయం అంటాం.
అప్పుడు పంచభూతాలకు లయం చెందక తప్పదు.

ఐనా ప్రకృతిలోని భాగమైన మహాకాశంతో పోలిస్తే తాత్కాలికమైన ఉనికి గల ఘటాదుల ఉపాధి అత్యంత స్వల్పకాలావధి కలది. అది త్వరలోనే తన ఉనికి కోల్పోక తప్పదు కదా.

కాని ఉనికి కోల్పోయిన ఒక ఘటం ఏమైపోతోంది? దానికి ఆకృతిని ఇచ్చిన పంచభూతాల్లోనే దానికి సంబంధించిన సర్వమూ లీనమై పోతోంది.  ఆ ఘటరూపంలో ఉన్న పంచభూతాల అంశలన్నీ ఎక్కడికి పోతున్నాయి?

ఎక్కడికీ పోవటంలేదు. అవి ప్రకృతిలోనే ఉంటాయి. ఇలా కూడిన అంశలు మరొక ఘటరూపంలో ఏర్పడుతూ ఉంటాయి.  ఆయా ఘటాల పరిమాణాలలోనూ ఇతర భౌతికలక్షణాలలోనూ స్థూలమైన బేధాలు తప్పక కనిపించవచ్చును.

కాని అన్నీ సృష్టిలోని పంచభూతాదుల అంశల కూడికలూ తీసివేతల గారడీలే.  ప్రకృతి మాత్రం అఖండంగా అలాగే ఉంటుంది.

ఈ అఖండభావం గ్రహించిన మునులు ఈ కూడికలూ తీసివేతలూ గమనిస్తూ వాటి గురించి ఏవిదమైన మనో వికారాలకూ (అంటే అయ్యో ఇది పోయిందే అది పోయిందే లాంటి శోకాలకూ, ఇది బాగుంది అది గొప్పగా ఉంది లాంటి స్వల్పసంతోషాలకూ) అతీతంగా ఉదాసీనంగా ఉంటారు.

లంబకోణంలో ఊర్ధ్వంగా ప్రయాణిస్తే బ్రహ్మరంధ్ర విఛ్ఛిత్తి జరిగితే, ఘటం భిన్నమైతే, ఘాటాకాశం మహాకాశం లో కలుస్తుందా? కలిసినట్టనిపిస్తుందా? వివరించమంటారు శర్మగారు.

ఘటం అన్నది శరీరానికి ప్రతీకగా తీసుకోవటం సరైనదే, ఇబ్బంది లేదు. ఘాటాకాశం మహాకాశం లో కలవటం అంటే శరీరంనుండి  బ్రహ్మరంధ్రంద్వారా  ఒక యోగి నిర్గమించిన తర్వాత సంగతి ఏమీ అంటున్నారు. శరీరమనే స్థూల వస్తువుతో యోగికి పనిలేదు. అందునా దానిని వదలిన తరువాత.  శరీరంలో ఉండే యోగి నారాయణాంశతో ఉన్న అనంతసహస్రకోటిజీవుల్లో ఒకడే కదా. ఐతే తత్త్వమసీతి సత్యాన్నెఱిగిన వాడు. సః యాతి పరమాంగతిం అని అనుకోవాలి. ఆ యోగికి పునరావృతి లేదు. అలా పునరావృతి ఉన్నవాడికి బ్రహ్మరంధ్రనిర్గమనం లేదు.

శరీరమనే స్థూలవస్తువుకు సంబంధించినది అంతా (తద్ఘటాకాశంతో సహా) ప్రకృతిలో కలుస్తుంది. మహాకాశం దానిలో భాగమే. తిరిగి ఆ శరీరంలో ఇమిడి ఉన్న ప్రాకృతికమైన సర్వాంశలనూ ప్రకృతి పునర్వినియోగం (recycle) చేస్తుంది. 
ఆ శరీరంలో వసించిన యోగి మాత్రం అలా ఏర్పడే మరొక ఉపాధిలోనికి రావలసిన అవసరం కలిగి ఉండడు.

అచ్చుకు నోచని నా వ్యాఖ్య

మున్నుడి:   నిన్న నేను చేసిన వ్యాఖ్య ఒకటి అచ్చు కెక్క లేదు. పోనీయండి, నేనే అచ్చేసికుంటున్నాను!

>ఇది విన్నాక తెలుగువాడిగా పుట్టడం ఓ అదృష్టం అనిపించింది

వ. మంచిది.

మ. మనుజుల్ గీచిన గీత కావలను సన్మానంబుతో నుండుచో
మనముల్ సంతస మేర్పడంగ నెగురన్ మా గొప్ప నదృష్టమే
యన వచ్చుం గద చూడగా నదియు నూహాతీతమై యొప్పు నా
ఘన కాల ప్రతిపాద్య సౌఖ్యమగుచున్ కన్పించుచుండెం గదా

మ. మనుజుల్ గీచిన గీత కీవలగ నే మాత్రంపు తేజంబు లే
కను దుఃఖంబున నీరసించి వగవంగన్ వచ్చు నా దైన్య మే
మని వర్ణింపగలారమయ్య యది యూహాతీతమై యొప్పు నా
ఘన కాల ప్రతిపాద్య కష్టమగుచున్ కన్పించుచుండెం గదా

కం. ఆవల నదృష్ట మున్నది
ఈవల ఘన దుఃఖ మున్న దీ రెండును కా
లావధి చే నేర్పడినవి
యే వేళకు నెట్లు మారు నెవ్వరి కెఱుకౌ.

వ. కాబట్టి ప్రాజ్ఞులు రెంటిండి యందును సమబుధ్ధి కలిగియుందురు.

ఈ వ్యాఖ్య తిరస్కరణకు గురైనదో లేదా సదరు బ్లాగువారు ఇంకా పరిశీలించలేదో తెలియదు. ఈ పద్యాలు కాసినీ జనం చదివినంతమాత్రాన కొంప మునిగేదేమీ లేదనిపించి ప్రచురిస్తున్నాను.

2, జూన్ 2015, మంగళవారం

చేయెత్తి మ్రొక్కేరులే నీకు శ్రీరామ బ్రహ్మాదులు



చేయెత్తి మ్రొక్కేరులే నీకు శ్రీరామ బ్రహ్మాదులు
నీయందు నిలిపేరులే భక్తి నిత్యంబు మోక్షార్ధులు

సామాన్యులైతే సంసారమొకటే సత్యంబుగా నెంచుచు
నీ మాట మరచి వ్యామోహములలో నిత్యంబు వర్తించుచు
కామాదులకు లొంగి కానిపనులుచేసి  కలగుండు పడుచుందురు
ఏ మయ్య నీ దయ రాకున్నచో వార లేరీతి తరియింతురు
॥చేయెత్తి॥
విజ్ఞానులైతే విషయభోగంబుల వైకృత్యముల నెంచుచు
అజ్ఞానులగువార లట్టివి గోరుచు నడుగంటుటను కాంచుచు
ప్రజ్ఞానిధులుగాన భగవంతుడవు నిన్ను భావంబులోనెంచుచు
యజ్ఞసంభవ రామ సుఖముందు రితరుల కాదర్శమై యుందురు
॥చేయెత్తి॥
అయ్యో తెలియని వారు సామాన్యు లనరాని దక్కట మాబోంట్లను
అయ్యారె విజ్ఞాను లనరాదు మాబోంట్ల నల్పప్రజ్ఞుల మగుటను
వెయ్యి జన్మములెత్తి వేసారి యుంటిమి వెగటాయ బ్రతుకులును
కుయ్యాలించుము మమ్ము కాపాడగ రమ్ము కోదండరామప్రభో
॥చేయెత్తి॥



1, జూన్ 2015, సోమవారం

విహంగ అందిస్తున్న గౌతమి గంగ





కాశీ చయనుల వెంకట మహా లక్ష్మి గారు


ప్రముఖ మహిళా వార పత్రిక విహంగ  వారు కాశీ చయనుల వెంకట మహా లక్ష్మి గారు రచించిన  గౌతమిగంగ అనే అద్భుతమైన సామాజిక నవలను ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. 

ఇదొక వేయిపడగలవంటి నవల. విశ్వనాథవారివలెనే ఇది కూడా నూఱేండ్ల క్రిందటి సామాజిక వాతారవరణాన్ని క్రమశః దానిలో వచ్చిన మార్పుల్ని విశదీకరిస్తున్నది. ముఖ్యంగా ఆనాటి బ్రాహ్మణసమాజం క్రమంగా కాలంతో ఎలా మార్పు చెందుతూ వస్తున్నదీ వివరిస్తున్నది. 

ఇది చదవటం పాఠకులకు ఆసక్తికరంగ ఉంటూందని భావించి విహంగా వారిని అడుగకుండానే సాహసించి ఆ గౌతమి గంగను ఇక్కడ పరిచయం లఘువుగా పరిచయం చేయటంతో పాటు వారి పత్రికలో ఇప్పటి వరకూ వచ్చిన భాగాల లింకులు కూడా పొందుపరుస్తున్నాను.

ముధ్రారాక్షసాలు తగుమోతాదులో ఉన్నా అవి మనం చదువుకొనేందుకు కొంత ఇబ్బంది కలిగించినా అక్కడక్కడా, ఈ రచనమాత్రం తప్పక ఎలాగో అలా చదివితీరవలసినదే అని నా అభిప్రాయం. చదువరులూ ఏకీభవిస్తారనే నా నమ్మకం.

హరినారాయణ్ ఆప్టే గారు వ్రాసిన పన్ లక్షత్ కోన్ ఘతో అనేదానికి దివంగత మాజీ ప్రధాని పీవీ  నరసింహారావుగారు  తెలుగుసేత పుస్తకం అబలాజీవితం అని ఒక అధ్బుత గ్రంథం ఉంది. ఈ గౌతమి గంగ అనేది దానితో కథాదులలో పోలిక కలది కాకపోవచ్చును కాని గతంలో స్త్రీల బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉండేవే చెప్పే విషయం ఈ  గ్రంథమూ  సరిగానే నిర్వర్తించిందని మాత్రం అనవచ్చును. మరింత చెప్పటానికి నేనా అబలా జీవితం చదివి ముప్ఫై యేళ్లు దాటింది కాబట్టి కుదరటం లేదు.

ఈ గౌతమి గంగ ప్రస్తుతం అన్ని భాగాలనూ చూపే ఉన్న లింకు:  http://vihanga.com/?author=34#sthash.9wF4BkBC.dpuf



ఈ ధారావాహిక రెండవభాగంలో ఇచ్చిన రచయిత్రిగారి పరిచయం యథాతధంగా క్రింద ఎత్తి చూపుతున్నాను.

రచయిత్రి పరిచయం:

కాశీ చయనుల వెంకట మహా లక్ష్మి గారు సంస్కృత పంచకావ్యాలు గురుముఖత: నేర్చుకుని ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలలో స్వయంకృషితో ఎన్నో గ్రంథాలను పఠించి విశ్వనాధ వారి ’రామాయణ కల్పవృక్షం’ వంటి గ్రంథాలను ఆకళింపు జేసుకున్న విదుషీమణి. జటావల్లభులవారి వంశంలో జన్మించిన ఈమె తండ్రి గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద విశారద డా.జ.లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు. తల్లి శ్రీమతి వేంకట సీతామహాలక్ష్మి సంగీత సరస్వతి. గాత్రం,హార్మోనియం, వీణలలో నిష్ణాతురాలు. స్వయంగా అనేక పాటలను వ్రాసి బాణీలు కట్టి గానం చేసిన వాగ్గేయకారిణి. సోదరి సాహిత్య శ్రీ డా. సుబ్బలక్ష్మి మర్ల ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, సోదరుడు జ.కృష్ణమూర్తి కూడా రచయిత. ఆర్ష విద్యా భూషణ బ్రహ్మశ్రీ జటా వల్లభుల పురుషోత్తం ఈమె పిన తండ్రి. ఈమె రచించిన వ్యాసాలు ఇది వరలో భక్తి రంజని, పాటలీ పుత్ర తెలుగు వాహిని వంటి పత్రికలలోను ఇటీవల ’విహంగ’ లోను ప్రచురితమయ్యాయి. భర్త కా.కృష్ణమూర్తి గారు ప్రముఖ వైద్యులు.’కాశీచయనుల కృష్ణమూర్తి ట్రస్ట్ ఫర్ హెల్త్ కేర్’ అనే పేరు తో ట్రస్టును స్థాపించి పేద రోగులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. 

ఈ పుస్తకంలో స్త్రీలవ్రతాలగురించి సంగతులున్నాయి. నాటి ఆడవారి  పాటలున్నాయి. నాకిష్టమైన గుమ్మడేడే పాటా ఉంది. అదెందుకిష్టం అంటే ఆ పాటను మా అమ్మగారు కమ్మగా పాడేవారు కాబట్టి. ఇంకా మా అమ్మగారు పాడే ధర్మరాజు జూదం, సుభద్రసారె వంటి పాటల ప్రసక్తీ ఉంది కాబట్టేమో నాకు ఇంకా నచ్చింది.

ఈ పుస్తకంలో కష్టేఫలేవారి వలే రకరకాలలైన వంటలను వాటిని చేసే విధానాలనూ చెప్పారు కాబట్టి మన పాఠకులకు నాటి వంటలూ పిండివంటలు అనేవి మళ్ళా మరొకరచనలో చదువుకోవచ్చును.

ఈ పుస్తకంలో ఆనాటి వారి కట్టుబాట్లలో వింతలూ విడ్డూరాలూ, కాఠిన్యాలూ, మార్దవాలూ వంటివన్నీ ఉన్నాయి . కాబట్టి పాఠకులకు పాతకాలంతో మంచి పరిచయం మరొకసారి వేయిపడగల్లాగానే.

ఇంకా చాలా ఉన్నాయి కానీ, ఇది లఘుపరిచయమే. మీరే చదివి ఆనందించండి.

పాఠకుల సౌకర్యార్థం ఇప్పటిదాకా విహంగవారు ప్రకటించి ధారావాహిక భాగాల విడి లింకులు:
 1. 2012-09-01  http://vihanga.com/?p=5178
 2. 2012-10-01  http://vihanga.com/?p=5398
 3. 2012-11-01  http://vihanga.com/?p=5704
 4. 2012-12-01  http://vihanga.com/?p=6155
 5. 2013-01-01  http://vihanga.com/?p=6573
 6. 2013-02-01  http://vihanga.com/?p=7078
 7. 2013-03-01  http://vihanga.com/?p=7428
 8. 2013-04-01  http://vihanga.com/?p=7671
 9. 2013-05-01  http://vihanga.com/?p=8501
10. 2013-06-01 http://vihanga.com/?p=8913
11. 2013-07-01 http://vihanga.com/?p=9183
12. 2013-08-01 missing?
17. 2014-01-01 missing?
18. 2014-02-01 http://vihanga.com/?p=11218
19. 2014-03-01 http://vihanga.com/?p=11465
20. 2014-04-01 http://vihanga.com/?p=11538
21. 2014-05-01 http://vihanga.com/?p=11742
22. 2014-06-01 http://vihanga.com/?p=12014
23. 2014-07-01 http://vihanga.com/?p=12214
24. 2014-08-01 http://vihanga.com/?p=12478
25. 2014-09-01 missing?
25. 2014-10-01 http://vihanga.com/?p=12822
26. 2014-11-01 http://vihanga.com/?p=13147
30. 2015-03-01 missing?
33. 2015-05-01 missing?



గరుత్మంతుడనే మహావిహంగుడు అమృతాన్ని భూమిమీదకు తెచ్చినట్లుగా ఐతిహ్యం సుప్రసిధ్దంగా ఉంది. ఈ పత్రికావిహంగం గౌతమిగంగామృతాన్ని మనకోసం మోసుకొని వస్తున్నారు పదేపదే. వారు అవశ్యం అభినందనీయులు.