9, జనవరి 2015, శుక్రవారం

తెలుగుభాషకు పడుతున్న దుర్గతిని గమనించండి.

మన తెలుగుభాష దుస్థితి ఎలా ఉందో తెలిపేందుకు ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి నిన్న రాత్రి నాగార్జున నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలో తటస్థించింది.

నిన్నరాత్రి షోలో అభ్యర్థిగా పాల్గొన్న ఒకాయన పేరు లక్ష్మీనారాయణగారు.

ఆయన తెలుగులో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. అయన పరిశోధించిన అంశం కరీంనగర్ జిల్లాలో భజన సంప్రదాయాలు.

ఆయనకు వచ్చిన ప్రశ్నల్లో కొన్ని అయనను ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బందులేమిటో మీరే చదివి ఆనందించండి!

తెలుగు అక్షరాలలో  గ జ డ ద బ లను యేమని పిలుస్తారు?

మొదటగా లక్ష్మీనారాయణగారిని ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇది.  నిజానికి యీ ప్రశ్నకు యే పాఠశాలావిద్యార్థి ఐనా జవాబు చెప్పగలడు. కాని డాక్టర్ లక్ష్మీనారాయణ అనిపించుకున్న మహనుభావుడికి జవాబు తెలియలేదు. సూచించబడిన నాలుగు సమాధానలలో సరైనదీ తప్పక ఉంటుంది, ఉంది కూడా. కాని యీయన తికమక మకతిక పడిపోయి, చివరికి స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను సూచించమని లైఫ్ లైన్ అడిగాడు. వారి చలువతో, గండం గడిచి చివరకు గజడదబ లను సరళములు అంటారు అని గ్రహించి అదే జవాబుగా ఇచ్చారు. నాగార్జున ఆశ్యర్యపోయి ఈయనకు ఎందుకు ఇబ్బంది వచ్చిందన్నట్లు అడిగితే, నాకు తెలుసును కాని ఎందుకో తికమకపడ్డానని చెప్పారు.

కొద్ది సేపటికి మరొకప్రశ్న వచ్చింది మరికొంచెం ఇబ్బంది పెట్టటానికి.

యుధిష్టిరుడికి అజ్ఞాతవాసంలో ఉన్నప్పటి పేరు యేమిటీ?

ఈ ప్రశ్నకు ఆలోచించి అలోచించి సరిగ్గానే అక్కడ ఉన్న ఆప్షన్ 'కంకుభట్టు' అన్నది ఎన్నుకున్నారు డాక్టర్ గారు.  ఆ 'కంకుభట్టు' అంటే అర్థం యేమిటంటే జూదం ఆడేవాడు కాబట్టి కంకుభట్టు అన్న పేరు అని చెప్పారు! అవునా? ఎక్కడా వినలేదు!

నిజానికి 'కంకుభట్టు' కాదు 'కంకభట్టు' అన్నది సరైన పదం. ఈ సంగతి డాక్టర్ లక్ష్మీనారాయణగారికి తెలియదు!  కంకము అన్నదానికి సంస్కృతంలో పద్మము అనే అర్థం ఉంది. భట్టు అన్నది సరే భట్టువంశీకుడన్నది సూచించే పదం అనుకుంటే అది ఒక ముని, పండితుడు అన్న అర్థాన్నిచ్చే పదం. నన్నయ భట్టారకుడు లేదా నన్నయ భట్టు అన్నదానిలో భట్టు పదం ఇటువంటిదే. అగ్నిభట్టారకుడనే మాటకూడా వాడుకలో ఉంది. కాబట్టి భట్టారక లేదా భట్ట శబ్దం శ్రేష్టతా వాచకం. కాబట్టి,  ఈ కంకభట్టు అనే పదం పండితశ్రేష్ఠుడు అన్న అర్థం ఇస్తుంది. ఈ మహానుభావుడికి ఇలాంటి విషయాలేమీ తెలిసినట్లు అనిపించదు.

మన డాక్టరేట్ యోగ్యతాసన్మానితుణ్ణి ఇబ్బంది పెట్టిన ముచ్చటైన మూడవపశ్న.

బుచ్చిబాబు అన్న కలంపేరుతో ప్రసిధ్ధుడైన రచయితగారి నిజమైన పేరు ఏమిటి?

దీనికి సమాధానంగా సూచించబడిన పేర్లు శివరాజు వెంకట సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి,  శ్రీరంగం శ్రీనివాసరావు, మరొకాయన-పేరు-గుర్తు-లేదు

మన డాక్టర్ లక్ష్మీనారాయణగారు బోర్లా పడిపోయారీ ప్రశ్నకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కాదు,  శ్రీరంగం శ్రీనివాసరావు కాదు, ఆ మరొకాయనా కాదు అనుకున్నాడు - అదీ అనుమానం గానే. కాని శివరాజువారు అవునా కాదా అన్నది తెలియలేదు. చివరకు ఆటను విడిచిపెట్టేశారు.

మీరు మిగతా ముగ్గురూ కాదనుకున్నారు కదా, బుచ్చిబాబుగారి ప్రసిథ్థమైన పుస్తకం 'చివరకు మిగిలేది' లాగా ఇక్కడా 'చివరకు మిగిలేది' శివరాజు వెంకట సుబ్బారావు అన్నదే సరైన సమాధానం అని నాగార్జున చమత్కరించాడు. మీరు తెలుగు సాహిత్యంమీద రీసెర్చి చేసారు కదా ఎందుకని ఇబ్బంది కలిగిందీ అని అడిగితే మన హీరోగారు చెప్పిన సమాధానాలు చూడండి.

శివరాజు వెంకట సుబ్బారావు గారి గురించి తెలియదు.
బుచ్చిబాబు అన్న పేరు ఎప్పుడూ వినలేదు.
'చివరకు మిగిలేది' అనే నవలపేరు ఎన్నడూ వినలేదు.

ఇదండీ, మన తెలుగుభాషలో, అందులోనూ సాహిత్యరంగంలో పరిశోధనచేసి డాక్టరేట్ పుచ్చుకున్న మహావీరుడు చూపిన ప్రజ్ఞ.

ఇలాంటి వారిని చూసి నవ్వాలా?
ఇలాంటి వారికి కూడా డాక్టరేట్ పట్టాలు ఎలా వచ్చేస్తున్నాయని ఆశ్యర్యపోవాలా?
ఇలాంటివారు తెలుగు లెక్ఛరర్లుగా విద్యార్థులకు జ్ఞానప్రదాతలుగా ఎలా వెలుగుతున్నారో అని ఆవేదనపడాలా?
మన తెలుగు భాషకు పడుతున్న దుర్గతిని చూసి ఏడవాలా?

మీరే చెప్పండి.