8, జనవరి 2015, గురువారం

నా గురించి నేను


ఉ. పుట్టితి నేల పుట్టితిని పుట్టిన పుట్టువు సార్థకంబుగా
నెట్టుల నేమి జేసితి నికెన్ని దినంబులు నేలనుందు ని
ప్పట్టున నేమి యాజ్ఞ భగవానుడు సేయగ నెంచు నే
తుట్ట తుద న్ముదం బలర తొల్లిటి గూటికి చేరుకొందునో

ఉ. చేరక నేలపై దిరిగి చేసిన చెయ్వుల మంచిచెడ్డలం
జేరిన పుణ్యపాపముల జేసి యవశ్యము క్రొత్తతిత్తిలో
దూరి మరొక్కమారు పెడద్రోవల బోవుదునో విదుండనై
కూరిమి దేవునిం గొలుచుకొందునొ యన్న దెఱుంగరాదుగా

ఉ. పుట్టగరామి సత్యమగు బుట్టిన దాదిగ లక్షకష్టముల్
జుట్టుకొనంగ శాంతి యది శూన్యముగా క్షణమాత్రసౌఖ్యమౌ
నెట్టుల వచ్చెనేని యది యెంతయు భాగ్యముగా దలంచి నే
నిట్టటు గ్రుమ్మరం గడచెనే బహుకాల మికేమి చేయుదున్

ఉ. మంచిగ నా దయామయుడు మానవజన్మము దేని కిచ్చెనో
యించుక యైన నే నెఱుగ కీశ్వరమాయయొ బుధ్ధిలౌల్యమో
వంచన చేయగా భ్రమసి పాడొనరించితి బుట్టువెల్ల నే
వంచిన బుఱ్ఱ నెత్తక నవశ్యము సొమ్ములకై  శ్రమించుచున్

ఉ. లోకము నందు పెక్కులగు లోలుపతం గలిగించు వస్తువుల్
నా కనునిత్యచింత్యము లనం జన నేండ్లునుబూండ్లునుం దుదిన్
లోకము నశ్వరం బనుచు లో నతిస్పష్టముగా గ్రహించితిన్
నా కొఱగాని పుట్టువున నష్టనివారణభాగ్య మున్నదే

క. గత జన్మల పాపంబులు
వెతలను కలిగించి చాల వేచుటయును నా
గత జన్మల పుణ్యంబులు
సుతిమెత్తని సౌఖ్యములను చూపుటయును గా

శా. ఈ‌ జన్మంబిటు సాగుచున్నయది ము న్నీరీతిగా సాగుటే
సాజం బన్నటు లెన్ని జన్మముల నీ‌ సంసార మీదంగా లే
దీ జీవుం డను నట్టులుండ నికపై నేని న్విరక్తుండనై
రాజీవాక్షుని పాదపద్మముల నారాధింపగా నేర్తునో

ఉ. నే నను వాడ నొక్కడను నేడిపు డుండిన నుంటి గాని యీ
నే నను చెప్పుకొంచు గడు నిక్కెడు వాడను లేకపోవుచో
రా నగు నష్ట మున్నదె ధరాతలమందున నన్ను బోంట్లు రా
పో నను నిత్యము న్నొకడు పుట్టుట గిట్టుట యేమి చోద్యమౌ

ఉ. కొందరు గాలిలో నుఱక గ్రుమ్మరు ధూళికణంబు లట్లుగా
నుందురు వారి కాశయము లుండవు మ్రెక్కగ బుట్టునట్టి వా
రెందును లక్ష్యమేమియును నెంచి గ్రహించి కృషించ నేరకన్
మందత నుండి జచ్చెదరు మానక వచ్చుచు పోవుచుందురున్

చ. స్తుతమతులైన కొందరన సూక్ష్మవిచారము చేయనేర్చి యీ
బ్రతుకున కేమి యర్థమని భావన చేసి సమస్తవిశ్వము
న్నతులిత లీలమై నడపు నట్టి మహాత్ముడు మాకు దిక్కు మే
మతనిని జేరుకొందుమని మాధవు వేడి తరింతు  రెప్పుడున్

చ. అనఘులు కొంతమంది మరి యట్టి మహాత్ముల లోన సాటి వా
రును తరియించు మార్గమును రోసి ప్రబోధము చేయుచుండు వా
రనిశము నట్టి వారలకు నంజలి యొగ్గి నమస్కరింతు నా
ఘనులను జేసి మందులకు గల్గును గాదె శుభేఛ్చ సత్యమై

ఉ. కాలము చేత సర్వమును కల్పితమై తనరారు చుండు నా
కాలము నందు జీవులకు గల్గుచు నుండును రాకపోకలున్
కాలపు మాయ చేత పొడగట్టు శుభాశుభభావనంబులన్
మేలగు సత్యముం దలచి మిక్కిలి శాంతి వహించు టొప్పగున్

ఉ. మంచిది నేటికైన పరమేశ్వరదత్తవివేకనేత్ర మి
ట్లించుక విచ్చుకొన దనిపించెడు నంతయు నీశ్వరాజ్ఞ గా
వించిన మేలుగా దలచి యిప్పటి నుండియు నుర్వి నాకు శే
షించిన కాలమున్ గడప నెంచెద నాతని కర్పణంబుగన్

ఉ. కాలము వ్యర్ధవాదపరికల్పితఖేదవినోదడోలికా
ఖేలనదుర్విలోలచణకిల్బిషబుధ్ధిని బుచ్చ నేటికిం
జాలును మేలు గూర్చగల సత్యపథంబున వోవు టొప్పు నిం
కేల విమోహజాలమని యెంచితి నీశు దలంచితిన్మదిన్

శా. లోకానేకసమూహకల్పనకళాలోలుం బ్రసన్నాత్మునిన్
లోకోపద్రవవారణైకనిపుణున్ లోకేశు నిర్ద్వందునిన్
లోకాత్మున్ మది నెంచి మ్రొక్కెదను నాలోనున్న లౌల్యంబులం
బోకార్చం దగునంచు తండ్రివగుచున్  బ్రోవంగదే యటంచున్

ఆ,వె. చింతలెల్లమాని శ్రీచరణంబుల
జేరియుంట కన్న సేమమేది
కోరదగిన దొకటె కోరుకొంటినిగాన
చేరదగినపదము చేరుకొందు

2 వ్యాఖ్యలు:

 1. ఉ. కాలము చేత సర్వమును కల్పితమై తనరారు చుండు నా
  కాలము నందు జీవులకు గల్గుచు నుండును రాకపోకలున్
  కాలపు మాయ చేత పొడగట్టు శుభాశుభభావనంబులన్
  మేలగు సత్యముం దలచి మిక్కిలి శాంతి వహించు టొప్పగున్
  -----------------
  కాల రహస్యం (Mystery of Time) బాగా చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆ,వె. చింతలెల్లమాని శ్రీచరణంబుల
  జేరియుంట కన్న సేమమేది
  కోరదగిన దొకటె కోరుకొంటినిగాన
  చేరదగినపదము చేరుకొందు

  చాలా బాగుంది. జీవిత రహస్యం విప్పేసేరు.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.